బహుళ-8

‘తల ఎత్తని కస్తూరి’ ఇల్లిందల సరస్వతీదేవి కథ

 – జ్వలిత

కథలు ఎక్కడి నుండో మొలుచుకురావు. మనుషుల జీవితానుభవాలు, అనుమానాలు, అవమానాలు, కలలు కలిసి ఊహలతో అల్లుకునే ఒక అందమైన ఎంబ్రాయిడరీ వంటివి కథలు. నైపుణ్యం గల కళాకారులు రంగు రంగుల దారాలతో కుట్టుపూలు కుట్టినట్టుగా కథకులు కథలు అల్లుతారు. అందులో కథయిత్రులు అయితే జీవితానుభవమా కల్పితమా తేడా తెలియకుండా కథారచన చేస్తారు. భయం కలిగించి, బాధాకర ఇతివృత్తాలను కథలల్లి, సహనంతో ఓర్పుతో సహించమని చెప్పి జీవతాలకు మార్గదర్శనం చేస్తాయి కథలు. అటువంటి కథలలో పాత్రలు చదివిన తర్వాత కూడా వెంటాడతాయి పాఠకులను. ఈ సారి బహుళ 8లో మీకోసం అటువంటి కథనే తెచ్చాను.

కథ కంటే ముందు ఆశ్చర్యాన్ని, విచారాన్ని, వికారాన్ని కూడా కలిగించిన ఈ వారంలో జరిగిన సంఘటనలను ప్రస్తావించాలి. ఒకటి మదనపల్లి జంట హత్యల గురించి. ఉన్నత విద్యావంతులైన తల్లిదండ్రులు, అంతకంటే ఉన్నత విద్యనభ్యసించేలా పెంచిన కుమార్తెలను అత్యంత దారుణంగా హత్య చేసిన సంఘటన. పునర్జన్మ ఆత్మలు దైవభక్తి ఏ స్థాయికి చేరాయి ? అసలా ఉన్నత విద్యకు అర్థం ఏమిటో ? విద్య అందించిన జ్ఞానం ఎక్కడికి పోయిందో ? మన ఇంట్లో పెంచిన మొక్కకు పెంపుడు కుక్కకు హానికలిగించే లేము కదా! కానీ అపురూపంగా పెంచుకున్న బిడ్డలను హత్య చేసి “ఐ యాం శివ” అంటున్నది తల్లి పద్మజ. “ఐ యాం శివ, కాల్ మై హస్బెండ్”అంటూ హంగామా చేస్తోంది. శివుడికి హస్బెండ్ ఏమిటో ? హస్బెండ్ గుర్తున్నాడు, కన్నబిడ్డలను హత్య చేయడం ఆమెకు బాధ లేదు. ఇంక ఆ హైకోర్టు లాయర్, బిడ్డల చంపిన తండ్రికి శిష్యురాలట. “అది క్షుద్ర పూజ కాదు, రుద్రపూజ అంటూ మరింత గందరగోళాన్ని సృష్టిస్తోంది.

 రెండోది ముంబై హైకోర్టు న్యాయమూర్తి పుష్ప వీరేంద్ర పోక్సో యాక్ట్ 32/2012(ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్)కు చెప్పే వక్ర భాష్యాలు. “చర్మానికి చర్మం తగలకపోతే ఎక్కడ తాకినా లైంగిక నేరం కాదు. చెయ్యి పట్టుకొని ప్యాంట్ జిప్ తీస్తే లైంగిక నేరం కాదు” అంటూ నేరస్థులకు ఊరట కలిగిస్తూ శిక్షను తగ్గిస్తూ, బాలికల భద్రతకు మరింత హానికరంగా మారుతున్నారు.

 మదనపల్లి పద్మజకు ఈ న్యాయమూర్తి పుష్పకు తేడా ఏమున్నది. వారు అభ్యసించిన విద్య వారికి హోదాలను ఉపాధిలను, డబ్బు డాంబికాలని తప్ప మరేమీ ఇవ్వలేదన్నమాట. “అజ్ఞానాన్ని మించిన ఆనందం లేదు” అన్న మాటకు సజీవ సాక్షాలు వీరు.

ఇక కథలోకి వస్తే ఇద్దరు కాలేజీ విద్యార్థునులు, కస్తూరి ఆమె స్నేహితురాలు మణి. మణితల్లి పేరంటాళ్ళకు పంచేందుకు కొని తెమ్మన్న జాకెట్ ముక్కలు కోసం కాలేజీ నుండి బజార్ కి వెళ్తారు. చీకటైన సంగతి గమనించకుండా దుకాణాల వద్ద గడుపుతారు. ఆలస్యం అయినది గమనించి,  తల్లులు తిట్టకుండా ఉండడం కోసం కూరగాయలు కొనుక్కొని బయలుదేరుతారు. ఇంటికి వెళ్ళే దారిలో చీకటి సందులో నడుస్తుండగా వారిద్దరిని, నలుగురు దుండగులు ఆటోలోకిడ్ ఈడ్చుకొని ఎక్కడికో తీసుకు పోతారు. దారిలో స్నేహితురాళ్లు ఇద్దరు భయంతో కళ్ళు మూసుకున్నారు. ఆటో ఎటు వెళ్లింది గమనించరు. చివరికి ఒక గుడిసెలోకి తీసుకొనిపోయిన దుండగులు రాత్రంతా నానారకాలుగా నలిపి హింసిస్తారు స్పృహ లేకుండా పోయేంతవరకు, తర్వాత వదిలేసి పోతారు. తెల్లారి కళ్ళు తెరిచిన స్నేహితురాళ్ళు ఒకరిని ఒకరు చూసుకొని ఇంటిదారి పడతారు. కారణాలు అడుగుతే స్నేహితురాలికి జ్వరం వచ్చిందని చెబుతుంది కస్తూరి

“జరిగిన ఘోరాలు ఈ అమ్మలకు తెలియవు. తెలిస్తే గుండెలు బాదుకుంటారు. ఎంత అమాయకులు. కొంచెమయినా అనుమానం కలిగినట్లు లేదు. లోకంలో జరుగుతున్న దుర్మార్గాలను ఊహించనైనా ఊహించరు” అనుకుంటుంది కస్తూరి.

 చివరికి కాలేజీ గోడల మీద రాతలు, తలెత్తుకోలేని పరువులు, తమ తప్పేమీ లేకున్నా స్నేహితురాళ్ళిద్దరి జీవితాలను చిన్నాభిన్నం చేస్తాయి. కస్తూరి స్నేహితురాలు ఒక్క మాట కూడా చెప్పకుండా తండ్రితో కలిసి ఊరు వదిలి వెళ్లి, తర్వాత తాను పెళ్లి చేసుకుంటున్నట్టు అన్నీ మరిచిపోయి కస్తూరిని కూడా పెళ్లి చేసుకోమని ఉత్తరం రాస్తుంది.

 తల్లిదండ్రులకు కాలేజీ గోడలపై రాతల ద్వారా ఈ విషయం అంతా తెలుస్తుంది. కస్తూరికి పెళ్లి చేయాలి అనుకుంటారు. ఆమె కాలేజీ చదువు ఆగిపోతుంది. కస్తూరి తమ్ముడికి చదువు అయిపోయి, ఉద్యోగం కూడా వస్తుంది. కానీ ఆమె పెళ్లి కాదు. ఇంట్లో ఉండి చదివి పరీక్షలు రాసి మంచి మార్కులతో పాస్ అవుతుంది కస్తూరి. తను ఉద్యోగం చేసి తండ్రికి సాయపడతాను అంటుంది. కానీ తండ్రి ఉద్యోగం కంటే పెళ్లి ముఖ్యమని, జబ్బుపడిన తల్లి కోరిక మేరకు ఉద్యోగం కోసం  తమ ఊరు వచ్చిన  ఒక ఉద్యోగిని, చూస్తేనే వికారం పుట్టి అనాకారిని వివాహం ఆడుతుంది. పెళ్లి అయిన వెంటనే వేరే ఊరికి బదిలీ చేయించుకోమని భర్తకు చెప్తుంది. వేరే ఊర్లో  భర్త సలహా మేరకు ఉన్నత విద్య చదివిన కస్తూరి డిగ్రీ విద్యార్థులకు ప్రైవేటు చెప్పడం మొదలు పెడుతుంది. కానీ తలెత్తి భర్త వైపు చూడకూడా చూడదు.

 ఒకరోజు ఉన్నట్టుండి కస్తూరి భర్త ఆఫీస్ నుండి ఇంటికి రాడు. ఎటు వెళ్ళాడో తెలియదు. ట్యూషన్ ఆదాయంతో జీవితం గడుపుతూ ఉండగా, సంవత్సరం తర్వాత సూటు బూటు వేసుకొని వచ్చిన ఆమె భర్త ఆమెను ఆశ్చర్యపరుస్తాడు. తనవైపే చూడని తన భార్య ప్రేమ కోసం గ్రహణ మొర్రి ఆపరేషన్ చేయించుకుని, అందంగా తయారై వచ్చిఆప్యాయంగా మాట్లాడినప్పటికీ, కస్తూరి మనసులో అనేక అనుమానాలు, ఆపరేషన్ పేరుతో తన ఊరు వెళ్ళాడు, గోడల మీద రాతల సంగతులు తెలుసుకున్నాడేమో అని భయం. భర్త తిరిగి వచ్చిన రాత్రి తెల్లవారకముందే భర్త లేవకముందే ఇంటి నుండి వెళ్లిపోవడానికి నిర్ణయించుకుంటుంది, రైల్వే స్టేషన్ లో కూర్చున్న కస్తూరి వద్దకు భర్త పరుగెత్తుకుంటూ వస్తాడు. గతాన్ని మరిచిపోయి హాయిగా బతుకుదాం అంటాడు

 “రా పోదాం. జీవితంలో ప్రతి నిమిషమూ అమూల్యమైంది” లాక్కొని పోతుంటాడు. కథముగుస్తుంది.

కథ ఆద్యంతం ఆగకుండా చదివిస్తుంది. కొన్ని సందేహాలను కూడా లేవనెత్తింది. 1968లోనే ఇటువంటి కథ రాయబడింది. కానీ కథలో సంఘటన ఈమధ్య జరిగినట్టే ఉన్నది. అంటే 53 సంవత్సరాల కాలానికి ఇప్పటికీ మహిళలపై జరిగే నేరాల విషయంలో ఎటువంటి మార్పు రాలేదు. ఆడపిల్లలు ఒంటరిగా తిరిగే పరిస్థితి లేదు. అయితే అప్పటి ఆ కథలో ఇద్దరు స్నేహితురాళ్లు ఆత్మహత్య చేసుకోలేదు. ఆనాటి తల్లిదండ్రులు వారి బిడ్డలను హత్యలు చేయలేదు. పైగా ధైర్యంగా తమకు జరిగిన దానికి తమ తప్పు లేదని చదువును కొనసాగించింది కస్తూరి, ఉద్యోగం చేయడానికి సిద్ధపడింది. కానీ తల్లి ఆరోగ్యం సెంటిమెంటు కురూపి భర్తను చేసుకునేలా చేసింది. ఆ భర్త మానసిక సౌందర్యం కలిగిన వాడు. చదువుకున్న కస్తూరిని ఎంతో గౌరవించి ప్రేమించి గతాన్ని మరచి పొమ్మను ఆత్మవిశ్వాసాన్ని కలిగించి ఆనందంగా ఉందామంటాడు. కానీ నేటి సమాజంలో ప్రేమించమని వేధిస్తున్నాడని అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రేమించడం లేదని అబ్బాయిలు కిరాతకంగా హత్యలు చేస్తున్నారు. ప్రేమించుకున్నారని తల్లిదండ్రులు పరువు హత్యలు, కుల హత్యలు చేస్తున్నారు. పెరిగిన నాగరికత, సాంకేతికత మనుషులను మనుషులు కాకుండా చేస్తున్నది. కొందరి మూఢభక్తి చాలామంది స్వార్థం, కులం రంగు, మతం ముసుగులో మహిళలను పెడుతున్నది. ఇటువంటి మారణకాండలో విద్యావంతులైన మహిళలు భాగస్వాములు కావడమే అత్యంత విషాదం. ఇంతకీ “తల ఎత్తని కస్తూరి” కథ ఎవరు రాశారో చెప్పనే లేదు కదా. తొలి కథా రచయిత్రి ఇల్లిందల సరస్వతీదేవి రచన ఇది. ఆడపిల్లలున్న మధ్యతరగతి కుటుంబాల్లో పరిస్థితులను, తల్లిదండ్రుల సెంటిమెంట్ చర్చలను, కొడుకు సంక్షేమం కోసం – కూతుర్ల భవిష్యత్తు ఆలోచించనివ్వకుండా బిడ్డలను వదిలించుకోవడం వంటి విషయాలను కథలో రచయిత్రి చాలా బాగా వివరించారు.

 కస్తూరి వల్లనే వారి కుమార్తెకు అటువంటి సంఘటన ఎదురైందని, మణి తల్లిదండ్రులు భావించడం వంటి మనుషుల్లో పలాయనవాద మనస్తత్వానికి అద్దంపడతుంది. కథా ప్రారంభం మాత్రం పూల పరిమళాలతో, ఆడపిల్లల అందమైన, అల్పమైన కోరికలను ప్రస్తావిస్తూ మొదలవుతుంది.

 కథలు ఆటోవాడి ప్రస్తావన సందేహాత్మకంగా అనిపిస్తుంది. సంఘటన జరిగిన రోజు రాత్రి అదే ఆటోవాడి గొంతు, కస్తూరి దంపతులు సినిమాకి వెళ్ళిన రోజు ఆటో వాని గొంతు, పాటలు పాడిన తీరుకి కస్తూరి భయపడడం కథకు అతకలేదు అనిపిస్తుంది.  ఆటో వాడి భాగస్వామ్యం నేరంలో ఉందని అనిపిస్తూన్నా కస్తూరి నోరువిప్పదు. ఇప్పటికీ ఈ సమాజం కోరుకుంటున్నది అదే స్త్రీల హక్కులు, వాటాలు అడక్కుండా భయపెట్టాలి అనుకుంటున్నది. భయపడుతూనే ఉన్నది. కథ బాగుంది చదవండి మీరు కూడా. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారు 2005లో ప్రచురించిన ‘తెలంగాణ కథలు’ సంకలనంలో ప్రచురించారు. (ఎక్కడి నుండి సేకరించారో సమాచారం లేదు).

                                                                       *****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.