1871 క్రిమినల్ ట్రైబల్ యాక్ట్

-రమేశ్ కార్తీక్ నాయక్

 
అది 1871 వ సంవత్సరం భారతదేశమంతా బ్రిటిష్ పాలనలో ఉంది. ఎటూ చూసినా వారి వాహనాలు, జెండాలు కనిపించేవి. ఆ యేడు బ్రిటిషర్లు క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ ని ప్రవేశపెట్టారు. మొదట అది ఉత్తర భారతదేశ భాగానికే పరిమితమైంది. తర్వాత బెంగాల్, మద్రాసు, 1911 వ సంవత్సరం చివరి దశలో భారతదేశంలో వివిధ రాష్ట్రాల దాకా ఆ యాక్ట్ ప్రభావం సాగింది.
 
బ్రిటిషర్లు ఎక్కడికక్కడ తమ బలగాలను పంపించి సంచార జాతులను ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేస్తా ఉన్నారు. ఆదివాసీ గిరిజనుల పై దీనిని విస్తృతంగా అమలు చేశారు. అలా దీని గురించి పల్లెల కంటే పట్టణాల్లో మరియు అప్పటి వార్తాపత్రికల్లో వార్తాకథనాలు వస్తూ ఉండేవి. ముఖ్యంగా బ్రిటిషర్ల దృష్టి సంచార తెగలపై ఉండడంతో ఇతర సమూహాలు హాయిగా గాలి పీల్చుకున్నాయి.
 
     ****
 
గమ్యం అంటూ లేని ఓ సంచార తెగ అది. కొందరు వారిని బంజారా, వంజరా, సుగాలి, లంబాడి మరియు గోర్ పేర్లతో పిలిచేవారు. ఎవరూ ఏ పేర్లతో పిలిచిన వారు మాత్రం “హం గోర్ చ్ఛా” అంటూ వారిలో వారు అనుకుంటూ ఉండేవారు. ఎవరితో కలిసేవారు కాదు. దొరికింది తినేవారు. ఎవరైనా ఏదైనా ఇస్తే తీసుకునే వారు. కాని చెయ్యి చాచి అడిగేవారు కాదు.
 
      గుంపులు గుంపులుగా తమ అవులతో బండి వెనక బండి కట్టుకుని వెళ్తూ ఉంటె అందరూ ఆశ్చర్యంగా చూసేవారు. ఇష్టంగా వారి పాటలను వినేవారు. వారి ప్రయాణమంతా సూర్యోదయం నుండి సూర్యాస్తమయం దాకా సాగేది. 
 
కొన్ని కొన్ని ప్రదేశాలకు ఇంకా బ్రిటీషు బలగాలు చేరనేలేదు. అటువంటి ప్రదేశాల్లో బంజారాలు తమ పనులు, ఎడతెగని నడకని సాగిస్తూ ఉన్నారు.
 
          అలా దారి మధ్యలో దట్టంగా పెరిగిన అడవులను చూసి అక్కడే ఆగి పరీక్షగా చుట్టూ ప్రదేశాలను గమనించి, అవ్వీ తమకు తమ పశుపక్షాదులకు సరైనవిగా భావించి వాటికి దగ్గరగా వెళ్ళి, కుప్పలు కుప్పలుగా పడి ఉన్న కొండలకు అడుగు భాగానికి కొంత దూరంలో బంజారా అనే సంచార తెగ డేరాలను ఏర్పాటు చేసుకుని, తమ వెంట తాము తెచ్చుకున్న, తాము పెంచుకున్న ఆవులను ఒక దగ్గర ఉంచి వాటికి కంచెలా తమ ఎడ్ల బండ్లను పెట్టి అక్కడే ఆ ప్రదేశంలో తాత్కాలిక జీవనాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
 
ఓ 35 నుండి 40 కుటుంబాలు అక్కడ ఉన్నాయి. కొన్ని కొన్ని కుటుంబాలు అడవుల్లోని వస్తువులను దగ్గరలో ఉన్న ఊర్లకు తీసుకెళ్లి వారాలు వారాలు ప్రయాణించి ఆ నెల ఆఖరికి తిరిగి తమ తాత్కాలిక నివాసం “తండాకు” తిరిగి వచ్చేవారు.
 
        వారు తాము విన్న క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ కథలకు భయపడి కొంతకాలం అడవి సరిహద్దులను దాటి బయటకి రాలేదు. అక్కడే ఆ అడవుల్లోనే తమ ఆవులను మేపుకుంటూ, ఆ ఆవులు తినే గడ్డిని ఉడికించి తమ దగ్గర ఉన్న పిండిని దానిలో కలిపి రొట్టెలు చేసి, తాము వేటాడి తెచ్చుకున్న జింక, దుప్పి లేక నేమలి మాంసం తింటూ జీవనం సాగించేవారు.
 
                       కొన్ని కుటుంబాలు అలా ఒకే దగ్గర ఉండటం మింగుడు పడక అక్కడి నుండి శాశ్వతంగా వెళ్ళిపోయాయి. ఎటు పోతున్నారో ? ఎవరికీ తెలీదు. హిందీ భాషా కొంచెం కొంచెం మాట్లాడడం తప్పించి ఏమీ రాదు. వారు మాట్లాడే గోర్ బోలి బయిటి వారికెవ్వరికి అర్థమయ్యేది కాదు. అలా ఆ కొండ ప్రాంతంలో 18 కుటుంబాలు మిగిలిపోయాయి. 
 
           తమ పూర్వీకులు చేసిన పనులు ఆవులు, మేకలను పెంచి పోషించి అమ్మడం. మళ్ళీ వేరే దగ్గరికి వలస వెళ్ళాక అక్కడి పరిస్థితులను బట్టి ఇంకో పని ఏర్పాటు చేసుకుని, ఆ ఊరి పొలిమేరలో అంటే కొండ లేదా అడవికి దగ్గరగా ఉండేట్లు డేరాలు వేసుకొని అక్కడ కొంత కాలం ఉండేవారు. ఒకదగ్గరి సామాగ్రిని ఇంకో దగ్గరికి చేరవేయడం. అడవిలోని కట్టెలను తీసుకొచ్చి పల్లెటూర్లలో అమ్మడం, ఉప్పు రవాణా ఇలా తమకు కాలానికి అనుగుణంగా ఉండే పనులు వాటి మెళకువలను తమ ఇంటి పెద్దల నుండి తెలుసుకుంటూ ఉన్నారు కొందరు కొత్తగా పెళ్లి అయిన యువకులు.
 
             ఇంటి పెద్దలు ఎడ్ల బండ్లు కట్టుకుని వేరే ప్రాంతాలకు తమ దగ్గర ఉన్నవి అమ్మడానికి వెళ్లేవారు. పెద్దలు తమ పిల్లలను తమతో తీసుకెళ్లే వారు కాదు. అలా వెళ్ళిన వారు తిరిగి వచ్చేవారు కాదు. కొన్ని నెలలు గడిచిపోయాయి. వెళ్ళినవారు బ్రిటిష్ వారి చేత బంధింపబడ్డారు. కొందరు చంపబడ్డారు. అది తెలియక ఇంకొందరు తమ వాళ్ళను వెతుకుతూ తమ తండాను వదిలి బయటి ప్రపంచంలోకి రావడం, వారు మాయం అవ్వడం, అలా ఆ కొండ ప్రాంతంలో మనుషుల సంఖ్య తగ్గిపోయింది. 
 
బతకడానికి వేటనే నమ్ముకున్న వారిలో కొందరు అడవి జంతవుల చేత చంపబడ్డారు. ఆవులను చూసే వారు, పట్టించుకునే వారు లేక అవి గడ్డిని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్లి తిరిగి రాకపోవడంతో ఆవుల సంఖ్య తగ్గిపోయింది. ఇంకా అక్కడ ఉండడం సరికాదని మిగిలిన కుటుంబాలందరూ అక్కడి నుంచి ఖాళీ చేసి ఎవరికివారు వెళ్ళిపోయారు.
 
      అలా ఓ కుటుంబంలోని ఏడుగురు అన్నదమ్ములు కలిసి ప్రయాణిస్తూ ఉన్నారు. వారిలో ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి. ఏడుగురిలో ఐదుగురు యుక్త వయసులో వారు కావడం చేత పని వెతుక్కుంటూ ఓ ఊరికి వెళ్తారు. వారికి తేలిక అక్కడ ఆరోజే తనిఖీలకు వచ్చిన ఆరుగురు బ్రిటీషు పోలీసులను కలవడంతో ఆ యువకుల భాష పోలీసులకు అర్ధంకాక వారిని అరెస్టు చేస్తారు. వారిలో ఒకడు ఏదో చెప్పడానికీ ప్రయత్నిస్తుంటే వినకుండా ఒక పోలీసు ఆ అబ్బాయిని కొట్టడంతో అన్నదమ్ములందరూ తిరగబడతారు. అక్కడి వారు దీనినంతా చూస్తూ ఉంటారు. పోలీసులు గొడవ పెద్దగ అవుతుండడంతో తమ దగ్గర ఉన్న తుపాకితో కాల్చి చంపేస్తారు.
 
          మొత్తం మీద ఆ చావువార్త మిగిలిపోయిన పెద్ద అన్నయ్య లావుడ్యా లాకు నాయక్ మరియు చిన్న అన్నయ్య భీమా నాయక్ లకు తెలియడంతో తల్లడిల్లిపోతారు. అయ్యిందేదో అయిపోయింది. తమ భార్యా పిల్లలను, మిగిలిన ఇరువై ఒకటి ఆవులను కాపాడుకోవాలని అనుకుంటారు. తమలా డేరాలు వేసుకొని జీవిస్తున్న కొన్ని కుటుంబాల దగ్గర వసరా ఏర్పాటు చేసుకుని అక్కడి ఆదివాసీ తెగతో కలిసి జీవిస్తా ఉంటారు. రెండేళ్ళు గడిచిపోతాయి. చాలా మార్పులు వస్తాయి. లావుడ్యా లాకు నాయక్ తమ దగ్గర ఉన్న వాటిలోంచి పద్దెనిమిది ఆవులను దగ్గరలో ఉన్న ఊరిలో అమ్మి, ఆ వచ్చె డబ్బుతో తన ముగ్గురు కూతుర్ల పెళ్లి చెయ్యాలని అనుకుంటాడు. కానీ అతను తిరుగు ప్రయాణం అయ్యేసరికి చీకటి పడిపోతుంది. అప్పటికి అతను అడవి మధ్యలో ఉండటంతో తను తన వాళ్ళను చేరుకుంటాను. ఇంకా కొంచందూరమే అనుకుంటూ నడుస్తుంటాడు. ఆ చీకట్లో ఏమైందో ఏమో తెలీదు కానీ మరుసటి రోజు ఉదయం అతడు చనిపోయి కనిపిస్తాడు. దేహం నిండా గీరిన గీతలు కడుపులో పేగులన్ని బైటికి వచ్చేసుంటాయి.
 
                       కొందరు అది ఇప్పపూలు తిన్న ఎలుగుబంటి చేసిందంటారు. ఇంకొందరు కచ్చితంగా ఇది పులి పనే అని అంటారు. ఇంకొందరు మనుషులే లావుడ్యా లాకు నాయక్ దగ్గరి డబ్బుల కోసమే ఇలా చేసుంటారని కథలు కథలుగా చెప్పుకుంటారు. ఆ కథనే ఆదివాసీలందరూ రాత్రుళ్ళు తమ పిల్లలకు కథలు కథలుగా చెప్తూ ఉంటారు. 
 
      భీమా నాయక్ మరియు అక్కడి ఓ ఆదివాసీతో పెద్ద గొడవ కావడంతో వారందరూ భీమా కుటుంబాన్ని తమ స్థలాన్ని వదిలి వెళ్ళాలని గట్టిగా చెప్తారు. అలా తను, తన భార్యా నాన్కు బాయి, అన్న భార్య లాడ్కి బాయి అతని ముగ్గురు కూతుర్లు, మిగిలిన మూడు ఆవులు వాటి దూడలను తీసుకుని వలస మొదలు పెట్టి కొన్ని నెలలుగా రహస్యంగా ప్రాంతాలను దాటుతూ, సేదతీరుతూ ప్రయాణిస్తూ ఉంటారు. ఆ ప్రయాణంలో జ్వరం వల్ల లాడ్కి బాయి చనిపోతుంది.
 
                  ఏడు నెలలైనా నిండలేదు. పురిటి నొప్పులు తట్టుకోలేక లబోదిబోమంటుంది నాన్కు బాయి ఓ ఆడబిడ్డకు జన్మనిస్తుంది. ఆమెకు వయసు పదిహేడు సంవత్సరాలు.
   
       పుట్టిన శిశువుకు సాంప్రదాయ పద్ధతుల్లో చేయాల్సినవేవి చెయ్యలేదు. చేసే అవకాశం దొరకదు. ఒక్కొక్కరిగా ఆ తంతును ఎవరూ చెయ్యరు అందరూ కలిసి చేస్తారు. అప్పటికే తాము తమ వాళ్లందరినీ కోల్పోయారు. ప్రపంచం దృష్టిలో క్రిమినల్స్, దొంగలు, అంటరాని వారుగా ముద్రపడడంతో వారికి పనులు దొరకడం కష్టమౌతుంది. వారి దగ్గర ఎవరు ఏమీ తీసుకోవడానికి ఇష్టపడేవారు కాదు.
 
అలా భీమానాయక్ మనస్సులో భయం నిండిపోతుంది. నలుగురు కూతుళ్లు, రెండు దూడలు, మూడు ఆవులు, ఒక ఎడ్ల బండి మరియు తన భార్య వీళ్ళందర్నీ కాపాడుకోవాల్సిన బాధ్యత భీమానాయక్దే.
 
 
       ఎక్కడ ఉండాలో ?
                     ఎలా బతకాలో ?
                               ఏం చేసి బతకాలో ? ఏమి తోచట్లేదు భీమాకు. ఒకటే ఆందోళన నా భుజాలపై ఉన్న వీటన్నింటిని నేను కాపాడుకోవాలి.
 
          సంవత్సరం గడిచిపోయింది. తమ వాళ్ళు చేసిన వ్యాపారాలు ఉప్పు రవాణా చేయడం, ఆవులను అమ్మడం, వేటాడడం, ఎడ్ల బండ్లు తయారు చేయడం ఇతర పనులన్నీ మర్చిపోయాడు భీమా.
 
        ప్రయాణిస్తూ ప్రయాణిస్తూ ఓ రాష్ట్ర సరిహద్దును చేరుకుంటారు. అక్కడ ఉన్న బ్రిటిష్ పోలీసులు వీరిని ఆపేస్తారు.
 
    ఎంత తమ అస్తిత్వాన్ని దాచుకోవాలి అనుకున్నా, వారి అస్తిత్వం వారి నడకలో, వారి మాటల్లో కనిపిస్తుండడంతో వారు సంచార తెగలకు సంబంధించిన వారని నిర్ధారించి వారిని బంధింస్తారు.
 
పోలిసులు ఆ కుటుంబాన్ని కారణం లేకుండా చితక బాదుతారు. అలా భీమా పోలిసులు విరిచేసిన తన కాలును చూస్తూ ఆ నొప్పికి పావురంలా వణికిపోతాడు. ఇదంత చూస్తున్న భీమా భార్యకు జ్వరం వస్తుంది. ఆమె ఒళ్ళో ఉన్న శిశువు పోలిసులు ఆమెని కొట్టిన దెబ్బల్లో తన శిశువు తలకు దెబ్బ తగులుతుంది. సుతిమెత్తని తల పుర్రె పగిలి ఆ శిశువు చనిపోతుంది. నిద్రపోతుందనుకున్న ఆమె ఆ శిశువుని తన గుండెలకు దగ్గరగా ఉంచుతుంది.
 
 
రెండు రోజులు గడిచిపోతాయి. మూడో రోజు రాత్రి భీమా అన్నయ్య ముగ్గురు కూతుర్లును పోలిసుల్లో కొందరు ఎత్తుకెళ్లిపోయి పాడుచేస్తారు. ఆడపిల్లల ఏడ్పులు వింటూ కూడా ఏమీ చేయలేకపోతాడు భీమా.
 
ముగ్గురు కుతుర్లను ఎత్తుకెళ్లిన పోలిసులు తిరిగివస్తారు. వచ్చి రాగానే వారి గది బయట తాగడం ఆరంభిస్తారు.
 
     భార్యాభర్తలు ఒకరిని ఒకరు చూసుకుంటూ కన్నీరు పెట్టుకుంటారు. అంతలోనే ఒక పోలిసు వాడు రెండు దూడలను తుపాకితో కాల్చి చంపేస్తాడు. చనిపోయిన దూడ మాంసం తీసి ఇవ్వమని భీమాను అడుగుతాడు. భీమా తనకు ఇష్టం లేకున్నా ఎక్కడ తనను తన భార్యను చంపేస్తారో అని దూడ మాంసం తీసి ఆ పోలీసుకు ఇస్తాడు.
   
 మాంసాన్ని కాల్చడానికి మంటను వెలిగిస్తాడో పోలీస్. మొత్తం పదకొండు మంది పోలిసులు మంట దగ్గర చేరుకుని కాలిన మాంసాన్ని కాల్చినట్లు తింటూ తాగుతూ ఆనందిస్తూ ఉంటారు. 
 
 అంతలోనే ఎర్రగా కందిపోయిన దేహాలతో కుంటుతూ భీమా ఉన్న దగ్గరికి ముగ్గురు అక్కాచెల్లెళ్ళు వస్తారు. వారిని చూసిన భీమా తన భార్యా ప్రాణం తిరిగొచ్చినట్లు గట్టిగా ఒకరినొకరు పట్టుకొని ఏడుస్తారు. భీమాకు ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్ళను తిరిగి చూసేసరికి ప్రాణం లేచి వస్తుంది. అక్కడ నుండి ఎలా తప్పించుకోవాలి ఆలోచించడం మొదలు పెడతాడు. మాంసాన్ని తింటున్న వారిలో ఒక పోలిసు జాలిగా ఆ కుటుంబాన్ని చూస్తాడు. కానీ ఏం లాభం ఆ జాలి వల్ల వారికి ఒరిగేదేమీ లేదు. ఎలాగైనా అక్కడి నుండి తప్పించుకోవాలని అనుకుంటారు. పోలిసులు తినేసి అక్కడొకరు ఇక్కడొకరు పడుకుంటారు. 
 
    అది అర్ధరాత్రి చంద్రుడు ఆకాశంలో భూమికి సూటిగా నిలబడిపోయాడు. చలి చెంపెస్తుంది. ఆవులు ఎటు వెళ్ళిపోయాయో ? ఆ కుటుంబమంతా ఒకరినొకరు ఓదార్చుకుంటు ఉన్నారు. చనిపోయిన శిశువు దేహం నుండి వాసన రావడంతో ఏమీ చేయాలో తోచక అయోమయంలో ఉండగ ఓ గుంపు మనుషులూ భీమా కుటుంబం ఉన్న చోటికి వచ్చి వారిని అక్కడి నుండి తీసుకుని తమతో పాటు తీసుకెళ్లడంతో కొత్త జీవితం ప్రారంభించే అవకాశం వారికి దొరుకుతుంది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.