నవ్వుల్ని పూయించడం!

-డా. కె. దివాకరా చారి

పసి పాపల నిర్మల నవ్వులు

ప్రకృతికి ప్రతిరూపాలు

కొత్త చిగురులా

కొంగ్రొత్తగా తొడిగే మొగ్గలా

నునులేత కిరణంలా

లేలేత వర్ణాలతో విరిసే

సుకుమారపు పువ్వులా

కొత్తగా మొలిచిన పసరు రెక్కలతో

ఆకాశాన్ని అందుకునేందుకు

ఎగిరే పక్షి కూనలా

ఏ వర్ణనలకు సరితూగని

ఏ కాలుష్యం సోకని

కల్మషం లేని ఆ నవ్వు ఇంకెవరికీ

సాధ్యం కానిది ఈ లోకాన!

కూర్చున్న చోటనుండి కదలకుండానే

అలా అలలా ప్రతిగుండె పై

పన్నీటి జల్లు కురిపిస్తూ

ప్రపంచమంతా పరివ్యాపితమవ్వడం

ఆ నవ్వుకే సాధ్యం !

సునితమైన  ఆకుల రెపరెపల

మౌన సవ్వడుల రాగాలు

పక్షుల కువకువల శబ్దాలలో

కలిసిపోయిన నీ నవ్వులను

నాకు కానుకగా ఇస్తావా చిట్టి తల్లీ!

ఈ బాధామయ ప్రపంచంలో

ఎండిన పెదాల కొమ్మలపై

చిరునవ్వును పూయించడం కూడా

ఓ రహస్య రసానంద కళే !

బాధల్ని, బరువుల్నీ

బ్రతుకు పోరులో ఎదురయ్యే

టోకరా దెబ్బలని, కన్నీళ్లనీ

మనకు తెలియకుండానే

మటు మాయం చేసే

మహత్తర బ్రహ్మ మంత్రం

పాపం, పుణ్యం, స్వార్థం సోకని

విరబూసే ఆ చిన్నారి నవ్వులే కదా !

( చిట్టి తల్లి ‘ సియ ‘ నవ్వులకు

మైమరిచి పోయిన క్షణాలలో )

*****

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.