యుద్ధం ఒక గుండెకోత-3

(దీర్ఘ కవిత)

-శీలా సుభద్రా దేవి

స్వప్నాలుకాలిన నుసిమీద

హృదయ పుష్పాలు శ్రద్ధాంజలులు ప్రకటిస్తున్నాయి

రేపటి వెలుగు కిరణంకోసం

కూలిన సౌధాల అడుగున

గుండె ఎక్కడో జారిపోయింది

అరాచక శక్తుల సూక్ష్మక్రిములు

జన్యువుల్ని తిని రోగాల్ని త్రేనుస్తున్నాయి

ఊపిరితిత్తులు శ్వాస తీసుకోవటం మర్చిపోతున్నాయి 

చలువగదులు కూడా ఎర్రని ఎడారి స్వప్నాలతో

చెమట చిత్తడులై సోలిపోతున్నాయి

స్వేచ్ఛాదేవత విగ్రహంమీద

పిండిరేణువుల్ని మోసుకెళ్తున్న చీమల్ని చూసి

ఘనత వహించిన ఆధిపత్య సర్పం వణికిపోతోంది

ఎక్స్‌రే కళ్ళు దేశాలమీద తెరుచుకొంటున్నాయి

భవిష్యత్తు తేటతెల్లమౌతోంది

తెరమీద ఎరుపుజీరలు విచ్చుకొంటున్నాయి

అప్పుడప్పుడే వాలిన మంచుబిందువు

రక్తమలాముతో పగడమౌతోంది

విస్తరిస్తున్న కార్యకలాపాలమీద

మృత్యువు గుడ్లగూబై కాచుకోనుంది

బతుకుతెరువుకోసం ఎగిరొచ్చిన వలసపక్షులు

విరిగిపోతున్న కొమ్మల్ని చూస్తూ

బిక్కముఖంతో ఆధారం వెతుక్కుంటున్నాయ్‌

మండుతున్న శిథిలాల మీద వాలబోయి

రెక్కలు కాల్చుకొని చతికిలబడిపోతున్నాయి

నిఘానేత్రాల వాడిచూపు

విచ్చుకత్తై గుచ్చుకుంటుందేమోనని

ఎగురుకుంటూ ఎగురుకుంటూ

కుప్పకూలిపోతున్న నీడపట్టు వృక్షాల్ని చూస్తూ

నివ్వెరపాటుతో నిశ్చలన చిత్రమైపోతున్నాయ్‌

పర్వతారోహణ కలల దారిలో పడ్తున్న

భస్మాసురుడి హస్తముద్రలు

భవిష్యత్తుని కాల్చేస్తున్నాయ్‌

డాలరు గింజల వేటకోసం

తన్నుకుంటూ వచ్చేసినప్పటి

శూన్యమైన అమ్మగుండె గూడు

కన్నీటి సముద్రమైనప్పటి వైనం

మసక మసకగా తడుముకొంటూ

విరిగిన రెక్కల్ని ముడుచుకొని

బితుకు బితుకుగా

తనదికాని చోట తాను కాకుండా అయిపోయి

పరాయితనం మృత్యుశీతలచ్ఛాయక్రింద

బతకటానికి గింజలు ఏరుకొంటున్నాయి

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.