నా జీవన యానంలో- రెండవభాగం- 20

‘శతాయుష్మాన్ భవ’ – కథానేపథ్యం

-కె.వరలక్ష్మి

1960లనాటికి ఇంగ్లీషు, హిందీ హైస్కూల్లో ఆరవ తరగతిలో ప్రారంభమయ్యేది. మాకు అలా ఇంగ్లీషు నేర్పిన వారు శ్రీ జోగారావు మాష్టారు. ఏ అక్షరాన్ని ఎలా పలకాలి, ఏ పదాన్ని ఎలా ఉచ్చరించాలి అనేది పట్టి పట్టి నేర్పించేవారు. ఎంతో శ్రద్ధతో పాఠాలు చెప్పేవారు. నేను సెలవుల్లో మా అమ్మమ్మగారింటికి వెళ్ళి తిరిగి వచ్చాక రెండు వారాలు ఆలస్యంగా హైస్కూల్లో జాయినయ్యాను అప్పటికే నా తోటివాళ్ళందరూ రెండు బడులు నేర్చేసుకున్నారు. నేను వెళ్ళిన రోజే సాయంకాలం లోపల రెండు బడులు నేర్చుకుని మూడో బడిలో అందరితో కలిసిపోయాను. అంతకుముందు పరిచయంలేని అక్షరాల్ని అంత తొందరగా నేర్చుకున్నందుకు మాష్టారికి నామీద ఆదరం ఏర్పడింది. నా హైస్కూలు చదువు ముగిసిన నాలుగేళ్ళకి ఆయన రిటైరయ్యారు. ఆయన సర్వీసు మొత్తం జగ్గంపేటలోనే పూర్తయిందని చెప్పుకోవచ్చు. ఎంతో బాధ్యతతో, నియమంతో విద్యార్ధుల అభివృద్ధే ధ్యేయంగా బతికిన ఆయన ఈ ఊరితో, ఇక్కడి స్కూలుతో, విద్యార్ధులతో అనుబంధాన్ని వదులుకోలేకపోయారు. హైదరాబాదులో స్థిరపడిన తన నలుగురు పిల్లల్ని వదిలేసి తరచుగా జగ్గంపేట వచ్చేసి తన పూర్వ విద్యార్ధి ఏచూరి నారాయణమూర్తిగారి ఇంట్లో మడిగా వండించుకుని తింటూ అందర్నీ పలకరిస్తూ తిరిగేవారు. తనపేరు ఇక్కడి హైస్కూల్లో శాశ్వతంగా వుండిపోవాలని, అందుకు ప్రతి సంవత్సరం ఏడవతరగతిలో ప్రథమ స్థానంలో వచ్చిన విద్యార్థికి ఒక ఆర్ధికపురస్కారం తన పేరుతో ఏర్పాటు చేయాలని ఒక ఆకాంక్ష ఆయనలో ఏర్పడి వేళ్ళూనుకుంది. కానీ అప్పటి బతకలేక బడిపంతులైన వారి జీతాలు, పెన్షన్లు అంతంత మాత్రం అందుకని పూర్వ విద్యార్ధుల సాయంతో ఒక ట్రస్టు ఏర్పాటు చేసి, కొంత ఎమౌంటు బాంకులో వెయ్యాలని కొన్ని కరపత్రాలు ముద్రింపించి వాటిని అందరికీ పంచేవారు. నేను స్కూలు ప్రారంభించాక ఏచూరి వారిల్లు మా ఎదురిల్లే కావడంతో తరచుగా ఇంచుమించు రోజూ నా దగ్గరకు వచ్చేవారు. విద్యాబోధనలో మెళుకువలు నేర్పించేవారు. నేనెన్నుకున్న వృత్తి ఆయనకెంతో నచ్చేది.

ఆయన ఆకాంక్ష నెరవేర్చడానికి నేనూ కొంత కృషి చేసాను. ఆయన సేకరించి న ఎడ్రస్ కి కరపత్రాలు పంపించడం, ఉత్తరాలు రాయడం వగైరాలు చేసాను. వచ్చిన మొత్తం ఒక స్కూల్ టీచరు అందుకునేలా ఏర్పాటు జరిగింది. ఆయన బాగా వయోవృద్ధులైపోయాక ఒక చిన్న సమావేశంలాంటిది ఏర్పాటు చేసి తన ఆశయాలు చెప్పారట. దురదృష్టవశాత్తు నేనా సభకి అటెండ్ కాలేకపోయాను సభ ముగిసాక ఆయన మా ఇంటికొచ్చి కంట నీరు పెట్టుకున్నారు. నేను ముందే కన్నీళ్ళతో ఆయన పాదాల మీద పడ్డాను నా తల నిమిరి ‘శతాయుష్మాస్వ ‘ అని ఆశీర్వదించారు.

ఆ మర్నాడే బయలుదేరి వెళ్ళిన జోగారావు మాష్టారు మళ్ళీ తిరిగి రాలేదు. ఆ నెలలోనే కాలం చేసారు.

ఆయన బాధ్యత అప్పగించినవాళ్ళు సరిగా పట్టించుకోక కొంతకాలం ఒక డిక్షనరీ బహుమతి ఇచ్చి, తర్వాత ఇవ్వకా మాష్టారి పేరు మరుగున పడిపోయింది. ఆయన అన్నాళ్ళు తిరిగిన తిరుగుడికి అర్ధం లేకుండా పోయింది. ఇది రాస్తున్న ఈ క్షణంలో కూడా మాష్టారి జ్ఞాపకాలో నా కళ్ళు కన్నీళ్ళతో నిండిపోయాయి

శతాయుష్మానవ

నేను నా ఆఫీసు రూములోకి అడుగుపెట్టేసరికి విజిటర్స్ కుర్చీలో కూర్చున్న ముసలాయన నెమ్మదిగా లేచి నిలబడ్డాడు, మళ్ళీ ఏదో అనుమానం వచ్చి కూర్చోబోతూ “ఇదిగో అప్పారావ్. అమ్మగారొచ్చారా?” అన్నాడు శూన్యంలోకి చూస్తూ, ఆయన గొంతులో వార్ధక్యం తెచ్చిన కంపన, నా వెనకే వచ్చిన అప్పారావ్ టేబుల్ మీది కాగితాలు సర్ది, వాటి మీద ఎగిరిపోకుండా పేపర్ వెయిట్స్ పెట్టి “ఆఁ వచ్చారు” అన్నాడు పేన్ ఆన్ చేస్తూ.

“ఈనెవరో సెవుటి మేళం, దానికి తోడు కళ్ళగవపడవండి, తెల్లారే తలికి ఎప్పుడొచ్చాడో గేటు దగ్గిర రెడీగా వున్నాడు. మిమ్మల్ని సూత్తేకానీ ఎల్లనంటున్నాడు” అన్నాడు అప్పారావు పళ్ళన్నీ కనపడేలా నవ్వుతూ.

ఉక్కకి తడిసి మరింత మాసినట్టు కనబడుతున్న ఆయన చొక్కానీ, భుజం మీద చిరుగులోంచి కనపడుతున్న ఎముకల గూడులాంటి వంగిన ఆయన దేహాన్నీ, ఒక పక్క విరిగిపోయినా నేనున్నానంటూ ముక్కు మీద నిలబడిన బి.సినాటి కళ్ళజోడునీ మార్చి మార్చి చూస్తూ ఆయనెవరో గుర్తుచేసుకోవాలని శతవిధాలా ప్రయత్నించసాగాను. లాభం లేదు, ఈయన్ని నేనెప్పుడూ చూసినట్లు లేదు. చూసుంటే ఈసరికి గుర్తుకొచ్చేదే

”అమ్మలూ, నువ్వు సుభద్రవి కదూ” అన్నాడాయన నేనెటున్నానో ఊహించుకుని చూడ్డానికి ప్రయత్నిస్తూ.

“అవునండీ” అన్నాను నా జ్ఞాపకశక్తిని తిట్టుకుంటూ.

“గుర్తురాలే? మీ రంగా మేష్టారింటికి వచ్చేవాణ్ణి కానూ!”

ఓహో.. ఇప్పటికి స్ఫురించింది ఈయన శ్యామశాస్త్రిగారు. వయసు ఈయనలో చాలా మార్పు తెచ్చింది. “మీరా తాతగారూ, నమస్కారం, క్షమించండి, గుర్తుపట్టలేకపోయాను” అన్నాను లేచి దగ్గరకు వెళ్తూ.

నా పలకరింపు విని అప్పారావు కాఫీ కోసం పరిగెత్తాడు.

ఈయనింకా బతికున్నాడంటే ఆశ్చర్యమే. రంగా మాష్టారికి విద్య నేర్పిన గురువీయన. ఆయన హైస్కూల్లో చదివే రోజుల్లోనే రిటైరయ్యారు. ఈ మాష్టారు. పదిహేనేళ్ళ క్రితం నేను హైస్కూలు స్టూడెంటుగా వుండగా రంగా మాష్టారింటికి ట్యూషన్ కి వెళ్ళేదాన్ని. అప్పటికే రంగా మాష్టారికి నలభై ఏళ్ళు పైమాట. హార్ట్ ఎటాక్ వచ్చి ఈ మధ్యే పోయారాయన. ముసలాయనకి సహస్ర మాసాలు ఎప్పుడో దాటి వుంటాయి. గుండు చేయించుకున్నాడో, వూడిపోయిందో కానీ నెత్తిమీద ఒక్క వెంట్రుక లేదు. నోట్లో ఒక్క పన్నుకూడా వున్నట్టులేదు.

”గుర్తుకొచ్చానా అమ్మడూ?” అన్నాడాయన తృప్తిగా నవ్వుతూ.

“బావున్నారా తాతగారూ?” అన్నాను నేనూ ఏదో అడగాలి కాబట్టి.

“అయ్యో నా బాగు బుగ్గిగానూ. ఇంకేం బాగు తల్లీ ఊరు పొమ్మంటోంది కాడు రమ్మంటోంది” ఆయన గాజు కళ్ళల్లో విషాదం దోబూచులాడింది.

అప్పారావు తెచ్చిన కాఫీని అందుకుని స్వయంగా ఆయన చేతికిస్తూ “ముందు కాఫీ తాగండి” అన్నాను.

వణికే చేతుల్తో కాఫీ కప్పు అందుకుంటూ “ఆడపిల్లవైనా బాగా చదువుకుని వృద్ధిలోకొచ్చావ్, చాలా సంతోషమమ్మా” అన్నాడాయన. అప్పట్లో ఈయన మడిలేకుండా ఇచ్చిన కాఫీ ముట్టుకునేవాడు కాదు. కాఫీ తాగడం ముగిసాక అడిగాను “ఏం పనిమీద వచ్చా రిలా?”

దానికి జవాబుగా ఆయన కుర్చీ పక్కన పెట్టుకున్న మాసిపోయిన చేతి సంచి తీసి, దాన్లోంచి తడిమి తడిమి కాయితాల కట్టల్ని లాగసాగాడు.

ఆ కాగితాల్ని చూసి నేను అవాక్కయ్యాను.

ఇదే సంచి, ఇవే కాయితాలు ఈయన రంగా మాష్టారింటికి కూడా తెచ్చేవారు. కాకపోతే అప్పుడివి ఇంతగా నలిగిపోయి, చిరిగిపోయి లేవు.

ఆ కాయితాల్లో ఏముంటుందో నాకు తెలుసు.

“మన శ్యామశాస్త్రి మాష్టారికి మన ఊళ్ళో సన్మానం జరపాలనీ, వసూలైన మొత్తాన్నీ బేంకులో వేసి, దానిమీద వచ్చే వడ్డీని స్కూలు ఫస్ట్ వచ్చిన విద్యార్థికి ఇవ్వాలనే ఒక నిర్ణయం జరిగింది. మాష్టారి విద్యార్థులంతా తమ తమ శక్తి మేరకు డబ్బు పంపించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చెయ్యమని కోరుతున్నాము”

ఇట్లు

కమిటీ మెంబర్స్.

రంగా మాస్టారి పేరు కమిటీ మెంబర్స్ అన్నచోట ముందుంటుంది. మిగిలిన నలుగురి పేర్లూ గుర్తులేవు. వాళ్ళంతా ఇప్పటికింకా వున్నారో లేరో.

ఆ కరపత్రం ఇంతగా గుర్తుండిపోడానికి కారణం వుంది. ఈ శ్యామశాస్త్రిగారు రంగా మాష్టారింటికి వచ్చినప్పుడల్లా ప్రైవేటు పిల్లలందరం తలా ఒక పేపరు అడిగి తీసుకుని, ఆయన వెళ్ళిపోయాక వరసపెట్టి పైకి చదువుతూ నవ్వుకునేవాళ్ళం.

ప్రతిసారీ మా మాష్టారు మందలించేవరకూ ఆ ప్రహసనం అలా సాగాల్సిందే.

అప్పట్లో ఈయన తన దగ్గర చదువుకున్నవాళ్ళ చిరునామాలు సేకరిస్తూ ఎక్కడెక్కడో తిరుగుతూ వుండేవాడు.

ఆ ఊరికి వస్తూనే సంచి తెచ్చి మాష్టారింట్లో పడేసి ”రంగా! భోజనానికొచ్చేస్తాను. మడికట్టుకుని వండమను మీ ఆవిణ్ణి” అని చక్కాపోయేవాడు వూళ్ళోకి.

అప్పటికే వంట ముగించుకున్న ఆవిడ మళ్ళీ నూతి చప్టా మీదికి పోయి రెండు చెంబుల నీళ్ళు నెత్తిమీద గుమ్మరించుకుని తడి చీరతో నీళ్ళోడుకుంటూ కుంపటి అంటించేది.

అన్నం, పులుసు చల్లారితే పనికొచ్చేవి కావీయనకి, ఏ ఝాము కొస్తాడో పదార్థాలన్నీ వేడి చెయ్యాల్సి వస్తుందని కుంపట్లో రెండు నిప్పుల్ని ఆరిపోకుండా చూసుకునేవారావిడ. రాత్రికి కూరలన్నీ మళ్ళీ వండాల్సిందే మిగులు తగులు తినడాయన. పిల్లలో గుట్టుగా సంసారం లాక్కొస్తున్న ఆవిడకి ఈయనొచ్చాడంటే మతిపోయినట్టయ్యేది, కానీ, ఉత్తమ ఇల్లాలు కాబట్టి ఎప్పుడు విసుక్కోకుండా సొంత మావగారికి చేసిపెట్టినట్టు పెట్టేది. రంగా మాష్టారు జాలిగా చూసేవారావుణ్ణి. మావగారినైనా అలా చూడరని మా అత్తయ్య ఇంట్లో చూసాను నేను. కొడుక్కి పదెకరాల మాగాణి సంపాదించి ఇచ్చిన మావగారిని ముసలితనంలో మా అత్తయ్య విసుక్కుని, కసురుకుని నానాపాట్లు పెట్టేది.

“ఆ శ్యామశాస్త్రికేం రోగం, వచ్చి ఇలా అందరిళ్ళమీదా పడతాడు? పెదకొడుకు అక్కడెక్కడో స్కూళ్ళ ఇన్ స్పెక్టరట. రెండో కొడుకు స్టేషను మేష్టరు. ఆ కోడళ్ళు వడ్డాణాలూ, వరస గొలుసులూ వేసుకు తిరుగుతారు. ఈయన చూడబోతే ఇలా ఏమాట కామాటే చెప్పుకోవాలి, ముసలాడు వాళ్ళని మళ్ళనీ తళ్ళనీ వేయించుకు తింటాడు. ఈ రోజుల్లో ఎవరికి కుదురుతాయి అవన్నీ?” అంటూ మా అత్తయ్యే ఒక రోజు స్వగతంలో శ్యామశాస్త్రి కథ చెప్పేసింది.

ఈయనకో కూతురుండేదట. పెళ్ళి చేస్తే కట్నమివ్వాలని, ఆ పిల్లకు ముప్పయ్యేళ్ళొచ్చేవరకూ పెళ్ళి మాటెత్తకుండా ఊరుకున్నాడట. చివరికి బంధువుల బలవంతం మీద భార్య వదిలేసిపోయిన ఒక తెలుగు పండితుడికిచ్చి ఆ పిల్లని కట్నం లేకుండా ముడి పెట్టేసేడట, ఈ విషయం తెలిసి అతగాడి మొదటి పెళ్ళాం తిరిగొచ్చి ఈమెని తన్ని తరిమేసిందట. ఉద్యోగం ఊడుతుందనే భయంతో ఆ తెలుగు పండితుడు కుక్కిన పేనల్లే వూరుకున్నాడట. దారీ తెన్నూ తెలీక ఆ అమ్మాయి తండ్రి దగ్గర కొస్తే ఈయన ఆమెని ఆదరించడం పోయి, చెడామడా తిట్టి ‘తెలివుంటే పోయి ఆ మొగుడి దగ్గరే పడి ఉండమని” తరిమేసాడట. ఆత్మహత్య చేసుకోబోయిన ఆమెని ఎవరో పుణ్యాత్ములు ఆదరించి తమతో తీసుకెళ్ళారంట. ఆరోతరగతి మాత్రమే చదువుకున్న ఆమె రాజధాని నగరానికి చేరుకుని ఏదో బట్టలకొట్లో సేల్స్ ఉమన్ గా పని చేసి తన పొట్ట తను పోషించుకుంటోందట – ఈ సమాచారం కూడా మా అత్తయ్యే సేకరించిందప్పట్లో. ఆ కాగితాల్ని చూస్తూ అలా వుండి పోవడం చూసి కాలు “అమ్మగారూ, ఏంటండీ?” అని పలకరించాడు అప్పారావు

వణికే చేతుల్తో పేర్ల లిస్టున్న కాయితాల్ని విడదీస్తూ “అమ్మలూ ఇందులో నా దగ్గర చదువుకున్నవాళ్ళ పేర్లు, ఎడ్రసులూ కొన్ని వందలున్నాయి. కొందరు తండ్రులకీ, వాళ్ళ కొడుకులకీ కూడా నేనే చదువు చెప్పాను. వీళ్ళల్లో ఒక్కడు, ఒక్కడంటే ఒక్కడు కూడా పదిరూపాయలైనా పంపలేదు” అంటూంటే శ్యామశాస్త్రి కంఠం గద్గదమైంది. కళ్ళల్లో నీళ్ళు చిప్పిల్లాయి.

ఆ రోజుల్లో ఈ కరపత్రాలను ఎవరో ప్రెస్ వున్న స్టూడెంటు వుచితంగా ప్రింటుచేసి ఇచ్చేడట. వీటిని అందరికీ పంపించే బాధ్యత రంగా మాష్టారి మీద పెట్టాడీయన కానీ, ఇన్ని వందల మందికి పోస్టేజి భరిస్తూ వాటిని పంపించేంత ఆదాయం రంగా మాష్టారికి లేదని ఈయనకి తెలీదా? తన గురువుకోసం గమనించలేదా? తెలిసే తనని తను మోసం చేసుకుంటూ వచ్చేడా? ఇన్నేళ్ళ తర్వాతింకా ఈ బడి పంతుల్ని ఆ విద్యార్థులు గుర్తుపెట్టుకుంటారని నిజంగా నమ్ముతున్నాడా ఈయన?

“నిజం చెప్తున్నా నమ్ము అమ్మలూ ఆ మారుమూల ఊళ్ళో అనామకలు బడిపంతులుగా బతుకు వెళ్ళదీసాను, నాకు తెలిసిందీ, నేను వలచిందీ ఆ వూరే, ఆ ఊరితో నా అనుబంధం నాకే అర్థం కానిది. నా తల్లినీ, నా భార్యనీ అదే నేలమీద మట్టిచేసాను. నేనూ అక్కడే మట్టిలో కలిసిపోతాను. కాని.. కాని నేను పోయినా ఆ బడిలో నా పేరు శాశ్వతంగా నలిగిపోవాలి. ఏడాది కొకసారైనా ఏదో ఒక సందర్భంలో ఆ బడిలో నా పేరు తల్చుకోవాలి. ఇది నా తీరని కోరిక. ఇప్పటికెందర్నో అడిగాను అవుననే వాళ్ళుకొందరు. నా వెనక నవ్వే వాళ్ళు కొందరు. కానీ, నా కోరిక ఎవ్వరూ తీర్చలేదు. ఈ ఆశ తీరకుండానే రాలిపోతానేమో అనుకుంటూండగా నువ్విక్కడున్నట్టు తెలిసింది. నువ్వు నా దగ్గిర చదువుకున్నదానివి కాదు. అయినా, నాకీ సాయం చేసిపెట్టు తల్లీ. ఈ కాయితాలన్నీ ఆ ఎడ్రన్లకి పంపించు, చచ్చి నీ కడుపున పుడతాను.” జీవం లేనట్లున్న చల్లని చేతుల్తో నా చేతుల్ని పట్టుకున్నాడాయన. ఈ కోరికే ఈయన్నింతకాలం బతికించినట్లుంది.

“తాతగారూ నాకో డౌటు. అప్పట్లో మీ రిటైర్మెంటూ డబ్బుతో ఆ పని చేసి వుండవచ్చుకాదా”

నా అసందర్భపు ప్రశ్నకి విషాదంగా నవ్వేడాయన.

“అప్పట్లో బడిపంతులి జీతం ఒక జీతమూ, పెన్షనూనా? బతకలేక బడిపంతులనే వాళ్ళు, ఆ పెన్షను నాలుగు రాళ్ళూ రావడానికి ఎన్నిపాట్లు ఆ పరమాత్ముడికే ఎరుక, ఇకపోతే, నాకొడుకులు నా పాలిటి శత్రువులు. ఆ డబ్బు అందగానే ఇకమీద పోషించాల్సింది మేమే కదా” అంటూ గెద్దల్లా తన్నుకు పోయారు. ఆడపిల్ల పెళ్ళైనా చెయ్యనిచ్చారుకారు.”

ఇది వింటూంటే మనం చెవులతో వినే ప్రతి సంఘటనకీ బొమ్మా బొరుసూ వుంటాయని నాకనిపించింది.

”అమ్మగారూ ఇజిటర్సు శానామంది మీకోసం వెయిట్ చేస్తున్నారు.” అంటున్నాడు అప్పారావు గొణుగుతూ. ఉద్యోగరీత్యా బిజీసీటు నాది. ఒక నిర్ణయానికొచ్చి “అలాగే తాతగారూ. మీరు చెప్పినట్టే చేస్తాను. మీ ఎడ్రస్ ఇచ్చి వెళ్ళండి. పనిముగియగానే మీకు కబురు చేస్తాను” అన్నాను.

ఆ మాట వింటూనే నవ్వుతో ఆయన బోసి పెదవులు విచ్చుకున్నాయి. “శతాయుష్మాన్ భవ.. శతాయుష్మానభవ” రెండు చేతులెత్తి ఆశీర్వదించాడు.

ఆ సంచిలోని కాయితాలన్నిటితో బాటు తన అడ్రసు కూడా ఇచ్చి అప్పారావు తోడురాగా బైటికి కదిలాడాయన.

దీర్ఘకాలం బ్రతకడం అదృష్టమౌనోకాదో నాకు తెలియదు. ఈ శ్యామశాస్త్రిగారిని చూస్తూ వుంటే అది అదృష్టం కాకపోగా దురదృష్టమేమోనని అనిపిస్తోంది. ఆ దీవెన అందరికి కాకపోయినా, కొందరికైనా శాపంగా పరిణమిస్తుంది కాబోలు. అందుకే ఆ దీవెన మాత్రం నాకొద్దనుకున్నాను.

వార్ధక్యంలో నా అనే వాళ్ళులేక, కష్టానికి ఆదుకునే తోడులేక, స్వయంగా చెయ్యి కాల్చుకుంటూ, వున్ననాడు తింటూ లేనినాడు పస్తులుంటూ బతుకుని వెళ్ళదీసుకురావడం శాపం కాక మరేమిటి? వేదికలెక్కి ఉపన్యాసాలు దంచే రాజకీయ నాయకులకిలాంటి వాస్తవాలు దృష్టికిరావు.

“బ్రతుకొక్క ఆరిన వత్తి కొడిలా తలచి మిధ్యలా కలచి పై కప్పు వంగిపడు పాడిల్లువలె నిలిచి” (తిలక్) వున్న శ్యామశాస్త్రిగారికోసం త్వరలో ఏదో ఒకటి స్వయంగా చెయ్యాలనే నిర్ణయానికొచ్చాను.

మరో వారం రోజుల్లో నా ఆఫీసులో జరూరు పనులన్నీ ముగించుకున్నాను. మా కంపెనీ రూల్స్ ప్రకారం నాలుగువేలకన్నా ఎక్కువ అప్పుగా శాంక్షన్ కాలేదు. నా వెనుకున్న బాధ్యతల వలన నేనింతవరకూ కూడ పెట్టిందేం లేకపోయింది.

నేనిలా వస్తున్నాను, ఆయన్ని సిద్ధంగా వుండమని శ్యామశాస్త్రిగారికి టెలిగ్రాం ఇచ్చి బయలుదేరి వెళ్ళాను.

నేరుగా ఆ ఊరి హైస్కూలుకి చేరుకుని హెడ్మాష్టరు గారికీ, స్టాఫ్ కీ విషయం చెప్పాను. శ్యామశాస్త్రిగారిని తెలిసిన వాళ్ళెవరూ లేరక్కడ, అయినా, అందరూ ఉత్సాహంగా ముందుకొచ్చారు.

శ్యామశాస్త్రి గారికోసం పంపిన కారులో మధ్యవయస్కుడొకాయన వచ్చి దిగాడు.

టెలిగ్రాం అందిందట. ఎదురు చూస్తూ వుంటామేమోనని కబురు చెప్పడానికి వచ్చాడట. వస్తూనే మొదలు పెట్టాడు. “చూడండి ఎంత పని చేసాడో ముసలాడు. వారం రోజుల క్రితం ఎక్కడి నుంచో గాలిలో తేలుతున్నట్టు నడిచి వచ్చాడు. ఎందుకో ముఖం వెలిగిపోతుంది. తనలో తనే నవ్వుకుంటున్నాడు. అలా వచ్చి వచ్చి పంచపాళీ గదిలో మూలనున్న తన మూట మీద తల వాల్చాడు. ముఖం నవ్వుతూనే వుంది. ఎప్పుడు ప్రాణం పోయిందో ఎవరం గమనించలా. దుష్ట నక్షతంలో చచ్చి మమ్మల్ని సాధించాడు. ఇల్లు ఖాళీ చెయ్యాల్సొచ్చింది. ఏవిటీ, సన్మానం అని టెలిగ్రామిచ్చారు. ఆయన తాలుకు డబ్బేమైనా వుంటే నాకే చెందుతుంది. ఎందుకంటే, దూరపు బంధుత్వాన్ని పురస్కరించుకుని పోయేముందంతా నా ఇంట్లోనే తిష్టవేసాడు. కొడుకులు బాగానే వదిలించుకున్నారు” అని కూడా అన్నాడు.

ఎందుకో నాకు దుఃఖం కానీ, ఆశ్చర్యం కానీ కలగలేదు. అలాంటి మనిషి అలా మాట్లాడకపోతేనే ఆశ్చర్యపడాలి.

“అలాంటిదేం లేదు లెండి” అంటూ అందరూ కలసి ఆయన్ని పంపించేసారు. అనుమానంగా చూస్తూనే నిష్క్రమించాడాయన.

సభాకార్యక్రమం కొనసాగించాం. శ్యామశాస్త్రి గారి ఆత్మశాంతికి ఐదునిమిషాలు మౌనం పాటించాం. తెలీని వాళ్ళుకూడా ఆయన గొప్పతనాన్ని పొగిడారు స్టేజిమీద.

నేను తెచ్చిన డబ్బు బేంకులో వేసాను శాస్త్రిగారి పేర్న, దానిమీద వచ్చే వడ్డీ శాస్త్రిగారి కోరిక మేరకు ప్రతి ఏటా ఆ స్కూల్లో ఫస్ట్ వచ్చే విద్యార్థికివ్వాలనీ, ఆ ఫండ్ మాత్రం ఎల్లకాలం అలాగే వుండాలని బేంకులో నమోదైంది.

తిరిగి వస్తూ అలసటగా సీట్లో వెనక్కి చేరబడ్డాను. కాంతి తరిగిన సూర్యుడు పశ్చిమాద్రి వెనక్కి నిష్క్రమించబోతున్నాడు. చెట్ల ఆకుల నీడల వెనక ఎక్కడో ఒక వృద్ధ మహిషం దీనంగా అరుస్తోంది.

ఒక జీవి తుదికోరిక తీర్చే అవకాశం కలిగించిన నా ఉద్యోగానికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, అలసటగా కళ్ళుమూసుకున్నాను.

 

****

(కౌముది సౌజన్యంతో-)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.