వంచిత

(మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021లో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

-శాంతిశ్రీ బెనర్జీ

సాహిత్య వాళ్ళమ్మ అలమారలో మంచి చీర కోసం వెతుకుతుంది. ఆ రోజు సాయంత్రం జూనియర్స్‌ ఇచ్చే ఫేర్‌వెల్‌ పార్టీకి అమ్మ చీర కట్టుకుని, చక్కగా రెడీ అయి కాలేజీకి వెళ్ళాలని ఆమె ఆరాటం! అలమారలో ఉన్న చీరల్లో ఏది నచ్చలేదు. ఇంతలో ఆమె దృష్టి వాళ్ళమ్మ పాత ట్రంకుపెట్టె మీదకు మళ్ళింది.

అందులో కూడా అమ్మ చీరలుండాలి కదా!అనుకుని గదిలో ఒక మూల స్టూలుమీద పెట్టబడిన ట్రంకుపెట్టె దగ్గరికి వెళ్ళింది. తెరచి చూస్తే లోపల రకరకాల  రంగుల చీరలు కనపడ్డాయి. సంతోషంగా తనకి నచ్చిన చీరె కోసం వెతకసాగింది. చివరికి ఆకుపచ్చ చీరెకి ఎర్రటి బోర్డర్‌ ఉన్న సిల్కుచీరె ఆమెని ఆకర్షించింది. అది బయటికి తీసి తన మీద వేసుకుని చూడటానికి మడత విప్పింది. మడతల్లోంచి ఒక పాత కవరు క్రిందపడింది. కుతూహలంగా కవరు తెరచి చూసింది. ఎప్పటిదో బ్లాక్‌ అండ్‌ వైట్‌ పాతఫోటో, రెండు పోస్ట్ కార్డ్స్‌, నలిగిపోయిన రెండు పాత కాగితాలపైన రాయబడిన కవితలు కనపడ్డాయి. ఆశ్చర్యంగా వాటిని తీసుకుని వంటింట్లో పనిలో ఉన్న తల్లి దగ్గరకెళ్ళి –

అమ్మా ! ఇవేంటి? నాకెప్పుడూ చూపించలేదే?” అంది.

కాత్యాయని ఆ పాతకవరు చూడగానే గుర్తుపట్టి అది మా అమ్మది! నేను జాగ్రత్తగా దాచుకున్న వస్తువు ! నాకు మా అమ్మమ్మ ఇచ్చింది. ఆ ఫోటోలో ఉన్నది నీ తాతగారు రామానుజశర్మ, అమ్మమ్మ అమృతవల్లి. ఆ రెండు ఉత్తరాలు అమ్మమ్మ తాతగారికి రాసినవి. ఆ కవితలు కూడా అమ్మమ్మ రాసుకున్నవి. ఈ మధ్య ట్రంకుపెట్టె సర్దుతుంటే కనపడింది. తీసి గుర్తుగా ఆ చీర మడతల్లో పెట్టాను. నీకు చూపిద్దామని అనుకున్నాను కూడా!అంది వాటివంక అపురూపంగా చూస్తూ.

అమ్మమ్మ కవితలు కూడా రాసేదా? నాకెప్పుడూ చెప్పలేదేం? ఈ ఫోటోలో ఎంత అందంగా ఉంది అమ్మమ్మ! ఆమెని గురించి చెప్పు. నాకు వినాలని ఉంది!అంది ఆత్రంగా.

ఉండు నా వంట అవనీ! ఇప్పటికే ఆలస్యం అయింది. రెండు కావొస్తోంది. అన్నాలు తిన్న తర్వాత తీరిగ్గా చెబుతానుఅంది.

తల్లి సమాధానంతో తృప్తిపడి, డ్రాయింగ్‌ రూముకెళ్ళి సోఫాలో తాపీగా కూర్చుని ఫోటో పరిశీలనగా చూడసాగింది.

సాహిత్య తండ్రి నాలుగేళ్ళ క్రితం హార్ట్‌ అటాక్‌ వలన పోయాడు. కాత్యాయని కూతురిని తీసుకుని  తెనాలి నుంచి హైదరాబాద్‌ వచ్చి, కొడుకుంటున్న ఇంటిదగ్గర ఫ్లాట్‌ కొనుక్కుని ఉంటున్నది. సాహిత్య బి.ఏ. ఎకనామిక్స్‌ ఆనర్సు చదువుతుంది. ఫైనల్‌ ఇయర్‌లో ఉంది. చదువుతోపాటు తెలుగు సాహిత్యం అంటే తగని అభిమానం. కనపడిన పుస్తకమల్లా వదిలిపెట్టకుండా చదువుతుంది. కవితలు కూడా రాస్తుంది. కొన్ని పత్రికల్లో కూడా వచ్చాయి. అమ్మమ్మ కవితలు రాస్తుందన్న విషయం తెలుసుకుని తెగ ఆనందపడిపోయింది.

తనకీ కవితలు రాసే అలవాటు అమ్మమ్మ నుంచే వచ్చుంటుంది అనుకుని ఫోటోలోని యువతిని దీర్ఘంగా చూసింది.

ఆమెకి సుమారు పద్దెనిమిదేళ్ళు ఉండవచ్చు. చక్కటి కోలముఖం. ఎన్నో భావాలు, ఆవేశాలు, ఆలోచనలు దాచుకున్నట్లున్న లోతైన పెద్దకళ్ళు. సూటిగా  ఉన్న ముక్కు. మధురమైన మందహాసంతో విచ్చుకున్న పెదవులు. చెవులకి పెట్టుకున్న బుట్టలతో, మెళ్ళో తాళిబొట్టు, నల్లపూసల గొలుసులతో, చిన్న, చిన్న పూలున్న చీరతో దివినుండి భువికి వచ్చిన దేవతలాగా ఉంది.

తాతగారు కుర్చీలో కాలుమీద కాలేసుకుని ఠీవిగా కూర్చున్నారు. ఆయన కుర్చీ పక్కనే నిలబడింది అందాలబొమ్మ అమ్మమ్మ! తాతగారు మొహం చిట్లించి అసలు ఫోటో తీయించుకోవడమే నచ్చనట్లు కూర్చున్నారు. మనిషి చూడటానికి బాగానే ఉన్నారు. బహుశా ఆయనకి ముప్ఫయి సంవత్సరాలకి తక్కువ ఉండవు. వాళ్ళ వయసుల్లో ఉన్న తారతమ్యం ఇట్టే తెలిసిపోతున్నది.

ఇంతలో కాత్యాయని భోజనానికి పిలిచింది. ఇద్దరు కలసి భోంచేసారు. వంటింట్లో అన్నీ సర్దేసి చేతులు తుడుచుకుంటూ వచ్చిన కాత్యాయనికి హాల్లో సోఫా మీద తనెప్పుడు వస్తుందా అన్నట్లు కూర్చున్న కూతురిని చూసి నవ్వొచ్చింది.

తల్లి సోఫా మీద పడుకుని తలపెట్టుకోడానికి వీలుగా కుషన్లు సర్దింది సాహిత్య. సోఫా మీద పడుకుని కూతుర్ని తన దగ్గరికి పిల్చి పక్కన కూర్చోబెట్టుకుంది కాత్యాయని.

ఇక చెప్పు అమ్మమ్మ గురించిఅంది సస్పెన్స్‌ భరించలేనట్లు.

కాత్యాయని ఏదో ఆలోచనలో ఉన్నట్లు, జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నట్లు కొంచెం సేపు మౌనంగా ఉంది. తర్వాత దీర్ఘంగా నిట్టూర్చి చెప్పడం మొదలెట్టింది.

* * *

అమృతవల్లి ముగ్గురన్నయ్యల తర్వాత అపురూపంగా పుట్టిన ఆడపిల్ల. తండ్రి రాఘవయ్యశాస్త్రి గుంటూరు జిల్లాలోని ముక్కామల గ్రామానికి కరణం. ఆయనకి ఇరవై ఎకరాల పొలం, రెండు మామిడితోటలు ఉన్నాయి. ఇంటినిండా నౌకర్లు, చాకర్లు. భార్య అరుంధతీదేవి పెద్ద మనసు కలది. దానధర్మాలు చేస్తూ, పాలేర్లని, నౌకర్లని ఆదరంగా చూస్తూ అందరికీ తలలో నాలుకలా మెలిగేది.

ఒక్కతే ఆడపిల్ల అవడం వలన అమృతవల్లి గారాబంగా పెరిగింది. కోరిందల్లా తెచ్చిపెట్టేవారు. ఆ రోజుల్లో అది అసాధారణమైనా ఇంట్లో ట్యూటర్‌ని పెట్టి చదువు కూడా చెప్పించారు. చిన్నప్పటి నుంచి పుస్తకాలు తెగ చదివేది. ఆమె కోరిక మీద దొరికిన పుస్తకమెల్లా తెచ్చి యిచ్చేవారు. పదమూడు సంవత్సరాల వయస్సునుండి కవితలు రాసేది. తల్లిదండ్రులు విని మురిసిపోయేవారు. ముగ్గురన్నలకి కూడా చెల్లంటే పంచప్రాణాలు.

అమృతవల్లికి పదిహేను సంవత్సరాలు రాగానే వివాహం చెయ్యాలని నిశ్చయించారు. అప్పటికే చాలా ఆలస్యం చేశారని చుట్టూవున్న సమాజం నుంచి విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. కృష్ణాజిల్లాలో ఉన్న నాగాయలంక వాస్తవ్యులైన విష్ణువర్థన్‌శర్మ మూడవపుత్రుడు రామానుజశర్మతో మెట్రిక్యులేషన్‌ వరకు చదువు కున్నాడని వివాహం వైభవంగా జరిపించారు. అన్ని లాంఛనాలతో అత్తవారింటికి వెళ్ళింది అమృతవల్లి.

ఆడింది ఆటగా, పాడింది పాటగా పెరిగిన అమృతవల్లికి అత్తగారిల్లు జైలులా అనిపించేది. మడీ, ఆచారం అలవాట్లు అతిగా ఉన్నట్లనిపించి మొదట్లో ఊపిరాడనట్లుగా ఉండేది. అత్తగారి చాదస్తం, ఆధిపత్యం, తనకంటే పెద్దవారైన తోడికోడళ్ళ దాష్టికం ఒక్కోసారి ఆమెకి భరించరానివిగా అనిపించేవి.

రాత్రిపూట తప్పిస్తే, పగలు ఎక్కువగా కనిపించేవాడు కాదు భర్త. ఆమెలోని అమాయకత్వాన్ని, సరళతని చూసి చిన్నపిల్ల చేష్టలుగా భావించి విసుక్కొనేవాడు. పెద్దగా నవ్వొద్దనీ, వారితో, వీరితో మాట్లాడొద్దని ఆంక్షలు పెట్టేవాడు. పుస్తకాలు చదవవద్దనీ, కవితలు రాయొద్దని కూడా అనేవాడు. అతను ప్రేమగా, ఆప్యాయంగా మాట్లాడే క్షణాలు ఎప్పుడోగాని దొరికేవికావు. దొరికిన వాటినే మరీ మరీ గుర్తుకు తెచ్చుకుని మైమరచేది అమృతవల్లి.

వెంట వెంటనే కాన్పుల వలన ఇరవైరెండేళ్ళకే ముగ్గురు కొడుకులు, ఒక కూతురు పుట్టారు. ఆ పరిస్థితుల్లో కూడా ఆమె చాటుగా కవితలు రాసుకుని దాచుకునేది. తోటలోకి వెళ్ళి ఒంటరిగా కూర్చుని నలువైపులా పరచుకున్న వెన్నెలని, మౌనంగా మాట్లాడుతున్నట్లు, సేద తీర్చుతున్నట్లున్న ప్రకృతిని చూస్తూ పరవశించేది.

ఆమె రాసిన ఒక కవిత :

ఈ నిశీధిలో ….. ఈ తోటలో ….. ఒంటరినా?

పలుకరించే ప్రకృతి కాదంటున్నది

సేదతీర్చి, ఊరడించే నేస్తాన్నంటున్నది!

ఆకాశంలో అందాల జాబిలి

మిలమిల మెరిసే తారలు

పూదోటలో మల్లెపూల పరిమళాలు

సన్నని చిరుగాలికి సందడి చేసే రెమ్మలు

దూరాన నిశ్చలంగా నిల్చిన కొండలు

మౌన సందేశాలిస్తున్నాయి 

ఈ లోకపు వాసనలంటని

సుదూర తీరాలకు తీసుకెళ్తున్నాయి!

బంధాల కతీతమైన

మనఃస్థితిలో పరవశింపజేస్తున్నాయి !

* * * 

పెద్ద కొడుకులిద్దరూ వ్యవసాయపు పనులు చూసుకునేవారు. ఏ పనీలేకుండా వ్యర్థంగా తిరిగే రామానుజశర్మని ఉద్యోగం చెయ్యమని తండ్రి బలవంతపెట్టేవాడు. బొంబాయిలో ఒక గవర్నమెంటు ఆఫీసులో క్లర్కుపోస్టు ఉంది, రమ్మనమని తెలిసిన బంధువు చెబితే, ఇరవైమూడేళ్ళ అమృతవల్లిని, నలుగురు పిల్లలని వదిలి బొంబాయి ప్రయాణమై వెళ్ళాడు రామానుజశర్మ. తనూ, పిల్లలూ కూడా వస్తామని అమృతవల్లి ఎంత వేడుకున్నా వినిపించుకోలేదు. తర్వాత ఉద్యోగం ఖాయమైందన్న కబురు వచ్చింది. రామానుజశర్మ అప్పుడప్పుడూ ఇంటికి డబ్బు పంపిస్తూ ఉండేవాడు. తండ్రికి ఉత్తరాల ద్వారా క్షేమసమాచారాలు తెలుపుతుండేవాడు.

ఇక అమృతవల్లి బాధ చెప్పనలవికాదు. రాత్రిపూటయినా తన పక్కన తోడుగా పడుకునే భర్త సాహచర్యానికి పరితపించిపొయ్యేది. అతని రాకకోసం ఎదురుచూస్తూ కళ్ళనీళ్ళు పెట్టుకునేది. తన భర్త దగ్గర నుంచి ఉత్తరం వచ్చినపుడు తన గురించి, పిల్లల గురించి ఎప్పుడైనా అడిగితే సంతోషంతో తబ్బిబ్బయ్యేది. రామానుజశర్మ నాలుగు నెలలకొకసారి వచ్చినా పిల్లల్ని ముద్దుచేసి దగ్గరికి తీసుకోవడం చాలా అరుదుగా జరిగేది. అదేమీ పట్టించుకోకుండా ఆయనకి తెగ సేవలు చేసేది. భర్త ఉత్తరం వచ్చినపుడు తను కూడా భర్తకి ఉత్తరం రాయాలని ఆరాటపడేది. రెండుసార్లు చాటుగా రాసింది కూడా! కాని వాటిని ఎవరికీ తెలియకుండా పోస్ట్‌ చేయించలేక తన దగ్గరే దాచుకుంది.

మొదటి ఉత్తరం

పూజ్య ప్రాణేశ్వరా,

మీరు క్షేమమని తలుస్తాను. ఎంతమంది చుట్టూ ఉన్నా మీరులేని లోటు ప్రతిక్షణం అనుభవిస్తున్నాను. మీరు ప్రక్కనలేని రాత్రిళ్ళు ఎలా గడుపుతున్నానో ఊహించలేరు. పిల్లలు నాన్న ఎప్పుడు వస్తారని అడిగితే సమాధానం చెప్పలేకపోతున్నాను. మీకక్కడ అంతా సవ్యంగా జరుగుతుందా? వేళకి తింటున్నారా? నిద్రపోతున్నారా? మీ ఆరోగ్యం జాగ్రత్త! మీకు వీలుంటే నాకెప్పుడైనా ప్రత్యేకంగా ఉత్తరం రాయండి. దానికోసం వెయ్యికళ్ళతో ఎదురుచూస్తుంటానని మరవొద్దు.

మీ

చరణదాసి,

అమృతవల్లి.

         * * *

రెండవ ఉత్తరం

జీవితేశ్వరా,

మీరు బొంబాయి వెళ్ళి అప్పుడే మూడు సంవత్సరాలవుతున్నది. ఈ మధ్య నాలుగు నెలలకొకసారి కూడ రావడం లేదు. ఉత్తరాలు కూడా మామగారికి అదివరకులా రాయటం లేదు. డబ్బు తరచుగా పంపడంలేదు. ఆ విషయం ఇంట్లోవాళ్ళకి కినుకుగా ఉన్నట్లనిపిస్తుంది. పనుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని రాశారు. కానీ మీ ఆరోగ్యం గురించి అశ్రద్ధ చెయ్యకండి. అక్కడ తళుకు బెళుకులు ప్రదర్శిస్తూ తిరిగే నారీమణులుంటారని విన్నాను. వారి మాయాజాలాల్లో చిక్కుకోకండి! మీకు సేవచేసే భాగ్యం నాకు ఎప్పుడు కలుగుతుందో! మీ రాకకై చకోరపక్షిలా ఎదురు చూస్తున్నాను! దయతో ఒకసారి వచ్చిపొండి.

మీ పాదపద్మములకు నమస్కరిస్తూ,

మీ దాసి,

అమృతవల్లి.

* * *   

ఆ తర్వాత నెమ్మదిగా రామానుజశర్మ నుండి ఉత్తరాలు రావడం ఆగిపోయింది. డబ్బు కూడా పంపడంలేదు. ఏమయిందోనని ఇంట్లోవాళ్ళు ఆరాట పడ్డారు. బొంబాయిలో ఉన్న బంధువుకు ఉత్తరాలు రాశారు అమృతవల్లి మామగారు. ఆయన దగ్గరనుంచి కూడా జవాబు రాలేదు. తర్వాత తెలిసిందేమిటంటే ఆయన బొంబాయి నుంచి మరోచోటుకి వెళ్ళిపోయాడని. ఇక ఏం చెయ్యాలోఎవరిని అడగాలో తెలియక మామగారు, అన్నలు రామానుజశర్మ మీద విరుచుకుపడి శాపనార్ధాలు పెట్టారు. డబ్బులు రాకపోవడం కూడా వారి కోపానికి కారణమయింది.

ఇక అమృతవల్లి విషయం వర్ణనాతీతం! రాత్రిళ్ళు మౌనంగా రోదించేది. నన్నూ, నా పిల్లల్ని  అనాథల్నిచేసి వెళ్ళిపోయాడు. భగవంతుడా! ఇక నాకేదిదారి?” అని విలవిలలాడేది.

హిందూధర్మశాస్త్రాలు స్త్రీ వివాహం ముందు తండ్రి, వివాహం తర్వాత భర్త, వృద్ధాప్యంలో కొడుకు సంరక్షణలో ఉండాలని చెప్తున్నాయి. నా భర్త నన్నొదిలేసి వెళ్ళిపోయాడు. కొడుకులు చిన్నవాళ్ళు. నేనెవరి సంరక్షణలో ఉండాలి?”  అని తనని తాను ప్రశ్నించుకునేది.

రామానుజశర్మ జాడ తెలియక అప్పుడే రెండు సంవత్సరాలు దాటింది. ఇంట్లో చాలా మార్పులొచ్చాయి. తమ్ముడి పిల్లల భారం వాళ్ళమీద పడేసరికి అన్నలకి చిర్రెత్తుకొచ్చింది. దానికితోడు తమ్ముడి గురించిన పుకార్లు అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. రామానుజశర్మ సన్యాసిగా మారి ఊళ్ళు పట్టుకుని తిరుగుతున్నాడని కొందరన్నారు.  కాదు ఎవరో మహిళతో తిరుగుతుంటే చూశామని కొందరన్నారు. ఈ పుకార్లు ఎంతవరకు నిజమో ఎవరికి తెలియదు.

ఇక తమ్ముడు తిరిగిరాడని నమ్మకంగా తెలిశాక అమృతవల్లి పట్ల, ఆమె పిల్లలపట్ల కుటుంబసభ్యుల్లో నిరశన మొదలయింది. వాళ్ళని భరించక తప్పదన్నట్లు ప్రవర్తించసాగారు. మిగతా పిల్లలకి, ఆమె పిల్లలకి తేడా చూపించడంతో పరిస్థితి మరింత దిగజారింది. అమృతవల్లిలో ఏదో లోపం ఉంటేనే ఆమె భర్త ఆమెని వదిలేసి వెళ్ళాడన్న అత్తగారి ఆరళ్ళు ఆమెకి భరించరానివయ్యాయి. ఇక తోడికోడళ్ళ ఎగతాళిమాటలు, వాళ్ళని భరిస్తున్నందుకు బదులుగా ఆమె మీద ఎక్కువ పనివెయ్యడం, ఆహార విషయాల్లో, చదువుల విషయాల్లో, ఇంకా అనేక విషయాల్లో ఆమెకి పిల్లలకి విలువనియ్యక పోవడం ఆమెకెంతో మనస్తాపం కలిగించేది.

ఇంటిల్లిపాదికి చాకిరి చేసింతర్వాత కూడా ఆఖరిలో, మిగిలిపోయిన ఆహారపదార్థాలు ఆమెకి తినవలసి వచ్చేది. తను తినకపోయినా, కనీసం తన పిల్లలకైనా సరిగ్గా పెడితే బాగుండని ఆమె కోరుకునేది. అదృష్టవశాత్తూ ఎప్పుడైన తన పాలబడిన తినుబండారాలు దాచిపెట్టి పిల్లలకి పెట్టేది. ఇంత జరిగినా ఆమెలో ఇంకా ఆశ చావలేదు. తన భర్త తిరిగి వస్తాడన్న ఆశతో ఎదురుచూసేది. ఆ సమయంలో ఆమె రాసుకున్న రెండో కవిత :

నీవు లేని జీవితం ప్రశ్నార్ధకం

నిద్రరాని రాత్రిళ్ళు ఒక శాపం

గణించుకునే ఘడియలు అనంతం

నీకై పలవరించేను నా హృదయం

స్పందించని నీ మనస్సొక పాషాణం

మిగిలింది కలసి గడిపిన క్షణాల స్మరణం

నీ రాకకై ఆశాసౌధాల నిర్మాణం

ఎదురు చూసి చూసి కారే కన్నీళ్ళ ప్రవాహం

నా దుఃఖాన్ని కరిగించేది కేవలం నీ ఆగమనం!

నిద్రాహారాలు లేకపోవడం, పైన దిగుళ్ళతో ఆమె కృశించిపోవడం మొదలైంది. ఆమెకి ఇరవైఎనిమిది సంవత్సరాలు నిండాయి. అంత చిన్న వయస్సులోనే ఎంతో దుఃఖభారాన్ని మోస్తున్నది. దానికితోడు ఆమెకి దగ్గు రావడం మొదలైంది. అప్పుడప్పుడు జ్వరం కూడా వస్తుండేది. ఎవరికీ చెప్పుకునేది కాదు. ఆమెని పట్టించుకున్నవారే లేరు! చివరికి దగ్గు ఎక్కువై, ఆమె పనులు కూడా చెయ్యలేని పరిస్థితిలో ఆమె పుట్టింటివారికి కబురుచేశారు. ఆమెని తీసికెళ్ళమని. అప్పటిదాకా ఆమె తల్లిదండ్రులకి, అన్నలకి ఆమె విషయం తెలియనియ్యలేదు. ఆమె కూడా తెలియనిచ్చేదికాదు. ఆమెని అత్తమామలు పుట్టింటికి పంపించడానికి కూడా ఇష్టపడే వారుకారు.

ఒకరోజు ఆమె చిన్నన్న ప్రభాకరశాస్త్రి వచ్చాడు ఆమెని తీసుకెళ్ళడానికికృంగి, కృశించి అస్థిపంజరంలా తయారయిన చెల్లెల్ని చూసి నిర్ఘాంతపోయాడు. ఆమెని పట్టించుకోనందుకు ఆమె అత్తవారిని దుయ్యబట్టాడు. అంతగా మీకు ఆమె, పిల్లలు భారమనిపించినపుడు తమకెందుకు కబురు చెయ్యలేదని విరుచుకుపడ్డాడు. ఆమె అత్తింటివారు వెనుకంజ వెయ్యలేదు. ఆమె శాపగ్రస్తురాలని, ఆమెలో ఏదోలోపం ఉంటేనే భర్త దేశాలు పట్టి  పొయ్యాడని ఎదురు సమాధానం ఇచ్చారు. ప్రభాకరశాస్త్రి చెల్లిని కూడా కోప్పడ్డాడు. ఇంతవరకూ వచ్చేదాకా ఎందుకు ఓర్చుకున్నావని బాధపడ్డాడు. ఇక ఆ యింట్లో పచ్చి మంచినీళ్ళయినా ముట్టుకోకుండా చెల్లెల్ని, పిల్లల్ని తీసుకుని ప్రయాణమయ్యాడు.

పుట్టింటికి వచ్చిన అమృతవల్లిని అక్కున చేర్చుకుని తల్లి రోదించింది. తమకి ఒక్క కబురు కూడా ఎందుకు చెయ్యలేదని వాపోయింది. తల్లిదండ్రులు, అన్నలువదిన్లు ఆమెని, పిల్లల్ని సాదరంగా ఆహ్వానించి ప్రేమగా, ఆప్యాయంగా చూడసాగారు. అమృతవల్లిని డాక్టరుకు చూపించారు. ఆమెకి టి.బి. అని, సరైన టైములో చికిత్స జరగక జబ్బు బాగా ముదిరిందని, ఇక ఎక్కువరోజులు జీవించడం కష్టమని చెప్పారు.

ఈ విషయాలన్నీ అమృతవల్లికి తెలియనీయకుండ ఆమెకి సపర్యలు చేశారు. ఆమెని సంతోషపెట్టడానికి ఆమెకిష్టమైన పుస్తకాలు తెచ్చిచ్చేవారు. సంగీతం వినిపించేవారు. కవితలు రాయమని ప్రోత్సహించేవారు. ఎంతచేసినా ఆమె మనస్సులోని దుఃఖాన్ని కరిగించలేకపోయారు. భర్త తనని వదిలేసి వెళ్ళిపోయాడన్న ఆవేదనతోనే ఆమె తన ఇరవైతొమ్మిదో ఏట ఈ లోకాన్ని శాశ్వతంగా విడిచి వెళ్ళిపోయింది.

* * *  

ఈ కథంతా చెప్తూవుంటే కాత్యాయనికి దుఃఖం వచ్చింది. సాహిత్య మనస్సు కూడా వికలమయింది. తల్లి కళ్ళనీళ్ళు తుడిచి అనునయించింది.

అమ్మా! అమ్మమ్మదెంత విషాదగాథ! అటువంటి అమృతమయిని వదిలేసి వెళ్ళిపోయిన తాతగారెంత పాషాణహృదయుడు. సుకుమారంగా, కళ్ళనిండా కలలతో, కవితా హృదయంతో అత్తింట్లో అడుగుపెట్టిన ఆమెని రేకులు చిదిమిన పువ్వులా చేసి విసిరేశారు. ఆయన్ని నేను నా జీవితంలో క్షమించలేనుఅంది కోపంగా.

కాత్యాయనికి కూతురు తండ్రినలా అంటుంటే బాధ కలిగింది. అయినా సర్దుకుని అవును సాహిత్యా! అమ్మని తలుచుకున్న ప్రతిసారీ నా హృదయం బరువెక్కుతుంది. అమ్మ చనిపోయినపుడు నాకు ఐదేళ్ళుంటామో? లీలగా ఆమె ఆకారం నా మనస్సులో మెదులుతుంది. ఇంకో విషయం చెప్పనా? మన బంధువుల్లో  చాలమంది నీ తాతగారి గురించి ఎంతో గొప్పగా మాట్లాడుతారు.  ఈ ఇహబంధాలను తెంచుకుని సన్యాసిగా మారిన ఆయనెంత గొప్పవారు అని పొగుడుతారు. కాని ఆయన వలన అమ్మమ్మ అనుభవించిన నరకయాతన్ని ఎవరూ పట్టించుకోరు. పైగా ఆయనలా అవడానికి ఆమె కారణం అయ్యుంటుందని ఆమెనే తప్పుపడతారు. ఎంత నిష్ఠూరమైనదీ మానవసమాజం?!”  అంది.

అవునమ్మా! మన సమాజంలో స్త్రీలెంత బాధలనుభవిస్తున్నారో అమ్మమ్మ కథ వింటే కనువిప్పు కలుగుతుందిఅని అన్నీ కవరులో సర్దేశి, దాన్ని గుండెలకి ఆర్తిగా హత్తుకుని కొంచెంసేపు ఆలోచనలో పడ్డట్టు అలాగే ఉండిపోయి, చివరికి ఏదో నిర్ణయానికి వచ్చినట్లుగా – 

అమ్మా! నేను అమ్మమ్మ జీవితకథని రాస్తాను. ఆమె విషాదభరిత గాథని ఈ లోకానికి తెలియజేస్తానుఅంది.

అది నాకెంతో సంతోషాన్నిచ్చే విషయం సాహిత్యా! ఈ విషయంలో నా సంపూర్ణ సహకారాలుంటాయి. తప్పకుండా రాయి!అంది కాత్యాయని కూతుర్ని గుండెలకి హత్తుకుంటూ.

 (ఈ కథ మావారు శ్రీ ప్రనాబ్‌ బెనర్జీ గారి నాయనమ్మ జీవితాన్ని ఆధారంగా చేసుకుని రాసినది. తెలుగు వాతావరణానికి అనుగుణంగా ఉండేలా మార్చి రాశాను.)

****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.