వ్యసన

-డా.కాళ్ళకూరి శైలజ

 
గుండె చప్పుడు చెవిలో వినిపిస్తుంది
స్వేదం తో  దేహం తడిసిపోతుంది.
ఎండిన గొంతు పెదవులను తడుముకుంటే
శక్తి చాలని కండరాలు
విరామం కావాలని మొర పెట్టుకుంటాయి.
ఆగావా? వెనుకబాటు,
కన్నుమూసి తెరిచేలోగా వందల పద ఘట్టనలు
ఉన్నచోట ఉండేందుకు పరుగు, పరుగు.
ఏమిటీ పోటీ?ఎందుకీ పరుగు?
 
బతుకు జూదంలో అనుబంధాలను పందెం కాసి
జవాబు దొరకని ప్రశ్నలు పావులుగా,
పేరుకున్న నిశ్శబ్దాన్ని గడ్డపారతో ఎత్తిపోస్తూ
స్వీయచిత్రం కోసం చిరునవ్వు అతికించుకుని తుడిచేసుకునే క్షణాలు ఆక్రమించిన బ్రతుకు.
ఎందుకీ పోటీ? ఎందాకా ఈ పరుగు?
 
పిండి కొద్దీ రొట్టె లా పెట్టుబడి కొద్దీ వ్యాపారం
తలపులు ఏమార్చి,తలలు మార్చే కాలంలో
తిమింగలం వేట కొస్తే చిన్న చేపలు మిగలనట్టు
లాభాలు చాలవు,వాళ్ళకి సామ్రాజ్యాలు కావాలి.
 
వేలికొస మీటతో శ్రమ తెలియకుండా
సొమ్ము,సమయం దోచేస్తున్న కొత్త ప్రయోగం.
ఏడుపు,నవ్వు;అమృతం,విషం అన్నీ అమ్ముతారు
మేధనే మనసని,
వస్తువే సమస్తమనీ
నమ్మించే ఆధునిక మాయాబజార్ ఇది.
 
ఏ పక్షి,ఏ మృగం మారనిది
ఒంటరిగా పరుగు తీస్తూ
మనిషొక్కడే మరో మనిషికి శత్రువౌతుంటే
అసలెక్కడిదీ వికృతి? 
వ్యసనమైన స్వార్ధానికి విజయ కిరీటం పెడుతూ
ఎందుకీ పోటీ? ఎక్కడికీ పరుగు!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.