సన్నద్ధమవండి

-పద్మావతి రాంభక్త

ఋుతుచక్రపు నడకకు
ఒక దుర్మార్గపుక్రీడ
ముళ్ళకంచై అడ్డం పడుతోంది
లోపలెక్కడో
రహస్యంగా పూసిన
నెత్తుటిపువ్వును పసిగట్టి
మతపుగద్ద
అమానుషంగా పొడుచుకు తింటోంది
జరిగిన ఘాతుకానికి
తలెత్తలేనంత అవమానంతో
విరిసీ విరియని మొగ్గలముఖాలు
భూమిలోకి కుంగిపోయాయి
సిగ్గుతో చితికిపోయి
కళ్ళ నిండా పొంగుతున్న సముద్రాలను
బలవంతంగా అదిమిపెట్టుకున్నాయి
మెలిపెట్టే నెప్పి కన్నా
ఈ దుఃఖం వాటిని
మరింత పగలగొడుతోంది
ఆమెలంటే
ఈ లోకానికి
ఎందుకంత చులకన
కొన్ని ప్రాణాలకు ఊపిరిపోయడానికే కదా
ఆమె నెలనెలా ఎర్రనివరదై
ప్రవహిస్తోంది
ధరిత్రిలా తొమ్మిదినెలలూ
కొండంత భారాన్ని మోసి
పేగులు తెంపుకుని
శ్వాసను పణంగా పెట్టి
ఆకాశాన్ని ఆనందంగా ఎత్తుకుంటోంది
ఈ వికృతచర్యను దేశం
కథలుకథలుగా చెప్పుకుంటోంది
సహజాతిసహజంగా
ప్రతీ ఇంట్లో పారే రక్తనదిలోంచే
కదా నువ్వూ నేనూ
ఈ ప్రపంచమూ మొలకెత్తినది
మరి ఏమిటీ శల్యపరీక్ష
ఆడతనానికి ఈ అసహ్యశిక్ష
రాక్షసరాజ్యంలో
గుండెల్లో లేని పవిత్రత
చర్మం పైన వెతకబడుతోంది
అమ్మా ఎవరక్కడ
ఇకమీదట భూమ్మీద
మనిషి పుట్టుకను
నిర్ధాక్షిణ్యంగా బహిష్కరిద్దాం రండి
ఈ ముల్లును ముల్లుతోనే తియ్యాలి
 యుద్ధాన్ని ప్రకటించడానికి సన్నద్ధమవండి

*****

Please follow and like us:

2 thoughts on “సన్నద్ధమవండి (కవిత)”

Leave a Reply

Your email address will not be published.