కొత్త అడుగులు – 21

 పోర్షియా కవిత్వం

– శిలాలోలిత

కవిత్వం మనస్సు జ్వలనంలో ఎగిసిపడే సెగ. తడినిండిన గుండెలను సాంత్వన లేపనం. బతుకు బొక్కెన ఎంతచేదినా తరగని అనుభవాల సంపుటి. జీవితంలో ఒక్కోమలుపూ చెప్పే, విడమర్చే అనుభూతించే, జీవన సారాన్నంతా ఒలకబోసే జ్ఞాన ప్రవాహం. నిజానికి, కవిత్వం చాలా ఊరటను కలిగిస్తుంది. ఆశను రేకెత్తిస్తుంది. వెలుగు రేఖల్ని చుట్టూ పరుస్తుంది. మనిషితనాన్ని నుని కాకుండా కాపాడుతుంది. కళ్నున్నది చూపు నివ్వడానికే అనుకుంటే, కవిత్వపు కళ్ళు బతుకు చూపునిస్తాయి. ఉద్విగ్న భరిత హృదయాలకు ఊపిరై నిలుస్తుంది కవిత్వం. ఒక మెత్తటి మనసు తివాచిని తనువంతా నింపుతుంది. జ్ఞాపకాల ఓడలో మునిగి పోకుండా తీరాన్ని చేరుస్తుంది. తానే చుక్కాని అవుతుంది.

బతుకు రంగుల్ని కలగాపులగం చేసి, నిజమైన బతుకు రస్తాను చూపిస్తుంది. తోటిమనిషిని గురించి ఆలోచన లేని మనిషి, సాయపడని మనిషి, ఓదార్పునివ్వని మనిషి, మానవత్వాన్ని సమాధి చేసిన మనిషి ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే అంటూ కవిత్వం తానే మనుషుల్ని వెతుక్కుంటూ, కవిత్వాన్ని నిజాయితీగా పలవరించే పలకరించే కవుల్ని అక్కున చేర్చుకుంటుంది.

కవిత్వపు తడివున్న వాళ్ళందరూ చాలా మటుకు సున్నిత హృదయులై వుంటారు. ప్రజల కోసం తన్లాడుతుంటారు. కవిత్వం పూర్తిగా మనిషిని మార్చలేకపోయినా, ఆలోచన కలిగించినాచాలు, ఒకక్షణం ఆగినా చాలు, పరివర్తన నెమ్మది నెమ్మదిగా అదే వస్తుంది.

పోర్షియాదేవి అధ్యయన శీలి. పుట్టింది ఉత్తరాంధ్ర అయినా అనేక దశాబ్దాలుగా హైదరాబాద్లోనే నివాసం. సమకాలీన కవిత్వాన్ని చాలా వరకూ చదివేసింది. కథలంటే బాగా ఇష్టం. ప్రారంభంలో కథలే రాసింది. ఆ తర్వాత కొంత కాలానికి ‘కవిసంగమం’ మీటింగ్ గ్లకు అటెండవ్వడం వల్ల కవిత్వమంటే ఆకర్షణ పెరిగిందట. ఉత్సాహాన్నంతా కవిత్వం పైపు మళ్ళించింది. కవిత్వ స్నేహితులు సంఖ్యా పెరిగింది. అలా, మొదలైన కవిత్వ రచన ఇలా ఈ పుస్తకం వచ్చేంతవరకూ కొనసాగుతోంది.

‘మాట్లాడ నివ్వండి’ – అనే కవితలో స్త్రీని నోరు విప్పనివ్వని సమాజాన్ని ఘాటుగా విమర్శించింది. సలహాలు ఇవ్వడం మానేసి తనని తనలా కొంచెం మాట్లాడనివ్వండి అంటుంది. స్వేచ్చగా మాట్లాడనివ్వండి, ఆమెను ఆమెలా మాట్లాడనివ్వండి అంటుంది. స్త్రీలపై జరిగే రకరకాల అణచివేతలను స్పష్టంగా కవిత్వీకరించింది.

విదేశాల్లో అన్నీ వున్నాయనుకుంటూ ఏమీలేనితనంగా బతుకుతున్న చాలామంది జీవితాల్ని ‘పొద్దెరుగని సూర్యుళ్ళు’ కవితలో చెప్పింది. అమెరికా జన జీవనాన్ని గురించి రాసిన మరోకవిత శిథిల నగరం. ‘ఒకరికొకరు ఎదురుపడినప్పుడు/ జీవంలేని కళ్ళతో ప్లాస్టిక్ నవ్వుల పలకరింపులు ఉంటాయి. కానీ ఎందుకో రోబో కదలికల్లానే వుంటాయని. విలువలు, నీతులు పెద్ద విషయాలు కావు ఇచ్చట | బతక నేర్చడమే పెద్ద అర్హత అవుతుంది.

‘బలిపీఠం’ కవిత ఎంతో బాధను వ్యక్తీకరించింది. స్త్రీల జీవితాల్లోని దు:ఖాన్ని ఒడపోసిన అక్షరాలున్నాయి.

కవిత్వాన్ని జీవన వాహికగా భావించిందీమె. ‘రంగస్థలం’ కూడా మంచి కవిత – దిశా నిర్దేశనం చేస్తుంది. ‘నడుస్తున్న దారి గజిబిజిగా మారినంత మాత్రాన / జీవితమే చిక్కుముడి కాదుగా | సరళమైన త్రోవ కోసం ప్రయత్నించుకొని / గమ్యానికి చేరువ కావాలి / ఆటుపోట్లు అప్పుడప్పుడూ వచ్చిపోయే చుట్టాలే | అంచుల దాకా పయనానికి ఎన్నో సాధనాలు | అని జీవన సత్యాల్ని చెప్పింది.

ఒక చోట అంటుంది కదా! ‘గుండెకున్నట్టు మనసుకే అరలుంటే ఎంత బాగుండేది/ భావాలన్నీ అరలలో స భావరహితంగా బతికేయవచ్చు.

“ ఆ ఇల్లు’ కవిత కూడా మనసుతో రాసింది. ఆ ఇల్లు విడిచి పోతున్నప్పుడు ఆ వ్యక్తులకు, ఆ పై ఇంటి గోడలకు మధ్య జరిగిన సంభాషణలా సాగుతుంది. గతంలో సినారె కూడా ఇల్లు ఖాళీ చేస్తున్నప్పుడు ఎలాంటి భావ సంచలనముంటుందో ఆర్తితో చెప్పిన కవిత గుర్తొచ్చింది. ‘ ఇల్లు మారడం కూడా / దేహాన్ని విడిచి పెట్టడం లాంటిదే అనిపిస్తుందిపుడు’ – అని కవితను ముగిస్తుంది. స్త్రీల నెప్పుడు ‘ముడిసరుకు’ గానే భావించి ఏమాత్రం ఎదగనియ్యని తనాన్ని ఎలా పెంచి పోషిస్తుంటారో చెప్పిన కవిత ఇది.

ఆమె అంటుందొక చోట –

‘నిజానికి నీడ నాదని చెప్పడానికి ఎన్నో సంశయాలు | ఎందుకంటే అప్పటికే నేనంటూ ఏమీ మిగలకుండా ఏదో ఒక అచ్చులోకి ఇంకిపోయుంటాను / అయితే ఇలా ఎన్నెన్నో ప్రలోభాలతో ముడిసరుకుగా మిగిల్చే ప్రయత్నాన్ని చూసి, ఆలోచిస్తే ఆమెకో నిజం తెలిసిందట. ‘ అదేంటో ఒక మౌల్డ్ పట్టుకునే వాడెప్పుడూ / యజమానిగానే వుంటాడు / ముడిసరుకుగా మారాలని అస్సలను కోడు / ఎల్లప్పుడూ పెంపుడు జంతువులా | లొంగిపోయే నాలోని అలసత్వమే/ బహుశా నన్ను నాలాగా వుండకుండా చేస్తుండవచ్చు.

అని, స్త్రీలు మారాల్సిన స్థితిని వెల్లడించింది.

‘వృత్తాలు’ పోర్షియా రాసిన అన్ని కవితల్లోనూ మంచి కవిత. ఇవి ఎవరికి వారు తమ చుట్టూ గీసుకొని/ బందీలవుతున్న గుండ్రని గీతలు – అయితే తన చుట్టూ వున్నవి సరళరేఖలో వృత్తాలో, తెలుసుకోలేని పురాతనమైన మనసుతో, నిత్యమూ సంఘర్షణ తప్పదు. అనే నిజాన్ని బట్టబయలు చేసింది.

మృత్యు స్పర్శ – చాలా గాఢమైన కవిత. మృత్యువుని ఈ కవితలో రకరకాలుగా చెబుంది. ఒకచోట, ‘నిత్యమూ దహించుకు పోతున్న మనసుకి పూసిన లేపనమేమో’ అంటుంది. ‘నిజానికి మరణమంటే | పారిపోవడమో కోల్పోవడమే కాదు/ అలిసిపోయిన తనువుకి విశ్రాంతి నివ్వడమే / కాకపోతే మేలుకునేది ఇంకెక్కడో అనేస్తుంది.

లోతైన భావగాఢత నిండిన కవిత ‘మౌనమే ఒక భాష’ అద్భుతమైన భావ చిత్రికలు. చివర్లో అంటుంది. ఇక, ఇప్పుడైతే నేను కూడా ఒక వృక్షమై పోయాను కనుక / మౌనంలోని భద్రత బాగా అర్థమవడం మొదలయింది’. అని తేల్చేస్తుంది. సంఘర్షణల నడుమ స్త్రీలు ఎంత చితికి పోతారో చెప్పిన కవిత ‘కథానాయకి’.

‘అయ్యో … భార్యయ్యాక కూడా ఇష్టాలుంటాయా 

తల్లయ్యాక కూడా తలపులు వికసిస్తాయా

ముందు వీటిని తుడిపేసెయ్

***

కావొచ్చు నువ్వొక స్టేజ్ స్పీకర్

అంత మాత్రాన ఇంట్లో మాట్లాడాలనుకుంటావా 

చాలా తప్పది.

***

నీ ప్రపంచాన్ని నువ్వు ఉల్లాసంగా మార్చుకొని వున్నా, కానీ తలుపు తట్టే ముందే గుమ్మం దగ్గరే | చిరునవ్వుల ఆనవాళ్ళు తుడిచేసుకుని, టన్నుల నీరసాన్ని ఒంట్లో నింపుకుని మరీ ఇంట్లోకి అడుగు పెట్టు, లేదంటే నీ కళ్ళలోని మెరుపుకి సరికొత్త కథలు అల్లబడతాయి. మరి నువ్వెప్పుడూ కథా వస్తువే కథా అంటుంది.

‘నేనొక అక్షరమై’ కవితలో ‘అంతలోనే సీతాకోక చిలుకలా ఎగరనిచ్చేది / అంతోలనే గుండె క్రింది చెమ్మని దిండులోకి వంపేది/ నన్ను నేను తెలసుకొనేలా/ ఇప్పుడిక నేనొక అక్షరంగా | మలుచుకోవడమే మిగిలిందేమో!

‘నేను సైతం కరోనా నిరోధానికి, ఆల్బమ్, అవలోకనం బాగున్నాయనిపించే కవితలు. 

కుందుర్తి, ‘నగరంలో వానని తలపిస్తూ ‘వాన… వానా’ కవిత ఆద్యంతమూ వర్షమై కురుస్తుంది. 

‘నా నేను’ కవితలో తనను తానే చెక్కుకునే శిల్పిని తానే కావాలనే తపనను వెలిబుచ్చింది.

‘అమ్మెలావుండాలి’ – అనే కవితలో అమ్మనెలా తమకనుకూలంగా ఎలా మలుచుకున్నారో, అధికారాల్ని చెలాయించాలో చాలా పవర్‌ఫుల్ గా రాసింది.

తనను తానే కొత్తగా చెక్కు కోవాలనుకుంటే, ఇంకో ఇల్లు అవసరమౌతుంది అంటుంది లాయర్ దృష్టితో.

జీవితంలో స్త్రీలు ఎన్నో సాధించారు. ఎంతో ఎత్తుకు ఎదిగారు. ‘అందుకే నేనెవరితోనూ సమానం కాదు. నాకు నేనే సాటి నాకు నేనే పోటీ – అంటుంది.

“స్త్రీత్వం’ కవితలో వ్యంగ్యాస్త్రాలన్నీ ఉపయోగించింది. “ఊరెట్లా ఉంది” – మంచి ఆలోచనాత్మకమైన కవిత.

శరీర వ్యాపారాన్ని తప్పని పరిస్థితుల్లో, బలవంతంగానో ఆకలికోసమో, పిల్లలకోసమో రోడ్డు పక్క మొగ్గల్లా నుంచునే వార్ని గురించి రాసిన 2 కవితలు 1. చీకటి బతుకులు 2. వెలయాలు.

ఎన్నారై పిల్లలకు తల్లిదండ్రులైన వారి బతుకుల్ని దగ్గరగా చూసి వేదనతో రాసిన కవిత సంచార జీవులు. ‘తన కోసం’ లో విరహాన్ని, ఎప్పటికీరాని అతడిని తలుచుకుంటూ రాసిన కవిత “ మా ఊరి చెరువు’ వాళ్ళ వూరి వరకు పాఠకుల్ని తీసుకెళ్తుంది.

ఇరుకు మనస్తత్వాలను బహిరంగ పరిచిన కవిత ఇరుకు భావన ‘ చెక్కని శిల్పం’ అందరూ చదవాల్సిన అంగీకరించాల్సిన కవిత.

ఇంచుమించుగా పోర్షియా కవితలన్నీ సహజంగా అ ప్రయత్నంగా ఆమె గుండెను చీల్చుకొని వచ్చాయి. ఇన్నాళ్ళ తన జీవితంలో, ఇతర స్త్రీల జీవితాల్లో వచ్చిన, వస్తున్న వచ్చేసిన ఘర్షణలన్నింటి రూపం ఈ కవిత్వం.

అందుకే ఏ అలంకారాల జోలికెళ్ళని, బతుకు పెచ్చులు రాలిపడ్డ రక్తాక్షరాలివి. అందుకే వీటికంత తడి. పుట్టింటి నుంచి ఏమీ తెలియని, అత్తింటికి సాగే ప్రయాణాన్ని గురించి కూడా ‘పురిటి గడ్డ’ రాసింది. ఒక మొక్కను తీసి వేరొక చోట పాతాలనుకున్నప్పుడు కూడా పాత మట్టిని కొంత చుట్టి పంపిస్తారు. కానీ ఆడపిల్లను మాత్రం ఆనవాళ్ళేమీ లేకుండా పంపించేస్తారు అని కన్నీళ్ళతో కవితనల్లింది.

మాటలు, అడుగులు, ఊహలు, ఉద్దేశ్యాలు, కలలు, కన్నీళ్ళు, ఎంతదాచు కోవాలో మాత్రం చెబుంటారు. అందుకని ‘మాట పదిలం’ అని ఓ కవితలో హెచ్చరిస్తుంది. బాల్యం గురించి కూడా అంతే గుంభనంగా రాస్తుంది.

‘బంధం’ కవితలో స్త్రీ పురుషులు విడిపోవాలనుకుంటే విడిపోవచ్చుగానీ, ఇంత నీచంగా, దారుణంగా కాదు. నచ్చలేదనుకుంటే, తప్పకునే దాన్ని కదా! బంధం నిలబడాలంటే నమ్మకం, ప్రేమ వుండాలి కానీ, కాగితాలు, మంత్రాలు కావు అంటుంది. 

తను కూడా ఒక ప్రాణినే నన్న స్పృహ స్త్రీలకు రావాలని, త్యాగాల దుస్తుల్లో ఇకనైనా కూరుకుపోరాదనీ, పుట్టిన ప్రతిజీవి సమానమని, జీవించే అర్హతగల స్థితి ఏర్పడ్డప్పుడే మనం కలలు కన్న స్వప్నాలు నిజమవుతాయని భావించింది. ఒక ఆరోగ్యకరమైన ఆలోచనా ధోరణిని మనముందు కవిత్వ రూపంలోకి తెచ్చిన పోర్షియా మరింత మంచి కవిత్వాన్ని రచిస్తుంది అన్న నమ్మకం నాకుంది. చదివిన మీకూ కలుగుతుంది. ఈ సాహిత్య ఆకాశంలో మరో వెలుగుతున్న నక్షత్రం పోర్షియాదేవి. అభినందనలు.

*****

Please follow and like us:

2 thoughts on “కొత్త అడుగులు-21 ‘ పోర్షియా కవిత్వం’”

  1. బావుంది ‘మా’…
    పుస్తక పరిచయం
    అభినందనలు పోర్షియా గారు

Leave a Reply

Your email address will not be published.