నా జీవన యానంలో- రెండవభాగం- 21

‘జీవరాగం ‘ – కథానేపధ్యం

-కె.వరలక్ష్మి

హైస్కూల్లో తొమ్మిదో తరగతి నుంచి స్కూల్ ఫైల్ (11thyస్) వరకు నా క్లాస్ మేట్ మూర్తి. మాకు దూరపు బంధువులు కూడా. వాళ్ళ తల్లిగారు నాకు పిన్ని వరసౌతుంది. తర్వాత కాలంలో మూర్తి ఎం.ఏ చేసి పోలీసు ఆఫీసరయ్యాడు. ఉద్యోగరీత్యా ఎక్కడో దూరంలో ఉండేవాడు. 1990లో హఠాత్తుగా అతని నుంచి ఓ ఉత్తరం వచ్చింది. ఈ కథలోని ఉత్తరం యధాతధంగా అతను రాసిందే నేను పలకరించడానికెళ్ళేసరికి పెళ్ళైతే జరగడం లేదుకాని, ఏదో పార్టీ జరుగుతోంది. నిజానికిది కథకాదు. అలాగే జరిగిన ఒక సంఘటన.

ఉరుకుల పరుగుల జీవితాల్లో కన్నతల్లిని గురించిన ఆర్థతనైనా ఎవరూ ఎక్కువకాలం నిలుపుకోలేరేమో అనిపించి ఈ కథ రాసాను. ఈ కథకు నేను ‘స్మశాన వైరాగ్యం ‘ అని పేరు పెట్టి పంపిస్తే పత్రికవాళ్ళు కథకు ఏ మాత్రం అతకని పేరొకటి పెట్టి ప్రచురించారు.

జీవితాల్లోని స్వార్థాల మధ్య మనసు మారుమూలల్లో ఎక్కడో దాగిన దుఃఖపు పొరలు ఏ చిన్ననాటి నేస్తాలకో చెప్పుకోవాలనిపిస్తుది కాబోలు. అది క్షణికమే అయినా మనిషిలోని మానవత్వానికి ఒక చిహ్నం, కాని, బిజీ పేరుతో కన్నతల్లిని మరచిపోవడం, దూరంగా పెట్టడం క్షమించరాని నేరం. మనిషి పోయాక ఎంత వగ ప్రదర్శించినా అదంతా నటనేమో అన్పించకమానదు.

జీవరాగం

ఏమైందో తెలీదు. చాలా సేపట్నుంచి బ్రెయిన్ ఆగిపోయిది. చదువుతున్న నవల్ని విసుగ్గా పక్కన పెట్టి కిటికీలోంచి బైటికి చూశాను. దూరపు కొండలు నునుపుదేరి కనిపిస్తున్నాయి. ఆతృత పట్టలేని కొందరు ట్రెయిన్ దిగి అటూ ఇటూ తిరుగుతున్నారు. బోర్ గా అనిపించి, ఏం తోచక పర్స్ తెరిచి చూశాను. ఈ ప్రయాణానికి కారణమైన ఆ ఉత్తరం మళ్ళీ చేతికి తగిలింది.

డియర్ శృతీ!

నీకు ఉత్తరం రాసి, చాలా రోజులైపోయింది కదూ! పది రోజుల క్రితం కండొలెస్ చెబుతూ నీ ఉత్తరం వచ్చేసరికి నేను మనుషుల్లో లేను. చాలా సివియర్ గా వచ్చిన హార్ట్ ఎటాక్ తో అపోలోలో ఉన్నాను. నిన్న ఇంటికి వస్తూనే నా టేబుల్ మీదున్న నీ ఉత్తరం చూడగానే ఏ ఆధారం లేకుండా నదిలో కొట్టుకుపోతున్న వాడికి పడవ అంచు దొరికినంత రిలీఫ్ ఫీలయ్యాను.

ఎప్పుడూ లేనిది మూర్తి ఇలా ఎందుకు రాస్తున్నాడా అనుకుంటున్నావు కదూ! నలభై దాటిన ఈ మిడిలేజ్ ఎంత చెడ్డదో నాకిప్పుడిప్పుడే అర్ధం అవుతోంది. చాలా విషయాలు సమస్యలుగా మారిపోయి బాధిస్తున్నాయి. ఎవరితోనైనా చెప్పుకోవాలంటే ఆత్మాభిమానం, అభిజాత్యం అడొస్తాయి. భార్యకు కూడా చెప్పలేని కొన్ని విషయాలు నా గుండెను పిండేస్తున్నాయి. బరువెక్కిపోయిన హృదయాన్ని తేలిక పరుచుకోవడానికే నీకీ ఉత్తరం.

శృతీ! ఈ సారోఫుల్ మూడో ఎమోషతో వ్రాసేస్తున్నాననుకోకేం. నా చిన్ననాటి నేస్తానివీ, నా బలహీనతల్తో సహా నన్నర్ధం చేసుకున్నదానివీ నువ్వు తప్ప నాకు దగ్గరవాళ్ళెవ్వరూ లేరు. చివరికి క్లబ్బులో కూడా నా పోలీసు ఆఫీసరు వేషానికి స్నేహితులున్నారు తప్ప నాకోసం లేరు. నా వాళ్ళంతా నా ఖాకీ బట్టల కరుకు తనాన్నే చూస్తారుగానీ, నా హృదయపు ఆర్ధతని అవలోకించరు. నిజానికి నీ కుత్తరం వ్రాయడానికింత ఉపోద్ఘాతం అవసరంలేదు. కానీ, ఈ వయసులో బావురుమని ఏడ్చెయ్యాలన్పిస్తున్న నన్ను పిచ్చివాడనుకుంటావేమోనని ఇదంతా వ్రాస్తున్నాను.

శృతీ! క్రితం నెల ఇదే రోజున మా అమ్మ నన్ను విడిచి వెళ్ళిపోయింది. నన్ను పెంచడానికి, చదివించడానికి ఆమె ఎంత కష్టటపడిందో నీకు తెలుసు. నన్ను కన్న మరుసటి రోజే భూమి తగాదాల్లో భర్తనీ, భూమినీ పోగొట్టుకుని, ఈ లోకంతో ఒంటరి పోరాటం చేసింది. ఒక్కగానొక్క బిడ్డననీ, నాకే లోటూ కలగకూడదనీ ఆమె రక్తాన్ని నీరుగా మార్చి చెమటోడ్చింది. అలాంటి అమ్మను నేనేం చేసాను? వార్ధక్యంలో ఆ పల్లెలో ఒంటరిగా వదిలేశాను. కోటీశ్వరుడి కూతుర్ని చేసుకుని డబ్బుతోపాటు నా స్టేటస్ ని పెంచుకున్నాననుకున్నానే తప్ప, నా కన్నతల్లికి అన్యాయం చేసి, నేను వీళ్ళకి శాశ్వతమైన బానిసగా మారిపోయాననుకోలేదు. మా పాలరాతి భవనంలో ఆమె ఒక దిష్టిబొమ్మలా వుంటుదని భయపడ్డానే తప్ప, ఆమె పాలమనసుని విషపు చుక్కలా విరిచేసానని గ్రహించలేకపోయాను. ఏడాదికి ఒక్కసారి వెళ్ళినా, నన్ను చూడగానే ఆమె కళ్ళలో వెలిగే కోటి దీపాల కాంతితో నా అహాన్ని పెంచుకున్నాను తప్ప ఆమె పట్ల ఆత్మీయతను పెంచుకోలేకపోయాను. శృతీ ఎవరి విలువైనా వాళ్ళు అందుబాటులో వుంటే తెలియదు.

ఇక మీద ఆ కోటి దీపాల కాంతి ఎవరి కళ్ళల్లో చూడను? ఈ భూమి మీద నేను మొదటి శ్వాస తీసుకునేటప్పుడు నా నోట్లో పాలుపోసిన నా తల్లికి ఆఖరి శ్వాస తీసుకునేటప్పుడు ఆమె నోట్లో తులసి నీళ్ళయినా పొయ్యలేక పోయిన దౌర్భాగ్యుణ్ణి నేను. ఈ బాధ నన్ను జీవితాంతం విడిచి పెట్టదు. ఎవరో ధర్మాత్ములు టెలిగ్రాం ఇచ్చి ఇంత దూరం నుంచి నన్ను పిలిపించేవరకు అనాధ ప్రేతంలా ఆ పల్లెలోని పాత ఇంటి వాకిట్లో మిగిలిపోయిన మా అమ్మను చూసాక గాని నా తప్పు నాకు తెలియలేదు. నా అంత దుర్మార్గుడింకెవడుంటాడు. ఈ ఉత్తరం మీద పడి అక్షరాల్ని చెరిపేస్తున్న ఇవి కన్నీటి చుక్కలు కావు. నా గుండెను ముక్కలు ముక్కలుగా కోస్తున్న రక్తపు చుక్కలు. ఈ దుఃఖం తీరేలా అమ్మ ఒడిలో తలవాల్చి ఏడవాలని వుంది. కానీ, అమ్మెక్కడుంది?

అమ్మ తాలుకు సంస్కారాలన్నీ చేసి వచ్చి నాలుగునాళ్ళయినా కాలేదు. ఆ మూడ్ నుంచీ నేనింకా కోలుకోనేలేదు. మా స్రవంతి తను ప్రేమించిన వాడిని రిజిస్ట్రార్ ఆఫీసులో పెళ్ళి చేసుకోబోతున్నానంటూ నా గుండెల్లో డైనమైట్ పేల్చింది. ఆ రోజే నాకు హార్ట్ ఎటాక్ వచ్చింది. వాళ్ళడిగిందల్లా ఇస్తూ అపురూపంగా పెంచినా ఈ పిల్లలెందుకింత కఠినంగా వుంటారో. నా ప్రమేయం ఏమీ లేకుండా అది తన పెళ్ళి తను చేసేసుకోవలనుకుంది. ఇదేమైనా న్యాయమేనా? న్యాయాన్యాయాలు దానికెందుకులే, ఐనా కూతురుకదా!

ఇక వ్రాసే ఓపిక లేదు, వుంటాను మరి. నిజానికి నాకు చచ్చిపోవాలనిపిస్తోంది.

నీ మిత్రుడు

సత్యమూర్తి.

ఆ రోజు ఉత్తరం చదవడం ముగిసేసరికి ఆర్తితో నా కళ్ళు చెమ్మగిల్లాయి.

నా దృష్టిలో సత్యమూర్తి ఉత్త ప్రాక్టికల్ మేన్. ఇంతటి బేలతనం అతనిలో వుందని నేనెప్పుడూ ఊహించలేదు.

సత్యమూర్తీ నేనూ ఒకే ఊళ్ళో పుట్టి పెరిగాం. చిన్నతనం నుంచీ పోస్టు గ్రాడ్యుయేషన్ వరకూ కలిసే సాగింది మా చదువు. ఆ తర్వాత అతను సివిల్ సర్వీసెస్ కి మద్రాసు వెళ్ళడం, పి.హెచ్.డికోసం నేను విశాఖలో వుండిపోవడం మమ్మల్నిద్దర్నీ విడదీసింది. అంతకన్నా, అతని ప్రాక్టికాలిటీయే మమ్మల్ని విడదీసిందంటే బావుంటుంది.

ఇన్నేళ్ళ పరిచయంలోనూ అతని నుంచి ఇలాంటి ఉత్తరాన్ని నేనెప్పుడూ అందుకోలేదు. కష్టకాలంలో స్నేహితులు మరింత ఆత్మీయులుగా కన్పిస్తారు కాబోలు. అతనిని వెంటనే చూడాలనిపించింది. చూసి ఓదార్చాలనిపించింది. ఉత్తరం మీది తారీకు చూశాను. పది రోజులైంది పోస్టు చేయబడి. పోస్టల్ డిపార్టుమెంటుకొక నమస్కారం.

నేనింక ఆలస్యం చేయలేదు.

ప్రిన్సిపాల్ గా నేను పనిచేస్తున్న కాలేజీలో బాధ్యతలు ఎక్కువే, వాటన్నిటినీ ఒక వారం పాటు వైస్ ప్రిన్సిపాల్ కి అప్పగించి, టికెట్ రిజర్వు చేయిచుకున్నాను. షాలిమా లో ఆఫీసరుగా వున్న మా అన్నయ్య పాణి నేను వాళ్ళింటికి వెళ్ళడం లేదని ఎప్పటి నుంచో నిష్ఠూరం పోతున్నాడు. ఈ వంకన, వదిననీ, పిల్లల్ని చూసినట్లు వుంటుంది. వస్తున్నానని టెలిగ్రాం కూడా ఇవ్వలేదు. మూర్తి ఆరోగ్యం బాగోలేదు కదా! స్టేషనుకు రమ్మని అతన్నెందుకు శ్రమపెట్టాలి? మూర్తికి స్రవంతి తప్ప కొడుకులు కూడా లేరు.

స్టేషను నుంచి డైరెక్టుగా అన్నయ్య ఇంటికెళ్ళిపోయాను.

ఆ సాయంత్రం నేనెక్కిన టాక్సీ ఆ ఇంటి ముందు ఆగేసరికి నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. షామియానాలో సన్నాయి మోగుతోంది. ఇల్లు చాల్ రిచ్ గా అలంకరించబడి వుంది. ఫ్లవర్ డెకరేషన్ తాలుకు పరిమళం గాలిలో నిండిపోయి ఆహ్లాదంగావుంది. సీరియల్ లైట్స్ తో దసరాకి అలంకరించిన మైసూరు పేలలా వుందా ఇల్లు. 

వీధంతా నిండిపోయిన కార్లు పార్కింగ్ ప్లేసు కోసం దిక్కులు చూస్తున్నాయి. వేరే ఎడ్రస్ కొచ్చానా అని నేను సంశయిస్తూండగా గేట్లోంచి గబగబా నడుచుకుంటూ వస్తున్నాడు మూర్తి.

పొందూరు ఖద్దరు సిల్కు పంచె కట్టుకుని, పొడవు చేతుల లాల్చీ, పై మీది జరీ కండువాను సవరించుకుంటూ కారులోకి తొంగి చూసి “వచ్చేసావా శృతీ.! టెలిగ్రాం ఇచ్చాను అందుతుందో లేదో, వస్తావో రావో అనుకుంటున్నాను. స్రవంతి పెళ్ళి ఇంటి దగ్గరే జరిపించేస్తున్నాను. దానిష్టం ఎందుకు కాదనాలి, ఏమంటావ్!” అంటూ నుదుటికి పట్టిన చెమటను అద్దుకున్నాడు.

అంతలో మా వెనుక వచ్చి ఆగిన మరో కారును రిసీవ్ చేసుకుంటూ “శృతీ! నువ్వు లోపలికి పద. సరోజ లోపలుంది” అంటూ అటు నడిచాడు.

మూర్తి భార్య సరోజ ఎదురొచ్చి నన్ను పలకరించింది. పెళ్ళి టైం కావడంతో నన్నొక చోట కూర్చోబెట్టి హడావుడిగా వెళ్ళిపోయింది.

ఎవరో తెచ్చిన కూల్ డ్రింక్ ని సిప్ చేస్తూ కూర్చున్నాను. నా కళ్ళు మాత్రం మూర్తినే గమనిస్తున్నాయి. ఎక్కడ చూసినా తనే అయి మూర్తి ఒకటే హడావుడిగా తిరుగుతున్నాడు. పకపకా నవ్వుతున్నాడు. మధ్య మధ్యలో సరోజ దగ్గరకి వెళ్ళి ఏదో సలహా అడుగుతున్నాడు.

పది రోజుల క్రితం నాకుత్తరం వ్రాసిన మూర్తి ఇతనేనా అని డౌటొచ్చింది నాకు. నా ముందు కూర్చున్న ఎవర్లో పలకరించడానికొచ్చాడు మూర్తి. 

ఆయన మూర్తి చేయందుకుని “హలో ఏంటీ మధ్య హార్టెటాక్ వచ్చిందట, అపోలోలో వున్నారట, నేనూళ్ళో లేను. బిజినెస్ టూర్ కల్ కత్తా వెళ్ళాను” అంటున్నాడు.

“ఆ.. అవునండి, అమ్మాయి పెళ్ళికదా ఎటాక్ అని పడుకుంటే ఎలాగ?” పెద్దగా నవ్వుతున్నాడు మూర్తి.

“పాపం, ఈ మధ్యనే మీ అమ్మగారు పోయారట, ఇంతలోనే ఈ పెళ్ళెలా పెట్టుకున్నారు?

మూర్తి ముఖంలో నవ్వు చెరగలేదు. “చూడండి రామారావ్ గారూ! పెద్దావిడ, కాలం తీరిపోయింది. వెళ్ళిపోయింది. పుణ్యాత్మురాలు. గతించి పోయిన కాలం కోసం భవిషత్తును ఆపుక్కూర్చోం కదా”

“అవునవును” అంటున్నాడాయన.

నా కర్దమైంది. మూర్తి నాకుత్తరం రాసే సరికి స్మశాన వైరాగ్యం నుంచి బటపడలేదు. ఇపుడు మళ్ళీ మామూలు మనిషైపోయాడు. అతని కోసం పరుగెత్తుకొచ్చిన నా సెన్సిటివ్నెస్ కి నా పై నాకే చికాకనిపించింది.

ఒక్క జెర్క్ తో ట్రయిన్ కదిలి స్పీడందుకుంది. ఉత్తరాన్ని చింపి బైటకి విసిరేశాను.

 (4-111-90 ఆదివారం ఆంధ్రజ్యోతి)

(వచ్చేనెలలో మరోకథ)

****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.