నా జీవన యానంలో- రెండవభాగం- 22

 ‘పుట్టిల్లు’ కథానేపథ్యం

-కె.వరలక్ష్మి

‘పుట్టిల్లు ‘ – కథానేపధ్యం

ఈ కథను పంపించడం, ప్రచురణ ‘వనిత’లో 1987లో జరిగినా, రాసి అప్పటికి చాలాకాలమైంది. మొదట్లో రాసిన చాలా కథల్ని పత్రికలకెలా పంపాలో తెలీక కొన్ని, తెలిసిన తర్వాత పోస్టేజికి డబ్బులు లేక కొన్ని, ‘ఇది మంచికథేనా? ‘ అన్న సంశయంతో కొన్నిఫెయిర్ చెయ్యకుండా వదిలేసాను. (అలా వదిలేసి తర్వాత పత్రికల్లో వచ్చిన కొన్ని కథల్ని ఈ మధ్య ‘పిట్టగూళ్ళు’ పేరుతో ఒక పుస్తకంగా తెస్తున్నాను) ఎనభైలలో మా రవీంద్ర కాన్వెంట్ ఒక పెద్ద మండువా లోగిలిలో ఉండేది. మధ్యలో మండువా, చుట్టూ బోలెడన్ని గదులు, నగిషీలు చెక్కి ఇత్తడి బుడిపెల అలంకరణతో ఉన్న సింహద్వారం, చుట్టూ విశాలమైన పెరడు, దాంట్లో ఏనాటివో బాదం మామిడిలాంటి పెద్ద చెట్లు. ఆ ఇంట్లో ఏ మూల చూసినా ఒక కథ పలకరిస్తున్నట్టే ఉండేది ఆ ఇంట్లో రాసిన కథే ఇది. స్త్రీలు పుట్టింటి మమకారాన్ని ఎంతగా కోరుకుంటారో, తృణీకారాన్ని అంతగా భరించలేరు. ఇది ఊహాజనితమైన కథేకాని, కొన్ని ముళ్ళు – నాకు, నా స్నేహితులకు గుచ్చుకున్నవి కూడా ఇందులో చోటు చేసుకున్నాయి. మా స్కూలు పిల్లలకు ఏలేరు ప్రాజెక్టు చూపించడానికి తీసుకెళ్ళినప్పుడు ఏలేశ్వరం ఊరు, కొండమీది గుడి, ఆ గుడిలో మ్రోగిన గంటలు, కొండ పాదంలో ఒరిసి ప్రవహిస్తున్న ఏలేరు అన్నీ ఈ కథలో చోటు చేసుకున్నాయి. అందుకే మిధిల ఎక్కిన కారు మా ఊరిని దాటి, ఏలేరు వంతెనను దాటి వెళ్ళింది. మా మండువా లోగిలి ఏలేశ్వరంలో ఉన్నట్టు చూపించబడింది. ఇప్పుడు చదువుతూంటే ఈ కథలో కొన్ని లోపాలు కానవస్తున్నా తెలిసీ తెలియక రాసిన కథ ఆ రోజుల్లో ‘వనిత లాంటి పెద్ద పత్రికలో వచ్చినందుకు ఎంతగా ఆనందించానో చెప్పలేను. తర్వాత దీనినే పెంచి కొద్ది మార్పులు చేర్పులతో ‘పుట్టిల్లు ‘ పేరుతోనే నవలికగా మలిచాను. అది ‘కలువబాల’ స్త్రీల పత్రికలో అనుబంధ నవలగా వచ్చింది.

పుట్టిల్లు

ఇంచుమించు ఇరవై ఏళ్ళ తర్వాత సామర్లకోట రైల్వే స్టేషన్లో దిగి తడబడుతున్న అడుగులతో స్టేషను బైటికి నడిచింది మిథిల. ఆ ఉత్తరం వచ్చినప్పటినుంచి ఆమె మనసును ఆవరించుకున్న సంభ్రమం ఇంకా అలాగే కొనసాగుతుంది.

ఎన్నో ఏళ్ళ తర్వాత తను చూడబోతున్న, తను అమితంగా ప్రేమించిన పరిసరాలు ఆమె హృదయంలో నిండిపోయాయి. ఇక ఈ జన్మకి సాధ్యం కాదు అనుకున్న ఈ ప్రయాణం అనుకోకుండా ఇప్పుడిలా సమకూరడం కలకాదు నిజమే అని నమ్మలేకపోతోంది.

రైలు దిగిన అందరూ ఇంచుమించు వెళ్ళిపోయారు.

స్టేషను బైట మిధిల మాత్రమే మిగిలిపోయింది. రెండు జతల బట్టలున్న ఎయిర్ బేగ్ ఎంతో బరువున్నట్టు చేతులు మార్చుకుంటూ “ఏం చెయ్యడమా?” అని ఆలోచిస్తోంది. అన్నయ్య రమ్మని వ్రాయగానే ఇలా బయలుదేరి వచ్చేయ్యడం తన మూర్ఖత్వమేమో అనుకుంటోంది.

అంతవరకూ తెల్లని మారుతీకారుకి ఆనుకుని సిగరెట్టు కాలుస్తున్న డ్రైవరు దాన్ని దూరంగా విసిరేసి ఆమె దగ్గరికి వచ్చాడు.

“మిధిలమ్మగారు మీరేనాండి?”

“అ….అవును.”

“రావరాజు బాబుగారు కారు పంపించారండి”

ఆమె హృదయం ఎగసిపడింది.

కలిమి తాలూకు చిహ్నాల్ని మరిచిపోయి ఇరవయ్యేళ్ళయ్యింది. మెత్తని సీట్లో చేరబడి కళ్ళుమూసుకుంది.

దాహంతో గొంతు పిడచకట్టినట్లయింది. ఆపమని కొంచెం నీళ్ళు తాగితేనో. ఏమనుకుంటాడో డ్రైవరు.

కళ్ళు విప్పి చూసింది.

ఆ సరికే కారు సామర్లకోట దాటి పెద్దాపురం చేరుకుంటోంది. ఇదివరకు ఈ రెండూళ్ళకూ మధ్య పొలాలుండేవి. ఇప్పుడు ఇంచుమించు రెండూళ్ళూ కలిసిపోయాయి. కాలేజ్ విడిచిపెట్టినట్లున్నారు. గుంపులు గుంపులుగా అమ్మాయిలు, అబ్బాయిలు బైటకి వస్తున్నారు. నవ్వులు, నవ్వులు… ఒకటే నవ్వులు. ఎగసిపడే యవ్వన ప్రాదుర్భావంలో రంగుల్లో కనిపిస్తుంది ప్రపంచం.

భౌతిక దృశ్యాల్ని వదిలి మిధిల హృదయం గతంలోకి పరుగులు తీసింది.

ఊరిపెద్ద రాఘవరాజుగారి ముద్దుల కూతురు మిధిల. ఆమె కన్నా ముందు పుట్టిన కొడుకు మీదకన్నా ముమ్మూర్తులా తల్లి రూపాన్ని పుణికిపుచ్చుకున్న అపర సరస్వతీదేవిలాంటి కూతురు మీదే ఆయన పంచప్రాణాలుండేవి. అప్పట్లో ప్రతి సంవత్సరం జరిగే పరీక్షల్లో గట్టెక్కలేక ఫోరుఫాంతో ఆగిపోయాడు రామరాజు. స్కూలు ఫైనల్ ఫస్టుక్లాసులో పాసైన కూతుర్ని చదువుకోసం పట్నం పంపించడానికి సంశయించి కూతురి చదువు ఆపించేసారు రాఘవరాజుగారు. అప్పటికే కూతురు మనసు పారేసుకుందనే విషయం ఆయనకు తెలీదు. తండ్రి తన మాట కాదనడనే ధీమాతో బి.యిడి పాసై కొత్తగా స్కూలుకి టీచరుగా వచ్చిన ప్రసా’ మనసిచ్చి పుచ్చుకుంది. మిధిల. ఒక్కసారి ఇంట్లో వాళ్ళని ఆశ్చర్యపరిచే ఘనకార్యం చేస్తున్నాననుకుని, అతనితో దండలు మార్చుకుని, అతని చిటికెనవేలు పట్టుకుని ఇంట్లో అడుగుపెట్టింది.

అలాంటి సంఘటనని ఏ మాత్రం ఊహించని రాఘవరాజుగారు కోపంతో వణికిపోయారు. నవ్వుతూ లోపలికి అడుగుపెట్టిన ఆమె కంటికీ మంటికీ ఏకధారగా కన్నీరు కురిపిస్తూ గుమ్మం దాటేలా చేశారు. ఆమె ముఖాన్నే ఆ ఇంటి తలుపులు మూయబడ్డాయి. తెల్లవారేలోగా ఆ జంట ఊరిని విడిచి పెట్టకపోతే తెల్లవారేసరికి వాళ్ళిద్దరి శవాలు ఏలేరులో కొట్టుకెళ్తూ ఉంటాయని రాఘవరాజుగారి మనుషులు తెచ్చిన కబురుతో ప్రసాద్ అప్పటికప్పుడు భార్యను తీసుకుని అతని స్నేహితుడొకాయన ఉద్యోగం చేస్తున్న బరంపురం చేరుకున్నాడు. అతని కులం మీద ఎస్.సి అనే ముద్ర ఉండడంతో తొందర్లోనే ఉద్యోగం దొరికింది. అంతవరకూ ఆ స్నేహితుడి కుటుంబమే పోషించింది వాళ్ళిద్దర్నీ.

ఆనాటికీనాడు ఇదిగో మళ్ళీ ఇలా వాళ్ళంతట వాళ్ళే పిలిచి రప్పించుకుంటున్నారు. మధ్యలో తండ్రి మరణ వార్త గాలి కబురులా తెలిసింది. తండ్రిని అమితంగా ప్రేమించిన మిధిల కళ్ళు పత్తికాయలయేలా విలపించింది కొన్నాళ్ళు. కాలం మాన్పలేని గాయాలుంటాయా?

గత స్మృతుల్లోంచి తేరుకునేసరికి కారు ఏదో వంతెనని దాటుతోంది. వంగి క్రిందపారుతోన్న ఏటి నీళ్ళని చూసింది. లేత పసుపు రంగులో గలగల పారుతున్న ఆ ఏటినీళ్ళామెని పలకరించాయి. ఎడం పక్క దూరంగా సగం కూలిపోయిన పాత వంతెన.

ఏలేరు మీద కొత్తగా కట్టిన వంతెన కాబోలు ఇది.

ఒక్కసారి ఆ ఏటి నీళ్ళని స్పృశించాలనిపించింది.

తను ఇంటి పెరటి గోడకి పదిగజాల అవతల ప్రవహించే ఏలేరు వర్షాకాలంలో పెరటి గోడను ఒరుసుకుని పారేది. ఆ వరద నీళ్ళలో కొట్టుకొచ్చిన పాములు కొన్ని తమ పెరటి గోడపైకి ఎగబ్రాకేవి. చిన్నతనంలో, రాత్రంతా వరదనీటికి కాపలా కాసే పాలేర్లతోపాటు తను, రాజన్నయ్య, అత్తయ్య పిల్లలూ తెల్లవార్లూ కూర్చునేవారు. పాలేరు వెంకడు పామర భాషలో పాడే పదాలు వినసొంపుగా ఉండేవి. అలా వింటూ వింటూ తెల్లవారుఝామున ఎప్పుడో నిద్రలోకి జారుకునేవారు. ఆ వరద ఉరవడి ఎప్పుడూ ఒక్క రాత్రికి మించి ఉండేది కాదు. తెల్లవారి పొద్దున్నే బామ్మ చిక్కని ఎర్రని ఏటినీటిలో పసుపు పూసిన కొబ్బరికాయలూ, పసుపు కుంకం, చిల్లర డబ్బులు వదిలిపెట్టేవారు. పిల్లల్ని గట్టుమీద నిలబెట్టి ఏటికి దండాలు పెట్టించేవారు. ఏరు తెచ్చిన కొత్త మన్ను పొలానికి బలాన్నిస్తుందని పెద్దవాళ్ళు చెప్పుకునేవారు.

కారు జి.టి రోడ్డునుంచి మలుపు తిరిగింది. కనుచూపు మేరలో కనిపిస్తున్న కొండల్ని ఆప్యాయంగా చూసింది. మిధిల. ఆ కొండల మీది నుంచి వస్తున్న కమ్మనిగాలి ఆమె చెంపల్ని తాకి వెళ్ళింది.

ఊరి మధ్య గట్టుమీది వేణుగోపాలస్వామి గురొచ్చి మనసులోనే చేతులు జోడించింది.

కారు ఊరిని సమీపించడం చూసి గాంధీ బొమ్మకోసం వెతికాయామె కళ్ళు,

“ఇదిగో చూడూ. ఇక్కడ ఊరి మొదట్లో గాంధీ విగ్రహం ఉండాలి కదూ?” ఏదీ అది అని అడక్కుండానే గొంతులో ప్రశ్నార్ధకాన్ని ధ్వనింపజేసింది.

“ఏం గాంధీ బొమ్మండి….” అంటూ గుర్తుచేసుకోడానికన్నట్టు డ్రైవరు కారుని కొంచెం స్లో చేసాడు. “ఓహో అదా, అదిక్కడెక్కడండీ. ఊరికి మధ్యలో ఉండేది. అయినా అదిప్పుడు లేదులెండి.”

“ఏం ఏమయ్యింది.?” ఆత్రుతగా అడిగింది. అంత మంచి సిమెంటు పోత విగ్రహం ఇక ఏ సెంటర్లోను లేదని, గాంధీ పోలికలు మూసపోసినట్లు ఆ బొమ్మలో అమిరాయని చెప్పుకునేవారు.

“రోడ్డు వెడల్పు చెయ్యాలని ఆ బొమ్మని అక్కణ్ణించి పీకేసారు.” ఆమె మనసు చిన్నబోయినట్లయింది. ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం నాడు, గాంధీ పుట్టినరోజు నాడూ తండ్రితో వెళ్ళి పూలదండ వేసి వచ్చేది.

ఊరు చాలా పెరిగింది. రోడ్డుకి ఇరువైపులా బారులు తీరిన షాపింగ్ కాంప్లెక్స్ అప్పుడు లేవు. దుకాణాలన్నింటినుంచీ టేపు రికార్డర్ల సంగీతం రణగొణధ్వని చేస్తోంది.

ఒకాయనెవరో ఎర్రపంచె కట్టుకుని, రిక్షాలో పూజా సామగ్రి పెట్టుకుని, పక్కనే రికార్డులో సన్నాయి వాయిద్యం కేసెట్ పుల్ సౌండులో ఆన్ చేసుకుని గుడికి కాబోలు తరలి వెళ్తున్నాడు. కారు మలుపు తిరిగింది.

చిరపరిచితమైన ఆ వీధిని చూడగానే మిధిల హృదయం ఆనందతరంగితమయ్యింది. ప్రాణప్రదంగా ప్రేమించే భర్త, పిల్లలు ఉన్న తన చక్కని సంసారంలో అప్పుడప్పుడు తన గుండెను వెలితిచేసి ఏదో దిగులుతో నిండిపోయేలా చేసేదేమిటో ఆమె కిప్పుడు అర్ధమయ్యింది. ఆ ఇంటిని, ఆ పరిసరాలను తాను ఎంతగానో ప్రేమించింది. ఎన్ని మారినా ఈ వీధి మారలేదు. వీధి అంచున కనిపిస్తున్న తమ ఇంటిగేటు మారలేదు. గేటు మంచి పది బారల దూరంలో రాజసంతో నిలబడిన చలువ పెంకుల మండువా లోగిలి మారలేదు. కుడిచేతి ప్రక్కనున్న గిలకల బావి మారలేదు. ఎడం చేతి పక్క గోడమూలకున్న పెద్ద వేపచెట్టు కొమ్మలను మరింత విస్తరించుకుని గర్వంతో చూస్తోంది.

కారు గేట్లోంచి ముందుకు పోయి ఆగింది.

ఆనందమో మరేదో అంతు తెలియని భావంతో పగిలిపోయేటట్లున్న గుండెను చిక్కబట్టుకుని కారు దిగింది మిధిల.

తన బాల్యంలోని మధుర స్మృతులన్నిటినీ మూటకట్టుకున్న ఆ మట్టిమీద అడుగుపెట్టి పులకించింది. మిధిల. నాలుగైదెకరాల కాంపౌండులో కట్టబడిన, తనకెంతో ప్రియమైన ఆ ఎత్తరుగుల ఇంటిని కళ్ళనిండుగా చూసుకుంది.

ఆ కుడి ప్రక్క అరుగుమీద పొడుగు చేతుల మడత కుర్చీలో కూర్చుని, మృదుగంభీరస్వరంతో తన తండ్రి ఇంకా ఊళ్ళోని జనానికి తీర్పు చెపుతున్నట్టే ఉంది.

ఆ ఎడం ప్రక్క అరుగుమీద కరణం తాత జారిపోయే కళ్ళజోడుని ముక్కు మీదికి లాక్కుంటూ లెక్కలతో కుస్తీ పడుతున్నట్టే ఉంది.

వేపచెట్టు కింద ఎడ్లబళ్ళకి బదులు నాలుగు ట్రాక్టర్లు విశ్రాంతి తీసుకుంటున్నాయి. వేపచెట్టుకవతల పశువుల కొట్టంలో మరో నల్లకారు తొంగిచూస్తోంది. అదిప్పుడు కార్లగేరేజి కాబోలు.

ఈలోగా సింహద్వారానికున్న పెద్ద పెద్ద పూలతెరని ఒత్తిగించుకుని నాలుగైదు ముఖాలు తొంగి చూసి పక్కకి తప్పుకున్నాయి.

అయినా మిధిల మనసు చిన్న బోలేదు. ఆ ప్రాణం ఉన్న మనుష్యులకన్నా ఈ నోరులేని ఇల్లే తనకి ఆత్మీయంగా అనిపిస్తోంది.

అంతలో జుట్టు ముడివేసుకుంటూ పరుగెత్తినట్టే మెట్లు దిగి వచ్చింది బాగి “సిన్నమ్మగోరూ” అంటూ. దాని ముఖం నవ్వుతున్నా, కళ్ళు మాత్రం వర్షిస్తున్నాయి. మిధిల చేతిలోని బేగ్ ను అందుకుంటూ “బాగున్నారా సిన్నమ్మా?” అంది బాగమ్మ. జవాబుకు ఆశించకుండానే “రండి” అంటూ ఇంట్లోకి దారితీసింది.

బాగమ్మ వెనుక ముందు చావడి దాటి మండువాలోకి అడుగుపెట్టింది మిధిల.

ఇంట్లో కలిమి తాలూకు అధునాతనకాంతులు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఆ ఇంట్లో గదులన్నిటి నుంచీ మండువాలోకే దారి ఉంటుంది. గదులన్నిటి గుమ్మాలకు పట్టు తెరలు వేలాడుతున్నాయి. యూఫోం సోఫాలో కూర్చుని కాఫీ తాగుతున్న రామరాజు కప్పు స్టూలు మీద పెట్టి “రా చెల్లెమ్మా” అన్నాడు. అతని పక్కనే కుర్చుని కాఫీ తాగుతున్న ఆవిడ కళ్ళద్దాల పైనించి పరిశీలనగా చూసి, కాసేపటికి పెదవి కదిలీ కదలనట్టు చిన్నగా నవ్వింది.

ఎక్కడికో ప్రయాణం కాబోలు జానెడు వెడల్పు జరీ బోర్డరున్న పట్టు చీర కట్టుకుని, ఒళ్ళంతా నగలు పెట్టుకుని ముస్తాబయ్యింది. “రా మిధిలా! అలా నిలబడిపోయావేం. ఈవిడే మీ వదిన. అన్నపూర్ణ. తనే మిధిల” అంటూ పరిచయాలు ముగించాడు రామరాజు.

“కాఫీ తాగి రెస్టు తీసుకో. మేం ఎమ్మెల్యే ఇంట్లో పెళ్ళికి వెళ్తున్నాం. వచ్చేసరికి ఆలస్యం కావచ్చు. భోంచేసి పడుకో, రేపు మాట్లాడుకుందాం. ఇక లే అన్నపుర్ణా!” అంటూ బైటికి నడిచాడు రామరాజు. అతని వెనుకే వెళ్తున్న తన వదినగారి వైభవాన్ని గమనిస్తూ ఉండిపోయింది మిధిల.

ప్రసాదుని పెళ్ళాడకుండా ఉండి ఉంటే బహుశ తను కూడా పట్టు చీరలు, బంగారు నగలే ఆడదానికి జీవిత పరమావధి అని నమ్మి ఉండేది.- కానీ, ఈ ప్రపంచంలో అన్నార్తులు, బాధాసర్పదష్టులు ఎందరున్నారో తెలిసి ఉండేది కాదు. మండువాలోకి నడిచింది.

మండువా పైకప్పులోని ఖాళీ ప్రదేశాన్నిప్పుడు అద్దాలతో కప్పేశారు. ఆ మండువాలో నిలబడి రామరాజు, తనూ సన్నగా మొదలయ్యే వర్షపుతుంపరలని నోటితో అందుకోవడం గుర్తుకొచ్చింది. వర్షం పెరిగి పెద్దదయ్యే కొద్ది దూరంగా పరుగులెత్తేవారు. –

వేసవి కాలపు వెన్నెల రాత్రులు ఈ ఖాళీలో వేసిన మంచం మీద బామ్మపక్కన పడుకుని, సుబ్బుల్తో పందెం వేసుకుని పరుగులెత్తే చందమామని చూస్తూ రాజకుమారుల కథలెన్నో వింది.

“రండమ్మా” అన్న బాగమ్మ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చి ఎడం చేతివైపు మొదటి గదిలోకి నడిచింది. అది తన తండ్రిగది. ఆ పాతకాలపు పందిరి పట్టెమంచం అలాగే ఉంది. ఆయన బీరువా, వ్రాసుకునే టేబుల్, గదిలోని కుర్చీలు ఒక్కొక్క దాన్నే చేతితో స్పర్శించింది.

చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్న తమను తల్లి తండ్రీ తనే అయి పెంచిన ఆయన స్మృతులు గుండె అట్టడుగు పొరల్లోంచి బైటకి తోసుకువచ్చాయి. ఆ మంచం మీద అలా మేనువాల్చి కళ్ళుమూసుకుంది. మిధిల. ఆ కళ్ళల్లో నుంచి జాలువారుతున్న కన్నీళ్ళను తలగడ లోలోపల ఇముడ్చుకుంటోంది.

“సిన్నమ్మగోరూ, కొంచెం టిపిను తినండి. తర్వాత తానం చేద్దురుగాని” వెండి పళ్ళెంలో ఉప్మా, బూందీ, అరటిపళ్ళు పెట్టుకుని, మరోచేత్తో, నీళ్ళుగ్లాసు తెచ్చి బల్లమీద పెట్టింది బాగమ్మ.

చొరవగా పక్కలో కూర్చుని చెంపలు పుణికి మెటికలు విరుచుకుంటూ “బంగారు తల్లీ బాబయ్యగారి మనసు ఎంత కష్టపెట్టారమ్మా! ఆ బాబు మొదట్లో మీ మీద కోపగించు కున్నా, రాన్రాను మిమ్మల్ని సూడాలని ఎంతో కొట్టుకులాడేవోరు. మీరెక్కడున్నారో తెల్వదాయే. పోయే ముందంతా మిమ్మల్నే తలుసుకునీవోరు.”

కళ్ళు తుడుచుకుంది బాగమ్మ.

తనెక్కడుందో తెలియకపోతే ఇప్పుడీ ఉత్తరం ఎలా వ్రాసాడు అన్నయ్య? అంటే అతనికి తెలిసే.

“పిల్లలెందరమ్మా?”

“ఇద్దరు, బాగమ్మా”

”తీసుకురాకపోయినారామ్మ?”

“లేదు, అన్నయ్య నన్ను మాత్రమే రమ్మని వ్రాసాడు. ఉత్తరంలో పిల్లల ప్రసక్తి లేదు. అందుకే..”

“అయితే ఏమ్మా? ఇది మీరు పుట్టి పెరిగిన ఇల్లు ఆయనగోరు రాయకపోతే ఏమవుద్ది? మీరు రావాలంతే”

ఎంత తేలికగా చెప్తోంది. మనసును నొప్పించే కొన్ని విషయాలుంటాయనీ తెలీని జీవితం బాగమ్మది. యజమానులకి తలవంచి చెప్పినట్లల్లా చేసుకుపోవడంలోనే ఆమె సుఖపడుతోంది. మిధిల చిన్నతనం నుంచీ బాగమ్మ ఈ ఇంట్లోనే ఉంది. మిధిల స్నానం, పానం అన్నీ బాగమ్మే చూసేది. అందుకే మిధిల అంటే అంత ఇష్టం.

“టిఫిను తినండి తల్లీ, సల్లారిపోతాంది”

”వద్దులే బాగమ్మా రాత్రికి ఏకంగా భోజనం చేస్తాను. ఇప్పుడేకదా కాఫీ తాగాను.”

“అయ్యో, అదేంటి తల్లీ! ఎప్పుడనగా ఎంగిలిపడ్డారో ఏమో, రెండరటి పళ్ళైనా తినండి” అంటూ వలిచి బలవంతంగా మిధిలచేత తినిపించింది బాగమ్మ.

మిధిలకి ఆకలి లేకపోలేదు. కానీ, ఏదో ‘ఇదీ ‘ అని చెప్పలేని భావాలతో ఆమె కడుపు నిండిపోయినట్టయ్యింది. ఆ అనుభూతి సుఖం వల్ల వచ్చిందో, దుఃఖం వల్ల వచ్చిందో ఆమెకే తెలియడంలేదు.

“బాత్ రూంకి వెళ్లాం పద బాగమ్మా” బేగ్ తెరిచి మెత్తని వాయిలు చీరొకటి తీసుకుంది మిధిల.

మండువాలో నడుస్తుండగా ఎదుటి గదిలోంచి ‘బాగీ’ అని పెద్దగా కేక వినిపించింది. మిధిల చెయ్యిపట్టుకుని బాగమ్మ ఆ గదిలోకి తీసుకెళ్ళింది.

అక్కడ మెత్తని యూ ఫోం బెడ్లోకి ఇంచుమించు కూరుకుపోయి ఏదో నవల చదువుకుంటొందొక పదహారేళ్ళ అమ్మాయి. ఆ అమ్మాయి దృష్టి నవల మీద ఉండడంతో వీళ్ళని చూడకుండానే అడుగుల సవ్వడిని బట్టి “ఏయ్ బాగీ! నీకెన్నిసార్లు చెప్పాను, పిలవగానే రావాలని. ఈ ప్లేటులో ఇంకాస్త బూందీ పోసి పట్రా” అంది. ఆ ప్లేటందుకుని పరుగెత్తినట్టే వెళ్ళింది బాగమ్మ.

చెవిలో అమర్చుకున్న వాక్మిలోని మ్యూజిక్కి అనుగుణంగా కాబోలు ఆ అమ్మాయికాలు స్పీడుగా కదులుతోంది.

“నవలతో బూందీ నంజుకుంటుంది కాబోలు ఈ అమ్మాయి” అనుకుంది. మిధిల.

“సూడు మంజమ్మా! అత్తమ్మగారొచ్చారు” బూందీ ప్లేటును మంచం మీద మంజుల పక్కనే ఉంచుతూ అంది బాగమ్మ.

నవల మీదనుంచి ముఖం తిప్పకుండానే కళ్ళు మాత్రం తిప్పి చూసింది మంజుల. ఆ కొన్ని క్షణాల్లోనూ ఆ అమ్మాయి కళ్ళు మిధిల కట్టుకున్న నలిగిన నేత చీరని, కట్టుకోబోతున్న వాయిలు చీరని, మెడలోని సన్నని నల్లపూసల గొలుసునూ పరిశీలించేసాయి. ఇది తమ తెగకు చెందిన శాలీ కాదని గ్రహించడానికి ఆ అమ్మాయికి ఒక్క క్షణం పట్టలేదు. వెంటనే దృష్టిని పుస్తకం మీదకి మళ్ళించుకుంటూ “ఊ సర్లే సర్లే. నిన్నలా మంజమ్మా అని పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను?” అంది.

ఇంటికెవరైనా రాగానే ఎంతో మర్యాదగా పలకరించే తన పిల్లలు గుర్తుకొచ్చారు మిధిలకు.

పిల్లల ప్రవర్తన తీర్చిదిద్దబడడానికి సంపద అడొస్తుందా? అనుకుంది.

చప్పుళ్ళు వినిపిస్తున్న పక్క గదిలోకి తీసుకెళ్ళింది మిధిలను బాగమ్మ. అక్కడ పదమూడేళ్ళ అమ్మాయి, పదేళ్ళ అబ్బాయి కేరమ్స్ ఆటలో నిమగ్నమై ఉన్నారు. ఒక్కసారి తలెత్తి చూసి తిరిగి వాళ్ళ ఆటలో మునిగిపోయారు.

పలకరించబోయిన బాగమ్మను చేత్తో వారించి బైటికి నడిచింది. మిధిల.

“మంజమ్మ తర్వాత వోళ్ళండి వదినమ్మగారికి” అంది బాగమ్మ.

“వేడినీళ్ళకు గీజర్ వేయించినట్టున్నారు” అనుకుంది బాత్రూంలో అడుగు పెడుతూ మిధిల.

“ఒళ్ళు రుద్దుతానమ్మా” అంది బాగమ్మ. “వద్దు బాగమ్మా, ఆ అలవాటు తప్పిపోయింది” అంది నవ్వుతూ మిధిల.

బాగమ్మ బాత్రూం తలుపు మూసి, మిధిలకు బాగా దగ్గరగా వచ్చి ”పోయేముందుంతా నాన్నగారితో అన్నయ్యగోరు గొడవలు పడీవోరమ్మా!” అంది.

మిధిలకి ఆ మాట నమ్మబుద్ధికాలేదు. ఆమె ఎరికలో రామరాజు తండ్రికే నాడూ ఎదురు చెప్పి ఎరగడు. ఆయన ఎదుటపడడానికే భయపడుతూ ఉండేవాడు.

“ఎందుకని?” అడిగింది సాలోచనగా.

“ఏదో ఇంటి గురించి కాబోలు గొడవపడేవోరమ్మా”

“ఏ ఇంటి గురించి?”

“ఈ ఇంటి గురించే

“ఏమని?”

“అన్నయ్య గారేమో ఈ ఇంటిని పడగొట్టించేసి పెద్దమేడ కట్టేద్దారని, నాన్నగారు అలా కుదరదు అని”

“అయ్యో కోటలాంటి ఈ ఇంటిని పడగొట్టాలని ఎందుకనిపించింది? నాన్నగారికి ప్రాణం ఈ ఇల్లంటే.”

“అదేకదమ్మా! ఆయనగారు పెళ్ళికి ముందు దగ్గరుండి, ఎక్కడేది ఉండాలో అలాగ కట్టించుకున్నారంట. ఆ రోజుల్లోనే ఎంత డబ్బయిందో లెక్కలేదని నాయనమ్మగారు అంటూ ఉండేవారు. లచ్మిదేవిలాంటి మీ అమ్మగారు కొత్త పెళ్ళికూతురై ఈ ఇంట్లో అడుగుపెట్టగానే ఇల్లు కలకల్లాడిపోయిందట. బాబయ్యగారికి ఆ యమ్మంటే ఎంత పేనవో, ఆ పోలికల్లో పుట్టిన మీరన్నా, ఆయమ్మ మెట్టిన ఈ ఇల్లన్నా అంత పేనం. ఆవిడ గేపకం కోసం ఈ ఇల్లు ఇలాగే దీపాలెలుగుతూ ఉండాలి అనీవోరు”

వేడినీళ్ళలో సరిపడా చన్నీళ్ళు తొరిపి రెండు బకెట్లతో నీళ్ళుంచి బైటికి నడిచింది బాగమ్మ.

అన్నగారు తననెందుకు పిలిపించాడో సమస్య విడనేలేదు మిధిలకు.

అలవాటు చొప్పున అయిదుగంటలకే మెలుకువ వచ్చేసింది మిథిలకి. రాత్రికలల్లో మధురమైన బాల్యాన్ని మళ్ళీ చవిచూసింది. పట్టుపరికిణీ కట్టుకుని, జడగంటలతో జడవేసుకుని, కాళ్ళకు మువ్వల పట్టీలు, చెవులకు జూకాలు పెట్టుకుని, మెడలో ముత్యాలహారాలు అలంకరించుకున్న చారడేసి కాటుక కళ్ళ ఆ ముద్దబంతి పువ్వులాంటి అమ్మాయిగా మారి పోయింది. అప్పుడు చేసిన బొమ్మల పెళ్ళిళ్ళు మళ్ళీ చేసింది, అన్నాలాటలు మళ్ళీ ఆడింది.

నిద్రనుంచి మేల్కొని కళ్ళు విప్పినా, ఆ కలల మాధుర్యం ఆమెను వీడలేదు.

బయట చెట్లమీదినుంచి పక్షుల కిలకిలారావాలు లోకాన్ని మేల్కొలిపే ప్రయత్నంలో ఉన్నాయి.

లేచి తూర్పు ఇంటి డాబా మీదికి నడిచింది. ఇక్కడే ఈ పిట్టగోడ దగ్గరే. తండ్రితో నిలబడి, సూర్యోదయాన్ని చూస్తూ ఉండేది. కొబ్బరిచెట్ల ఆకుల మధ్యనుంచి తళతళా మెరిసే కిరణాలు పొదిగించి హారం చేయించమని అడిగిందోసారి తండ్రిని. ఆయన పగలబడి నవ్వారు. తనని ఎత్తుకుని ముద్దులు పెడుతూ

“అలాగే చేయిస్తానమ్మా నువ్వు పెద్దయ్యాక, అత్తవారింటికి వెళ్ళేటప్పుడు” అన్నారు.

“ఛీ, నేనేం అత్తవారింటికి వెళ్ళను. ఇక్కడే మనింట్లోనే ఉంటాను” అంది తను.

మళ్ళీ నవ్వారాయన.

అప్పటి కొబ్బరి చెట్ల తలలు పైకెదిగిపోయాయి.

తూర్పు ఆకాశంలో చీకటిని చీల్చుకుని అరుణరేఖలు పొడగడుతున్నాయి.

ఆ అరుణరేఖల దగ్గరిక తను వలసవెళ్ళింది. అక్కడ తన భర్త, పిల్లలు ఏం చేస్తున్నారో అందరికీ ఆశ్చర్యమే తన ఈ ప్రయాణం . ట్రెయిన్ కదలబోతుంటే, కిటికీ దగ్గరకి వచ్చి “అమ్మా! వెళ్ళకెళ్ళక ఇన్నాళ్ళకి నీ పుట్టింటికి వెళ్తున్నావు. నీకు వుండాలనిపించినన్నాళ్ళు వుండిరా. మా కోసం బెంగపడకు” అంది వసుధ తనకి మాత్రమే వినిపించేలా..

దానికి తెలుసు తను తన పుట్టిన ఊరిని, ఇంటిని మనసులోనే మూతపెట్టి పదిలంగా దాచుకుందని.

వసుధ అలా ఆరిందాలా చెప్పడం చూసి తనకి నవ్వొచ్చింది. ‘ఎంతలో ఎదిగిపోతారు పిల్లలు’ అనుకుంది.

దూరంగా ఆకాశంలో మంకెనపూలు మాయమై మంచు కురిసిన మల్లెలు గుమ్మరించినట్టయింది.

ఆ వెలుగులో ఎడమవైపు గుట్టమీది వేణుగోపాలస్వామి ఆలయం తెల్లగా మెరిసిపోతోంది.

ఒక్కసారిగా వాలి రెక్కల్ని సవరించుకుంటున్న పావురాల సందడికి ధ్వజస్థంభం మీద మువ్వలు గలగలలాడాయి.

దూరంగా చుట్టుముట్టిన తూర్పు కొండల వరుస ఆ స్వామిగుడికి ప్రకారాల్లా ఉన్నాయి.

చేతులు జోడించింది. మిధిల. కష్టసుఖాల్లాగే భక్తి కూడా పరిసరాల ప్రభావంతో మనిషిని ఆవరించే ఒక భావమేనని అనిపించిందామెకి.

కిందికి దిగివచ్చి, స్నానం ముగించుకుని తండ్రి పూజగది వైపు నడిచింది.

ఇంట్లో గదులన్నీ ఆధునికతతో ఉట్టిపడడం చూసిందామె. కానీ, ఈ పూజగది తీరు చూస్తుంటే తండ్రిపోయినప్పటి నుంచి ఆ గది తలుపు తెరుస్తున్నట్టే లేదు.

మిధిల పూజగది వైపు వెళ్ళడం చూసి బాగమ్మ పరుగెత్తుకొచ్చింది – “ఒక్క నిముషం బైట నిలబడండమ్మా తుడిసి సుబ్రం చేసేత్తాను” అంటూ.

తండ్రి తన కిష్టమైన రీతిలో అతి శ్రద్ధగా కట్టించుకున్న గది అది. నేలమీద, గోడలమీద పాలరాయి పరిచి ఉంటుంది. బామ్మ పుట్టింటి వారిచ్చిన వెండి అంతా కరిగించి దేవుడి మందిరం పోత పోయించిందట.

తండ్రి పూజ సమయంలో కప్పుకునే పచ్చని పట్టు పంచె అక్కడే కొక్కానికి వేళ్ళాడుతోంది. దాన్ని తీసి మడత పెట్టాలని విప్పింది. చిమ్మెటలు కాబోలు కొట్టేశాయి చాలావరకూ. శిధిలమైపోయిన ఆ వస్త్రంలో జరీ అంచుమాత్రం ఇంకా కొత్తగా మెరుస్తూనే ఉంది. చిన్న వయసులో తండ్రి పక్కనే కూర్చుని నిశ్శబ్ధంగా చేతులు జోడించేది. తండ్రి ధ్యానంలో కళ్ళు మూసుకుని కూర్చునేవాడు. పువ్వులతో అలంకరించిన మందిరంలో, వెలుగుతున్న దీపాల మధ్య పంచెమీది జరీకి దీటుగా వేణుగోపాలుడి కళ్ళు మెరుస్తూండడం విచిత్రంగా ఉండేది తనకి.

ఎండిపోయిన పూల మధ్యనుంచి ఆ వేణుగోపాలుడు నిశ్చలంగా తననే చూస్తున్నట్టు అనిపించింది మిధిలకి.

పువ్వులు తేవాలని తోటలోకి నడిచింది.

తోటంతా ఇంచుమించు పాడుపడి ఉంది. చాలా వరకు చెట్లు ఎండిపోయాయి. అక్కడక్కడా ఇంకా ఉన్నామంటూ నిలబడిన మొక్కలకు పువ్వులే లేవు.

ఆ ప్రదేశం అంతా ఆవులు, గేదెలు, నిలబెట్టి ఉన్నాయి. పాలేర్లు బకెట్లు ముందు పెట్టుకుని పాలు తీస్తున్నారు. కొందరు అక్కడున్న పెద్ద పెద్ద కేన్లలో పాలు నింపుతున్నారు. ఆ కేన్ల మీద మిల్క్ డిపో లేబుల్స్ అంటించి ఉన్నాయి. అక్కడంతా ఒక్కటే సందడిగా ఉంది.

ఉత్త చేతులతో వెనక్కి వచ్చేసింది మిధిల.

పూజగదిలోంచి బైటకి వచ్చేసరికి అన్నగారి కుటుంబంలో ఇంకా ఎవరూ లేచినట్లు లేదు.

“తవరికి టిఫిను ఇచ్చెయ్యమంటారా అమ్మా?” అంది బాగమ్మ.

“వద్దులే, అన్నయ్య వాళ్ళనీ లేవనీ” అంది మిధిల.

“ఆరికోసం ఆగితే మీకు సేనా ఆలీశం అయిపోతాదమ్మా, మీర్రండి” అంటూ చెయ్యిపట్టుకుని తీసుకెళ్ళింది.

మిధిలని ఒక కుర్చీలో కూర్చోబెట్టి బాగమ్మ టిఫిన్ తేవడానికి వంటింట్లోకి వెళ్ళింది. అంత పెద్ద ఇంట్లో, అందరు మనుషుల మధ్య అంతులేని ఒంటరితనాన్ని ఫీలవుతోంది మిధిల.

ఇదే మరొకచోటైతే ఆమెనా భావం ఆవరించేదికాదు.

ఆడపిల్ల యుక్తవయస్సు వరకు సర్వస్వంగా భావించిన పుట్టినింటినీ, తల్లితండ్రుల్నీ, తోబుట్టువుల్ని వదిలి మరో అపరిచిత గృహానికి తరలివెళుతుంది. భర్త ఇంట ఎంత ప్రేమను చవిచూసినా, ఆమె హృదయంలో కొంత స్థానాన్ని తన పుట్టింటి వాళ్ళకోసం విడిగా ఉంచుకుంటుంది. ఆ పుట్టింటి నుంచి ఆప్యాయతని, ఆదరణని కోరుకుంటుంది. అది లభించనివాడు ఆమె పడే వేదన వర్ణనాతీతం, దక్షసభలో సతీదేవి దహనం కావడానికి ఆ ఆవేదనే కారణం.

బాగమ్మ వెండి పళ్ళెంలో టిఫిను, వెండి గ్లాసులో తెచ్చిన పాలు ఆమె నోటికి రుచించలేదు.

చూస్తూ ఉంటే అన్నగారు తన వైభవాన్నంతా చూపడానికి తనను పిలిపించినట్లుంది.

పదిగంటలు కావొస్తుండగా ఒక్కొక్కరే లేచి వచ్చారు బైటకి. మిధిలను చూసి పలకరింపుగా నవ్వింది వదినగారు.

డైనింగ్ హాల్లోనే నాలుగుమూలలా ఉన్న వాష్ బేసిన్ దగ్గరే ముఖాలు కడగటం పూర్తిచేశారు. ముఖం తుడుచుకుంటూ వచ్చి కూర్చున్న ఒక్కొక్కరికి టిఫిన్, కాఫీ లేదా పాలు తెచ్చి ఇవ్వసాగింది బాగమ్మ.

”ఆవిడకి కూడా ఇవ్వు” అంది వదినగారు.

“వదొద్దు.. ప్రొద్దుటే అయ్యింది”

“మరేం ఫర్వాలేదు, తీసుకో, ఈ ఇంట్లో ఎప్పుడూ ఎవరో ఒకరు రావడం, తిని వెళ్ళడం మామూలే”

వెలవెలపోతూ చూసింది మిధిల. వదినగారా మాట ఏ ఉద్దేశ్యంతో అన్నదో కాని మిధిల మనసు మాత్రం సెగ తగిలిన పువ్వులా ముడుచుకుపోయింది. అంతలోనే తేరుకుని ‘నా అంతట నేను రాలేదులే, వాళ్ళు రమ్మంటేనే కదా వచ్చాను’ అని సర్ది చెప్పుకుంది.

“అన్నిసార్లు తినే అలవాటు లేదు” అంటూ దగ్గరగా ఉన్న ప్లేటును దూరంగా తోసింది.

“మీ ఆయన బడిపంతులనుకుంటాను కదూ?”

“ఆ… హెడ్ మాస్టర్”

“అదెలాగ? అప్పట్లో బళ్ళో మామూలు మాస్టరని విన్నాను.”

”తర్వాత పరీక్షలు పాసయ్యారు”

“జీతం ఎంతొస్తుంది?”

చెప్పింది మిథిల.

“మా ఇంట్లో పనివాళ్ళందరికీ కలిపి ఇచ్చే జీతం మీ ఆయన జీతానికి మూడింతలు” చురుక్కున చూసింది మిధిల.

“పిల్లలెందరు?”

“ఇద్దరు” “ఇద్దరూ ఆడవాళ్ళేనట కదా?”

“ఆ….”

“అయ్యో పాపం..”

ఈ సంభాషణ మిధిలకి ఆశ్చర్యాన్ని కలిగించలేదు. ఈ మారుమూల పల్లె, పట్నం కాని ఊళ్ళో, ధనం అనే తెరమరుగున ఉండిపోయిన ఈవిడ ఇంతకన్నా సంస్కారవంతంగా మాట్లాడగలదని మిధిల అనుకోలేదు.

“ఏవిటి, మిధిలతో అప్పుడే కబుర్లు మొదలు పెట్టేశావ్!” అంటూ వచ్చాడు అన్నగారు.

మిధిల భర్త జీతం ఎంతో కళ్ళు పెద్దవి చేసుకుని చెప్పిందావిడ తన భర్తకి.

“లేకపోతే నీలాగే అందరూ అదృష్టవంతు కావద్దూ?” తన జోక్ కి తనే పగలబడి నవ్వేడాయన.

మంజుల టిఫిన్ తింటూ నవల చదువుకుంటోంది.

చిన్నపిల్లలిద్దరూ తండ్రితోపాటు నవ్వారు.

“అన్నయ్యా! నన్ను పిలిపించిన పనేమిటో చెపితే నేనింక బయలుదేరతాను”

“ఏంటంత తొందర? వెళ్ళచ్చులే”

“లేదులే, వెళ్ళాలి”

“అన్నట్టు నువ్వేదో స్కూలు నడుపుతున్నావని విన్నాను”

“అవును, నేను ప్రైవేటుగా బి.యిడి చేశాను.”

“మహారాణిలా కాలుమీద కాలేసుకుని ఉండాల్సిన దానివి పొట్టకూటికోసం పాట్లు పడుతున్నావా?”

“పొరపాటు, పొట్టకూటికోసం కాదు, నాకొచ్చిన విద్యని నలుగురికి పంచడం కోసం. నేను నడుపుతున్నది ఉచిత విద్యాలయం. ఒరిస్సాలో తెలుగు నేర్చుకోవాలనుకునే వాళ్ళు నా దగ్గరికొస్తారు. తెలుగు వాళ్ళ పిల్లలు కూడా కొద్ది ఫీజ్ కట్టి చదువుకుంటారు. “

“అలాగా..”

అన్నగారు కాఫీ తాగుతూ మౌనంగా ఉండడం చూస్తే ఆయనేదో ఆలోచిస్తున్నాడనిపించింది. విషయమేమిటో ఆమెకింకా బోధపడలేదు.

కాఫీ తాగడం ముగించి కప్పు టేబుల్ మీద పెడుతూ “మిధిలా! నాన్నగారు చేసిన అనాలోచితమైన పనికి నిన్నింత దూరం రప్పించవలసి వచ్చింది” అన్నాడు నాందిగా.

“కారులో నువ్వొచ్చేటప్పుడు చూసే ఉంటావు – అవతలి రోడ్డులో పెద్ద బిల్డింగుని. మంత్రిగారి అల్లుడు కట్టించాడు దాన్ని.”

“ఉహూ”

“ఈ ఊళ్ళో డబ్బులోకాని, వైభవంలో కాని నన్ను మించిన వాడెవడూ ఉండడానికి వీల్లేదు”

అన్నగారి మండుతున్న కళ్ళలోకి విచిత్రంగా చూసింది మిధిల.

“నేను అంతకు మించిన బిల్డింగ్ కట్టాలనుకుంటున్నాను. త్వరలో టైల్స్ పేక్టరీలు పెరిగి ఇండస్ట్రియల్ గా ఈ ఊరు డెవలప్ కాబోతోంది. అప్పటికి మన బిల్డింగును మించిన బిల్డింగ్ ఈ ఊళ్ళో ఇంకెవరికీ ఉండకూడదు.” కొంచెం ఆగి సాలోచనగా మిధిల కళ్ళలోకి చూశాడు. “దానికి మన ఈ చోటును మించిన మరో చోటు లేదు. ఈ పాత ఇంటిని పడగొట్టి కొత్త బిల్డింగ్ కట్టాలనుకుంటున్నాను”

ఈ ఇంటిని పడగొట్టడం అనేమాట ఆశనిపాతంలా తగిలింది మిధిలకి. కనీసం తండ్రి గుర్తుగా చూసుకోడానికి ఈ ఇల్లు కూడా ఉండదన్నమాట ఇక. తన మధురమైన బాల్యస్మృతుల్ని అన్నగారు తన చేతులతో చెరిపేయబోతున్నట్టు ఫీలయ్యింది మిధిల. కళ్ళలో రెండు నీటి చుక్కలు నిలిచాయి. తలవంచుకుని ఎవరూ చూడకుండా తుడిచేసుకుంది వాటిని.

డ్రైవరొచ్చి చెప్పాడు “బాబుగారూ! లాయరుగారొచ్చారు”

“వచ్చేసాడా?”

“ఆ, బైట హాల్లో ఉన్నారు”

“అక్కడెందుకు, ఇక్కడికి తీసుకురా, బాగమ్మా! లాయరుకి టిఫిన్ పట్రా”

నల్లకోటు తొడుక్కున్న లాయర్ జోగారావు నవ్వుతూ వచ్చి రామరాజు పక్కనే కుర్చీలో కూర్చున్నాడు.

“ఏవోయ్ లాయరూ! మీ అమ్మాయి పెళ్ళి పనులెంతవరకూ వచ్చాయి?

“ఆ.. ఏదో అవుతున్నాయిలే. ఎంతైనా, నీ అంత గొప్పవాణ్ణి కాదుకదా, పన్లు పరుగులెత్తటానికి”

“ఇదేంటోయ్, కొత్తగా వింటున్నాను, పన్లు పరుగులెడతాయా?”

“ఆ పెట్టవూ మరి. మందీమార్బలం, అంతకన్నా ముఖ్యంగా లక్ష్మీదేవిని ఇంట్లో కట్టేసుకున్నావు”

“ఓరి నీ అసాధ్యం కూలా” అంటూ విరగబడి నవ్వాడు రామరాజు. మిధిలకు ఆ కొత్త వ్యక్తి ఎదుట అలా కూర్చోవాలంటే ఇబ్బందిగా ఉంది.

అందుకే లేచి లోపలికి వెళ్ళబోయింది.

“ఆ…ఆ..ఆగు మిధిలా! నీతో మాట్లాడాలనే ఈయన్ని పిలిపించాను, చెప్పవోయ్ జోగూ” అన్నాడు రామరాజు.

“ఈవిడేనా నీ చెల్లెలు మిధిల?”

“ఆ..”

“ఏం, నువ్వేం చెప్పలేదా?”

“లేదులే, ఎంతైనా నువ్వు లాయర్ వి కదా! పని సానుకూలం చెయ్యడంలో సిద్ధహస్తుడివి” అంటూ లేచి వెళ్ళాడు. ఆ వెనుక ఆయన భార్యా పిల్లలూ వెళ్ళారు.

బాగమ్మ తన ముందుంచిన ప్లేటులోని పూరీముక్కని తుంచి బుగ్గన పెట్టుకుంటూ “మిధిలగారూ డొంక తిరుగుడేం లేకుండా సూటిగా చెపుతున్నాను వినండి. ఈ ఇంటిని మీ తండ్రి రాఘవరాజుగారు పోయేముందు మీ పేర్న వ్రాసేశారు. మిగతా ఆస్తిచరాస్తులు, పొలాలు, తోటలూ, డబ్బూ దస్కం అన్నీ మీ అన్నగారికి వ్రాసారు. ఈ ఇంటిని మాత్రం దీన్లో ఉన్న ఫర్నీచరుతో సహా చెక్కు చెదరకుండా మీకు అప్పగించమని వ్రాసి రిజిష్టరు చేయించారు”

ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసుకుని నోటిమాట రానట్టు నిర్ఘాంతపోయి వింటున్న మిధిల ముఖకవళికల్ని ఒక్క క్షణం నిశితంగా పరిశీలించాడాయన.

“అవును, మీరు నమ్మలేరు. అందుకే ఎలాగూ అనుకున్నది కాదు కాబట్టి, ఈ ఇంటిని వదులుకోవడం మీకు పెద్ద సమస్య కాదు. ఎక్కడో ఒరిస్సాలో స్థిరపడిపోయిన మీరు కేవలం ఈ ఇంటి కోసం ఇంతదూరం రాలేరు కదా! రావడానికి మీ మనసూ ఒప్పుకోదు. ఇప్పుడేదో అన్నగారు అర్జంటుగా రమ్మన్నాడని ఆలోచించకుండా వచ్చేసారే కానీ, కాస్త మనసులోతుల్లోకి వెళ్ళి చూసుకోండి. ఆనాడు మీ భర్తనూ, మిమ్మల్నీ అంతగా అవమానించి బైటికి నెట్టేసిన ఈ ఇంట్లో మీరు కాలుమోపగలిగేవారేనా? అంతగా అవమానించిన ముసలాయన ఈ పాత ఇంటిని మాత్రం మీకిచ్చాడంటే మీరా అవమానాన్ని పదేపదే తలుచుకుని బాధపడాలనే.. ”

తండ్రి మీద ఆ అపరిచిత వ్యక్తి చేస్తున్న అభియోగాన్ని వినలేకపోయింది మిధిల. “ఆగండి, మా నాన్నగారలాంటివారు కారు” అంది అప్రయత్నంగా గొంతు పెద్దదిగా చేసి.

“అవునమ్మా, మీ తండ్రిగారంటే మీకు చాలా అభిమానం అని విన్నాను. అందుకే, నేను చెప్పేది నమ్మలేరు మీరు. సరే! కూతుర్ని అభిమానించే వాడైతే ఆస్థంతా కొడుక్కి రాసుకున్నాడెందుకంటారు?”

“అదంతా ఆయనిష్టం. ప్లీజ్ మా నాన్నగారి గురించి చెడుగా మాట్లాడకండి”

“ఓకె. ఓకె ఇక విషయానికొద్దాం. మీ అన్నగారు ఆర్థికంగా బాగా ఎదిగాడు, చూసారు కదా! ఆహాహా.. మీ నాన్నగారి హయాంలో ఇంత ఆస్థిలేదని కాదు. ఈయన మంత్రులతో వాళ్ళతో పరిచయాలు పెంచుకుని మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇవాళ రామరాజంటే హైదరాబాదులో రాజకీయనాయకులందరికీ తెలుసు. మరి అంత ఎదిగిపోయిన వ్యక్తికి అంత ఎదుగుదలని చూపించే ఇల్లుండాలి కదా!”

“ఉండాలి, తప్పదు. అందుకే ఈ ఇల్లు మీరు మీ అన్నగారికిచ్చేస్తే దీన్ని పడగొట్టి, ఆకాశాన్నంటే అధునాతన భవనం కట్టించాలని ఆయనగారి ఆశ. చూడండి, మీరు మళ్ళీ వచ్చేసరికి ఇక్కడెంత చక్కటి భవనం ఉంటుందో. లిఫ్ట్ ‘ రావాల్సిందే”

“మనిషి ఉండడానికి అంత ఇల్లు అవసరం అంటారా?”

“అంటే అసలు విషయం ఇంకోటుంది. ఇల్లంటే ఇల్లుకాదు. ఈ ఏరియా పారిశ్రామికంగా పైకి రాబోతూంది. చుట్టుపక్కల కడుతున్న పేక్టరీలన్నీ తయారయ్యేసరికి ఇక్కడొక పెద్దలాడ్జి అవసరం అవుతుంది. అందుకే రామరాజు ముందు చూపుతో ఆ పనికి పూనుకున్నాడు.”

“లాడ్జినా? ఈ దేవాలయాన్ని పడగొట్టి లాడ్జి కట్టిస్తారా?”

ఎగతాళిగా నవ్వాడాయన.

“మీ భావంలో ఇది దేవాలయం అయితే నాకభ్యంతరం లేదు. కానీ నిజంగా దేవాలయాల్నే పడగొట్టి లాడ్జిలు కట్టే రోజులివి. మీరు సెంటిమెంటల్ ఫీలింగ్ విడిచిపెట్టండి. మీకిద్దరు ఆడపిల్లలున్నారని విన్నాను. వాళ్ళ పెళ్ళిళ్ళూ అవీ జరగాలి కదా, అదంతా మీ అన్నగారికి వదిలెయ్యండి లేదా, ఈ రోజే ఓ యాభై వేలిస్తాడు పుట్టుకెళ్ళిపొండి.”

“తొందరేం లేదు, ఆలోచించుకోండి. కానీ, వెళ్ళేలోగా సంతకాలు మాత్రం చేసివెళ్ళండి” పాతవి, కొత్తవి డాక్యుమెంట్స్ అందించాడాయన. తను చెప్పదలచుకున్నది పూర్తిగా చెప్పేసాననే తృప్తి తొణికిసలాడుతోందాయన ముఖంలో.

తాపీగా కుర్చీలోంచి లేచి నిలబడింది మిధిల.

“మరోమాట, రామరాజు తలుచుకున్న పనిని కాకుండా వదిలెయ్యడు. నయాన్నో భయాన్నో సాధించి తీరతాడు, మీ మేలు కోరి చెప్తున్నాను.”

ప్రశాంతమైన హృదయంతో తండ్రి గదిలోకి నడిచింది. మిధిల. ఫోటోలోని తండ్రికళ్ళు తననే జాలిగా చూస్తున్నట్లున్నాయి. చేతులెత్తి నమస్కరించి, ఎయిర్ బేగ్ తీసుకుని గదిలోంచి మండువాలోకొచ్చింది.

అంతవరకూ లాయరుగారితో నవ్వుతూ మాట్లాడుతున్న అన్నగారి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశారు.

నిశ్శబ్ధం రాజ్యమేలుతున్న ఆ హాల్లో ధృఢంగా నిలబడి, స్థిరమైన గొంతుతో అంది మిధిల “వెళ్ళొస్తాను” అని. నవ్వుతున్న రామరాజు ముఖంలో ఒక్కసారిగా మార్పొచ్చింది. “అదేవిటి, ఇంతవరకూ చెప్పిన విషయం ఏం చేశావ్?” “అన్నయ్యా! నా కూతుళ్ళ పెళ్ళిళ్ళు నువ్వు చేయిస్తావు, లేదా ఏభై వేలిస్తావు అన్నారు లాయరుగారు.”

”చాలదా? మరో పదివేలు… పోనీ ఇరువై.. ”

“ఆగు. అన్నిటినీ డబ్బుతో కొనలేవు వాళ్ళ పెళ్ళికి నిన్ను చేయిచాచి అర్ధించే అవసరం మాకులేదు. ఎందుకంటే నా పెద్ద కూతురు మరో రెండేళ్ళలో డాక్టరుగా ఇదే ఇంట్లో ప్రాక్టీస్ పెట్టబోతోంది. నా చిన్న కూతురు ఇంజనీరింగ్ రెడో సంవత్సరం చదువుతోంది. ఈ ఏలేరు ప్రాజెక్టు వర్కు దాని చేతుల మీదగానే నడవబోతోందేమో ఎవరు చూడొచ్చారు. వస్తాను మరి”

అందరూ నిశ్చేష్టులై చూస్తుండగా, ధైర్యంగా తలెత్తుకుని సింహద్వారం దాటింది మిధిల.

గుట్ట మీది వేణుగోపాలస్వామి ఆలయంలో గంటలు గణగణా మ్రోగాయి. జే గంటల్లా.

****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.