“మలుపు

– కె. వరలక్ష్మి

వర్థనమ్మగారి ప్రవర్తనలో తేడా కొట్టొచ్చినట్టు కన్పిస్తోంది. పెరట్లో మావిడిచెట్టు కొపుకొచ్చి, ఆఖరు పండుదించే వరకూ కళ్లల్లో వత్తులేసుకుని కాపలాకాసే ఆవిడ సారి చెట్టును పట్టించుకోవడం మానేసారు. పైగా ‘‘అరవిందా! పాపం పిల్లవెధవులు మావిడికాయల కోసం మన పెరటి గోడచుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నట్టున్నారు. రాలిపడిన కాయనల్లా వాళ్లకి పంచిపెడుతూ ఉండు‘‘ అన్నారు. సీత ఎప్పుడైనా ’పప్పులోకి ఓ కాయెట్టండమ్మా’ అనడిగితే ఏ కిందపడి పగిలిన కాయో చేతిలో పెట్టే ఆవిడ ‘‘కాయలు పరువుకొచ్చినట్టున్నాయే, మీ ఆయన్ని చెట్టెక్కి కాయలు తెంపమని పట్టుకెళ్తూండు, పిల్లలు తింటారు’’ అంది. కరోనా కట్టడి కాలమంతా సీతకుటుంబానికేం కావాలో ఆవిడే సమకూర్చింది.

ఆ మధ్య పక్కపోర్షన్లో అద్దెకున్నావిడను పిలిచి ‘‘మీకెన్ని కాయలు కావాలో కోయించుకుని ఊరగాయలు పెట్టుకోండి’’ అని చెప్పింది.

లాక్ డౌన్ సమయంలో కుర్రాళ్లొచ్చి పేదలకి ఇంటింటికీ వంట సరుకులు పంచుతున్నాం చందా ఇవ్వండి అనడిగితే పదివేలు ఇవ్వడమే కాకుండా వారం వారం ఇస్తానని ఒప్పుకొని అలాగే ఇబ్బంది, నిన్నటికి నిన్న స్కూల్ టీచర్స్ వచ్చి ’’అమ్మా, మన హైవేలో నడిచివెళ్తున్న పొరుగు రాష్ట్రాల కూలిజనానికి ఆహారం చెప్పులు వైగారాలు పేక్ చేసి ఇచ్చి లారీల్లో వాళ్ల రాష్ట్రాలకి పంపిస్తున్నాం అంటే లక్ష రూపాయలకి చెక్కు రాసిచ్చింది.

‘‘మొన్న హైదరాబాదు వెళ్లి వచ్చినప్పటినుంచీ మా వదిన ప్రవర్తన మారిపోయింది కదా సీతా!’’ అంది అరవింద, వంటగదిలో సీతతో.

‘‘అవునమ్మా నేనూ ఆమాటే అనుకుంటున్నాను’’ అంది సీత బెండకాయలు తరుగుతూ,

సాలోచనగా సీతవైపు చూసింది అరవింద, ఆమె దృష్టి సీతమీద ఉన్నా మనసెక్కడో ఉన్నట్టుంది.

‘‘నీకు తెలుసా, ఈ ఇల్లూ వాకిలీ ఇలా నిలబెట్టడం, పిల్లలిద్దర్నీ చదివించి ప్రయోజకుల్ని చెయ్యడం అంతా మావదిన చలవే, మా అన్నయ్య పోయాక ఫేమిలీ పెన్షను తోనే తను అనుకున్నవన్నీ సాధించింది, తనని అందరూ పిసినిగొట్టు అనుకున్నా లెక్కచేసేదికాదు, పొదుపు ఒక్కటే తన జీవితధ్యేయం అన్నట్టుండేది. అత్యవసరాలకి మాత్రమే అతి జాగ్రత్తగా ఖర్చుచేసేది. పిల్లల మీద పంచ ప్రాణాలు, తనకి చెందిన దేదైనా వాల్లకే చెందాలనే గాఢమైన మమకారం, హఠాత్తుగా ఇప్పుడెందుకిలా మారిందో అని ఆశ్చర్యంగా ఉందినాకు. అలా అని ఎవరి సొమ్ముకీ ఆశించేతత్వం కాదు, నేను ప్రైవేటు స్కూల్లో పనిచేస్తూ జీతం తెచ్చి ఇవ్వబోతే ‘‘తెలివితక్కువ పిల్లా, బేంకులో దాచుకో అని మందలించేది.’’

‘‘హైద్రాబాదులో ఉండగా అమ్మగారికి గుండెనెప్పి వొచ్చిందన్నారు కదా, దాన్నుంచి బతుకు మీద ఇరక్తిలాటిదేదైనా పుట్టిందంటారా?’’ అంది సీత.

‘‘లేదు లేదు, వదిన అంత పిరికిదేం కాదు, హాస్పిటలుకి నవ్వుతూ వెళ్లి నవ్వుతూ వచ్చిందట, డాక్టర్లు కూడా ఏం ఫర్వాలేదు అన్నారట కదా!’’

పక్కగదిలో విశ్రాంతిగా పడుకున్న వర్థనమ్మకి పరిసరాల నిశ్శబ్ధం వల్ల వాళ్ల మాటలన్నీ స్పష్టంగా వినిపిస్తూనే ఉన్నాయి. ఒక నిట్టూర్పు విడిచి అటు ఒత్తిగిల్లింది –

ఈసారి హైదరాబాద్ ప్రయాణం తనలోని మమకారపు పొరల్ని తొలగించేసింది.

ఆరోజు డాక్టరేమన్నాడు? తనకి గుండెకి సంబంధించి భయపడాల్సినంతగా ప్రోబ్లమ్లేదు, ఎందుకైనా మంచిది, ముందు జాగ్రత్తకోసం ఈమందులు వాడండి అంటూ కొన్ని మందులు రాసిచ్చేడు. ’కాని రిపోర్టులో హైపటైటిస్ సి వెరీ స్మాల్ కౌంట్లో ఉన్నట్టు డౌట్ గా ఉంది. ఎంతస్మాల్ అంటే మరో పదిహేనేళ్లవరకూ అది బైటపడనంత, మరోసారి వీలైనప్పుడు టెస్ట చేయించి కన్ ఫం చేసుకుందాం.’ అని కూడా అన్నాడు.

అంతే, తను తన పిల్లలకి అంటరానిదైపోయింది. HC వైరస్ తమ ఇంట్లో నడయాడుతున్నంత భయపడిపోయారు.

తన కూతురైతే వాళ్లవదినకి పదేపదే జాగ్రతత్తలు చెప్పి తక్షణం పిల్లల్ని తీసుకుని వెళ్లిపోయింది.

తన కొడుకు, కోడలు, పిల్లలు వరూ తన గదిలోకి తొంగిచూడడం మానేసారు. తన హాల్లోకి వెళ్లకూడదు. సోఫాల్లో కూర్చోకూడదు. తన కోసం ఒక ప్లాస్టిక్ కుర్చీని ప్రత్యేకించి దాన్ని ఎవరూ ముట్టుకోవడం మానేసారు. తనకోసం ఒక కంచం గ్లాసుకేటాయించారు. వాటిని తనేకడుక్కోవాలి, తన బట్టలు తనే ఉతుక్కోవాలి, పనమ్మాయి తన గదిలో భోజనం పెట్టి వెళ్లిపోయేది. గది బైట నుంచి భయం భయంగా పలకరించేవాళ్లు. ఇదంతా తట్టుకో లేక, రాత్రుళ్లు దుఃఖంతో నిద్రపట్టకపదిరోజులకే పదేళ్లు మీద పడినట్టు అయిపోయింది. ఆ అంటరానితనం అనుభవిస్తేగాని తెలియదు.

కొన్నాళ్లు ఉండి వద్దామని వెళ్లిన తను తిరుగు ప్రయాణమైపోయింది. సామర్లకోటలో దిగేసరికి అరవింద, సీత సేటషనుకి వచ్చి ఉన్నారు. తను బేరం డకుండా టేక్సీ ఎక్కడం చూసి ఆశ్చర్యపోయారు. కారులో ఎవ్వర్నీ తాకకుండా కూర్చుండి.

అంతలో కరోనా వైరస్ ముంచుకొచ్చింది. అదుపు చెయ్యాలని మూడు నెలలకు పైగా ప్రయత్నించి సాధ్యంకాక ప్రభుత్వాలు తెల్లబోతున్నాయి.

ఆ రోజు తనకి అవగాహన లేక వైరస్ అనేది ఏదైనా ఎంత భయంకరమైనదో అర్థం చేసుకోలేకపోయింది. కోపం తెచ్చుకుంది. ఏది ఏమైనా ఈ సందర్భంగా తనకి మాత్రం జీవితాలు ఎంత అశాశ్వతాలో అర్థమైంది. పెంచుకున్న మమకారాలు ఎంత అర్థంలేనివో తెలిసివచ్చింది.  ఈ లోకంలో ఎందరో నిస్సహాయులున్నారనీ, వాళ్లకి చేయూత అవసరమనీ అర్థమైంది. తను చేస్తున్నది పెద్ద సాయం కాకపోవచ్చు. చిన్నపుడక సైతం గూడు నిర్మాణానికి తోడుపడినట్టు…

****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.