కథాకాహళి- 24

పెళ్ళితో పనిలేని ప్రేమను ఫ్రతిపాదించిన 

సింధు మాధురి కథ ‘కలాపి’

                                                                – ప్రొ|| కె.శ్రీదేవి

స్త్రీల రచనల్లోని నిషేధాలను ధిక్కరించి స్త్రీరచయితలు తమకు సంబంధించిన  సమస్యల గురించి రాసే వాతావరణాన్ని స్త్రీవాద సాహిత్యం  ఏర్పరిచింది. ఇటువంటి భావ వాతావరణ కల్పనలో ఓల్గా నుంచీ సత్యవతి, కొండేపూడి నిర్మల, పాటిబండ్ల రజని, సి. సుజాత,  గీతాంజలి, కుప్పిలి పద్మల వరకు వున్న స్త్రీరచయితలందరూ తమ శక్తిమేరకు  కృషి చేశారు. వీరి కృషికి కొనసాగింపుగా సింధుమాధురి సంప్రదాయాల చాటున కుహనా విలువల చాటున మగ్గబెడుతూ వచ్చిన సమాజంలో స్త్రీలుగా పొందలేకపోతున్న ప్రేమ గురించి తన కథల్లో చిత్రించారు.  వైవాహిక జీవితావరణలోకి ప్రేమ ప్రతిపాదనను “కలాపి” కథపేరుతో ప్రవేశపెట్టడం ద్వారా  సమస్యాత్మకం చేశారు.

నాలుగు దశాబ్దాల తర్వాత స్త్రీవాద కథాసాహిత్యంలో అమలులో వున్న అప్రకటిత వస్తునిషేధాన్ని అధిగమించి, ఎటువంటి అనివార్యత లేకుండా కథలు రాయగలుగుతున్నారు. వీళ్ళ రచనల్లో ఎక్కడ ఎటువంటి inhibitions లేవు. అందువల్లే’ గూనెమ్మ, కృష్ణవేణి  లాంటి స్త్రీల సామాజిక సమస్యల నుండి  ’చంద్రకళ’, ’కలాపి”లాంటి అత్యంత రాడికల్ ఆలోచనలున్న స్త్రీవాద తాత్విక పాత్రికలను సిందుమాధురి తెలుగు సాహిత్యానికి పరిచయం చేశారు.

అమలులో వున్న అసంబంధ విలువల్ని సమస్యాత్మకం చేయటం, అందులో operate అయ్యే ద్వంద్వత్వాన్ని బహిర్గతం చేయటం, తద్వారా కొత్త విలువల ఆవిర్భావానికి దోహదకారి కావటం అనేది కాల్పనిక సాహిత్యం చేయాల్సిన అనేకానేకపనుల్లో ఒకటి. ఆపనిని సింధుమాధురి ఈకథలో చాలా సమర్థవంతంగా, ఎటువంటి సంకోచాలు లేకుండా చేయగలిగారు.

’కలాపి”కథను రాడికల్ స్త్రీవాదకథ అన్నా పర్వాలేదు. ఈ పాత్రను మలచటంలో రచయిత లోతైన అవగాహనను ప్రదర్శించటం జరిగింది. అమలులోవున్న నైతికతలోనుంచి చూసినప్పుడు ఆమె చేసిన పని నైతికానైతిక ప్రశ్న సమాజం వేస్తుంది. అది అవ్యక్తసంబంధం, వివాహేతర సంబంధం కానప్పటికీ కూడా. చాలా నైతిక చట్రాలు వ్యక్తి అస్తిత్వానికి ముప్పుగా పరిణమించినప్పుడు దాన్ని అధిగమించటం అనేది అన్ని సమాజాలలో అమలయ్యేదే, ఆమోదింపబడేదే అయినప్పటికీ, ఈ అతిక్రమణం లైంగిక విషయాలకు సంబంధించిందయినప్పుడు, మరీ ముఖ్యంగా ఆ అతిక్రమణ స్త్రీ చేసినప్పుడు ఆమెను తప్పు పట్టడం, నిలదీయటం పురుష కేంద్రక సమాజంలో సర్వ సాధారణం. ఈ స్థితిలో స్త్రీలు తమ చర్యలను తాత్వికంగా సాధికారికంగా సమర్ధించుకోవటం అసాధ్యమైపోయింది. పురుషుడి ద్వంద్వ నీతి ఇక్కడ కూడా అమలవుతోంది. అందువల్ల స్త్రీలు ఈ అంశాలను అణచివేసి వుంచుకోవటం, నిజాయితీ ప్రదర్శించ లేకపోతున్నామన్న ఆత్మనూన్యతలోకి వెళ్ళటం సాధారణ స్త్రీల విషయంలో జరుగుతుంది. ఈకథలో కలాపి ఇందుకు భిన్నంగా కన్పిస్తుంది. ఆమెకు ఎటువంటి సిద్ధాంతమూ లేకపోయినప్పటికీ, ఆమె ఆలోచన, ఆచరణ అనుభవ కేంద్రకం. ఆమె గురించి లడ్డు లాంటి స్నేహితుడు అన్న మాటల్లో ఆమె స్వభావం తెలుస్తుంది. 

కలాపికథ, ‘ఆంధ్రజ్యోతిఆదివారం పత్రికలో అచ్చయిన కథ. కలాపి అంటే నెమలి. సింధుమాధురి మాత్రం నెమలి లాంటి కలాపి గురించి కథ రాయలేదు. ఎనిమిది పెళ్ళిళ్ళు చేసుకున్నా, ఎంత సంపదున్నా, జీవితానందాన్ని అందుకోవడంలో విఫలమైన కలాపి గురించి రాసిన కథ. ఒక పాము నోట్లో నించి ఇంకో పాము కోరల్లో ఇరుక్కుంటూ, ఒడుపుగా కొండలెక్కే సాహసి గురించి రాసింది. కలాపికి ఎంతో ఇష్టమైన సాహస క్రీడ ఇది. ఈ క్రీడ కలాపి శరీరానికి మాత్రమే పరిమితం. ఈక్రీడా వినోదయాత్రలో కలాపి పొందిందేమిటో, పోగొట్టుకున్నదేమిటో కథ చివరలో కలాపి చేతే చెప్పిస్తుంది సింధు మాధురి.

ఇట్లాంటి కథాంశంతో రాయడం ఒక సాహసమే. రాసి ఒప్పించడమూ, మెప్పించడమూ అంత సులువేమీ కాదు. ఐదుగురిని పెళ్ళి చేసుకున్న ద్రౌపదిని ఆమోదించడానికి పవిత్రత, దైవత్వాన్ని కవచాలుగా వాడుకోక తప్పడంలేదు ఇప్పటికీ, మరి, మనమధ్య సజీవంగావున్న ఒక సాధారణస్త్రీ ఎనిమిది పెళ్ళిళ్ళు చేసుకోవడాన్ని భరించగలమా? భరించి సహించగలమా? సహించి ఆమోదించగలమా? ఆమోదనీయమైన పరిస్థితులనూ, కారణాలను వివరించ గలగాలి. లేకుంటే ఎంత సమర్ధంగా రాసినా, ఎంత గొప్ప శిల్ప నైపుణ్యాన్ని ప్రదర్శించినా ఈ కథ తిరస్కరణకు గురవుతుంది.’కలాపి’ కథలో ఆమోదనీయత కోసం రచయిత చేసిన ప్రయత్నం సఫలమైంది. జాగ్రత్తగా కథను చదివితే రచయిత ఉద్దేశ్యం కలాపి జీవితాన్ని వున్నదున్నట్లుగా పాఠకుల ముందుంచడమే అనిపిస్తుంది. బహుశా నిజజీవితంలో రచయితకు పరిచయమున్న పాత్ర అనిపిస్తుంది కలాపి. అయితే ఆమెను తన కథలో పాత్రగా మలచుకోవడంలో పాఠకులకివ్వగలిగిన జాగృతిని మాత్రం సింధుమాధురి విస్మరించలేదనడానికి మరణశయ్య మీదున్న కలాపి చేత చెప్పించిన ఈమాటలే సాక్ష్యం.

ఎనిమిది పెళ్ళిళ్ళు చేసుకున్నాను. ప్రపంచమంతా తిరిగాను. సంపదతో దొరికే ప్రతిసుఖమూ అనుభవించాను. అయినా ఎప్పుడూ ఏదో ఒక అన్వేషణ. ఎక్కడా స్వాంతన లేదు. ఎప్పుడూ సంతృప్తి లభించలేదు. ఏ మగవాడి దగ్గరా నాకు కావాల్సింది నాకు దొరకలేదు. నాకు కావాల్సింది నాలోనే ఉంది. నాకు నేనే దాన్ని ఇచ్చుకోగలను. మరెవ్వరికీ సాధ్యం కాదని తెలుసుకున్నాను. జీవితంలోకి మనుషులు వస్తూంటారు. పోతూంటారు. మనకి మనమే శాశ్వతం. అయాం వాట్ ఆయాం. ఈ వెతుకులాటలో నాకు మిగిలింది అనుభవాలు మాత్రమే” అంటుంది.

కలాపి పాతికేళ్ళ అన్వేషణే ఈ కథ సారాంశం. కొండలమీద కుండపోతగా కురిసే వానకు, దూకే జలపాతం కలాపి, రాళ్ళని ఒరుసుకుంటూ, చెట్లను వేళ్ళతో సహా పెకలించుకుంటూ, మట్టీ నీళ్ళూ ఒక్కటై పోయి సుడులు తిరుగుతూ ఏ నదిలోనో, సముద్రంలో కలిసేకగానీ నెమ్మదించదు. ఈవడిలో, ఈ దూకుడులో తనకు అయిన గాయాలు గానీ, తనకుతాను చేస్తున్న గాయాలు గానీ గుర్తుకు రావు. బాధ తెలియదు. ఈ పరుగులో, ఈ ప్రవాహంలో, ఈ ప్రయాణంలో తన ఉనికే ప్రధానం. ఎన్ని హొయలు పోయినా ఈజడిలోనే, ఈ ప్రాయపు పడిలోనే, అనంత సాగరంలో కలిసిపోయాక తనకిక ఉనికి లేదు. విడి అస్తిత్వం లేదు. అప్పుడిక అన్వేషణ బయటి ప్రపంచంలో కాదు, లోపల…లోలోపల…తన లోపల మాత్రమే నిక్షిప్తమైన అవ్యవస్థ.

కలాపి, కొండలెక్కే సాహసి, శ్రీమంతుడి కూతురు. ఆధునిక స్త్రీ. అందమైనది. అందాన్ని ప్రేమించేది. కలాపి ఆరాధించే సౌందర్యం పురాతనమైంది. తుంగభద్రా, హంపీ నగరం, రాజులు, రాణులు తిరిగిన ప్రదేశాలూ, వాటి శిధిలాలూ, శిల్పాలూ, రాళ్ళూ, గుట్టలూ, మనిషి లోలోపలి పొరల్లో దాగిన పురాతత్వం ఏదో ఆమెను మేల్కొలిపేది. హంపి కలాపి పుట్టిన ఊరు కాదు. ఆమె అక్కడ పుట్టలేదు అక్కడ పెరగలేదు. అయినా తెలియని బంధమేదో కలాపితో పెనవేసుకుపోయింది.

కలాపి అన్వేషణ దేని కోసం? మిల మిల మెరిసే శరీరం, గలగల పారే స్వభావం, ఉరకలెత్తే ఉత్సాహం, పగడాలు, ముత్యాలు, వజ్రాలు, అంతులేని సంపద వైపు పరుగులు, కొత్త పరిచయాలు, కొత్తస్నేహాలు, చేతులుసాచి పిలిచే కొత్తప్రపంచాలు. కలాపి పరుగులో మిడిసిపాటు లేదు, ఇంకా ఇంకా ఏదో కావాలనే తపన తప్ప. జలప్రవాహం ఒక రాయి మీద నుంచి ఇంకో రాయి మీదకి ఎగబాకినట్టే, ఒక మగవాడి మీదుగా ఇంకో మగవాడిని అందుకుంది కలాపి. ఈ ప్రయత్నంలోఆమెకు అలసటలేదు, ఆనందం తప్ప. కలాపి ప్రయాణంలో తప్పటడుగులుండవచ్చు, కానీ తప్పుల్లేవు. ఘర్షణలుండవచ్చుగానీ  పశ్చాత్తాపం లేదు. ప్రయాణం ఎక్కడికి అని అడగగలం గానీ, ప్రయాణమే ఎందుకు అని అడగలేం కదా!. ప్రయాణంలో మరణం కూడా ఒక సంఘటనే. మరణంతో కలాపి ప్రయాణం ఆగలేదు. యుద్ధగాయాలతో ఉన్న దేశానికి తను చేయాల్సిందేమిటో కలాపి గుర్తించింది. చేయగలిగింది చేయడం. మొదలు పెట్టింది.

పడిలేచిన పరుగుల ప్రయాణంలోనే కలాపికి తాను వెతుకుతున్నదేదో దొరికింది. అమూల్యమైన నిధి అది. ఆనిధి ఆమెకు రాజకుటుంబాల్లో దొరకలేదు. ఆమె కోసం తపించిన మగవాళ్ళ ప్రేమలోనూ లభించలేదు. దిగిన లోయలూఎక్కిన కొండల్లోనూ కనిపించలేదు. పొందిన సుఖాలు, ధరించిన ఆభరణాలు… ఊహూ.. ఎక్కడా ఏవి ఆమె అన్వేషణలో వుపయోగపడలేదు. అద్భుతమైన నిధి అచ్చంగా ఆమెలోనే ఉంది. అప్పటిదాకా తాను వెతుకులాడింది దాని కోసమే. తనకు తాను దొరికిపోయాక, తన ప్రయాణం కొనసాగుతుందనే నమ్మకం కుదిరాక, ప్రశాంతంగా కలాపి కన్ను మూసింది. తన నేస్తం లడ్డూతో “ప్రేమతో పనిలేని పెళ్ళిళ్ళులున్న దగ్గర పెళ్ళితో పనిలేని ప్రేమ ఉండకూడదా?” అనే ప్రశ్న వేస్తుంది. సమస్యాత్మక చర్చను కళాపి పాత్ర ద్వారా సింధుమాధురి ఒక స్త్రీవాద రచయితగా మనముందుకు నెట్టగలిగింది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.