కాళరాత్రి-3

ఆంగ్లమూలం : ఎలీ వీజల్‌ -“నైట్‌”

అనువాదం : వెనిగళ్ళ కోమల

ఇది బాగానే ఉన్నదని అనుకున్నారు జనం. మా కిష్టంలేని ఆ పోలీసుల ముఖాలు చూడనవసరం లేదు అని సర్దుకున్నాం. యూదులం కలిసి బ్రతుకుతున్నామనుకున్నాం.

అసంతృప్తికర విషయాలు జరుగుతూనే ఉన్నాయి. మిలిటరీ రైళ్ళకు బొగ్గు నింపటానికి మనుషుల్ని తీసుకుపోవటానికి జర్మన్లు ఇళ్ళలోకి వచ్చేవారు. అలాంటి పనులు చేయటానికి యిష్టపడే వాలంటీర్లు బహు తక్కువ. అది తప్ప వాతావరణం ప్రశాంతంగా ఉన్నట్లే.

యుద్ధం ముగిసేదాకా గెటోల్లోనే ఉంటామని చాలామంది తలపోశారు. ఎర్ర ఆర్మీ వచ్చేదాకా అని అనుకున్నారు. తరువాత మామూలు పరిస్థితులు నెలకొంటాయని ఆశించారు. గెటోలను జర్మన్లుగాని, యూదులుగానీ నడపటం లేదు. ఏదో అయోమయంలో నడుస్తున్నాయి.

వాతావరణం ఆహ్లాదంగా ఉండటంతో షవుట్‌కి జనం వీధుల్లో తిరుగాడుతున్నారు. ఒకరినొకరు పలకరించుకుంటూ. పిల్లలు ఆటల్లో మునిగి తేలుతున్నారు. నేను నా స్కూలు వాళ్ళతో కలిసి ఎజ్రామాలిక్‌ వాళ్ళ తోటలో టల్‌ముడ్‌ చదువుతున్నాను.

రాత్రి అవుతుండగా 20 మంది చేరాము. నాన్న ఏవో జరిగిన సంగతులు చెబుతున్నాడు. ఆయన (స్టోరీటెల్లర్‌) కథలు బాగా చెప్పగలడు.

అనుకోకుండా గేటు తెరుచుకుంది. ఇదివరలో షాపు నడిపిన వ్యక్తి ఇప్పుడు పోలీసు. అతను మా నాన్నను అవతలికి తీసుకెళ్ళాడు. చీకటిలో గూడా నాన్న ముఖం పాలిపోవటం గమనించాను.

నాన్న తిరిగి వచ్చాక ఏమి జరిగిందని అడిగాము. సంగతేమిటో తెలియదు. తనని కౌన్సిల్‌ మీటింగుకు రమ్మని పిలుపు వచ్చిందన్నాడు నాన్న.

‘‘నేను వెళుతున్నాను. వచ్చిన తరువాత వివరాలు చెపుతా’’ అన్నాడు.

అందరం ఆతురతగా నాన్న రాకకోసం ఎదురు చూశాం. చాలా ఆలస్యమయింది. ఏమిటా మీటింగని ఆందోళన చెందాం.

అమ్మ తన భయం బయటపెట్టింది. ఇద్దరు జర్మను ఆఫీసర్లు గెటోలో కనిపించారన్నది. వాళ్ళు గెస్టాపోలు అన్నది.

అర్ధరాత్రి అయినా ఎవరు నిద్రపోలేక పోయాము. చివరకు గెటో తెరుచుకుంది. నాన్న కనిపించాడు. కళా విహీనంగా  ఉన్నాడు. అందరం చుట్టూ చేరాం సంగతేమిటో చెప్పమని.

ఆందోళన చెందవలసిందేమీ లేదు. మీటింగు రొటీన్‌దే ` సౌకర్యాలు, ఆరోగ్య సమస్యల గురించి జరిగింది అని నాన్న చెపుతాడని ఆశించాం.

చివరికి నాన్న ` ‘‘చెడువార్త అందరిని యిక్కడ నుండి తొలగిస్తారట అన్నాడు. గెటోలు మూసేస్తారు. ముఠాలు ముఠాలుగా అందరినీ యిక్కడ నుండి మారుస్తారు. రేపే ప్రక్రియ ప్రారంభం’’ అన్నాడు. మేము షాక్‌ తిన్నాం. మనల్ని ఎక్కడికి తీసుకుపోతారు అని అందరం అడిగాం.

‘‘అది రహస్యం. నాన్నకొక్కడికే తెలిసిన రహస్యం’’. చెబితే నాన్నను కాల్చి చంపుతామని గెస్టాపోలు బెదిరించారు.

‘‘గాలి వార్తలుగా విన్నాను. మనని హంగేరీ ఇటుక ఫ్యాక్టరీలలోనికి తీసుకుపోతారట’’ అని అన్నాడు నాన్న.

అందరం అత్యవసర వస్తువులు, కొంచెం ఆహారం, కట్టుకునే బట్టలు ఒక సంచిలో సర్దుకుని తయారుగా ఉండాలి. ‘‘ఇంకేమీ తమతో తీసుకెళ్ళగూడదన్నారు’’ అని నాన్న అంటే అందరం అవాక్కయ్యాం. మిగతా వారిని నిద్ర నుండి లేపి చెప్పిరమ్మని మమ్మల్ని పంపించాడు.

ఇంతలో మా బంధువు. బొటియారీచ్‌ వచ్చి బయట మూసివేసిఉన్న కిటికీ తడుతున్నారని చెప్పారు.

యుద్ధం తరువాత నాకు తెలిసింది కిటికీ తట్టింది. నాన్న స్నేహితుడైన హంగరీ పోలీసు ఇన్‌స్పెక్టర్‌ అని. మేము గెటోలలోకి పోకముందు చెప్పారాయన. నేను ముందుగా మీకు వార్నింగు యిస్తాను, ఏదైనా ప్రమాద ఘంటిక మోగబోతుంటేఅని. అతన్ని ఆ రాత్రి వినగల్గితే మేము పారిపోగలిగే వాళ్ళం. కానీ మేము కిటికీ తెరవగలిగేటప్పటికి అక్కడ ఎవరూ కనిపించలేదు.

గెటోలో అందరూ మేల్కొన్నారు లైట్లు వెలిగాయి.

నేను మా నాన్న స్నేహితుని యింటికెళ్ళి నిద్ర లేపాను. లేచి తన కుటుంబం వారితో సహా బహిష్కరణకు తయారుగా  ఉండమని చెప్పాను. ఎక్కడికీ అన్నాడు. ‘‘దేవునికి ఎరుక, ప్రశ్నలడిగే స్థితిలో’’ లేమన్నాను.

నేనేమి చెపుతున్నానో ఆయనకు బోధపడలేదు. నాకు మతి భ్రమించిందనుకున్నాడు.

‘‘ఏమి ప్రయాణం, ఎక్కడికి ప్రయాణం, నీకు మతిగాని చెడిరదా’’ అన్నాడాయన.

‘‘నేను హాస్య మాడుతున్నాను. ప్రశాంతంగా నిద్రపోండి’’ అని చెపుతానని ఆశించాడాయన.

నా గొంతు మూగపోయింది. మాటలు కరువయ్యాయి. నా వాలకం చూసి అతను అర్థం చేసుకున్నాడు. భార్యను తట్టి సున్నితంగా లేపాడు. ఆమె ముఖంలో చిరునవ్వు కనిపించింది. ఇద్దరూ పిల్లల్ని నిద్ర లేపారు. వాళ్ళు తమ కలల నుండి                  ఉలిక్కిపడి లేచారు. నేను అటునుండి వెళ్ళిపోయాను.

నాన్న జనాన్ని ఓదారుస్తున్నాడు. చివరి క్షణంలో ఆర్డరు వాపసు తీసుకుంటారేమొ అన్న ఆశతో యూదు కౌన్సిల్‌ని కనుక్కుంటూనే ఉన్నాడు.

తెల్లవారకుండానే ఆడవాళ్ళు వంట తయారు చేసుకున్నారు. పిల్లలకు ఏమి జరుగుతుందో అర్థం కాలేదు. పెద్దవాళ్ళ పనులకు అడ్డం వస్తున్నారంతే!

పెరడంతా మార్కెట్‌ యార్డ్‌లా ఉంది. విలువైన వస్తువులూ, ప్రార్థనా సామాగ్రి అన్నీ చిందర వందరగా పడి ఉన్నాయి.

ఉదయం ఎనిమిదయ్యే సరికి అందరం మొద్దుబారి పోయాం. అలసి, సొలసి ఆలోచన లేకుండా గడ్డకట్టిపోయాం. కిటికీ గుండా చూస్తే హంగేరీ పోలీసుల అరుపులు వినిపించాయి.

‘‘యూదులందరూ రండి బయటకు వెంటనే’’ అని ఆర్డరు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.