నా జీవన యానంలో- రెండవభాగం- 12

 

-కె.వరలక్ష్మి

1978వ సంవత్సరంలో హైదరాబాద్ లో దూరదర్శన్ టి.వి. ప్రసారాలు ప్రారంభమయ్యాయి. చుట్టుపక్కల 80 కిలోమీటర్ల పరిధిలో మాత్రమే టెలికాస్ట్ అయ్యేవట. 1981 నుంచీ రాష్ట్రం మొత్తం రావడం ప్రారంభమైంది. మొదట్లో ధనవంతులు కొద్ది మంది మాత్రమే టీ.వీ. కొనుక్కోగలిగేవాళ్లు. బ్లేక్ అండ్ వైట్ లోనే ప్రసారాలు వచ్చేవి. పల్లెల్లో జనానికి మొదట రేడియోనే వింత. ఎక్కడో కూర్చుని మాట్లాడుతూంటే ఇక్కడికి విన్పిస్తున్నాయి మాటలు అని కథలు కథలుగా చెప్పుకొనేవాళ్లు. అలాంటిది టీ.వీ. అంటే మరీ వింతైపోయింది. ఎక్కడో జరుగుతున్న కార్యక్రమాలు ఇక్కడ తమ ఇంట్లో కూర్చుని టెలివిజన్లో చూడగలగడం మరీ వింత అయింది. 

1982 ఫిబ్రవరి లో అంజయ్యగారు ముఖ్యమంత్రి పదవి నుండి దింపివేయబడ్డారు. వారి తర్వాత భవనం వెంకట్రామిరెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. 

టెలివిజన్ వచ్చాకా రేడియోకి ఆదరణ ఎప్పట్లానే ఉండేది. రేడియో నాటక వారోత్సవాలు, ఆదివారం నాటకాలు, సంక్షిప్త శబ్ద చిత్రాలు, క్లాసికల్ మ్యూజిక్, లలిత సంగీతం అన్నీ అందరికీ ఇష్టంగా ఉండేవి. మా స్కూలు పిల్లలకు రేడియో మాటల కార్యక్రమాలు విన్పించేవాళ్లం.

82 నవంబర్ లో ఢిల్లీలో జరిగిన ఆసియా క్రీడోత్సవాల సందర్భంగా కాకినాడకు (తూర్పుగోదావరి జిల్లాకు) రిలే ఇవ్వబడింది. ఆసియాడ్ ప్రారంభోత్సవంలో ఒలింపిక్ అధ్యక్షుడు నమరంచ్ పాల్గొన్నాడు. క్రీడాకారుల తరపున గీతాజుట్టి ప్రమాణం స్వీకరించింది. భారత హాకీ జట్టుకి కెప్టెన్ జాఫర్ ఇక్బాల్, ఫుట్ బాల్ కెప్టెన్ భాస్కర్ గంగూలీ. అప్పటికే సుప్రసిద్ధుడైన బాడ్మింటిన్ ఆటగాడు ప్రకాశ్ పడుకొనే వృత్తి ఆటగాడు కావడం వలన ఆసియాడ్ కి నిరాకరింపబడ్డాడట. 

81 లో మా పెద్ద తమ్ముడికి మింట్ కాంపౌండ్ లో ఉద్యోగం రావడం వల్ల భార్యనీ, పిల్లల్నీ తీసుకుని హైదరాబాద్ వెళ్లిపోయాడు. కొన్నాళ్ల తర్వాత మా చిన్న తమ్ముణ్ణీ, మా అమ్మనీ తీసుకెళ్లేడు. మా చెల్లెళ్లు, ఆడపడుచులు, అప్పుడప్పుడూ తమ్ముళ్ల కుటుంబాలు, ఇతర బంధువుల్తో మా మండువాలోగిలి కళకళలాడిపోయేది. అప్పుడప్పుడే గేస్ స్టవ్వులొస్తున్న కొత్త.  మా ఇంట్లో గేస్ స్టవ్వు లేదు అప్పటికి.  రెండు బొగ్గుల కుంపట్లు, ఒక కిరోసిన్ గేస్ స్టవ్వు, ఒకటో రెండో కర్రల పొయ్యిలు వెలిగించాల్సి వచ్చేది. అన్నెందుకంటే టైం సరిపోవాలి కదా మరి!

మా అమ్మ హైదరాబాద్ వెళ్లినా అక్కడ ఇమడలేక తరచుగా వచ్చేసి తన ఇంట్లో తనుండేది. మా నాన్న పోయేక తన మెడ లోంచి తీసేసిన మంగళసూత్రాలు, ఇంట్లో ఉన్న చిన్నా చితకా బంగారం కలిపి తాడేపల్లి గూడెంలో మా పెద్ద చెల్లి వాళ్లింట్లో అద్దెకుంటున్న కంసాలి సీతారామయ్యగారి దగ్గర రెండు పేటల పెద్దగొలుసు చేయించుకుంది. ఇంట్లోకి ఏ నగ చేయించినా ముందు నాకు ధరింపజేసే అలవాటు చొప్పున తెచ్చి నా మెడలో వేసింది. అదే రోజు లయన్స్ క్లబ్ కి చీఫ్  గెస్ట్ ఎవరో రావడం వలన పిలిస్తే వెళ్లేను. అప్పటికి  ఊరి లయన్స్ క్లబ్ ప్రెసిడెంటుగా ఉన్న డాక్టరొకాయన ముందు వరసలో కూర్చున్న నా మెడలోని గొలుసును పట్టి పట్టి చూడడం గమనించేను. ఆ కళ్లల్లో జెలసీని దాచుకోలేక పోయాడు. నిజానికి ఆయనకున్న సంపదల్తో పోల్చుకుంటే ఏనుగుముందు ఒక ఈగలాంటిది నా పరిస్థితి. అంతే, ఆ మరుసటి నెలలో లయన్స్ స్కూల్ ప్రారంభమైంది. వాళ్ల కమ్యూనిటీ హాల్లోనే నడుపుకోవడం వల్ల వాళ్లకి అద్దె బెడద లేదు.

మా హౌస్ ఓనరు ముందు అరవైరూపాయలకి ఇచ్చినా, సింగు గారు వచ్చి చూసెళ్లేక అద్దె 150 కి పెంచుతున్నామని ఉత్తరం వచ్చింది. అంత పెద్ద ఇల్లు దొరకడం కష్టం కాబట్టి అలాగే వొప్పుకొన్నాను. ఏడాదికే  రెండు వందలు చేసారు. సెలవుల తర్వాత స్కూలు  తెరిచేసరికి లయన్ మెంబర్స్ పిల్లలంతా లయన్స్ స్కూలు కెళ్లిపోయేరు. మా పిల్లలు అప్పుడప్పుడే చదువులు మొదలుపెట్టేరు. స్కూలు సరిగ్గా  నడవకపోతే వాళ్లనెలా చదివించాలి? నేనున్నానని ధైర్యం చెప్పేవాళ్లు లేక డీలా పడిపోయేను. సాయంకాలం స్కూలు ముగిసేక వీణపాఠాలు కూడా ప్రారంభించేను. ఎంత కష్టపడి ఎన్ని ప్రయత్నాలు చేసినా మోహన్ వల్ల మళ్లీ అప్పుల్లోకి వెళ్లిపోయేది ఆర్థిక పరిస్థితి. మా పెద్ద చెల్లెలికి వాళ్లాయనగారు అప్పుడప్పుడు ఇచ్చిన డబ్బులు తెచ్చి నా దగ్గర దాచుకుంది. వాళ్లది ఉమ్మడి కుటుంబం కావడం వల్ల వాళ్లత్తగారికి తెలిస్తే గొడవైపోతుందని ఆ ఏర్పాటు. నేను తనని బేంకుకు తీసుకెళ్ళి ఎకౌంటు ఓపెన్ చేయించి తన డబ్బులు దాంట్లో వేయించేను.  మరిచిపోయి గొడవలు రాకుండా చిన్న పోకెట్ బుక్ లో కాపీ ఇచ్చేను. వచ్చినప్పుడల్లా తను తెచ్చుకున్న డబ్బులు ఎకౌంట్ లో వేసేవాళ్లం. ఒకసారి తను వెళ్లబోతున్నప్పుడు నాకు రెండు వేలు అవసరమై అడిగితే ఖాళీ  చెక్కు మీద సంతకం పెట్టి ఇచ్చేసి వెళ్లింది. రహస్యంగా చీరమడతల్లో దాచిన ఆ చెక్కు మర్నాడు ఎంత వెతికినా కన్పించలేదు. రెండో రోజు బేంకుకి వెళ్తే మా చెల్లి ఎకౌంటులో డబ్బులు మొత్తం డ్రాచేసేసి ఉన్నాయి. చెక్కు తెచ్చి మోహన్ డ్రాచేసి  వెళ్లేడని బేంకువాళ్లు చెప్పేరు. మోహన్ ని అడిగితే అవును, నాకు అవసరమై తీసుకున్నాను. నువ్వే వేసేయ్ బేంకులో అన్నాడు నిర్లక్ష్యంగా. ఆరునెలల తర్వాత మా చెల్లి పండక్కి వచ్చేవరకూ కూడబెట్టినా  ఆ అప్పు తీరలేదు, మొత్తానికెలాగో దాని ఎకౌంట్ ఇచ్చేసి, ఇక్కడొద్దు లేమ్మా, ఇంకెక్కడైనా దాచుకో అని చెప్పేసేను. ఇప్పుడు రాయడం రాస్తున్నా, ఇలాంటి సంఘటనలు నన్ను చాలా అస్థిమితానికి గురిచేసేవి.

నాకు అక్షరాభ్యాసం చేయించిన మా ఇంటి పురోహితులు హనుమంతవఝల వెంకన్న పంతులు గారికి భార్య గతించింది. పిల్లలు లేకపోవడం వలన ఎందుకనుకున్నారో ఏమో ఉన్న భూములన్నీ చవకలో అమ్మేసారు, వృద్ధాప్యం మీద పడి పౌరోహిత్యం చేయ్యలేక ఆ డబ్బు ఖర్చైపోయిందట. ఇంచుమించు 500 చ.గజాలు స్థలంలో సదుపాయమైన చక్కని పెంకుటిల్లు, పెద్ద పెరడు, పెరట్లో మొక్కలు ఉండేవి. వీధి అరుగుమీద మడతకుర్చీలో రాజసంగా జీవించిన ఆయన్ని వృద్ధాప్యం కౄరంగా లొంగదీసుకుంది. వేళకు భోజనం, ఉతికిన బట్టలు అమర్చేవాళ్లు లేక ఆయన పరిస్థితి దయనీయంగా మారిపోయింది. అలాంటి పరిస్థితుల్లో లయన్స్ క్లబ్ ఆయన్ని ఆదుకుంటామంటూ ముందుకొచ్చింది. అది నమ్మి ఆయన ఉదారంగా తన ఇంటిని వాళ్లకి రాసి ఇచ్చేసారట. పెద్దాయనకి అరుగుమీది చిన్న గదిని కేటాయించి, క్లబ్ లో ఒక పెద్దాయన తన చుట్టాన్ని కుటుంబంతో బాటు తెచ్చి ఆ ఇంట్లో దించేడు. వాళ్లు చేసిన వాగ్దానాలన్నీ గాలికెగిరిపోయి పంతులుగారికి వేళకి తిండి కూడా కరువైపోయింది. ఈ పరిస్థితులన్నీ కలిసి ఆయన మెదడు మీదా, ఆరోగ్యం మీద దాడిచేసాయి. మేముంటున్న కుప్పయ్యగారింటికి రెండిళ్ల అవతల తూర్పున ఆయన ఇల్లుండేది. ఆయన పేరుతో పిలవబడిన ఆ వీధిలో కొంగులరావిచెట్టు దగ్గర ఆయన చాలా అసహనంగా కర్రపుచ్చుకుని నడుస్తూ ఏమేమిటో వలపోసుకునేవారు. తరచుగా ఇల్లు లాక్కున్న పెద్ద మనిషికి శాపాలు పెడుతూ ఉండేవాడు. తనలో తనే మాట్లాడుకుంటూ ఉండేవాడు. తర్వాత కొద్దికాలంలోనే ఆయన విషాదగాధ ముగిసిపోయింది.

1983 అక్టోబరు 3 మధ్యాహ్నం దట్టమైన మబ్బులు కమ్మి తుఫాను మొదలైంది. పగలూ రాత్రీ ధారాపాతంగా నిలిచి కురిసిన వానకి వీధుల్లోనే కాకుండా ఇళ్లల్లోనూ నీళ్లు ప్రవహించాయి. మేమున్న ఇంటిపెరట్లోని రెండు కొబ్బరి చెట్లూ, ఏనాటిదో బాదం చెట్టు ఇంటిమీద కూలిపోయాయి. దక్షిణం వైపు మాకూ గ్రంథాలయానికీ మధ్య నున్న పెంకుల గోడ నానిపోయి పడిపోయింది. మండువాలో ధారాపాతంగా వర్షం కురుస్తూనే ఉంది. ఇటు మెరకలో ఉన్న కోమట్లు, బ్రాహ్మణుల వీధులే ఇలా ఉంటే అటు పల్లంలో ఉన్న ఇతర కులాల ఇళ్ల పరిస్థితి చెప్పేలాలేదు. మా అమ్మా వాళ్లింట్లో చిన్నిల్లు పెద్ద శబ్దంతో కూలిపోయిందట. అప్పటికి మా పెద్ద చెల్లి చంటి పిల్లల్తో వచ్చి మా అమ్మదగ్గర ఉంది. కళ్లెదుట ఇల్లుకూలిపోవడంతో మా అమ్మ చాలా భయపడిపోయి వాళ్లని తీసుకుని ఇంచుమించు నీటిలో ఈదుకుంటూ వచ్చి మా ఇల్లు చేరుకుంది, నీరు పూర్తిగా తీసేవరకూ ఉంచుకుని పంపించేను.

ముందు అర్జెంటుగా లైబ్రరీకీ, మాకూ మధ్య ఉన్న గోడ కట్టించాను. ఆ రోజుల్లో అంత పెద్ద గోడ కట్టించడానికి 680 రూపాయలు ఖర్చైంది.

ఆ సంవత్సరం అంటే 1984 జనవరిలో సంక్రాంతికి మాపెద్ద తమ్ముడు మా అక్కచెల్లెళ్లు ముగ్గుర్నీ హైదరాబాద్ పిలిచాడు. ఆ సందర్బంగా  హిమాయత్ నగర్ లో ఉన్న మా ఇల్లు గలవారింటికి వెళ్లేం నేనూ మోహన్. చిన్నప్పుడు మానాన్నకు హెడ్మాష్టారైన కుప్పయాచార్యులు గారు, ఆయన భార్య పెద్ద వారైపోయి మంచాల మీద ఉన్నారు. కుప్పయ్యగారు నన్ను చూసి చాలా ఆనందించేరు. ‘‘నువ్వు  మాక్రిష్ణమూర్తి మనవరాలివా? చిన్నప్పుడు వాడూ, నేనూ మంచి మిత్రులం.  చిన్నవయసులోనే పోయాడు పాపం, మీ నాన్నని నేనే స్కూల్లో చేర్పించి, సత్రంలో భోజనం ఏర్పాటు చేసాను’’ అంటూ నన్ను ఆప్యాయంగా తన పక్కన కూర్చోబెట్టుకుని ఎప్పటెప్పటివో పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకున్నారు. ‘‘అమ్మాయ్, ఆ ఇల్లు చాలా మంచిది. అమ్మేద్దామనుకుంటున్నాం. నువ్వు కొనేసుకోరాదూ?‘‘ అన్నారు. నేను ఉత్సాహంగా రెడీ అయిపోయాను.

సింగుగారు ఇంటిరేట్లు చెప్పి మొత్తానికి 55 వేలకి బేరం కుదిరించి ’’ఆ గోడ ఎందుకు కట్టించేరు? మేం ఎలా ఉన్నది అలా అమ్మేయాలనుకున్నాం’’ అన్నాడు. అయ్యో చెట్టు పడి ఇంటి పై కప్పు, మిద్దెలు దెబ్బతినేసాయండి. గదుల్లోకి వర్షం  నీరు దిగిపోతోంది.” అన్నాను నేను. ‘‘మాకదంతా తెలీదమ్మాయ్, ఇవన్నీ మీరు చేయంచుకోవాల్సిందే” అన్నాడాయన.

తీరా అక్కడ ఒప్పుకొని వచ్చేసాను కానీ యాభై ఐదు వేలంటే నేను నా చిన్నప్పుడు మా నాన్న చిట్ ఫండ్ కంపెనీలో తప్ప మళ్లీ అంతడబ్బు చూడలేదు. వచ్చినప్పటినుంచి మనసులో ఒకటే ధ్యాస “ఎలా అంత డబ్బు సంపాదించాలి?” అని స్టేట్ బేంక్ కీ, ఆంధ్రాబేంక్ కీ వెళ్లి అప్పు ఇస్తారేమోనని అడిగేను. కుదరదన్నారు. తాకట్టుపెట్టడానికి ఆస్తులూ లేవు, బంగారమూ లేదు, రాత్రులు నిద్రపట్టడం మానేసింది. అంతలో మోహన్ సామర్లకోట సిద్ధాంతిగారిని కలిసేడట. వందేళ్లు దాటిన ఇంటిని కొనుక్కుని అలాగే వాడుకోకూడదు. పునాది రాళ్లనుంచీ తీసేసి మత్స్యయంత్రం  ప్రతిష్ఠించి కొత్తగా నిర్మించుకోవాలి అన్నారట.

ఉన్నట్టుండి ఓ రోజు స్కూలు విడిచిపెట్టి పిల్లలంతా వెళ్లిన కాస్సేపటికి మధ్యగదిలో మిద్దె పెద్ద శబ్దం చేస్తూ కూలిపోయింది.

 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.