కథాకాహళి- 25

విప్లవోద్యమ కథాసాహిత్య విస్తృతి – ప‌ద్మ‌కుమారి ’అపురూప’ కథలు

                                                                – ప్రొ|| కె.శ్రీదేవి

ప‌ద్మ‌కుమారి 23వ తేదీ సెప్టెంబర్,1972సంవత్సరం ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలోని మంద‌మ‌ర్రి గ్రామంలో జన్మించారు. తండ్రి, సోద‌రులు, బంధువులు అంద‌రూ సింగ‌రేణి కార్మికులే. విద్యార్థిగా ఉన్న‌ప్పుడే, అజ్ఞాత విప్ల‌వోద్య‌మంలోకి వెళ్ళారు. అరెస్ట‌యి ఆరేళ్లు జెయిల్లో వున్నారు. విడుద‌ల‌య్యాక విర‌సంలో, అమ‌రుల బంధుమిత్రుల సంఘంలో చేరారు. ప్రస్తుతం అమ‌రుల బంధుమిత్రుల సంఘం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా పనిచేస్తున్నారు. ఆక్రమంలో ఎదురైన సంఘటనలనే కథలుగా మలిచారు. మెదట సింగ‌రేణి కార్మిక కుటుంబనేపధ్యంలో ఎన్ కౌంటర్ హత్య తరువాతి పరిణామాలలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను ’ఫల్గుణ’ నవలికగా మలిచారు. ఆతరువాత దాదాపు పన్నెండు కథానికలు రాశారు. 

జీవితంలోని ఏచిన్న సంఘటననైనా ఒక కళాఖండంగా ప్రదర్శించగలిగే శక్తి కథానికకుంది. “ఒక కథానికకు ఒకే ఒక లక్ష్యం వుండాలి. జీవితాన్ని వస్తువుగా తీసుకుని, ఆ జీవితం పట్ల ప్రజలకు ఒక దృక్పథాన్ని లేదా ఆలోచనను కలిగించడానికి సమకాలీన వచనంలో రాయబడిన కల్పనా సాహిత్య ప్రక్రియే అయినా అది వాస్తవిక జీవితమే కావాలి. కాని ఆ కథ చెప్పే జీవితం మాత్రం కల్పితం కాకూడదనేది కథానిక వస్తురూప సంబందిత నిర్దిష్ఠత. పద్మకుమారి కథలలో ఈనిర్దిష్ఠ  కథారూపం కళాత్మకంగా మారిందని చెప్పడానికి పాఠకుల కళ్ళనుండి జారే వెచ్చని కన్నీళ్ళే సాక్ష్యం. పాత్రలు, సంఘటనలు వంటి జీవిత వాస్తవాలను పునాదిగా తీసుకున్న కళారూపం ’అపురూప’. వాస్తవిక జీవితమంటే జీవిత యధార్థం మాత్రమే కాదు. జీవిత యథార్థానికి రచయిత దర్శనం, విశ్లేషణం, అవగాహన జోడిస్తే వాస్తవిక జీవితమౌతుందని పద్మకుమారి కథలు ఋజువుచేస్తాయి. ఈమె కథలకు వస్తువు, రూపం రెండూ జీవిత వాస్తవికతే కావడం యాదృచ్చికం కాదు. పద్మకుమారి కథలకు, ఇతివృత్తానికి తోడైన  శిల్ప నైపుణ్యం. 

ఫ్రెడరిక్ ఏంగిల్స్ Realism to my mind implies, besides truth of detail, the truthful reproduction of typical characters in typical circumstances అని చాలా కాలం క్రితమే నిర్వచించారు. పద్మకుమారి విప్లవోద్యమ విస్తృతజీవితాన్ని కథానికల్లో  చిత్రించింది. అపురూప కథల్లోని జీవితం వాస్తవికమయినట్లే, పాత్రలు, సంఘటనలు కూడా వాస్తవికంగానే తీర్చిదిద్దారు. వాస్తవం వేరు వాస్తవికత వేరన్న వాస్తవాన్ని పద్మకుమారి మరిచిపోలేదు.

వర్తమాన సమాజంలో నగరం, గ్రామం అనే తేడా లేకుండా తీరికలేని హడావిడి బ్రతుకులో, తన గురించి, తన వాళ్ళ గురించి మాత్రమే ఆలోచిస్తున్న మానవ సంబంధాల సంక్షోభ వాతావరణం మనుషుల చుట్టూ ఆవిరించి వుంది. అటువంటి మెనాటనస్ లైఫ్ నుండి బద్దలవడానికి, ఎక్కెడెక్కడో మానసిక అంతరాలలో దాయబడిన దు:ఖం ఒక్కసారిగా కట్టలు తెంచుకోవడానికి, ఉదాసీనతలోకి జారిన  మనసు సంధర్భం కోసం ఎదురు చూస్తూంటుంది. కొడుకు, కోడలి మరణం వార్త విన్నప్పటి నుండి అలాంటి దు:ఖభారాన్ని దుర్గమ్మ అనుభవిస్తోంది. తన దుఃఖానికి కారణమైన మనుమరాలిని చూసినప్పుడు, దుఃఖోద్వేగానికి గురవుతుంది. దుర్గమ్మను అనుసరించి వస్తున్న పాఠకుడు కూడా అదే దుఖాన్ని అనుభవించడానికి, దుర్గమ్మ దు:ఖంలో సంయోజనం చెందడానికి ఆదీనరేఖంటూ లేకపోయిన స్థితిని ’అపురూప’ కథలో చూడగలం.

తన ఇంటికి వచ్చిన అగంతకులకు మంచి నీళ్ళివ్వడానికి వెళుతున్న దుర్గమ్మ ’అపురూప’ పేరు వినగానే గిరుక్కున వెనుతిరిగి ఇరవై ఐదుఏళ్ళ అమ్మాయి ముఖంలో తన కొడుకు రూపురేఖల్ని వెతుక్కుంటుంది. వృద్ధదంపతులు “అపురూపా” అనడం, నీ పేరు “అపురూపా” అంటూ ఆమెను పరిశీలనగా చూసిన దుర్గమ్మ ఉద్వేగానికి లోనవుతుంది. ఒక్కసారిగా చదువరులు దుర్గమ్మ కంటే ఎక్కువగానే ఉద్వేగానికి లోనవుతారు. కథ ప్రారంభం నుండి నారాయణ దుర్గమ్మల మధ్య జరుగుతున్న చర్చ, పాఠకుణ్ణి సంశాయాత్మక వాతావరణం నుండి ఉద్వేగ వాతావరణంలోకి తీసుకు వెళ్ళేందుకు ఈకథా ప్రణాళికలో రచయిత్రి ఎలాంటి ఎత్తుగడ వేయలేదేమో అనేంత సహజంగా, అలవోకగా పద్మకుమారి కథాకథనం సాగుతుంది.

సుధాకర్ స్నేహితుడు, రవీంధర్ కబురు చెప్పిన దగ్గర నుండి దుర్గమ్మ దు:ఖం, నారాయణ అంత:శోకం(హృదయఘోష) పాఠకునికి తెలుస్తూనే వుంటుంది. కానీ అక్కడ  లోనవని దు:ఖానికి, దుర్గమ్మ అపురూపను చూసినపుడు కలిగే పాఠకుని అనుభవానికి చాలా వ్యత్యాసం వుంది.

           కథకురాలు ప్రారంభం, కొనసాగింపులో  ఉద్యమ ప్రస్తావన గానీ  ప్రతక్ష పోరాట చిత్రణ గానీ చేయలేదు. కానీ కథ ఆసాంతం ఉద్యమ వాతావరణం ప్రతిఫలిస్తూనే ఉంటుంది. దూరమైన బంధాలను, బంధుత్వాలను దగ్గరకు చేర్చడమే పద్మ కుమారి కథల లక్ష్యం కాదు. విప్లవోద్యమంలో పాల్గొంటున్న వాళ్ళు, వాళ్ళకు వెన్నుదన్నుగా నిలుస్తున్న వాళ్ళు ఎన్ని ఉద్వేగాలకు గురవుతున్నారో,  ఎంతమంది అమరవీరుల కుటుంబాలతో ఆ ఉద్వేగాలను  పంచుకుంటున్నారో తెలియజెప్పడం వరకే ఆగిపోకుండా అంతకు మించిన నిర్మాణాత్మక  కార్యాచరణ కలిగి వుందని చెప్పడం  “అపురూప” కథల లక్ష్యం. 

 ఇరవైఐదేళ్ళ క్రిందట కొడుకు రాసిన ఉత్తరంలోని వాక్యాలు ”అమ్మా…నీ మనుమరాలికి అపురూప” అని పేరుపెట్టాం, అంతే అపురూపంగా ఉంటుంది” అన్న ఒకే ఒక్క పరిచయ వాక్యం తప్ప మరేమి తెలియని దుర్గమ్మ మెదడు పొరల్లో ఆపేరు ఎంత బలంగా నిక్షిప్తమైందో తెలుస్తుంది. 

పాత్రల ప్రతి కదలికల్ని స్పూర్తివంతమైన భావవాతావరణంగా పరిణమింప జేయడంలో రచయిత్రి పాత్ర శక్తివంతంగా ప్రతిఫలిస్తుంటుంది.

“నేను మీ సుధాకర్ కూతుర్ని” అన్న అతి సాధారణ వాక్యం ఉత్తరంలో   చెప్పిన సుధాకర్ పరిచయ వాక్యంతో అనుసంధానించడానికి. అగంతకురాలిగా అడుగుపెట్టిన అమ్మాయి రాకతో ఏర్పడిన గందరగోళం నుండి బయటపడడానికి, ఎప్పటినుండో గడ్డకట్టిన దు:ఖం కన్నీరై ప్రవహింప జేయడం ఒక్కటే పరిష్కారం అవుతుంది.

          ’ అపురూప’ కథావస్తువు నిజంగా అపురూపమైనది. విప్లవోద్యమం పెంపొందించిన మానవ సంబంధాలలోని ఔన్నత్యం.  మనుషులుగా మనుషుల్ని కలవడం, కలపడం ఒక బాధ్యతాయుతమైన చర్య. ఒకరికి ఒకరు ఆసరాగా నిలబడటం ’అపురూప’ కథాసృజనలో జరిగిన మానవ సంబందాల చిత్రణ. వ్యక్తిగత రక్తసంబంధ ఉద్వేగం ఎంత బలంగా దుర్గమ్మ పాత్రలో పద్మకుమారి చిత్రించడం జరిగిందో, అంతే శక్తివంతంగా అపురూప పాత్రను చిత్రించారు. పెంచి పెద్ద చేసిన శాంతమ్మ-రమణయ్యలు, దుర్గమ్మ-లింగయ్యలు తమ బిడ్డల్ని ఉద్యమానికి అప్పగించి ఉద్యమ భాగస్వాములయ్యారు. అపురూప చొరవతో పరస్పరం కుటుంబసభ్యులుగా  ఒకే కప్పు కిందికి చేరడం మానవ సంబంధాల ఔనత్యానికి పరాకాష్ఠ రూపం.

బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రులు, బిడ్డల్ని ఉద్యమానికి అప్పగించిన తల్లిదండ్రులు, ఉద్యమంలో తల్లి దండ్రుల్ని కోల్పోయిన బిడ్డలకు ఆసరా అవుతారు. కన్నబిడ్డల్ని కోల్పోయిన వాళ్ళకు ఎక్కడెక్కడో పెరిగిన బిడ్డలు, తమ చేతుల్లో పెరిగిన బిడ్డలు వృద్ధాప్యంలో ఆసరా అవుతున్నారు. ఒక అపురూప కుటుంబంగా  మానవ సంబంధాల ’అపురూప’ క్షేత్రంగా ఈకథ రూపుదిద్దుకుంది. ఈ కుటుంబ సంబంధాలలో ఎవరితో ఎవరికీ సంబంధంలేనట్లుగా మారిపోతున్న నేపధ్యంలో  పితృస్వామిక కుటుంబ సౌష్టవానికి  ఆనవాళ్ళెక్కడ? కొత్తకుటుంబాల పునర్నిర్నాణానికి ఈకథ సరికొత్త నిర్వచనం. ఇంతకు మించిన నిర్మాణాత్మక పర్యవసానం వేరొక రకంగా వుంటుందా? గుర్రం జాషువా ప్రతిపాదించిన విశ్వనరుడనే అస్తిత్వ ఆత్మగౌరవ ప్రకటనలు, అడవి బాపిరాజు అంతర్జాతీయంగా వున్న అంటరాని సమస్యకు నవలారూపమిచ్చిన ’నరుడి’కి అభివృద్ది రూపమా, బహుళ మానవ భాంధవ్య సమాహార రూపమా ఈ “అపురూప”? అనిపిస్తుంది.

         ఏంగిల్స్ ప్రతిపాదించిన మార్క్సిస్ట్ కుటుంబం వ్యవస్థ పితృస్వామిక కౌటుంబిక వ్యవస్థను విచ్చిన్నం చేయగలదా? అనే ప్రశ్నలకు ఒక ప్రత్యామ్నాయ కుటుంబ వ్యవస్థ నిర్మాణాన్ని ’ అపురూప కథ ద్వారా పద్మకుమారి ప్రతిపాదిస్తారు. నిజానికి పద్మకుమారి ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయినవారు కనిపించకుండా పోయిన వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకొని పనిచేస్తున్న క్రమంలో ఒకరికి ఒకరు ఆసరాగా  మారాలన్న ఆకాంక్షతో ఈ కథ రాశారు. అయితే క్రమంగా ఒక కొత్త నిర్మాణ ప్రతిపాదన వైపు కథ నడిచింది. అక్కడితో ఈ కథ ముగిసిపోలేదు. వృధాప్యంలో వున్న “ఇలాంటి వాళ్ళుఒకరికి ఒకరు అండగా నిలబడి ఆసరా పొందాలేమో… దీనికి మనం ఏమైనా చేయలేమా తాతయ్యా?” అని అపురూప అలా చెప్పుకు పోతుంటే ఆయనలో ఆలోచనలేవేవో అంటూ కథ ముగిస్తుంది. ఆ ముగింపే మరో వ్యవస్థీకృత నిర్మాణంవైపు ఆయన ఆలోచనలు సాగటం భవిష్యత్ మానవసంబంధాల సమాగమాన్ని తలపిస్తుంది.

ఈ కథారచన పద్మకుమారి గడిపిన ఉద్యమ జీవితం, ఉద్యమానంతర జీవితంలోని కార్యాచరణకు ప్రతిరూపం సంకేతం. ఉద్యమాలతో సంబంధం లేనివారికి ఉద్యమంలో పనిచేస్తున్న వారిపట్ల, ఉద్యమం పట్ల వున్న సందేహాలు, ప్రశ్నలు ప్రశ్నలుగానే మిగిలిపోతుంటాయి. విప్లవోద్యమ జీవితాన్ని గురించి రాసిన ఇలాంటి రచనలవల్లే బయట ప్రపంచానికి తేటతెల్లమవుతుంది.

 ’ఇల్లుకట్టు కోవడం’ ఒక స్థిరీకరించబడిన నిర్మాణం. ఆ నిర్మాణం వ్యక్తిగత సౌకర్యం, ప్రయోజనాల కోసం చేసే ఆలోచనల ప్రతిబింబం. వ్యక్తిగతం(ఆస్తి)గా తన మనుమరాలికి ఏమివ్వగలను? అని ప్రశ్నించుకొని, వ్యక్తిగత ప్రేమతో చేసిన  నిర్మాణం,  ఒక సామూహిక ప్రయోజనం దిశగా ప్రయాణించడానికి కావాల్సిన పునాది ఈకథ ప్రారంభంలోనే పడింది. కథకురాలు అవలంభించిన ప్రారంభ ఎత్తుగడ, కథాకథనాలే ఈకథ ముగింపుకు సమగ్రతను చేకూర్చాయి.  

    సాధారణంగా సాహసోపేతమైన జీవితం గడిపేవారు అందరికంటే భిన్నంగా చాలా దృఢంగా వుంటారనే అభిప్రాయం వుంది. బలంగా, దృఢంగా, బలహీనంగా అసమర్థులుగా ఎవరూ పుట్టరు. సమాజమే వారిని దైర్యవంతులుగా దృఢమైన మనస్తత్వం గలవారుగా తయారు చేస్తుందన్న చైతన్యం ధనలక్ష్మికి ఆమె అన్నరమేష్ వల్ల కలుగుతుంది. అలాగే “మామూలు మనుషులే పెద్దపెద్ద పనులు చేస్తారనే, భావ చైతన్యాన్ని అందిస్తాడు. అందుకోసం పుస్తకాలు, వాటి అధ్యయనం అవసరమని, అవే  వ్యకిత్వ వికాసానికి దోహదం చేస్తాయన్న ఎరుక “ఉండవలసిన తీరు” కథ అందిస్తుంది.

   పద్మకుమారి కథలన్నీ ఒక వరుస క్రమంలో రాశారు. ఉద్యమంలోకి కార్యకర్తలుగా వెళుతున్న వాళ్ళందరూ ఉద్యమ అవసరాలకు, వేరువేరు స్థాయిల్లో ఎలా గుర్తింపబడుతున్నారు? ఎలా ఆహ్వానించబడుతున్నారు? అనే ప్రక్రియ ఈకథలో వ్యక్తమవుతుంది. అలా గుర్తించడానికి, ఆహ్వానించడానికి తారతమ్య బేధాలుగానీ, లింగ బేధాలు గానీ అడ్డంకులు కావని బోధపడుతుంది.

      అడవుల్లో సాగుతున్న ఉద్యమ కార్యాచరణ మైదాన ప్రాంతాలలో జీవిస్తున్న వారికి తెలిసే పరిస్థితి చాలా తక్కువ. ఈ క్రమంలో సామాజికులకు అందే సమాచార గ్నానం వినికిడి గ్నానమే తప్ప ప్రత్యక్ష అనుభవం వుండదు. ఇలాంటి వాళ్ళు ఉద్యమ వ్యతిరేకులు కాదు, ఉద్యమం గురించి ఏమాత్రం అవగాహన లేకపోయినా దృశ్య, శ్రవ్య మాధ్యమాల కంటే వేగంగా సమాచార ప్రసారాన్ని భుజాలకెత్తుకొని తెలిసినవి, తెలియనివి  తమ నేరెటివ్ స్కిల్స్ ను, కేవలం ఈ ప్రావీణ్యంతోనే సమాచార ప్రసారం జరిపేస్తారు. అవసరమున్నా లేకున్నా ఇటువంటి  వాళ్ళ వల్ల పెద్దగా ప్రమాదం వుందని అనుకోరు. కానీ వీళ్ళ భయం వల్ల కావచ్చు, ఆశ్చర్యంవల్ల కావచ్చు, లేదా అసహాయత వల్ల కూడా అనవసర భావప్రసారానికి దోహదం చేస్తుంటారు. అటువంటి వాతావరణం నెలకొనకుండా కనీసం ఉద్యమ సానుభూతి పరులకైనా తన వాస్తవ అనుభవాన్ని పద్మకుమారి ’అపురూప’ కథల ద్వారా అందిచారు.

ఉద్యమంనుండి బయటకు వచ్చిన తర్వాత విప్లవోద్యమంలో అసువులు బాసిన కుటుంబాలకు వాళ్ళ మృతదేహాలను పొందేహక్కును, ఆచరణలో సాధించేందుకు,  కుటుంబసభ్యులకు అండగా నిలబడే కర్తవ్యాన్ని పద్మకుమారి భుజానికెత్తుకున్నారు. ఆ కర్తవ్య నిర్వహణలో ఆమె ఎదుర్కొన్న అనుభవాలను ఆటంకాలను, అవమానాలను, అసౌకర్యాలను పాఠకుల ముందు పెట్టారు. ఇదీ పరిస్థితి! ఏం చేయాలో ఎలా ఆలోచించాలో నిర్ణయం పాఠకులే నిర్ణయించుకోమని ఒక బృహత్తర ప్రయత్నం “ఫల్గుణ” తో ప్రారంభించి “అపురూప” వరకు విస్తరించారు.

      ఫల్గుణలో తీసుకున్న వస్తువు చాలా వినూత్నమైంది. అయితే విప్లవ కథా రచయితలు కొంతవరకు అలాంటి స్థితికి ఇదివరకే కొంతవరకు సాహిత్య రూపాన్నిఅందించారు. అందుకే పద్మకుమారి రచనాప్రయత్నం చేసిన తర్వాత  పెద్దగా స్పందన రాలేదు. అందుకు కారణం అది డాక్యుమెంట్ స్థాయిని దాటలేదనిపిస్తుంది. కానీ అపురూప కథాసంపుటి ఆమెను రచయితగా చాలా ఎత్తుకు తీసుకువెళ్ళిన ప్రయాణపు గుర్తులు కంటెంట్ అండ్  ఫామ్  రెండింటిలో ఆమె సాధించిన పరిపక్వ స్థితి ’అపురూప’లో బహిర్గతమయ్యాయి. 

      మనుషులు ఇలాకూడా జీవిస్తారా? ధనలక్ష్మికి కలిగిన అనుమానాలు, విస్మయాలు ఆమె చదివిన పుస్తకాలే తీర్చాయి. ధనలక్ష్మి పాత్రచిత్రణ ద్వారా, బేలగా, సాధారణ స్త్రీలాగా జీవించే స్త్రీలు కూడా చదువు, ఉద్యోగం వాళ్ళ జీవితాన్ని వెలిగంచగలనన్న విశ్వాసాన్ని రచయిత్రి అందిస్తుంది. పోశమ్మ, లింగయ్య కూడా ధనలక్ష్మికి వివాహం చేస్తేనే ఆమె కుదుట పడుతుందన్న నమ్మకం నుండి తనంతకు తానుగా పెళ్ళి, మొగుడు ఆసరాలు లేకుండా జీవించగలదన్న విశ్వాసం వాళ్ళలో కలిగింది. అందుకే లింగమ్మ పోశమ్మల కూతుర్ని చిన్న పిల్లలా చూడటం మానేశారు. ప్రతి చిన్నదానికి తలకిందులయ్యే ధనలక్ష్మి, ఇవ్వాళ వాళ్ళకు కొత్తగా కనబడుతుంది. ధనలక్ష్మి పాత్ర చిత్రణలోని భావ పరిణామం పాఠకులను ఎక్కడా ఆశ్చర్యపర్చదు. అవాస్తవికంగా కూడా అనిపించదు.

       ధనలక్ష్మి మొదటసారి ఉద్యమ జీవితంలోకి ప్రవేశించినప్పుడు ఇచ్చిన పరిశీలనలు  పాఠకులను చాలా బ్రాంతుల నుండి బయట  పడేస్తాయి. పద్మకుమారి నారేషన్ లో పాఠకుడు ధనలక్ష్మి పాత్రను వదలకుండా వెంబడిస్తూ వినూత్న సమాచారంకోసం, సన్నివేశాల కోసం కుతూహలంతో ఎదురు చూస్తుంటాడు.

ఉద్యమాల్లోకి వెళుతున్న వాళ్ళందరూ కుటుంబాలు, బాంధవ్యాలు లేని వాళ్ళు కాదు. తీవ్రవాద సంఘాల్లో చిన్న పిల్లలుగా వున్నప్పటి నుండి శిక్షణ తీసుకున్న వాళ్ళుకాదు. తమ బిడ్డల సంక్షేమం, కుటుంబ సంక్షేమం కంటే పదిమందికి మేలు జరిగే బాటలో పయనించాలన్నసాధారణ మనుషుల సంకల్పమే  వాళ్ళను ఉద్యమాల బాట పట్టిస్తుందన్న స్పష్టత “ఉండవలసిన తీరు”  కథ ద్వారా వ్యక్తమవుతుంది. బిడ్డల్ని వదిలి వెళ్ళే తల్లులు,  తల్లిదండ్రుల్ని వదిలిన బిడ్డలు పరస్పరం వాళ్ళ దు:ఖాన్ని భరించడానికి  సన్నద్ధులై విప్లవోద్యమంలోకి అడుగుపెడుతున్నారు. మామూలు జీవితం నుండే, ఎలాంటి శిక్షణ, దేహ ధారుడ్యం లేకున్నా మానసికంగా ఏర్పడిన దృడచిత్తమే వాళ్ళను రాజ్యంతో చేసే యుద్ధానికి సిద్ధం చేస్తుందన్న అవగాహన కలుగుతుంది.

       ధనలక్ష్మి తానెలా జీవించాలనుకున్నదో తన జీవితం ఎలా వుండాలనుకున్నదో అలా వుండాల్సిన క్రమాన్ని ఆమె కార్యచరణే నిర్ణయిస్తుంది. అందుకే గడచిన జీవితంలో ముడిపడిన బంధాలకు బందీగా వుండి జీవించటం కన్నా గెరిల్లా జీవితంలోకి వెళ్ళడమే జీవిత సాఫల్యంగా భావిస్తుంది.

 అయితే ఒకే ఒక అంశం దగ్గర సంకటం ఎదురవుతుంది.  ధనలక్ష్మి  జీవితంలో తోడబుట్టిన వాడుగా రమేష్ పోషించిన పాత్ర, చిన్నప్పుడు చెట్టు ఎక్కించడం దగ్గర నుంచి ఉద్యమంలో భాగస్వామ్యానికి ఆహ్వానించే వరకూ ధనలక్ష్మి జీవితంలో రమేష్ పాత్ర జోక్యం చాలా ఎక్కువగా, అంటే ధనలక్ష్మి అభిప్రాయాలను ప్రభావితం చేసేంత  డామినెంట్  రోల్ ప్లే చేస్తుంది. 

ధనలక్ష్మి తనంత తానుగా స్కూలులో విధులు నిర్వహించడం, ఉద్యమ అవసరాలకు తోడ్పాటు నివ్వడం ఇవన్నీ కూడా  ఆమె వ్యక్తిత్వాన్ని నిలబెట్టేవే. ఆమె జీవితం ఉద్యమంలోకి వెళ్ళకముందు కూడా విచారించే స్థాయిలో లేదని తెలుస్తుంది. తల్లి దండ్రులు కూడా ఆమె వ్యక్తిగా ఎదుగుతున్న క్రమాన్ని గుర్తించారు. కనుకనే ఆమెకు పునర్వివాహం చెయ్యాలన్న ఆలోచన వాళ్ళకు మళ్ళీ రాలేదు.  ఈ అంశం తప్ప కథంతా చాలా ఆసక్తిగా, సింపుల్  నారేటివ్  స్టైల్ తో చక్కగా సాగిపోతుంది. ఒక సాంధ్రత గల పెద్ద సమస్యను ఇలా సునాయాసంగా పరిష్కరించడం అంత సామాన్య విషయం కాదు.

అమరుల బంధుమిత్రుల సంఘం విప్లవోద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకు  అంత్యక్రియలు గౌరవప్రదంగా జరపాలని, కుటుంబ సభ్యులను  లేదా ఆత్మీయ మిత్రులను, బంధువులను ప్రేమతో  వాత్సల్యంతో, గౌరవంతో  చూసుకునే  అవకాశం దక్కాలనే ఒక మానవీయ ఆకాంక్షకు అక్షరరూపం “అపురూప” కథల ఇతివృత్తం. ఆక్రమంలో ఎదురువుతున్న వాస్తవ సంఘటనలను కథా సన్నివేశంగా మలుచుకునే క్రమంలో పద్మకుమారి సాధించిందేమిటి? అన్న ప్రశ్న ఎదురవుతుంది. ఒక సెంటిమెంట్ కోసం అమరవీరుల బంధుమితృల సంఘం ఏర్పడిందా? అన్న ఆలోచన వస్తుంది. మనిషి జీవితంలో విడదీయరాని ఒక ఎమోషనల్ సెంటిమెంట్. మనిషి పుట్టుక కంటే  అత్యంత ప్రాధాన్యత కలిగింది మరణం. పుట్టుక, చావు రెండూ మనిషి జీవితంలోని ఆద్యంతాలు. పుట్టుక కంటే మరణం  ప్రదానమైంది. ఎందుకంటే శిశువుగా జన్మించడం వలన కలిగే అనుబంధం చాలా స్వల్ప స్థాయిలోనే వుంటుంది.  కానీ మరణంతో, ఆవ్యక్తితో  వున్న అనుబంధం, ఆత్మీయత, జీవన స్పర్శ  ఉద్వేగవంతమైనది. ఆ ఉద్వేగం విప్లవోద్యమ కార్యాచరణకు  సానుకూలాంశం.  ఒక వీరుని మరణం వందమందికి స్పూర్తిదాయకమైన సాంఘిక జీవితానికి నాంది పలుకుతుంది. “ఉండాల్సిన తీరు”ను నిర్ణయిస్తుంది.  అందుకే రాజ్యానికి భయం మృతవీరుల దేహాలను అప్పగించిన తర్వాత పెల్లుబికే ఉద్వేగ ప్రభావం  వాళ్ళకు కంటకంగా తయారవుతుంది. అందుకే ఈ మానవీయ స్పర్శ, విప్లవోద్యమాలలో పెరిగే  భాగసామ్యాన్ని నిర్దేశిస్తుందనే అమరుల మృతదేహాలను అప్పగించడంలో అభ్యంతరం వుంటుంది.  అమరుల మృతదేహాలు మైదాన ప్రాంతాల భద్రజీవితంలోకి చొచ్చుకొనివస్తాయి. తాము కోల్పోతున్న అనుబంధాలనే కాదు మానవహక్కుల నేపథ్యాన్ని గుర్తు చేస్తాయి. మృతదేహాలు నిర్జీవంగా నిస్సహాయంగా పడివున్న దేహాలు కావివి. అప్రజాస్వామిక అవమానీయ రాజ్య స్వభావాన్ని శరీరంపైన ఏర్పడిన గాయాల నైనా సంకేతిస్తాయి. తమదేహాలపై జరిగిన అకృత్యాలను గురించి తన ఆత్మీయులతో మాట్లాడతాయి. అందుకే అక్కడ పోలీసుల రూపంలో దుర్మార్గంగా, అమానుషంగా  భీకర కృత్యంగా హతమార్చడంలో రాజ్యం పాత్రను ఎరుక పరుస్తాయి. అందుకే ఆ ఎరుక కలిగించే ఆలోచనల  ప్రవాహమే అమరవీరుల రక్తపు దేహస్పర్శ సామాన్యులను ఆలోచింప జేస్తుంది. రోమాంఛితులను చేస్తుంది. కర్తవ్యోన్ముఖులుగా మారుస్తుంది. అందుకే పద్మకుమారి ఈ విప్లవ కార్యాచరణను సామూహిక కర్తవ్యంగా  చేపట్టింది. మృతవీరుల దేహాలను అప్పగించడమంటే, వర్తమాన, భవిష్యత్ విప్లవోద్యమ బాధ్యతను స్వీకరించడమేనని పద్మకుమారి సృజించిన ’కథకురాలు’ తన విధిని తాను నిర్వచించుకుంది. 

విప్లవ కథాసాహిత్యం విస్తృతిలో పద్మకుమారి కథలు ఒక మేలిమలుపు. మానవోద్వేగ  సమాహార రూపం “అపురూప” అయితే    తల్లిదండ్రులకు ఆసరా అవ్వాల్సిన బిడ్డల్ని, కోల్పోయినా వాళ్ళ ఆశయాలు, ఆదర్శాలే వృద్ధాప్యంలోని తల్లిదండ్రులలకు ఆసరా అయి వాళ్ళల్లో జీవశక్తిగా మారడం “నిరీక్షణ” కథ ఋజువుచేస్తుంది. 

 “ఉండాల్సినతీరు” కథలో కొడుకుల కోసం తల్లులు, తల్లుల కొసం కొడుకులు తల్లడిల్లితే, “తల్లికోరిక” కథ విప్లవోద్యమంలో కొడుకుల్ని కొల్పోయిన తల్లులు ఉద్యమాన్ని వదలిపెట్టకుండా, ఉద్యమం వెన్నంటివున్న రాజవ్వ అంతిమయాత్రలో సంఘం పాల్గొంటుంది. సంఘంవాళ్ళు ఎర్రజెండాలతో నినాదాలు ఇస్తూ రాజవ్వ మృతదేహంపై కప్పిన ఎర్రజెండాలతో గాలిలో ఎగిరే జెండా లాగా రాజవ్వ శవం లేచింది అంటుంది కథకురాలు. ఉద్యమం పట్ల వున్న గౌరవప్రద స్పూర్తితోనే దేవక్క తన బిడ్డలతో “నేను కూడా  రేపోమాపో అన్నట్లున్న నన్ను కూడా ఇట్లనే సాగనంపండ్రి” అన్నది. రాజవ్వ అంతిమ యాత్ర దేవక్కకు ఎలా స్పూర్తిదాయకంగా మారిందో పాఠకులు గమనంలో నిలబడకుండా వుండదు.

  “ ముగ్గురు తల్లుల్లు” కథలోని రజిత, రవి మృతదేహాల ఊరేగింపు ఖననం చివరి ఘట్టంలో శారద  పక్కనున్న ఎర్రజెండా పైకి ఎత్తి పట్టి పిడికిలి బిగించి నినాదమివ్వడంతో అమరవీరుల బంధు మిత్రుల సంఘం లక్ష్యం, నిర్దేశిత ఉద్దేశం అవ్యక్తరూపంగా బహిర్గతమవుతుంది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.