మాయమైన మరో ప్రేమమూర్తి, అనువాదకురాలు

(నెచ్చెలి రచయిత్రి వెనిగళ్ళ కోమల గారికి నెచ్చెలి కన్నీటి నివాళి సమర్పిస్తూంది!)

-దామరాజు నాగలక్ష్మి

ప్రముఖ పాత్రికేయులు, హేతువాది, మానవవాది, రచయిత నరిసెట్టి ఇన్నయ్యగారి సహచరి, రచయిత్రి వెనిగళ్ళ కోమలగారు ప్రపంచానికి దూరమయ్యారు. ఇన్నయ్యగారి కుటుంబానికి మూలస్తంభం ఒరిగిపోయింది.

మొక్కల మధ్య మొక్కగా, పువ్వుల మధ్య పువ్వుగా, పుస్తకాల ప్రేమికురాలిగా ఆనందంగా వుంటూ… చక్కటి అనువాదకురాలిగా కొన్ని పుస్తకాలు అనువాదం చేశారు. తన జీవితాంతం పుస్తకాలు చదువుతూ కాలక్షేపం చేసేవారు. ఆప్యాయతకి పెట్టింది పేరు కోమలగారు. ఆతిథ్యమివ్వడంలో ఆవిడది పెద్ద చెయ్యి.

2010 వరకూ ఇండియాలోనే వున్న కోమలగారు ఇంటి ముందు చక్కటి పువ్వుల తోట పెంచి అందమైన పువ్వులని పూయించి ఆనందించేవారు. ఆవిడ ఒక్క నిమిషం కూడా సమయాన్ని వృధా చేసేవారు కాదు. నవ్వుతూ స్నేహితులతో కబుర్లు చెప్పడం, వాళ్ళకష్టనష్టాల్లో పాలుపంచుకోవడం చేస్తుండేవారు.

2010లో వారి పిల్లలలైన నవీన, రాజుల దగ్గిరకి అమెరికా వెళ్ళిపోయారు. అమెరికా వెళ్ళినప్పటికీ ఇండియాలో ఉన్న తన బంధు, మిత్రులని పలకరిస్తూనే వుండేవారు. దాదాపు పదకొండు సంవత్సరాలుగా అమెరికాలో ఉన్న కోమలగారు నరిసెట్టి ఇన్నయ్యగారి జీవిత భాగస్వామిగా, ఆణిముత్యాల్లాంటి పిల్లలు రాజు నరిసెట్టి (కిమ్), నవీన నరిసెట్టి (హేమంత్)లతో
మనుమలు రోహిత్, రాహుల్ – మనుమరాళ్ళు లెలా, జోలాలతో అమెరికాలో ఆనందమయ జీవితాన్ని గడిపారు.

డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఇంగ్లీషు ప్రొఫెసర్ గా చేసిన కోమలగారు రిటైర్ అయిన తర్వాత –
అయాన్ హిర్సీఅలీ – నోమాడ్, కేజ్డ్ వర్జిన్ (మతపంజరంలో కన్య),
యంగ్ ఛాంగ్ – వైల్డ్ స్వాన్స్ (అడవికాచిన వెన్నెల (చైనా వనితల కష్టాలు)
ఎమ్.ఎన్.రాయ్ – మెమోయిర్స్ ఆఫ్ కాట్ (పిల్లి ఆత్మకథ)
ఎలీవీజల్ – నైట్ (కాళరాత్రి)

అనువాదాల్ని, వారి స్వీయచరిత్ర తెలుగులోను, ఇంగ్లీషులోను రచించారు.
దిన, వారపత్రికలకి వ్యాసాలు రాశారు.

పరిపూర్ణమైన జీవితాన్ని గడిపి ప్రశాంతంగా డిసెంబరు 5, 2021న అమెరికాలో తనువు చాలించారు.

*****

 

 

****

Please follow and like us:

One thought on “మాయమైన మరో ప్రేమమూర్తి, అనువాదకురాలు (వెనిగళ్ళ కోమల గారికి నివాళి!)”

  1. శీర్షికలోనే ఆమె సంపూర్ణ వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించారు.చెరగని చిరునవ్వు ఆమెఆభరణం.2018లో కలసినపుడు గుర్తున్నానా అని అడిగితే మరచిపోతే గదా గుర్తు తెచ్చుకోవటానికి అన్నారు.ఆతిథ్యానికి పెట్టింది పేరు.ఆమె ఎప్పడూ మనతోనే ఉంటారు.

Leave a Reply

Your email address will not be published.