నా జీవన యానంలో- రెండవభాగం- 13

 

-కె.వరలక్ష్మి

1982 ఫిబ్రవరిలో అంజయ్యగారు ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించబడి భవనం వెంకట్రామిరెడ్డి ముఖ్యమంత్రిగా నియామకం జరిగింది. ఇందిరాగాంధీని విపరీతంగా అభిమానించే దాన్ని. ఒక స్త్రీగా ఆమె కార్యదక్షత నాకు ఆశ్చర్యం కలిగించేది. కాని, ఇలా ముఖ్యమంత్రుల్ని దించెయ్యడం వల్ల ఆంధ్రాలో ఆమె ప్రభుత్వానికి ఏమైనా అవుతుందేమో అని భయంవేసేది.

1982 లోనే అని గుర్తు. రష్యన్ భాష నుంచి తెలుగులోకి అనువదించిన ఓల్గా కథ మూడు తరాలు ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది. దాన్ని చదివి షాక్ అయ్యాను. అయ్యో, ఇదేమి కథ? ఇలాంటి సబ్జెక్ట్స్ తో కథలు రాయచ్చా? అంటూ ఒకటే మథనపడ్డాను. అప్పటికే నేను కవిత్వం అనీ, కథలు అనీ ఏవో రాసేదాన్ని తీరిక దొరికి, రాయాలన్పించినప్పుడు. కానీ అవన్నీ ఒక దారీ తెన్నూ లేని రాతలు.

1982 మేలో సెలవులివ్వగానే మా ఇంగ్లీష్ టీచర్ బార్బరాకి నాగపట్నం చూపించాలనీ, ఇద్దరికీ సరిపోయే డబ్బులిమ్మనీ అన్నాడు మోహన్. అంత డబ్బు నా దగ్గరలేకపోయేసరికి గొడవ మొదలుపెట్టేడు. తిననీయడు. నిద్రపోనీయడు. నాకేమో అందరూ వింటే ఏమనుకుంటారో అని భయం. కొత్తగా కొన్న త్రీ ఇన్ వన్ అమ్మేస్తానని పట్టుకెళ్లిపోయాడు. ఎవరూ కొనలేదు కాబోలు తిరిగి తెచ్చేసి, ఉన్న రెండు గాజులూ ఇమ్మని గొడవ. ఎప్పట్లాగే నేనే ఓడిపోయి రెండు పెద్ద ఉంగరాలు ఇచ్చేసి ఓ నమస్కారం పెట్టేను. సరిగ్గా అప్పుడే నాకు మా ఊరి గ్రంథాలయంలో అలెక్స్ హేలీ ‘రూట్స్’కి అనువాదం ‘ఏడుతరాలు’ దొరికింది. అంతే, అన్నీ మరచిపోయి ఆ పుస్తకంలో మునిగిపోయాను. ఆ ఆఫ్రికన్స్ తో పోల్చుకుంటే నావీ ఒక బాధలేనా? అన్పించింది. బహుశా ఎవరిగాయాలైనా నన్ను నొప్పించేస్థితి అప్పుడే ప్రారంభమైంది. నూతిలో కప్పలాంటి సొంత జీవితం నుంచి విశాలప్రపంచంలోకి దృష్టి సారించడం అలవాటైంది. లైబ్రరీ పక్కనే ఉండడం వల్ల ఆ సంవత్సరాల్లో చాలా పుస్తకాలు చదివేను. చాలా రేడియో నాటకాలు, నాటికలు విన్నాను. ఊళ్లో ఉన్న రెండు థియేటర్స్ తో బాటు కాకినాడ, రాజమండ్రి వెళ్లి మరీ మూవీస్ చూసేను. ఏదో రిలాక్సేషన్ కావాలి అన్పించేది. మోహన్ కి సినిమాల మీద ఇష్టం వల్ల నాకు తోడు వచ్చేవాడు.

‘‘అసూయ – స్వార్థం కల వ్యక్తితో జీవితం జతపడితే ప్రేమ అనేది ఒక ఊబి.

సహృదయం, సంస్కారం కల మనిషితో బ్రతుకు కలిస్తే అది ఒక దీపిక.’’

అంటుంది సులోచనారాణి గారు ఒక నవలలో.

‘ఈ బ్రతుకు నవలకాదు, నాటకం కాదు. యవనిక జారినా కష్టాలు కన్నీళ్లు, మానసిక క్షోభలు అంతం కావు’ అని నేను రాసుకున్నాను. 

1983 జనవరిలో తెలుగుదేశం పార్టీ గెలిచి ఎన్.టి.రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యాడు. స్వతంత్ర్యం వచ్చాక ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కాకుండా వేరే పార్టీ గెలవడం అదే మొదటిసారి.

ఆ ఫిబ్రవరిలో నేను అమితంగా అభిమానించిన సినీనటుడు రాజబాబు, రచయితలు పాలగుమ్మి పద్మరాజు, మాదిరెడ్డి సులోచన కాలం చేసారు. ఆ వార్తలు పేపర్లో చూసి చలించిపోయాను, జూన్ లో శ్రీశ్రీ కూడా వెళ్లిపోయాడు.

‘స్వర్గం – నరకం అనేవి నీ మనస్సులోనే ఇమిడి ఉన్నాయి’ అన్న క్రీస్తు మాటలు; ‘భారతీయులందరూ అనుభవించే వ్యాకులతకూ, అసౌఖ్యాలకూ బీజాలు నాటేది వారి ఊహలు మాత్రమే గాని వాస్తవికత కాదు’ అన్న జనరల్ జార్జిక్రుక్ మాటలు నన్ను చాలా ఆలోచింపజేసాయి. 

1983 లో ఒకరోజు ఉధృతంగా వచ్చిన గాలివానకు మా అమ్మగారింట్లో చిన్నిల్లు పడిపోవడమే కాక, మేం ఉన్న కుప్పయ్యగారింట్లో ఎప్పటిదో పెద్ద బాదంచెట్టు, ఒక కొబ్బరిచెట్టు ఇంటిమీదా, మరో కొబ్బరిచెట్టు కాంపౌండు వాల్ మీదా పడి రెండు గదుల అటక – పెణక; కాంపౌండ్ వాల్ కూలిపోయాయి. ఇల్లు గలవాళ్లకి ఉత్తరం రాస్తే వాళ్లు బాగు చేయించం అనీ, కావాలంటే మమ్మల్ని సొంత ఖర్చుతో చేయించుకోమనీ రాసారు. అది విని మా పెద్ద తమ్ముడు పడిపోయిన ఇంటి నుంచి గేటు వరకూ షెడ్డు కట్టించి ఇస్తానని, దానినీ – వీధిలో ఉన్న నాలుగు గదుల్నీ స్కూలుకి, మథ్యలో ఉన్న ఇంటిని మేముండడానికి వాడుకోగలిగితే వచ్చెయ్యమని అన్నాడు. మా అమ్మనీ, మా చిన్న తమ్ముడి కుటుంబాన్ని తన దగ్గరకే హైదరాబాద్ తీసుకెళ్లిపోయాడు. నేను వెంటనే ‘సరే’ అన్నాను. కుప్పయ్యగారి దగ్గరున్న మా అడ్వాన్స్ తీరిపోయాక 1984 ఆగష్ట్ లో మేం ఇల్లు మారి మా అమ్మ వాళ్లింటికి వచ్చేసాం. అద్దె రెండువందలు నెలకి. 1980 ఏప్రెల్ నుంచి నాలుగేళ్లు పైగా ఉన్నాం కుప్పయ్యగారింట్లో. అంతకు ముందు కొత్తవారింట్లో ఏడేళ్లు. మొత్తం పదకొండు సంవత్సరాల తర్వాత ఆ వీధిని వదిలి వచ్చేసాం. షెడ్డు కట్టించడానికి మా చిన్న తమ్ముడు వచ్చాడు. ఈ లోపల తరగతులకు చోటు సరిపోక పక్కనే ఉన్న కట్టావారి డాబా ఇంటినీ, మరో మూడిళ్లలో గదుల్ని – అరుగుల్ని కూడా అద్దెకు తీసుకోవాల్సి వచ్చింది.

ఆ సంవత్సరం ఒలింపిక్స్ జూలై 29 న అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో ప్రారంభమై ఆగష్టు పదమూడుతో ముగిసాయి. అమెరికా 82 బంగారు పతకాలు గెల్చుకుని రికార్డ్ నెలకొల్పింది.

ఆ ఆగష్టు 16న ఎన్.టి.ఆర్ ను గద్దెదించి నాదెండ్ల భాస్కర్రావు సి.ఎం. అయ్యాడు. మా ఊరితో సహా రాష్ట్రమంతా నిరసనలు ధర్నాలు జరిగాయి. తిరిగి సెప్టెంబరు 16 న ఎన్.టి.ఆర్ గద్దెనెక్కాడు. ఆ అక్టోబర్ 31 న ఇందిరా గాంధీ హత్య జరిగింది. నేనెంతో అబిమానించిన ఇందిరాగాంధీ గురించి చాలా దుఃఖించాను.

నెమ్మదిగా అవకాశం ఉన్నవాళ్లు టీవీలు కొనుక్కోవడం ప్రారంభమైంది. నేను కెల్ట్రాన్ బ్లేక్ &వైట్ టీవీ తెప్పించాను మోహన్ చేత. ఎప్పట్లాగే మూడువేల టీవీ కి ఏడువేల ఐదువందలు తీసుకున్నాడు. అతని కమీషన్ వ్యాపారం అది. పోనీలే, బైటివాడు కాదు కదా అని నేనూ సర్దుకుపోవడం అలవాటు చేసుకున్నాను. ఆ సర్దుకుపోవడం వల్ల నేను ఏం కావాలన్నా అప్పు (బేంకులో) చేసి, కొనాల్సి వచ్చేది.

ఆ సంవత్సరం డిశంబర్ 16 నుంచి 26 వరకూ చేసిన కేరళ ప్రయాణం నేనెప్పటికీ మరచిపోలేనిది. 1969 లో చేసిన వెస్ట్ బెంగాల్ ప్రయాణం తర్వాత మోహన్ పక్కన లేకుండా చేసిన రెండవ ప్రయాణమిది. అప్పటిలాగే ఇప్పుడూ మా పెద్ద ఆడపడుచు రాణితో కలిసి చేసిన ప్రయాణం. ఆ కార్తీకమాసంలో కొండపల్లి వి.టి.పి.ఎస్ ఉద్యోగులు కొందరు అయ్యప్పమాల వేసుకున్నారు. వాళ్లలో రాణి వాళ్లాయన సుబ్బారావు గారొకరు. ఆ గ్రూప్ లో ఉన్న కేరళ నాయరుగారి భార్య రాధ, రాణి, నేను ముగ్గురం ఆడవాళ్లం. ఊరికే ప్రయాణం వరకే మేము. మగవాళ్లు మాత్రం శబరిమలై వెళ్తారట. 15 రోజుల ముందు రాణి ఉత్తరం రాసింది “నువ్వూవస్తావా” అని. నేను వెంటనే జవాబిచ్చాను “వస్తానని”. రాధ, రాణి మంచి ఫ్రెండ్స్.

మా గీత అప్పటికి తొమ్మిదో తరగతి చదువుతోంది. స్కూలు తనకి అప్పగించి బయలుదేరేను.

*****

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.