చిత్రం-33

జాన్ సింగర్ సార్జెంట్

-గణేశ్వరరావు 

          సుప్రసిద్ధ చిత్రకారుడు జాన్ సింగర్ సార్జెంట్ కి ఫ్రాన్స్ లో గోచరో (Gautreau) తో పరిచయం అయింది. ఆమెది అపురూప సౌదర్యం – కొనదేరిన ముక్కు, ఎత్తైన నుదురు, హంసను గుర్తుకు తెచ్చే మెడ, సన్నని నడుము. ఇసుక గడియారం లాంటి వంపు సొంపులున్న ఆకృతి – ప్రతీ చిత్రకారుడికి ఆమె బొమ్మ గీయాలని, పాలరాతిపై శిల్పం చెక్కాలనీ అనిపించేది . సార్జెంట్ ఆమె వ్యామోహంలో పడ్డాడు. ఆమె చిత్రం గీయడానికి అనుమతి అడిగాడు. అప్పటికే ఆమెకి ఒక ఐశ్వర్యవంతుడైన బ్యాంకర్ తో పెళ్లయింది. కాగా సార్జెంట్ ఆమెకి అందంలో తీసిపోడు – ఎన్నో దేశాలు చుట్టి వచ్చిన చిత్రకారుడు, పియానో వాద్యగాడు, నాట్యకాడు, మాటకారి. ముందు ఆమె తల్లి ఒప్పుకుంది. గోచరో ని కొద్దిపాటి అధ్యయనం చేసాక ఆమె చిత్రాన్ని చిత్రించాడు. ఆమె పొడవాటి శాటిన్ లంగా, మెడకు బాగా దిగువగా వెల్వెట్ బాడీ ధరించింది, పల్చని నగ-పట్టీలు తప్పిస్తే భుజాలు నగ్నంగా ఉన్నాయి. తలని కొద్దిగా ఎడమవైపు కి వాల్చింది. ఎడమ చేతితో బట్ట కుచ్చులను పట్టుకుని నడుంపైన వేసింది , కుడి అరచేతిని ముడిచి టేబుల్ కొసను పట్టుకుంది. జుట్టుని పైకి ఎగదోసి వజ్రం తాపిన చిన్న కిరీటంతో అలంకరించింది. అలా ఆ భంగిమలో నిల్చోడం కష్టo , తన ఆకారాన్ని పూర్తిగా చూపరులవైపు తిప్పింది, అపురూపమైన భంగిమ. మడతలు కనబడుతున్న ముదురు నలుపు రంగు దుస్తులు, దీనికి వైరుధ్యంగా – దేదీప్యమానమైన ధవళ వర్ణం లో ఉన్న ఆమె శరీరం. చిత్రంలో కేంద్ర బిందువు – గోచరో, పక్కనే ఆమె కన్నా ఎత్తు తక్కువ ఉన్న టేబుల్, ముందు వైపు లేత తెలుగు-నలుపు రంగుల కుంచె విసురు, వెనక వైపు ముదురు గోధుమ రంగులో గోడ.. కాంతివలయంలో ఉన్న ఆమె.. .

 
          సార్జెంట్ తన చిత్రంలో సున్నితంగా కనబరిచిన రంగుల మేళవింపు, అద్భుతమైన శైలీ విన్యాసం, మార్మికత, ఇంద్రజాలం – 1884 లో Salon చిత్ర ప్రదర్శన లో అందరినీ సమ్మోహింతులని చేసింది. కాగా గోచరో నిల్చున్న భంగిమ, ఆమె కనబరిచిన హావభావాలు, అందం, పొగరు, నిర్లక్ష్యం, లైంగిక ఆకర్షణ అప్పటి ఫ్రాన్స్ సమాజం కి నచ్చలేదు, ఆ అపకీర్తి భరించలేక ఆమె తల్లి ఆ చిత్రాన్ని తొలగించమంది. తర్వాత సార్జెంట్ ఆ చిత్రానికి మేడం X అని పేరు పెట్టి న్యూ యార్క్ మ్యూజియం కు వెయ్యి డాలర్లకి అమ్మేశాడు. 82x 43″, 7′ ఎత్తు ఉన్న ఈ చిత్రం ఒక కుంభకోణానికి దారి తీసినప్పటికీ ప్రపంచ ప్రసిద్ధి గాంచింది.
****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.