ప్రేమంటే!!!

-జయశ్రీ అట్లూరి

ప్రేమంటే!!!
 
రెండక్షరాలే అయినా
జీవితం
జీవితానికి
సంక్షిప్త నిర్వచనం
 
పంచుకునేదే అయినా
పంచేద్రియాలు 
పనిచేయటానికి
బిందు కేంద్రం
 
భావం 
బహుముఖం
వ్యక్తిగతం
అయినా ఏకోన్ముఖం
 
మాట మాధుర్యం
ఛలోక్తులు విసిరే చనువు
కన్నీళ్ళు తుడిచే ఆర్తి
కన్నీళ్ళు పెట్టే ఏకత్వం
 
కళ్ళు మూసుకున్నా
తెలిసే స్పర్శ
ఆద మరవటానికి
నిద్ర పోవటానికి భరోసా
 
నిరాశలో వెన్నుతట్టి
నిలబెట్టే జీవన దీపం
మనసులో స్థిరమైన స్థానం
మరొకరిని నిలపలేని అశక్తత
 
నాకు కావలసింది
ముఖం లేని నా రేఖాచిత్రాన్ని
గోడెక్కించి
ఆరాధించటం కాదు
 
నన్ను గుర్తించే నీచేతిస్పర్శ 
నిన్ను నిలవేసే నా చూపు
నన్ను నిలువరించే నీ విహ్వలత
నీకు నాకు మధ్య మనం చెరిపేసిన గీత
 
మన మనసు లోతుల్లోని
స్వాతి ముత్యపు చిప్ప
అందులో మనం దాచుకున్న
ముత్యం లాంటి ప్రేమ
 
అరిగినకొద్దీ పెరిగేది కాలంతో ఎదిగేది
అనుక్షణం సాన్నిహిత్య సాకల్యం 
మనిషి వదిలిన వాసన మరువలేక
మదిలే మెదిలే మమకారం మరపురాక 
 
పాత బొమ్మను వదలలేని పసివాళ్ళలా
ఒకరు లేని మరొకరు క్షణక్షణం క్షీణిస్తూ 
సూర్యుడితో పాటు వెళ్ళిపోయిన నీడను
వెతుక్కుంటూ బ్రతకటమే ‘ప్రేమంటే’.
 
నాక్కావలసిందదే
స్వగర్వంగా
సమం గా
స్త్రీ గా…

*****

Please follow and like us:

One thought on “ప్రేమంటే!!!”

  1. A very eloquent exposition of ‘Love’ in all its facets. Very profound, yet simple and elegant.
    Reminds what Shakespeare said: ‘It will never age, nor fade, nor die.”

Leave a Reply

Your email address will not be published.