చిత్రలిపి

ఎప్పుడూ అదే కల!

-మన్నెం శారద

నడిరేయి దాటిన ఏ జాముకో
అదాటున ఉలిక్కిపడి నిద్ర లేస్తాను .. ఎవరో తట్టిలేపినట్లు .
 
ఆరుబయట ఆకాశం నేలపై బోర్లించిన బేసిన్ లా!
కాలుష్యాన్ని కడిగి జల్లెడ పట్టినట్లుగా
 
నేలకి జారుతున్న నీలపు రంగు ..
నేల పచ్చని తాకి పసిడిగా మారి మెరుస్తూ !
 
అక్కడక్కడా జారిన నలకల్లా నక్షత్రాలు మిణుకు మిణుకు మని కులుకుతూ ..!
 
ఎక్కడిదో ఒక దివ్యగానం వీనులసోకి
గుండె తంత్రులని మీటుతూ ….రారమ్మని పిలిచిన భ్రాంతి !
 
ఆకస్మాత్తుగా నా భుజాలపై
వీవెనలా విసురుతున్న తెల్లని రెక్కలు !
 
నేల నుండి వికర్షణ పొందిన నా పాదాలు ఆకాశంలోకి దూసుకు పోయి …..
అనంతమైన ఆకాశంలో విహంగమై తేలుతూ నేనూ !
 
తారలు కొన్ని నా తలపై కిరీటంలా .
జలతారు వెన్నెల నా మేనిపై వలువలా .
 
ఒక అదృశ్య స్నేహ హస్తాన్ని అందుకోవాలనే ఆశతో
పైపైకి ఎగసిపోతూ….
 
ఎంతసేపో ఏమోకానీ ..తూరుపు వెలుస్తున్న సంకేతమొకటి అందగానే
తారలు జారుకుంటాయి…..మెల్లిగా మెలిమెల్లిగా…….
 
వెన్నెల వెలిసిపోతుండగా
ఒక లోహపు శకలం లా జారి నేను మళ్ళీ నేలకి అతుక్కు పోతాను
నిస్సత్తువగా ……………….
 
ఒకముళ్ళ కిరీటాన్ని నెత్తికెత్తుకుని ..తిరిగి నా తలగడపై!
ఎక్కడివో రెండు నక్షత్రాలు కంటికొసలలో ఇరుక్కుని
కాంతిని స్రవిస్తూ …
మళ్ళీ రేపటి కలకై వేచి చూస్తూ !!!
****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.