ఈ ‘హైందవ రాజ్యం’ లోకి ఎట్లా చేరాం?- పుస్తక పరిచయం

పుస్తకాలమ్’ – 6

(ప్రపంచవ్యాప్త సాహిత్యాన్ని పరిచయం చేసే ఎన్.వేణుగోపాల్ పుస్త’కాలమ్’ )

  -ఎన్.వేణుగోపాల్

          “మత నిరపేక్ష రాజ్యం” స్థితి నుంచి “అధిక సంఖ్యాక మత రాజ్యం” స్థితికి, “లౌకిక రాజ్యం” అనే రాజ్యాంగబద్ధ ఆదర్శం నుంచి నగ్నమైన హైందవ రాజ్యం (అంటే నిజానికి బ్రాహ్మణ్య, వర్ణాశ్రమ ధర్మ రాజ్యం) అనే వక్రీకరణకు మన దేశం ఎలా దిగజారిందనేది ఆలోచనా పరులందరినీ కలవరపరుస్తున్న ప్రశ్న. మరీ ముఖ్యంగా సంఘ పరివారానికి దేశ రాజకీయాలలో నానాటికీ పెరిగిపోయిన ఆధిపత్యం, చివరికి అది నరేంద్ర మోడీ – అమిత్ షా ల వ్యక్తిగత, హింసాత్మక ఆధిపత్య రూపంలో వ్యక్తీకరణ పొందడం లోతుగా చారిత్రక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయార్థిక విశ్లేషణ చేయవలసిన అంశాలు. ఆ బృహత్తరమైన విశ్లేషణలో కొన్ని కోణాలు వదిలేసినప్పటికీ, మన హైందవ రాజ్యం విస్తరణకు ఉన్న కొన్ని ముఖ్యమైన కోణాలను విస్తారమైన సమాచారంతో కలిపి విశ్లేషించిన ఆకార్ పటేల్ రచన ‘మన హైందవ రాజ్యం’ దేశ పరిణామాల గురించి తీవ్రంగా ఆలోచిస్తున్న, ఆందోళన పడుతున్న వారందరూ తప్పనిసరిగా చదవవలసిన పుస్తకం.

          పాత్రికేయుడు, పత్రికా రచయిత, అనువాదకుడు, గుజరాత్ మారణకాండ మీద పుస్తక సహ రచయిత ఆకార్ పటేల్ సంఘ్ పరివార్ విష విద్వేష రాజకీయాలను నిరంతరం ప్రశ్నిస్తున్న విమర్శకుడిగా తెలుగు పాఠకులకు కూడా పరిచయమే. ఆ విమర్శ వల్ల విపరీతంగా నిందలకు, ట్రోలింగ్ కు, ప్రభుత్వ సంస్థల నుంచి వేధింపులకు గురి కావడం కూడా చాలా మందికి తెలిసిందే.

          ఆయన రాసిన Our Hindu Rashtra: What It Is. How We Got Here గత డిసెంబర్ లో వెస్ట్ లాండ్ ప్రచురణగా వెలువడింది. ఇది అత్యవసరంగా తెలుగులోకి రావలసిన పుస్తకమే గాని, మామూలుగా తెలుగు ప్రచురణ రంగ ప్రమాణాలతో పోలిస్తే ఇంగ్లిష్ లో వెలువడిన తొమ్మిది నెలల్లోనే తెలుగులోకి వచ్చిన పుస్తకాలు తక్కువే. కాని ఈ పుస్తకం చదవగానే డా. చెలికాని స్టాలిన్ గారు ఇది వెంటనే తెలుగు పాఠకులకు అందుబాటులోకి రావాలనుకున్నారు. తెలుగు అనువాదానికి ఎ. గాంధీ గారిని సంపాదకుడిగా ఎంచుకుని, పద్నాలుగు అధ్యాయాల పుస్తకాన్ని పదకొండు మంది అనువాదకులతో తెలుగు చేయించి డా. చెలికాని రామారావు మెమోరియల్ కమిటీ తరఫున సెప్టెంబర్ కల్లా ప్రచురించారు. తెలుగు పుస్తకానికి ఖరీదు కూడా పెట్టకుండా చదివేవారందరికీ, ఎవరు చదవడం అవసరమని తాను అనుకుంటున్నారో వారందరికీ అందజేస్తున్నారు.

          ఈ పుస్తక రచనకు ఆకార్ పటేల్ ఎంచుకున్న నిర్మాణం విశిష్టమైనది. దేశ విభజన గురించి ఒక పరిచయ వ్యాసం తర్వాత, ఆయన నేరుగా భారత రాజకీయ చరిత్రలోకి, అది హైందవ రాజ్యంగా ఎలా మారుతూ వచ్చిందనే వివరాలలోకి వెళ్లలేదు. ఆ విషయాలలోకి వెళ్లే ముందు, రెండు అధ్యాయాలు – దాదాపు యాబై పేజీలు, మొత్తం పుస్తకంలో ఆరో వంతు – పాకిస్తాన్ రాజకీయ చరిత్రను వివరించారు. ఇది ఒక అద్భుతమైన ఎత్తుగడ. మామాలుగా పాకిస్తాన్ మతరాజ్యమనీ, భారతదేశం మతాతీత రాజ్యమనీ ఒక అపోహ, తప్పుడు అవగాహన మన విద్యావంతులందరి లోనూ సాధారణ లోకజ్ఞానం స్థాయిలో ఉంది, ఉంటుంది. కనుక ఆయన మొదట ఒక “మతరాజ్యపు” ఏడు దశాబ్దాల ప్రయాణాన్ని మన కళ్ళ ముందు పరిచి, ఆ తర్వాత రెండు వందల యాబై పేజీలలో ఆ మతరాజ్యపు పరిణామాలూ, మన “మతాతీత రాజ్యపు” పరిణామాలూ ఎంతగా సరిసమానంగా, సమాంతరంగా సాగుతూ వచ్చాయో వివరించి మన “లౌకికత్వం” ఎంత డొల్ల సరుకో చూపారు.

          ముందుగా పరిచయంలో “పొరుగున ఉన్న దేశాల కంటే మన దేశంలో అధిక సంఖ్యాకుల ఆధిపత్యం అనేది భిన్నంగా జరిగింది. కాని, పర్యవసానంలో మాత్రం తేడా లేదు” అనే అవగాహనను అందించడానికి చాల వివరాలు, గణాంకాలు, చారిత్రక, సామాజిక ఘటనలు, వ్యక్తుల జీవిత పరిణామాలు ఎన్నో ప్రదర్శించారు. ఇది ప్రధానంగా హైందవ రాజ్యం గురించి చర్చించే పుస్తకం గనుక హిందుత్వను అనేక కోణాల నుంచి వివరించి, హిందుత్వ అనేది ఎలా భారతీయ జనతా పార్టీలో విడదీయరాని అంతర్భాగమో చూపారు. “అదొక నిశ్చిత భావజాలం. ఇంకా సరిగ్గా చెప్పాలంటే అదొక నిశ్చిత దురభిమానం. అది అల్ప సంఖ్యాకులకూ ముఖ్యంగా ముస్లింలకూ వ్యతిరేకమైన నిశ్చితమైన దురభిప్రాయం… బిజెపి మార్చుకోని విషయం ఒకటే ఉంది. అది మైనారిటీల వ్యతిరేకతపై ఆధారపడిన ఎజెండా. హిందూత్వ హృదయ పీఠాన్ని అలంకరించింది అదే” అన్నారు.

          పరిచయం తర్వాత మొదటి అధ్యాయం ‘ఆవేశరహితంగా దేశ విభజన గురించి’. దేశ విభజన భావనలు, ద్విజాతి సిద్ధాంతం, మతాన్ని రాజకీయాలను కలపగూడదని జిన్నా తొలిరోజుల్లో చేసిన వాదనలు, లాలా లజపతిరాయ్, ఆ తర్వాతి కాంగ్రెస్ నాయకుల వాదనలు వంటి ఇరవయో శతాబ్ది తొలి అర్ధభాగం చరిత్రనంతా సింహావలోకనం చేసి చరిత్రకారుడు కె కె అజీజ్ చూపిన ఒక కఠోర వాస్తవాన్ని ఉటంకించారు: 1858-1940 కాలంలో ముస్లింలకు ఒక వేరే దేశం ఉండాలని వచ్చిన మొత్తం 56 ప్రతిపాదనల్లో 34 ప్రతిపాదనలు ముస్లిమేతరులు చేసినవే. చివరికి దేశ విభజన ప్రతిపాదన తీవ్రాతితీవ్రంగా చర్చకు వచ్చిన 1931-40 కాలలో వచ్చిన మొత్తం 33 ప్రతిపాదనల్లో 18 ప్రతిపాదనలు ముస్లిమేతరులవే. అంటే మామూలుగా జరుగుతున్నట్టుగా దేశ విభజన నెపం పూర్తిగా ముస్లింల మీదికి నెట్టివేయడానికి వీలులేదు. అందులో ఇతరుల పాత్ర, ప్రధానంగా ఆధిపత్య రాజకీయాల పాత్ర ఉంది. ఈ చారిత్రక వివరణ ఆధారంగా “ఒక వ్యక్తి ఆకస్మిక అభిమతం వల్ల గాని, ఒక పార్టీ బలహీనత వల్ల గాని, భారత మాతను విభజించి పాకిస్తాన్ ను ఏర్పాటు చేసుకోవాలని ముస్లింలు కోరుకోవడం వల్లగానీ జరిగింది కాదు. ప్రపంచంలోని అతి పెద్ద మత మైనారిటీకి రాజకీయ హక్కులు కల్పిస్తూ అధికారాన్ని పంచుకునే యంత్రాంగాన్ని నెలకొల్పుకోలేని కాంగ్రెస్ నాయకత్వంలోని భారతీయ హిందువుల వైఫల్యమే దేశ విభజన ఘట్టం చాటింది” అని నిర్ధారించారు.

          ఆ తర్వాత రెండు అధ్యాయాలు – జిన్నా కట్టిన ఇల్లు, ఇంటిని తగులబెట్టుకున్నారు – పాకిస్తాన్ ఎంచుకున్న మతరాజ్యం ఆ దేశపు రాజకీయ, సామాజిక వ్యవస్థలలో ఎటువంటి కల్లోలాన్ని సృష్టించిందో, ప్రజా జీవితాన్ని ఎలా అల్లకల్లోలం చేసిందో వివరాలు ఇచ్చారు.

          ఈ పునాది మీద భారత రాజకీయాల పరిణామ క్రమాన్ని అధ్యయనం చేయడం ఆసక్తికరంగా ఉంటుంది. సంస్కృతి, మతం, జాతీయత, హిందుత్వ వంటి భావనల పట్ల సంఘ్ పరివార్ ఆది గురువులైన దీన్ దయాళ్ ఉపాధ్యాయ, ఎం ఎస్ గోల్వాల్కర్, వినాయక్ సావర్కర్ ల ఆలోచనలనూ, కార్యాచరణలనూ వివరంగా చూపుతూ ఎంతగా ‘హిందుత్వపు గందరగోళ మంత్రాలు’ రానున్న హైందవ మత రాజ్యానికి మార్గాన్ని సుగమం చేశాయో చూపారు. ఈ కాలంలోని జనసంఘ్ నుంచి 1970ల జనతా పార్టీ ప్రయోగం తర్వాత రూపొందిన భారతీయ జనతా పార్టీ వరకూ జరిగిన పరిణామాన్ని ‘అప్పుడొచ్చాడు అద్వానీ’ అధ్యాయంలో వివరించారు. ఈ స్థూల వివరణ తర్వాత బుజ్జగింపు సిద్ధాంతం; మత విధేయత; ముస్లింలను ఘెట్టోలకు, వెలివాడలకు పరిమితం చేయడానికి జరిగిన ప్రయత్నాలు; న్యాయవ్యవస్థ, ముఖ్యంగా సుప్రీం కోర్టు హిందుత్వ వాదులకు లొంగిపోయి, తప్పుడు తీర్పులు ఇవ్వడం; బాబ్రీమసీదు వివాదం; ట్రిపుల్ తలాక్; కశ్మీర్; గోరక్షణ కపట రాజకీయాలు వంటి సంఘ పరివారపు, హిందుత్వపు ప్రధాన అంశాలన్నిటినీ ఒక్కొక్క అధ్యాయంలో విశ్లేషించారు. 

          చివరికి, ఎలా ఎదుర్కోవాలి అని కొన్ని సూచనలు చేశారు. పౌర సమాజ సమీకరణ, ప్రతిఘటన మాత్రమే ఈ హిందుత్వ విస్తరణను అడ్డుకోగలదని ఆశాభావంతో ముగించారు. 

          ఆకార్ పటేల్ చేసిన సూత్రీకరణలన్నిటితో ఎవరైనా ఏకీభవించవచ్చు, విభేదించవచ్చు. కాని ఆధునిక భారత చరిత్రలో ఆధిపత్య, అధిక సంఖ్యాక మతతత్వం పెరుగుదల గురించి అన్వేషించడానికి, విశ్లేషించడానికి జరిగిన ఒక లోతైన, విస్తారమైన ప్రయత్నంగా ఈ పుస్తకాన్ని సగౌరవంగా ఆహ్వానించవలసి ఉంది. తీవ్రంగా అధ్యయనం చేసి, చర్చించి, ఈ అవగాహనలను మరింత పరిపుష్టం చేసి, విస్తృతంగా ప్రచారం చేయవలసి ఉంది.

          ఈ పుస్తకంలోని అవగాహనలతో, చరిత్ర వివరణతో, విశ్లేషణలతో నాకు భిన్నాభిప్రాయాలు లేవని కాదు. మొట్టమొదట మతతత్వం గురించి చర్చించిన ఈ పుస్తకం లౌకిక వాదాన్ని నిర్వచించడంలో స్పష్టంగా లేదు.  ఫ్రెంచి విప్లవం నాటి నుంచి యూరప్ ఆలోచనా ధోరణిలో వికసించిన లౌకికవాదం మతానికి రాజకీయాలతో, విద్యతో, పాలనతో, మొత్తంగా విశాల సామాజిక జీవనంతో సంబంధం ఉండగూడదని, ఆ సంబంధం వ్యక్తిగత స్థాయికి మాత్రమే పరిమితం కావాలని నిర్దేశించింది. కాని ఆధునిక భారత రాజకీయ నాయకులందరూ ఆ మత రాహిత్యాన్ని, మతాతీత స్థితిని, సర్వమత సమభావం అని తలకిందులుగా నిర్వచించారు. అన్ని మతాలకూ సమాన దూరం అంటూ అధిక సంఖ్యాక మతానికి దాసోహం అన్నారు. ఆ తప్పుడు నిర్వచనపు విష ఫలితాలను ఇవాళ భారత సమాజం అనుభవిస్తున్నది. ఈ దిశగా పుస్తకం ఆలోచించలేదు.

          రెండు, హిందుత్వ రాజకీయాల విస్తరణకు ఉన్న మత కోణాన్ని చాలా వివరంగా అనేక వైపుల నుంచి చర్చించారు గాని, అంతకన్న ముఖ్యమైన రాజకీయార్థిక, సామాజిక, సాంస్కృతిక కోణాల చర్చ వైపు పోలేదు. అలా చర్చిస్తే ఈ మతతత్వానికి, హిందుత్వకు ఉన్న వర్గ పునాది కూడా బైటపడి ఉండేది. “హిందుత్వకు కావలసింది ఫాసిజం కాదు, కాపిటలిజం కాదు, సోషలిజం కాదు” అనే అమాయక వ్యాఖ్యతో హిందుత్వకు ఉన్న ఆధిపత్య కుల, ఆధిపత్య మత, భూస్వామ్య, సామ్రాజ్యవాద, దళారీ పెట్టుబడిదారీ అనుకూల దృక్పథాన్ని వెలికి తేలేకపోయారు.

          మూడు, హిందుత్వ విస్తరణలో సంఘ్ పరివార్ పాత్ర చాల చర్చకు వచ్చింది గాని, ఆ సమయంలోనే చర్చించవలసిన కాంగ్రెస్ పాత్ర, పార్లమెంటరీ రాజకీయాల పాత్ర అంతగా చర్చకు రాలేదు. వచ్చిన దగ్గర కూడా లోతుకు పోకుండా భారతీయ జనతా పార్టీ తప్ప మిగిలిన పార్టీలలో హిందుత్వ తక్కువ అన్నట్టుగానో లేదన్నట్టుగానో వ్యాఖ్యలున్నాయి. అది వాస్తవం కాదు.

          ఇక తెలుగు పుస్తకంలో అనువాద సమస్యలు చాలా ఉన్నాయి. వేరు వేరు అనువాదకులు వేరు వేరు అధ్యాయాలు అనువదించినందువల్ల ప్రమాణాల మధ్య, భాషా వినియోగం మధ్య, శైలి మధ్య కొట్టవచ్చినట్టు కనబడే భేదాలున్నాయి. కొందరి అనువాదాలు మరింత బాగా ఉండే అవకాశం ఉండింది. కొన్నిచోట్ల తప్పు అనువాదాలు, పదాలూ, వాక్యాలూ తప్పిపోవడం, మూలంలో లేని పదాల ప్రయోగాలు, అన్వయం కుదరని వాక్య నిర్మాణాలు, ‘మరియు’ వంటి అనవసర ప్రయోగాలు, మూలంలోని ఉటంకింపుల చిహ్నాలు లేకపోవడం వంటి లోపాలు వచ్చాయి. 

          ఈ లోపాలు ఉన్నప్పటికీ ఇవాళ్టి పరిస్థితుల్లో అత్యవసరమైన, అందరూ చదవవలసిన పుస్తకం ఇది.

****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.