తెలియనిదే జీవితం

-చందలూరి నారాయణరావు

మనిషో పుస్తకం
మనసో నిఘంటువు
గుంపుగా చేరితే గ్రంధాలయమే.
ఎప్పుడు తెరుచుండె సందడే.

చదువుకుపోతుంటే
కలిసేది ఎందరి ఆలోచనలనో!
ఏరుకుపోతుంటే
దాచుకునేది మరెందరి అనుభవాలనో!

ఎంత చిన్న పుస్తకమైనా
ఎంతో కొంత వెలుగే.
ముద్రించిన అనుభావాలను
చదువుతుంటే  సంతోషమే.

కొన్ని గొప్ప గ్రంధాల్లో
ప్రతి ఘట్టం ఆమోఘమే
ప్రతి మలుపు ఆశ్చర్యమే
అనుసరించాల్సిన యోగ్యాలే.

కొన్ని దినపత్రికల్లో
పొట్టి బాధలు, పొడుగు కన్నీళ్ళు
ఊరిని అద్దంగా చేసి పచ్చి వింతలను
వేడిగా చూపించే అక్షరాల సందడి.

కట్టలు కట్టలుగా పుస్తకాల్లో
బారులు తీరిన బతుకులు
గుట్టలు గుట్టలుగా విషయాల్లో
తీరని ఆశల ఆవేశాలు..

చదువుతున్నది తలచుకుంటే
తెలుసుకున్నది తలపుకొస్తే
మనిషన్నది  ఒక చిత్రం
మనసన్నది మరో చిత్రం.

బతుకు బతుకో పుస్తకం.
ఒక్కో అనుభవం ఒక్కో పేజీ.
ఏ పేజీలో ఏముందో
పక్క పేజీకి తెలియనిదే జీవితం.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.