పట్టించుకోనింక!!

-సుభాషిణి ప్రత్తిపాటి

గుచ్చే ఎగతాళి చూపుల ముళ్ళు,
పడదోసే అడుసులాంటి మాటలు
అన్నీ దాటుకుంటూ…నన్ను
చేరిన గెలుపు పిలుపు నాకేం కొత్తకాదు.
ఏళ్ళ తరబడి పాతుకుపోయిన అహం,
తుఫాన్ లో ఊగే ఊడలమఱ్ఱి లా
మహోగ్రంగా మాటలతో విరుచుకుపడ్డా..
నిబ్బరంగా ఎదిగే నాపై పిడుగై కురవాలనుకున్నా…
కలతల కన్నీళ్ళను కవితల్లో నింపుతూ కదిలే నాకు 
నువ్వేంటనే ….కుఱచ సంబోధన కొత్తగా అనిపించదు.
నా ఆలోచనాలోగిలి అనంతాకాశమై..
రెక్కలు చాచిన కొద్దీ సరిహద్దులు లేని విశ్వం నన్ను తనలోకి 
ఆహ్వానిస్తుంటే….
నన్నింకా సగమంటూ పెట్టే పెనుకేకలు పాతాళంనుంచి వినబడుతున్న భావన…
నా చూపంతా విశ్వైక్యం పైనే…
ఆ పిలుపుల పిపీలికాల్ని పట్టించుకోలేనింక!!!
 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.