చిత్రలిపి

నన్ను నాకు వదిలేయండి …

-మన్నెం శారద

అవును ….మీరు విన్నది  నిజమే …
దయచేసి  నన్ను నాకు వదిలేయండి !
 
తెలతెలవారుతూనే  తెగ పనులున్నట్లు 
ప్రొద్దుకుంకేవరకు పడీ పడీ విన్యాసాలు చేస్తూ 
ఇన్నిరోజులు ఆకాశ సంద్రంలో ఈదులాడేను !
 
ఇప్పుడారెక్కలు సత్తువ ఉడిగి చతికిలపడ్డాయి 
రంగురంగు ఈకలు పాలిపోయి నేలకు జారుతున్నాయి 
 
ఇప్పుడే రెక్కలొచ్చి  వాటికి రంగులొచ్చిన 
వయసొచ్చిన వన్నెలాడి  పిట్టలు  కొన్నినన్ను  చూసి 
ఇక్కడున్నావా అంటూ 
ఎకసెక్కాలాడుతూ  కారుకూతలు కూస్తూ 
కిందామీదకు  పల్టీలు కొడుతూ తిరుగుతున్నాయి 
 
నాకునిజంగా  నవ్వొస్తుంది 
 
ఆ వయసు దాటొచ్చిన దాన్ని కాదా నేను ??
పుట్టబోయే బిడ్డల కోసం మూతి ముక్కలు చేసుకుని 
రెక్కలు సాచి ఎగిరి ఎగిరి పుల్లా పుడక ఏరి గూళ్ళు కట్టి సాకిన వైనం 
ఇప్పుడెవరికి  గుర్తు !
పోనివ్వు  
 
ఇప్పుడిక  ఈ ఆఖరి మజిలీలో  …
చేరవలసిన చోటుకే చేరుకున్నాను 
 
ఆకాశపు వడిలో  ఆకుపచ్చని తోటలో  ఏటి ఒడ్డున 
చివరి మలుపులో  చింతలుడిగి  సేద తీరుతున్న  నన్ను 
దయచేసి నా దారికి నన్ను వదిలేయండి !
మీ పిలుపులరొదతో నాకు తపోభంగం చేయకండి !

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.