కనక నారాయణీయం -33

పుట్టపర్తి నాగపద్మిని

          ‘ఉపనయనం (వడుగు) కాకుండా, గాయత్రీ తోడు లేకుండా ఇటువంటివి శాక్తేయ మంత్రాలు చేయకూడదు. ప్రమాదం. నీవు మా మాట వినకపోతే, మీ అయ్యగారికి చెప్పేస్తాం, అని కూడా బెదిరించినారు. (నవ్వు).’ దీనితో భయపడి మానుకున్నా!! ‘

          భళ్ళున నవ్వేశారు పుట్టపర్తి. ఆయన నవ్వులో తనగొంతూ కలిపిన వాట్కిన్స్ గబుక్కున అడిగాడు.

          ‘ఇవన్నీ సరే స్వామీ, మీతో ఉన్న చనువు కొద్దీ మిమ్మల్ని ఒకమాట అడగాలని ఉంది. మళ్ళీ తిట్టరు కదా?’ వాట్కిన్స్ ఆగిపోయాడు.

          ‘ఒరే వాట్కిన్స్!! నిన్నెందుకు తిడతాను?? ఇక్కడున్న అందరిలోకీ, నీ మనసు చాలా నిర్మలం. అందుకే నీతో మాట్లాడుతుంటా!! పైగా విద్యార్థి దశలో నా అభిమాన గ్రంధం బైబిల్ తెలుసా?? తిరుపతి ఓరియెంటల్ కళాశలలో చదీవేటప్పుడు, అందరూ సంస్కృత పాఠాలు వల్లె వేస్తుంటే, నేను బైబిల్ చదువుకుంటూ కూర్చునేవాణ్ణి. అందులో ఏముందో కనుక్కోవాలని!! ఈ కుహనా సంప్రదాయ0 నాకు నచ్చదు. పిలకలు ధరించి పొద్దున్నే, ఒంటినిండా పట్టేనామాలు పెట్టుక్కుని, నేను పరిశుద్ధుడనైనాను అనుకోవటం కాదు. మనసును, నిర్మలంగా వుంచుకోవాలె!! నీలో నాకది కనిపించింది. నువ్వేమీ మొహమాటపడకుండా అడుగు.’ అన్నారు వారు.

          ‘ఎంత మాట స్వామీ!! మీ గొప్పదనం ముందు నేనెంత, నా ఉద్యోగమెంత?? అడగమన్నారు కాబట్టి ధైర్యం చేసి అడుగుతున్నా!! మీరిక్కడి నుంచీ సినిమా రంగానికి వెళ్ళిపోతున్నారని ఇక్కడి పండితులంతా చెవులు కొరుక్కుంటున్నారు. నిజమేనా స్వామీ??

          అతని మాటలు సావధానంగా విన్న పుట్టపర్తి, మొహంలో చిరునవ్వు.

          ‘ఐతే, యీ సంగతి ఇక్కడిదాకా వచ్చిందన్న మాట!! ఉన్నమాటేమిటంటే ఇటీవల, నెల్లూరుకు నేను ఎక్కువగా వెళ్ళివస్తున్నాను.అక్కడ మంచి సాహిత్యాభిమానులున్నారు. 1958లో నెల్లూరు టౌన్ హాల్ల్ లో నన్నయ జయంతి నాడు, తిక్కవరపు రామి రెడ్డి పురస్కారాన్ని అందుకున్నాను. పెన్న నీరు నాకు చాలా ఇష్టం రా!! ఆ తీయదనం ముందు, గోదావరి రుచులు తేలిపోవూ?? అందుకే అన్నాను శ్రీపాద గోపాలకృష్ణమూర్తి గారి ముందే ఒక ఆశువులో , ‘నీవి పైపైని రుచులు గోదావరమ్మ!!’ అని!! ఆయన కూడ దానిలోని స్వారస్యానికి ముగ్ధుడై, నన్ను మెచ్చుకున్నారు. పైగా నా శివతాండవానికి గొప్ప పీఠిక కూడా వ్రాసినాడు కూడా!! అప్పట్లో ఆయన నెల్లూరు బీయీడీ కాలేజీ ప్రిన్సిపాల్. ‘

          ఔనా స్వామీ?? పెన్న నీరు అంత తియ్యగా వుంటుందా??

          ఆస్వాదించ గలిగే మనసుండవలె  గానీ, పెన్న నీళ్ళకేమిరా?? అందుకే అన్నాను నా మేఘ దూతంలో,

గంగలో తానమ్ము

తుంగలో పానమ్ము

పేరుగనె భారతము నందూ

యీ రెండు గలవు గుణములు పెన్నయందూ

తిక్కన్న

కవి కలంబంతగా గముచుటలు పొలపంబు

పెన్న గట్టున బ్రదికి పలికిన యదృష్టాన!!

అని !! పెన్నదాటితే కదా పెరుమాళ్ళు సేవ..’ అని సామెత ఉంది విన్నావా!! అంటే పెన్న నది ఇప్పటివలె కాదు, ఎంతో పెద్ద నది అప్పట్లో!! దాన్ని దాటడమంటె చాలా కష్టం అని ధ్వనిస్తున్నది కదా ఇక్కడ!! ఈ పెరుమాళ్ళెవరు?? రంగనాథ స్వామి!! నెల్లూరులో పెన్న ఒడ్డున రంగనాథస్వామి ప్రాచీన దేవాలయం చూసి తీరవలె!! పెన్న తీరాన ఆ గుడిలో దైవ దర్శనం!! మహద్భాగ్యం తెలుసా?? అదలా వుంచితే, అక్కడి వాళ్ళకు నా శివతాండవం అంటే పిచ్చనుకో!! ఎన్ని సార్లు విన్నా మళ్ళీ వినిపించమని బ్రతి మాలుతారు!! పైగా అభినయించమంటారు!! చిన్న వయసులో బాగా నృత్యం చేస్తూ, అవసరమైన చోట వివరణలిస్తూ చదివేవాణ్ణి!! మొన్నొకసారి నా బిడ్డతో కలిసి కొన్ని ముద్రికలూ వాటిని చూపిస్తూ శివతాండవ గానం చేసి వచ్చినాను. బెజవాడ గోపాల రెడ్డి గారిగురించి చెప్పేదేముంది!! ఠాగూర్ గురించి వారి మాటల్లో వింటుంటే సమయం తెలియనే తెలియదు. ఇక మరుపూరు కోదండ రామిరెడ్డి మాటల్లో నెల్లూరు మాండలికం విని తీరాలప్పా!! నేల నూతల కృష్ణ మూర్తిగారని, ఒక లాయర్. ఎంత గొప్ప లాయరో అంత గొప్ప సాహిత్య నిరంతర పఠనాభిలాషి. వారి శ్రీమతి పార్వతమ్మ కూడ తులసీదాసు ఉపాసకురాలు. గోసుకొండ వెంకట సుబ్బయ్య తెలుగు పండిట్. వీరంతా చాలా ఆప్తులు నాకు. నెల్లూరును విక్రమ సింహపురి అనేవారు పాతకాలంలో!! ఆ పేరుతోనే నెల్లూరు జిల్లా పరిషత్ వారు వెలువరించిన విక్రమ సింహపురి సర్వస్వం లో గోపీనాథ వెంకటకవి గురించి ఒక పెద్ద వ్యాసం కూడా వ్రాశాను. ఇట్లా పలుమార్లు నెల్లూరికి వెళ్ళి వస్తున్నాను కదా!! ఒక సారి, నెల్లూరు వాస్తవ్యులు సోమిసెట్టి నరసింహ గుప్త గారితో పరిచయమైంది. ఆయన ఒక సినీ నిర్మాతట!! హిందీ నుండి, మహరధి కర్ణ ‘ అన్న సినిమాను తెలుగులోకి డబ్బింగ్ చేయించవలెనని ప్రయత్నం చేస్తున్నాడంట!! అనువాదం పనులు సాగుతున్నాయట!! తుమ్మలపల్లి రామలింగేశ్వర రావు గారని, మరో విద్వాంసుడు కూడ అనువాద విభాగంలోనే పనిచేస్తున్నాడట!! ఈ పని సరిగా జరుగుతున్నదా లేదా, పాటలూ వంటివి లిప్ సింకింగ్ కి సరిపోయే విధంగా వున్నాయా లేదా అని పర్యవేక్షణ చేయమని, అడిగించినాడు, వీళ్ళతో!! నా జీవితమంతా ప్రయోగాలే కదా!! ఈ రంగం కూడా ఎట్లా వుంటుందో చూద్దామని, ఇష్టం లేకున్నా ఒప్పుకున్నా!! సినిమా అంటే పెద్ద మాయాలోకం కదా!! నాదంతా సాహిత్య లోకం!! దీనికీ దానికీ చుక్కెదురు!! అప్పుడప్పుడూ పోయి ఆ పని చూసి వస్తున్నాను. ఎప్పటిదాకా చేస్తానో ఏమో!! ఐనా నా గురించిన విషయాలన్నీ చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటున్నట్టున్నారు, ఇక్కడి విద్వాంసులంతా !! నిన్ను అడిగి తెలుసుకోమని పురమాయించినారా ఏమిరా??’ పుట్టపర్తి మొహంలో చిరునవ్వు.

          శ్రద్ధగా వారి మాటలను వింటున్న వాట్కిన్స్ యీ మాటలో భయపడిపోయాడు. ‘ఎంత మాట స్వామీ!! నన్ను వాళ్ళ ఏజెంట్ అనుకుంటున్నారా?? లేదు లేదు. నేనే ఆ నోటా యీ నోటా యీ మాట విని అడిగినాను – ఉత్సాహంతో!! ఐనా వేరేవాళ్ళు మనలను గమనిస్తున్నారంటే, గర్వపడాల్సిందే కదా!!’

          ‘నా పాండిత్యాన్ని గమనిస్తే మంచిదే కానీ, నా వ్యక్తిగత వ్యవహారాలను కూడా గమనించడం నాకు నచ్చదురా.’

          బెల్లు మోగడంతో, వాట్కిన్స్ సెలవు తీసుకున్నాడు. లంచ్ బెల్ కావటంతో పుట్టపర్తి కూడా సాపాటు చేయటం కోసం మోచంపేటలోని తమ ఇంటిదారి పట్టారు.

***

          ఉత్తరాభిముఖంగా వరుసగా నాలుగు గదులున్న ఆ మట్టి గోడల ఇంట్లో, దక్షిణం చివర వంటిల్లు. ఆ గది దాటితే, నైఋతి వైపు నుండీ, ఇంటి పైకి వెళ్ళే మెట్లు. వంట గదిని అనుకుని ఉత్తరం వైపుకు వరసగా రెండు చిన్న గదులు. ఆ రెండో గది నుండే, తూర్పు వైపు కి ముఖ ద్వారం. ఆ గది తరువాత, ఉత్తరానికి ఓ మోస్తరు పెద్ద గది. ఉన్న ఆ ఇంట్లో, చివర ఉన్న పెద్ద గది. అందులో, నిండుగా పుస్తకాలతో, మూడు నాలుగు చెక్క బీరువాలు! ఓ వైపు, కరణం బల్ల !! దానికి అటు వైపు గంభీర ముద్రలో, ఆలోచనాలోచనాలతో పుట్టపర్తి !! ఇటువైపు, అంతకంటే గంభీరంగా, వారి నోట్లోంచీ, యే మాటవచ్చినా, అక్షరబద్ధం చేసేందుకు సంసిద్ధంగా, కాగితాలూ, ఇంకు పెన్నులతో మా అమ్మో, మా అక్కయ్యలో!! అయ్య (పుట్టపర్తి )ఇంట్లో ఉన్నారంటే, అంతా నిశ్శబ్దం. వారి మూడ్ చెడిపోకూడదు మరి!! అయ్య ప్రతి రోజూ సాయంత్రాలు రామకృష్ణ సమాజం, విద్యోదయ బుక్ స్టాల్, వెంకట్రామ బుక్ స్టాల్ వైపు వెళ్ళేవాళ్ళు. ఈ లోగా ఎవరైనా వచ్చి, వారి కోసం అడిగితే, ‘ మా అయ్య పేటలోకి పోయినారు..’ అని సమాధానం చెప్పమనేదమ్మ!! ( అప్పటికి నాకు ఓ ఏడెనిమిదేళ్ళుంటాయేమో, అక్కడికి ఒక కిలోమీటర్ దూరంలో సీతారామయ్య వీధి బడిలో రెండో మూడో క్లాస్ చదువుకుంటూ ఉండేదాన్ని) మా ఇంటి అలవాటు ప్రకారం పేట అంటే, బజారులోకి అన్న అర్థమన్న మాట!!

          మేము బాడుగకుండే ఆ మట్టి గోడల ఇంట్లో కరెంటూ లేదప్పట్లో!! కిరోసిన్ దీపాలే!! చెప్పాగా…వాటిని రెండ్రోజులకోసారి తుడిచే పని, మా అక్కయ్యలతో పాటూ నాకూ పడేది.

          ఆ వీధిలోనే తరతరాలుగా స్థిరపడిన పేరుమోసిన లాయర్ నరసరామయ్య గారి పేరుతోనే ఆ వీధి పిలువబడేది. దాదాపు వెయ్యి గజాల స్థలంలో…వీధి కంటే ఆరడుగుల ఎత్తులో చాలా హుందాగా…పేద్ద వరండా. అందులో ఓ ప్రక్క పేద్ద చెక్క ఉయ్యాల. ఆ ఉయ్యాలపై, ఎప్పుడూ కిల కిలా నవ్వుతూ ఆడుకునే నా వయసు పిల్లలూ!! తెల్లవారింది మొదలు ఆడా, మగా అందరూ సందడిగా ఏవో పనుల్లో ఇంట్లోకీ బైటికీ తిరుగుతూనే ఉండేవాళ్ళు. లంకంత కొంప అనేవాళ్ళు కదా, కొంప అంటే ఇల్లు అనికదా అర్థం!! అచ్చం అదేవిధంగా వుండేదా ఎత్తు అరుగుల ఇల్లు!!

***** 

(పుట్టపర్తి పండరీ భాగవతం (ద్విపద కావ్యం) కు వాట్కిన్స్ సర్ వేసిన ముఖచిత్రం).

  (సశేషం) 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.