హృదయ పుష్పకం

-సుభాషిణి ప్రత్తిపాటి

 
ఆ మూడుకాళ్ళ ముసలితో…
పరుగులు తీయలేక…
పగలంతా అలసి , సొలసి
నిద్రా శయ్యపై తలవాల్చగానే…
కలలు తలగడై జోలపాడగా
అంతులేని శాంతి పొందిన 
నా హృదయంలో
వేకువ రాలే పారిజాతాల్లా…… నూతనోత్తేజపు పరిమళాలు!
 
జారే వెచ్చని కన్నీళ్ళను
పీల్చుకునే
నా కొంగు చల్లని తోడై నాతో నడుస్తూ…
అవసరమైన చోటల్లా…నడుంచుట్టూ బిగిసి
నవశకానికి నాందీ వాక్యమై
సుప్రభాతపు పూవై వికసిస్తుంది!
 
తలపుల తడితో…
ఊహల అల్లరితో వల్లరిగా సాగి,
హృదయ కుహరంలో బీజమై…
లోలోపలి ఆశలకు చివురులు తొడిగి,
రగిలే క్షణాలను సింధూరంగా మార్చుకుంటూ…
తూరుపు వీణెపై పలికే నవరాగానికి
జత కలిసే తాళమై….
వేవేల మయూఖలుగా ఉదయించే
భానుతేజమై…
భావికి వెలుగయే నా కలం
వేకువ పుష్పంలా కుసుమించి  ప్రసూన కవనమై.. నా హృదయ పుష్పకంలో
ప్రభవిస్తూనే ఉంటుంది!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.