(ప్రముఖ కవి, చిత్రకారులు, రచయిత శ్రీ శీలా వీర్రాజు గారు జూన్ 1న పరమపదించిన  సందర్భంగా నెచ్చెలి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ నివాళిగా ఈ వ్యాసాన్ని సమర్పిస్తూంది-)

సాహితీ బంధువు మన “శీలావీ”

-డా. సిహెచ్.సుశీల

          నెచ్చెలి వెబ్ మాగజైన్ లో ప్రతి నెలా ప్రముఖ రచయిత్రి, కవయిత్రి శ్రీమతి శీలా సుభద్రాదేవి “నడక దారిలో…” అంటూ జీవితంలో చిన్ననాటి నుంచి తాను ఎదుర్కొన్న ఒడిదుడుకులను సహనంగా సరళంగా దిద్దుకొంటూ, బాధలను కన్నీళ్లను సాహితీ సుమాలుగా మార్చుకుంటూ, చదువు పట్ల తనకు గల ఆసక్తిని ఎన్ని అవాంతరాలు వచ్చినా కొనసాగిస్తూ, అడుగులు వేస్తూ, ఎదిగి వచ్చిన అనేక సంఘటనలను – నిర్ద్వందంగా ఎలాంటి అభూత కల్పనలకు తావీయకుండా ‘జీవిత చరిత్ర అంటే ఇంత స్వచ్ఛంగా, సహజంగా రాయాలి’ అన్నట్టు రాస్తున్నారు.

          శీలా వీర్రాజు గారి మేనమామ బిడ్డ సుభద్రాదేవి. సాహిత్యం ద్వారానే వారికి పరిచయమై, తర్వాత అభిప్రాయాలు కలిసి, పెద్దవారు మాట్లాడుకుని ఇరువులకూ వివాహం చేయడం జరిగింది.

          కళలకు కాణాచి అయిన గోదావరి తీరం రాజమహేంద్రవరంలో 1939 ఏప్రిల్ 22న వీర్రాజు జన్మించారు. హై స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లోనే మిత్రులతో కలిసి “బాలసాహితి” అనే వ్రాత పత్రికను తీసుకువచ్చారు. అక్కడే వాటర్ కలర్స్ మరియు తైల వర్ణాలతో చిత్రలేఖనం ప్రారంభించి, 60 ఏళ్ల పాటు తన స్వేదాన్నే రంగులుగా తీర్చిన చిత్రాలను….. అమ్ముకుంటే లక్షలు కురిపించే చిత్రాలను తాను పుట్టిన ఊరు రాజమండ్రి లో దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ కి ఉచితంగా ఇచ్చేసారు ఈమధ్య.

          1961 నుండి కృష్ణా పత్రిక లో మూడేళ్ల పాటు చిత్రకారుడిగా, రచయితగా – తర్వాత 1963 నుండి రాష్ట్ర సమాచారం పౌర సంబంధాల శాఖ లో అనువాదకుడిగా పనిచేశారు. 1990 లో స్వచ్ఛంద పదవీ విరమణ చేసి, ఇక తన పూర్తి జీవితాన్ని సాహితీలోకానికి అంకితం చేశారు. 83 ఏళ్ల జీవితకాలంలో 60 ఏళ్ళ పైబడి సాహితీ కృషిచేసిన అతి కొద్దిమందిలో వీరు ప్రథములు.

          ఎందరో కవులు, కథకులు, నవలాకారులకు దాదాపు 1000 కి పైగా ముఖ చిత్రాలు వేసారు.  అందులో సగం మందికి పైగా ఉచితంగా ఇచ్చారు. కొందరికి పుస్తకం ముద్రించే ఆసక్తి ఉన్నా, ఆర్థికమైన శక్తి లేకపోవడాన్ని గమనించి, తిరిగి ఊరు వెళ్లడానికి ఛార్జీలు కూడా ఇచ్చిన మానవతావాది ఆయన.

          వీర్రాజు గారి కవిత్వం వారి మనసు లాగే సున్నితంగా, మాటల్లా సరళంగా, సౌమ్యత, మృదుత్వం, నెమ్మది తనం, నిండి ఉన్నా… భావం మాత్రం చాలా సూటిగా,
గాఢంగా ఆలోచనాత్మకంగా ఉంటుంది. మనుషుల్లోని వైవిధ్యమైన వ్యక్తిత్వాన్ని నిర్ద్వందంగా వ్యక్తీకరిస్తారు. వారి రచనల్లో అస్పష్టత ఉండదు. అనిర్వచనీయమైన అనుభూతిని కలిగించి, పాఠకుని గుండెలో ఒక ” చెమరింపు” అనుభవానికి వస్తుంది. రచనల్లోని చిత్తశుద్ధి తన జీవితం లోనూ నిలబెట్టుకుంటూ ఆదర్శంగా నిలిచారనడంలో ఎలాంటి సందేహమూ లేదు.

“ఎవరైనా సరే
కవిత్వమై ప్రవహించడానికి
ఏం కావాలి ?
ఒక దృశ్యం కావాలి
ఒక శబ్దం కావాలి
ఒక ఆలోచన కావాలి
ఒక స్పందన కావాలి …”

అని కవి యొక్క, కవిత్వం యొక్క లక్ష్యంగా చెబుతారు. సమాజంలోని అన్ని కోణాలపై సాహిత్యం ప్రతిబింబించాలని ఆయన అంటారు. అందుకే సాహిత్యాన్ని ఆయుధంగా అనుసరించారు, ప్రేమించారు ఆ బహుముఖప్రతిభాశాలి.

          మానవ మనస్తత్వాల్ని, అందులోని వైరుధ్యాల్ని, సంకుచిత ధోరణులను తన రచన ప్రక్రియలన్నింటిలో అక్షరీకరించారు వీర్రాజు గారు. జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల్ని, సమాజంలోని అసమానతల్ని, మనిషి మనిషికి మధ్య ఏర్పడుతున్న అసంబద్ధతల్ని తన రచనల్లోనూ చిత్రాల్లోనూ ఆవిష్కరించారు‌.

          “మైనా ఎగిరిపోయింది” అని సుధామ గారు – “బుచ్చిబాబు మళ్లీ మరణించాడు” అని వంశీకృష్ణ నివాళి వ్యాసాలను రాయటం వీర్రాజు గారి కవిత్వాన్ని, జీవితాన్ని మనస్పూర్తిగా ఆవిష్కరించడమే.

          “కొడిగట్టిన సూర్యుడు, హృదయం దొరికింది, మళ్లీ వెలుగు, కిటికీకన్ను, ఎర్ర డబ్బా రైలు, పిడుగు పేకలమధ్య జీవితం, బతుకు బాట, ఒక అసంబద్ధ నిజం” ఆయన కవితా సంపుటాలు.

          ‘వెలుగురేఖలు, కాంతి పూలు, కరుణించని దేవత, నవలలు ముఖ్యంగా ఈ పేరు వినగానే గుర్తొచ్చే “మైనా” నవల 1969 లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు పొందింది.

          కథా సంపుటాలు – సమాధి, మబ్బుతెరలు, వీర్రాజు కథలు, హ్లాదిని, రంగుటద్దాలు, పైగా మైనస్ ద్వేషం, వాళ్ళ మధ్య వంతెన, మనసులోని కుంచె, ఊరు వీడ్కోలు చెప్పింది, చివరగా ” కథ నాది ముగింపు ఆమెది”. అభూత కల్పనలకు తావీయని జీవితచరిత్ర “ఇంకా పూర్తి కాలేదు.”

          ఆయన చిత్రించిన అపురూప చిత్రాలు గ్రామీణ వాతావరణం సౌందర్యాత్మ భావన తో పాటు బాధాతప్త మానవుల ‘మాటరాని మౌనం’ కూడా ప్రత్యక్షమవుతుంది. అవన్నీ కూడా జీవన చిత్రాలు. 1990లో లేపాక్షి శిల్పాలకు గీసిన స్కెచ్ లతో ” శిల్పరేఖ” పేరిట ఒక పుస్తకం, 2009లో వర్ణచిత్రాలు పేరిట మరో పుస్తకం వెలువరించారు. వారి చేతుల మీదుగా నేను అందుకోవడం నాకెంతో అందమైన క్షణాలు.

          మూడు నాలుగు తరాల రచయితలను ప్రోత్సహించిన వీర్రాజుగారు ” మీ ముళ్ళపూడి పిహెచ్.డి. బాగుంది. పుస్తకం వేయొచ్చు కదా” అని క్లుప్తంగా అనడంతో, ఒకటిన్నర సంవత్సరాలలో ఆరు పుస్తకాలు ప్రచురించి మొదటి ప్రతిని ఆయనకే ఇచ్చాను.

          విశ్వనాథ వారి కిన్నెరసాని పాటలు ముఖ చిత్రం చేసి పుస్తకం నా చేతికి వచ్చే వరకు ( చాలమంది కవులు, రచయితలకు సహకరింకరించినట్టు) పూర్తి బాధ్యత తీసుకొన్న ఉదారవాది‌. కిన్నెరసాని పాటలు అంటే విశ్వనాధవారి చిత్రం, ఒక కొండ, ఒక వాగు అందంగా గీస్తారు ఏ చిత్రకారుడైనా. కొండ గా నిలిచిన భర్తను చూస్తూ బాధగా తరలిపోతున్న స్త్రీ మూర్తిని ఆ కెరటాలలో చిత్రించడం వీర్రాజు గారి మార్క్. ఎప్పటికీ వారి పట్ల నా మనసులో కృతజ్ఞతలు ఉంటాయి.

          రావూరి భరద్వాజ తన నవల ” మాయ జలతారు” పేరును ” పాకుడురాళ్ళు” అని వీర్రాజు మార్చారు అని ఎన్నోసార్లు సభల్లో సంతోషం గా గుర్తుచేసుకొన్నారు. కథలు, కవిత్వం రాయడంతో పాటు కవితాత్మక కథలు రాయడం ఆయనకిష్టమైన ప్రక్రియ. వీర్రాజు గారి కవిత్వం పై రెండు ఎం.ఫిల్. లు, కథలపై ఒక పిహెచ్. డి వచ్చాయి. ఆయన కవిత్వం హిందీ, ఇంగ్లీష్ లోకి అనువదింప బడ్డాయి. మైనా నవల తమిళం, హిందీలో  వెలువడ్డాయి.

          కుందుర్తి ఆంజనేయులు కవిత్వాన్ని అభిమానించిన వీర్రాజు గారికి ‘ఫ్రీవర్స్ ఫ్రంట్’ మొదటి అవార్డు వచ్చింది. కుందుర్తి గారి మరణానంతరం వారి కుమారుడు సత్యమూర్తి తో కలిసి ‘ఎలాంటి ఒత్తిళ్ళకు లొంగకుండా, ఒక రకంగా రహస్యంగా ఉత్తమ కవిత్వాన్ని పరిశీలించి అవార్డులివ్వడంతో పాటు, అనేక కార్యక్రమాలు నిర్వహించారు తన చివరి రోజుల వరకూ. ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు రావాలని ఎందరో కవులు ఎదురుచూస్తుంటారు. ఒక ఉత్తమ పురస్కారం పొందినట్లు భావిస్తారు.

          వీర్రాజు గారి చిత్రాలు పల్లెటూరి వాతావరణం, జూన్ జీవనం, తెలుగు వారి సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబించడం, తెలుగు రా‌ష్ట్రొలలోనూ, పొరుగు రాష్ట్రాలలోనూ ప్రదర్శన జరగటం, ప్రేక్షకుల అత్యంత ఆదరణను పొందడం జరిగింది.

వీర్రాజు గారి మరణవార్త విని కవిలోకమే తరలి వచ్చింది చివరి చూపు కోసం. స్మశానంలో అంతిమ క్రియలకు సన్నద్ధమైన తమ మిత్రుడు, పెద్ద దిక్కు అయిన వీర్రాజు గారి భౌతిక దేహం ఎదుట ఆయన కవిత్వాన్ని చదవడం అన్న ఘటన విని ఈ నూతన ఒరవడికి ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేసింది సహృదయ లోకం.

          ” కాలానికి ఇటు, అటు” అన్న వ్యాస ‌సంపుటి వెలువరించిన శీలా వీర్రాజు గారు ” ఇటు మంచికీ మానవత్వానికి, అటు నిర్ధిష్టమైన భావాలతో కూడిన రచనలకీ'” మధ్యలో ఉన్న చైతన్యశీలి. మిత్రులకు”శీలావీ”. బోయి భీమన్న సాహితీ పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం అందుకొన్నారు. అయితే ఆయన అవార్డులు, సన్మానాలు కోసం ఏనాడూ ఎదురుచూడలేదు. గుర్తింపు కోసం పాకులాడలేదు. తన సిద్ధాంతం ప్రకారం రచనలు చేయడం, మనసుకు వచ్చినట్టు చిత్రాలు వేయడం, ఉత్తమ కవిత్వాన్ని ప్రోత్సహించడం, కొత్తగా కలం పట్టిన వారినీ ఆదరించి సలహాలివ్వడం చివరి వరకూ కొనసాగించారు.

          అందుకే ఈనాడు ఆయన భౌతికంగా లేకపోయినా, ఎందరెందరి గుండెల్లోనో “సాహితీ బంధువు” శాశ్వతంగా నిలిచిపోతారు.

          ప్రముఖ కవి సిరికి స్వామినాయుడు అన్నట్టు – ” మహోన్నతమైన మనిషి, మనిషి జీవనానికి అర్థం చెప్పిన మనిషి, కడదాకా సాహిత్యం కోసమే బ్రతుకు నేర్పించిన మనిషి.. మీ మరణం నాకే కాదు సాహిత్య లోకానికి తీరని లోటు మీ జీవితం సార్థకమైంది అక్షరం ఉన్నన్నాళ్ళు మీరు ఉంటారు”.

*****

Please follow and like us:

5 thoughts on “సాహితీ బంధువు మన “శీలావీ” – శీలావీర్రాజు గారికి నివాళి!”

    1. డా సుశీలగారు శీలావీర్రాజుగారికి అర్పించిననివాళి చదివి శ్రీమతి సుబద్రగారిగురించి కూడా వ్రాసారు .సజలనయనాలతో నివాళి అర్పిస్తూ చలించిపోయాను .
      మీరు వీర్రాజుగారిగురించివ్రాసింది చదువుతుంటే అడవిబాపిరాజుగారు గుర్తొచ్చారమ్మా ..
      శ్రీవీర్రాజుగారుకూడా అట్టివారే కదమ్మా ..ఆ సౌమ్య మూర్తిని విశాఖలో ఒక సభలో కలిసి మాట్లాడిన సంఘటన మననం చేసుకున్నాను మీకు హౄదయపూర్వక అభినందనలు .

  1. గొప్ప నివాళి అమ్మా .. నడిచే అక్షరాలై వాళ్లిద్దరూ మనమధ్య తిరుగాడేరు . సాహిత్యానికి తన శక్తినంతా ధారవోసీ ఒక మైనా ఎగిపోయింది .. యిక ఏ బాధ్యతలు మిగిల్చీ ” ఇవి చేసేసి నా దగ్గరకు రా .. అంటూ ఈ పక్షిని ఒంటరిజేసీ పోయేరు ‌. ఆయన మిగిల్చిన బాధ్యతలు పూర్తిచేసేందుకు అమ్మకు మనందరం తోడుగా ఉందాం .. ఆ దంపతులిద్దరూ తమ బిడ్డల్లా ఇన్నేళ్లూ అపురూపంగా చూసుకున్న చిత్రాలను
    ఆర్ట్ గేలరీ ఇచ్చేసినపుడు అపుడే బాధ్యతలన్నీ అప్పగించేసీ చివరి ప్రయాణానికి సిద్ధమైనట్టు అనిపించింది . మాతృదేవోభవ సినిమా లో ముగింపు సీన్ లా చాల బాధనిపించినా ..‌ ఉండాల్సిన చోటే వాటిని భద్రపరచి చాలా మంచిపని జేసేరు .. ఆయన‌ మహోన్నతమైన మనిషి .. మనిషి జీవితానికి అర్ధం చెప్పిన మనిషి . కడదాకా సాహిత్యం కోసమే బ్రతుకు నర్పించిన మనిషి . ఆయన మరణం మనకే కాదు సాహిత్య లోకానికి తీరని లోటు . ఆయన జీవితం సార్థకమైంది . అక్షరం ఉన్నన్నాళ్ళు ఆయన సదా మనతో ఉంటారు . నమస్తే

    1. సరిగ్గా చెప్పారండీ. ధన్యవాదాలు.

  2. సహృదయులు,మానవతావాది,గొప్ప కవి ,చిత్రకారులు కీ.శే.“శీలా వీర్రాజు గారి గురించి చాల బాగ రాశారు సుశీలగారు. సాహితి బంధువుకు నివాళి🙏🏻.

Leave a Reply to దామరాజు.విశాలాక్షి Cancel reply

Your email address will not be published.