కొత్త అడుగులు – 32

ఈ తరం పాలపిట్ట – ఫణి మాధవి కన్నోజు

– శిలాలోలిత

          ‘ఫణి మాధవి కన్నోజు’- వేసిన కొత్త అడుగుల్ని ఈ సారి చూద్దాం. కవిత్వాన్ని నాన్ సీరియస్ గా కాకుండా సీరియస్ గా తీసుకున్న కవి. అందుకే ప్రాణం అద్దిన అక్షరాలూ, జల్లెడ పట్టిన జీవితాలు, కళ్ళ ముందే కదలాడుతున్న నగ్నసత్యాలు ఈమె కవిత్వంలోని సాధారణ అంశాలు, కవయిత్రిగా మొదలైన ఈమె నడక ఇప్పుడు కాలమిస్ట్ గా ఎదిగింది. ప్రపంచాన్ని, సాహిత్యాన్ని అధ్యయనం చేస్తున్న తీరు స్పష్టంగా కనబడుతోంది. త్వరలోనే తన తొలి సంతకం లాంటి తొలి కవిత్వాన్ని పుస్తకంగా తీసుకొస్తానంది. ఆ కవిత్వం ‘ఫణి’ని మరింత దగ్గరగా సాహిత్యకారుల దగ్గరకు తీసుకొని వెళ్తుంది.

       చిన్నచిన్న మాటలతో ఫీలైన ధోరణితో ఎంతో గాఢతతో రాయడం ఈమెశైలి. మనిషెంత సున్నితమో, మాటంత మెత్తన. కానీ సంకల్పం మాత్రం కత్తి పదును కంటే ఎక్కువ. అదే ఆమె ప్రత్యేకత.

        ప్రపంచంలో వున్న పీడిత తాడితులంతా, దుఃఖాన్ని ఒడిసి పట్టుకున్న వాళ్లంతా, ఆత్మీయులేనన్న ఆత్మ గల తల్లి ఈమె.

        కవిత్వం అంటే నీకెందుకిష్టం అంటే, ఆమె మాటల్లోనే వింటే –

        “అమ్మ, అక్క, తమ్ముడు, నా సహచరులు, మా బాబు, బంధువులు, స్నేహితులు, కలబోసుకునే కష్టాలు, పంచుకునే సంతోషాలు, మొత్తంగా ఓ చిన్ని మధ్యతరగతి ప్రపంచం నాది. చిన్నప్పటి నుంచీ దినపత్రికలు చదవడం, రేడియో వినడం ఇష్టమైన హాబీలు. చదవడానికి ప్రాధాన్యత నిచ్చాను. ఎక్కువగా ఒక్క మాటలో చెప్పాలంటే చదవడమే నా స్నేహిత.

        అనివార్యమైన ఓ సంఘటన అనంతరం, అసంకల్పిత ప్రతీకార చర్యలుగా, మనస్సు మోయలేని భావాలను రాయడం మొదలైంది. చవి చూసిన అనుభవమో, చదివిన సంఘటనో నాలో అలజడి రగిలించి, నన్నురాసే దాకా వదలని సందర్భాల్లోనే ఎక్కువగా రాసాను. అక్షరం సాయంగా నా లోపలి భావాల్ని ప్రటించుకోగలిగాను. దాన్నే కవిత్వం అన్నారు. కొనసాగుతున్నాను. నా జీవితంలో కవిత్వం పాత్ర ఏమిటి అంటే, ఇంత అని చెప్పలేను. శోకం అంచున శ్వాసను నిట్రాడులా  నిలిపి ఉంచింది కవిత్వం. ఇంటి నాలుగు గోడల్లోనే కలతిరిగే చూపును విస్తారం చేసి ప్రపంచం నలుదిక్కులా పారించింది కవిత్వం. అయిదేళ్ళ క్రితం ‘కవిసంగమం’ ఫేస్బుక్ గ్రూపులో జాయినవడం ఓ గొప్ప మలుపు. అక్షరం ఆధారంగా నిలబడితే, కవిసంగమం ఓ కొత్త లోకాన్ని అందించింది. సాహిత్య లోతుల్ని పొడవుల్ని కొత్త కళ్ళతో చూపింది. అనుకూలమైనా, ప్రతికూలమైనా కాలంతో కలిసి సాగటం కాలం నేర్పిన పాఠమే. అందుకే ‘అనేక మెలాంఖలీల ఏకవాక్యం- ‘జీవితం’ అని రాసుకున్న నేనే ‘జీవిత కాలపు వసంత ఋతువు- సాహిత్యం’ అని రాసుకున్నాను. సాహిత్యం నాకు సాంత్వన. కనుకే ‘నా అక్షరాలు నాకు ఊయలలు, నన్ను ఊరడించే జోలపాటలు’ అని రాసుకున్నా ‘లల్లబీ’ అనే కవితలో. పిల్లలు, మహిళలు, రాజకీయాలు మూడింటికి సంబంధించిన అంశాలు నన్ను బాగా కదిలిస్తాయి. ఇటీవలి రాజకీయ పరిణామాలు మరీనూ. మారుతున్న ప్రజాస్వామ్య ముఖచిత్రాన్ని ప్రతిబింబించేలా ప్రత్యేకంగా కవిత్వం రావాలని కోరుకుంటున్నా. ఇదీ ఆమె అంతరంగం. 

        ముఖచిత్రం-2017లో మొట్టమొదట ‘కవిసంగమం’లో చేరిన రోజు పోస్ట్ చేసిన కవిత. గౌరీలంకేష్ హత్య నేపథ్యంలో రాసినది.

జరభద్రం (కవిత)

 బుర్రనటు ఇటు

ఊపటం నేర్చుకో

పశువనుకుని

బ్రతకనిస్తాయి..

ఊరుకోవే మనసా

నువ్వు స్పందించకే..

నువ్వు మనిషివని

తెలిసిపోతుంది.

గుండెలేని తూటాలు

గురిపెడతాయి.

ఒకడుగు ముందుకేసి

మాట్లాడావో..

పక్కా తెలిసిపోద్ది

జరభద్రం.

మనసా స్పందించకే..

మనిషివని తెలిసిపోద్ది.

 

మరో కవిత – రేపర్. ఫణిమాధవి కవితలకు వ్యాఖ్యానం అవసరం లేదు. సున్నపుతేటలా అర్ధమయ్యేట్లుగానే ఉంటాయెపుడూ..

అప్పుడెప్పుడో అర్ధమయ్యేలా

చీకటిని చుట్టి కానుక చేశారు.

రెండుగా చీల్చి మరీ చుట్టి ఇచ్చారు.

వీళ్ళు సంబరాలు చేసుకున్నారు.

వాళ్ళు

నవ్వుకున్నారు..

వాళ్ళు

వెళ్ళిపోయారు.

తెలుపు తెల్ల జెండా ఊపింది

నలుపు మిగిలింది.

చీకటి మరింత పెద్దదయ్యింది.

పీలికలు పీలికలుగా

విడిపోయింది

చీకటి భయంకరంగా చిక్కబడ్డది.

 

వీళ్ళకి

చుట్టిన చీకటిని తెంపుకోవడం

రాలేదు

ఇప్పటికీ

కానుక చేతికి

అందలేదు.

కలగన్న వెలుతురు కళ్ళకు

చిక్కలేదు.

 

        ‘అమ్మకే ఫాధర్స్ డే – కవిత కూడా విలువైన కవిత. అమ్మానాన్నల ప్రాధాన్యతను చెబుతూనే అమ్మకే ఫాధర్స్ డే చెప్పడం విలక్షణంగా ఉంది. ఒంటరి అమ్మలందరికీ జేజేలు అని ముగిస్తుంది.

         పునరపి కవితలో- మళ్ళీ మళ్ళీ వచ్చే రాత్రి, పగళ్ళ గురించి కలవరింత, పలకరింతా వున్నాయి.

        సాహిత్యం మనుషుల్లో మానవతాదీప్తిని వెలిగించేట్లు వుండాలని తన ఆకాంక్షను చాలా చోట్ల వెల్లడిస్తుంది.

         ఖమ్మంలో వినబడుతున్న కవయిత్రుల స్వరాల్లో గట్టి స్వరం ఫణిమాధవి. తనకు సాంత్వన నిచ్చింది కవిత్వం అని ఆమె అన్నట్లుగానే, పాఠకుడు రిలీఫ్ కి కూడా కొన్ని కొన్ని చోట్ల గురౌతాడు. 

        అమ్మ జానకీ దేవి ప్రోద్బలంతో సాహిత్య ప్రవేశం చేసిందనొచ్చు.

         ఆమెకున్న సాహిత్యాభిరుచికి ఆధారం యం.ఏ.తెలుగు  చేస్తుండడమే. ‘ఖమ్మం’ జిల్లాలో ‘తల్లాడ’ఊరిలో తొలికేకలా పుట్టిన ఈమె, తాను ఎంచుకున్న మార్గంలో సాహిత్య కృషి చేస్తుండడంలో ఎలాంటి సంశయములేదు. ఫణిమాధవి గురించి చిన్న పరిచయమే ఇది. పెద్ద పరిచయాన్ని ఆమె రచనలే చేస్తాయి ఇకపై.

*****

Please follow and like us:

3 thoughts on “కొత్త అడుగులు-32 ఫణి మాధవి కన్నోజు”

  1. అక్క…ముందుగా శుభాకాంక్షలు.
    మీ సాహిత్య ప్రయాణాన్ని, మీ పదునైన వాక్యాన్ని అమ్మ శిలాలోలిత గారు చక్కగా పరిచయం చేసారు.మీ వాక్యాలు ఎప్పుడూ ప్రత్యేకమే అక్క…💐💐💐

  2. చాలా అర్థవంతమైన పరిచయం . అపిటైట్ పెంచారు. మిగతా కవిత్వం కోసం ఎదురుచూసేలా…ఫణి మాధవికి అభినందనలు.

  3. ఈ శీర్షిక కు ఎంపిక చేసిన శిలాలోలిత అమ్మ కు, నెచ్చెలి పత్రిక సంపాదకులు గీత గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. పుస్తకం గా రావాలనుకుంటున్న నా సంకల్పానికి ఈ ఆర్టికల్ ఆశీర్వాదం గా భావిస్తున్నాను.

Leave a Reply

Your email address will not be published.