కథా మధురం 

ఎస్.శ్రీదేవి

‘ప్రేమ అనే పదానికి స్వచ్ఛమైన నిర్వచనంలా నిలిచిన ఓ స్త్రీ కథ’ – గుండెలోతు!

 -ఆర్.దమయంతి

‘Goodness in words creates trust, goodness in thinking creates depth, goodness in giving creates love.’

-Laozi.

***

          భార్య గత జీవితం లో ఒక ప్రేమ కథ వుందని, అందులో ఆమె పాత్ర ఏమీ లేదని తెలిసినా నమ్మలేని మగ బుద్ధి పోకడలు ఎలా వుంటాయి? పైపెచ్చు, ఆ ప్రేమికుడు ఆమెని ఇంకా ఆరాధిస్తునే వున్నాడని, చావుబ్రతుకుల్లో వున్నాడని, కడసారి చూపుగా వెళ్దాం అని భార్య అన్నాక ఆ మగని మనసు ఎన్ని వికారపు ఆలోచనలు చేస్తాయి?
‘ నేను అతన్ని ప్రేమించలేదు మొర్రో..’ అని భార్య నిజాయితిగా మొత్తుకుంటున్నా, నమ్మని కలియుగ రాముని తీర్పు ఎలా వుంటుంది?

          ప్రతి మనిషి జీవితం లోనూ ఒక గతం వుంటుందనీ, ప్రేమ కథలుంటాయని, అందుకు తన భార్యా మినహాయింపు కాదన్న సత్యాన్ని అంగీకరించేంతటి మనో బలం, సహృదయత పురుషునిలో వుంటుందా?

          ఆమె తనతో కాపురం చేస్తోంది ప్రేమతో కాదన్న అపోహ ని తొలగించుకునే విజ్ఞత వుంటుందా? ఆమెని భార్య గా స్వీకరించగల ఔన్నత్యం భర్తలో వుంటుందా?- ‘ అసలు స్త్రీలో- తొలి ప్రేమ ఎవరిమీద జనిస్తుందంటే..కేవలం భర్త మీద మాత్రమే కలుగుతుంది..’  అనే కటిక అబద్ధం లోని అసలు నిజాన్ని నిర్భయం గా చెప్పిన కథ – ‘గుండె లోతు. ‘

***

అసలు కథేమిటంటే :

          అతను – తన భార్య పేరు మీద వచ్చిన ఉత్తరాన్ని చింపి,  చదువుతాడు. అందులో సారాంశం ఏమిటంటే, ఆమె బావ చివరిదశలో వున్నాడని, వచ్చి చూడమని. అంతే. అతనిలో అనుమానం పెనుభూతమౌతుంది. ఆ బావ డైరీలో కేవలం తన భార్య అడ్రెస్ మాత్రమే ఎందుకున్నట్టు? సందేహం తీర్చుకోవడం కోసం అతనూవెళ్తాడు ఆమెతో కలిసి. ప్రేమ నాటకాన్ని చూడ్డం కోసం. ఆ బావ మరణిస్తాడు. సన్నివేశాలన్నీ కళ్ళారా చూస్తాడు. భార్య వాసంతి – బావని ప్రేమించని మాట వాస్తవమే అయినా, అతని లోని మగ బుద్ధి అంగీకరించనీదు.  తన మీద ఆమెకి ప్రేమ లేదని డిక్లేర్ చేస్తూ, ఆమెని అక్కడే రైల్వే స్టేషన్ లోనే ఒంటరి గా వదిలేసి  వచ్చేస్తాడు. మనశ్శాంతి వుండదు. తన వాళ్ళింటికెళ్తాడు. అక్కడ వదిన గారి తో ప్రేమంటే ఏమిటో లోతైన వాదన జరుపుతాడు. అంతలో భార్య నించి ఫోన్ వస్తుంది.

          తిరిగి కలుస్తారా లేదా? శ్రీరాముడు సీతాదేవిని అడవిలో వదిలేసినట్టు.. ‘నువ్వంటే నాకు అసహ్యం ‘ అంటూ వదిలేసి వెళ్ళిపోయిన భర్తని ఆమె ద్వేషించిందా లేదా? అనే ముగింపు ని తెలుసుకోవాలంటే..ఎస్.శ్రీదేవి గారు రచించిన ‘గుండె లోతు ‘ ని చదవి తెలుసుకోవాల్సిందే!

***

కథలోని స్త్రీ పాత్రలు, ఉన్నతమైన వ్యక్తిత్వాలు :

నిండైన వ్యక్తిత్వాన్ని నింపుకున్న పాత్ర – వాసంతి :
కథా నాయిక. ఈ వనిత ఒక నిండైన వ్యక్తిత్వాన్ని నింపుకున్న పాత్ర. యవ్వన తొలి దశ నించి కూడా భవిష్యత్తు పట్ల ఒక క్లారిటీ గల యువతి. ఒక స్పష్టమైన మార్గాన్ని ఎంచుకుని, చదువు బాట పట్టిన యువతి. సహజంగా తన చుట్టూ మూగే అనేకానేక ఆకర్షణలకు, వికార సంస్కృతికి నేటి యువత లొంగిపోవడం చూస్తున్నాం. కాని ఈ విషవలయాలకు చిక్కకుండా చదువు పట్ల ఎంత ఫోకస్డ్ గా వుండాలో నేర్పుతుంది ఈ – స్త్రీ పాత్ర .

తండ్రిని మెచ్చిన కూతురు :
అయితే ఇందుకు స్ఫూర్తి నిచ్చింది తండ్రి మాటలని భర్త తో గర్వం గా చెప్పుకుంటుంది. ప్రతి ఆడపిల్లకి తండ్రి గైడెన్స్ ఎంత ముఖ్యమో, అవగతమౌతుంది.

స్త్రీ మనసు తెల్ల కాగితమని చెప్పిన పాత్ర :
‘అవును. బావ నన్ను ప్రేమించిన మాట వాస్తవం..’ అని భర్త తో ధైర్యం గా చెప్పగల నిజాయితీ పరురాలు వాసంతి. అంతే ధైర్యం గా మరో నిజాన్నీ చెబుతుంది. తను మాత్రం అతన్ని ఎప్పుడూ ఆ దృష్టి తో చూడలేదని స్పష్టం చేస్తుంది.
ఎంతమంది భార్యలు – భర్త తో తన ప్రేమికుని గురించి ధైర్యం గా చెప్పగల సాహసం చేయగలరు? అసలు చెప్పడం అవసరమా? హాయిగా సాగిపోతున్న కాపురం లో కోరి కష్టాలు తెచ్చుకోవడమే అవుతుంది కానీ, పొందే లాభమేముంటుంది? అయినా ఒక మాట! ఇలాటి ప్రేమ చరిత్రలుంటే మనసులో నే సమాధి చేసుకోవాలి తప్ప, పైకి ఒక్క ముక్క అయినా పెదవి దాటి రానీకూడదు. పెళ్ళయ్యాక, భర్త ముందు పర పురుషుని ఊసెత్తకూడదు. అని నమ్ముతాం. ఆచరిస్తాం. అదే ఇతరులకీ చెబుతాం. కానీ వాసంతి మాత్రం వున్నదున్నట్టు చెప్పేస్తుంది. బావ తనని ప్రేమించాడని, అప్పుడు తను పదహారేళ్ళ బాలికనీ, తనకా ఉద్దేశమే లేదని..భర్తతో స్పష్టం చేస్తూ మాట్లాడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

          ఎంత విశాల దృక్పథం గల మగాడైనా.. భార్యకొక ప్రేమ కథ మిగిలి వుందని తెలిసాక మనశ్శాంతి గా వుండగలడా? మరి ఆమె ఎందుకు చెప్పినట్టు? అంటే – భర్త మీద నమ్మకం. ప్రతి ఇల్లాలు తన భర్త అందరిలాంటి వాడు కాడు. చాలా ప్రత్యేకం అని భ్రమిస్తుంది.

          ఆ మాటే అంటుంది బావతో – ‘ఆయన నీ లాగా కలల్లో బ్రతికే మనిషి కాడు. చాలా ప్రాక్టికల్ అని.’

          చాలా మంది ఇల్లాళ్ళు భర్త మనసంతా చదివేసాం, సమస్తం అవగతం అని భ్రమ పడేది సరిగ్గా ఇక్కడే! సీతా దేవి సైతం అవాక్కవ్వ లేదూ!? అగ్నిలో దూకమంటే? అయినా, ఇన్ని యుగాలు దొర్లినా – స్త్రీ పొరబడుతూనే వుంది..మగ మనసుని చదవడంలో, అనుమాన మనిషిని అంచనా వేయడం లో!

పిరికితనం లేని స్త్రీ :
తనని ప్రేమించిన బావ చావు బ్రతుకుల్లో వున్నాడని తెలిసి, భర్తని వెంటపెట్టుకుని వచ్చిన ఈ స్త్రీ మూర్తి లో చూద్దమన్నా పిరికితనం కనిపించదు. తను బావని ప్రేమించ లేదు కాబట్టి, అతను తన కోసం ఏం చచ్చినా తనకవసరంలేదని నిర్ణయించుకోవచ్చు. కానీ, అలా అస్సలు భావించదు. బావ చివరి దశలో వున్నాడని తెలిసి, ఆమె కదిలి పోతుంది. బెడ్ మీద శుష్కించిన అతని దేహన్ని చూసి చలించి పోతుంది. అతను బ్రతకాలని, అందుకు తన చేయూత వుంటుందని, కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అతన్ని కోరుతుంది. అతను మరణించాక విలపిస్తుంది. ఇదంతా పక్కనే వున్న భర్త చూస్తున్నాడని, గమనిస్తున్నాడని కానీ, ఆమె దేనికీ వెనకాడదు. నీలో స్వచ్చత ముఖ్యం. నీ భావనలో పవిత్రత ముఖ్యం. అన్నిటికన్నా, సాటి మనిషి పట్ల గౌరవం, మనసున్న తనం, మనిషితనం ముఖ్యం..వాట్లని అణగిదొక్కి, బ్రతికే బ్రతుకు దొంగ బ్రతుకు.. నాటకాల బ్రతుకు అని పరోక్షం గా చెప్పిన పాత్ర.. కథానాయిక అంటే ఈమె కదా! హీరోయిన్ కారెక్టర్లో ఒదిగివుండాల్సిన లక్షణాలు ‘ఇవి కదా’ అనిపించిన ఉన్నతమైన పాత్ర వాసంతి.

మగాడు ప్రేమిస్తే, ప్రేమించాలన్న రూల్ లేదు :
బావ తనని ప్రేమించి, విఫలమొంది, మద్యానికి బానిసై, మరణిస్తున్నాడని అందుకు తను కారణమన్న అపరాధ భావన ఆమెలో వుండదు. మరో గొప్ప లక్షణం – భర్త ఎదుట ఇదేదో ఒక గొప్ప డ్రామా గా చేసి చూపించాలని కానీ, తనని తాను ఎక్కువ చేసుకోడానికి కానీ బావ దగ్గరకి రాదు. కేవలం ఆమె మనిషి లా స్పందిస్తుంది.

          ఆమె ప్రతి మాటలో, కదలికలో నూతన మనసులో బావకున్న స్థానానికి ఒక గీటుని, ఒక పరిమితిని ప్రదర్శిస్తుంది.

భర్త మీది భార్యకి గల పరిపూర్ణమైన విశ్వాసానికి ప్రతిబింబం వాసంతి పాత్ర :
తాళి కట్టగానే భర్త మీది అమాంతం – ప్రేమ పుట్టదు. అందుకే అంటుంది. ‘సహచర్యం ప్రేమని పుట్టిస్తుంది. ‘ అని. సరిగ్గా ఈ ఒక్క డైలాగే అతనిలో ద్వేషాగ్నిని రగిలిస్తుంది.
ప్రతి భర్తకీ – కట్టుకున్న భార్య ఎప్పుడూ ఒక మూసిన పుస్తకం లాటిది. ఆమె సంపూర్ణమైన వ్యక్తిత్వాన్ని లోతుగా చదివి, పరిశీలించినప్పుడు.. అనుమానంతోనో, అమితమైన గౌరవంతోనో ఆ భర్త పెద్ద కన్ఫ్యూజన్ లో పడటం తధ్యం. అయితే ఈ కథలో ని హీరో రెండో కోవకి చెందినవాడు. అందుకే అతని ప్రశ్నకి ఆమె సూటిగా, స్పష్టం గా, నిస్సంకోచంగా, నిర్భయంగా చెప్పిన జవాబు అతనికి రుచించదు. రగిలిపోతూ, ఆమెని వదిలేసి వెళ్ళిపోతాడు.

స్త్రీ మానసిక ఎదుగుదలని అర్ధం చేసుకోడానికి పురుషుడు తగిన స్థాయిని కలిగి వుండాలి:
భర్త తనని వొంటరిగా వదిలేసి వెళ్ళిపోయిన క్షణాన.. ఆమె నోట మాటరానిదౌతుంది.
తాళి కట్టిన వాడు ఎన్నేళ్ళు కాపురం చేసినా, ఎంత మంది పిల్లల్ని కన్నా, నువ్వెంతగా కంటికి రెప్పలా చూసుకుంటున్నా..సంసారం సాఫీ గా సాగుతుందేమో కానీ, అతని మనసులో ఆమె స్థానం మాత్రం పరిధులు గీసుకునే వుంటుంది. ఈ కాలానికీ — కొంతమంది మగవాళ్ళకి ఇల్లాలంటే తనకంటే తక్కువ స్థాయీ పరురాలు అనే భావనలోనే వున్నారు అంటే నమ్మబుద్ధి కాదు. ఏ కాలానికీ- అతని కంటే ఆమె ఒక మెట్టు తక్కువలోనే వుండాలి. వుంటుంది. అనే ఒక చెక్కుచెదరని స్థిర అభిప్రాయాన్ని కలిగి వుండటం ఎంతైనా విషాదకరం. కొంతమంది ప్రవర్తనలో వారి కుచితత్వం అనుక్షణం బయటపడుతుంది. మరికొందరిలో ఆ అహం ఇదిగో ఇలా..సమయమొచినప్పుడు బహిర్గతమౌతుంది.

          ఏ స్త్రీ కైనా, – ప్రపంచాన్ని జయించినంత తేలిక కాదేమో భర్తని జయించ గలగడం.. అని అనిపిస్తుంది – నిరుత్తురాలైన వాసంతి ని చూసాక. ఆధునిక స్త్రీ ఎదిగే అవకాశాలే కాదు, చుట్టూ మూగే సమస్యలూ అధికమౌతున్నాయి. అయితే, వాటిని తమకు తాముగా పరిష్కరించుకోవడంలో ఒక నేర్పుని, చాకచక్యాన్ని ప్రదర్శిస్తున్నారు ..అని నిరూపించిన పాత్ర!

సాటి స్త్రీలకి స్ఫూర్తి గా నిలిచిన పాత్ర :
కాపురం లో సమస్యలు చెలరేగినప్పుడు, భర్త తో భేదాభిప్రాయాలు కలిగినప్పుడు పాటించాల్సింది సహనం. కలిగి వుండాల్సింది సమన్వయం. నిన్ను నీ భర్త అర్ధం చేసుకోడానికి ఒక అడుగు ఆలస్యమైనా..నీ నిండు వ్యక్తిత్వాన్ని మాత్రం వీడకు..అంటూ స్త్రీలకు స్ఫూర్తి గా నిలిచిన పాత్ర గా వాసంతిని కొనియాడక తప్పదు.

***

వదినా మరుదుల అనుబంధానికి ఓ సరికొత్త నిర్వచనం పరిమళ :
మేధావితనం, మెత్తని మనసున్న తనమూ సొంతం చేసుకునే అరుదైన వ్యక్తిత్వం గల మరో స్త్రీ పాత్ర – హీరో గారి రెండో వదిన – పరిమళ :
వదినా మరుదుల అనుబంధానికి ఓ సరికొత్త నిర్వచనం లా పాత్రని మలిచారు.
కుటుంబంలో స్త్రీలు ధరించే పాత్రలు, బాధ్యతలు, కర్తవ్యాలు, నేరవేర్చాలిసిన విధులు.. ఎంతో గొప్పగా వుంటాయి. నిజానికి ఇవన్నీ కూడా పెద్ద సవాళ్ళ తో కూడిన టార్గెట్స్ అనే చెప్పాలి.

          ఆఫీస్ లో ప్రాజెక్ట్ వర్క్ సబ్మిషన్ కైనా సమయం, గడువు తేదీలు వుంటాయి. కానీ .. కుటుంబం విషయం లో అది వర్తించదు. హఠాత్తు ఉప్పెన లా తన్నుకొచ్చే సమస్యలని పరిష్కరించడం లో ఆలోచించి నిర్ణయం తీసుకునే వ్యవధి వుండదు. తక్షణమే స్పందించి, మెరుపులా ఆలోచించి, సెకన్లలో పరిష్కరించాల్సిన ఎమెర్జెన్సీ సంఘటనలు ఎన్నో.. ఎన్నెన్ని ఎదురౌతాయో!

          స్త్రీ తను చదువుకున్న చదువు, జ్ఞానం, లౌక్యం, జీవితానుభవం అన్నీ కూడా సరిగ్గా ఇలాటి సమయాలలోనే వినియోగించుకోవాలి. మరిది కీ తోటికోడలికి మధ్య జరిగింది ఏమిటన్నది చూచాయగా ఆమెకీ తెలుసు. అయితే, అది ఎలా జరిగిందీ, జగడం ఎలా మొదలైంది, ఎలా ముగిసింది, ఇందులో తోటికోడలు వాసంతి తప్పు ఎంత?, నీ ఒప్పు ఎంత అని కూపే లాగి, వివాదాన్ని విని, వినోదించడం అనేది పరిమళ ముఖ్యోద్దేశం కాదు. సరిగ్గా ఇక్కడే పరిమళ సాధారణ స్త్రీలకు భిన్నం గా, మెరుస్తూ కనిపిస్తుంది. పరిణితి చెందిన స్త్రీ స్వభావానికి నాంది పలుకుతూ కథలో ప్రవేశిస్తుంది.

తోటికోడలకి సరైన నిర్వచనం లాటి పాత్ర :
సహజంగా తోటికోడళ్ళ మధ్య పోటీ చోటు చేసుకుంటుంది. సయోధ్యలు కూడా అంతంత మాత్రమే అన్నట్టుంటాయి. కానీ పరిమళ మరిదితో చెబుతుంది, తన తోటికోడలు వాసంతి తమ ముగ్గురిలోనూ తెలివిగలదని.. ముఖ్యం గా ఉన్నతమైన పెంపకం నించి వచ్చిన పిల్ల అని ప్రశంసిస్తుంది.. సాటి స్త్రీ లోని మంచిని మాటల్లో పంచడం వల్ల మన వ్యక్తిత్వం గౌరవప్రద మౌతుందనడానికి పరిమళ పాత్ర ఒక సాక్ష్యం గా నిలుస్తుంది.

ప్రేమ అనే డిక్షనరీ లో పరిమళ మాటలు ఒక గొప్ప అర్ధాన్ని నింపుతాయి :
తన మీద ప్రేమ లేని వాసంతిని భార్య గా స్వీకరించలేనంటున్న మరిది కి – మెత్తని మాటలతో..గట్టి చెంప దెబ్బలే వేస్తుంది.

          ‘ఆడవాళ్ళకీ వ్యక్తిత్వం ఉంటుందని గుర్తించడానికి మనకి మనసొప్పదు. అంతేనా, చందూ?” అంటూ, మాటలతోనే – గుర్తుండిపోయే వాతలు పెడుతుంది మరిదికి. అంతే కాదు, తర్క వితర్కాలతో, మెలికకి మెలిక పెట్టి, వాత కి వాత, పూత కి పూత చేసి, అతని కళ్ళు తెరిపిస్తుంది.

          ప్రతి ఇంట్లో ఇలాటి మా మంచి వదిన ఒకరుంటే..అసలు విడాకుల కేసులే వుండవు లోకం లో అని ఆశ ని జనియింపచేస్తుంది పరిమళ. ఈ పాత్రలో దాగున్న ఈ ఔన్నత్య లక్షణం ఎంతైనా ప్రశంసనీయం.

          స్త్రీలు ఎంత మహోన్నతమైన ఆలోచనా సరళిని అలవరచుకోవాలీ అంటే – దీపం నించి దీపం లా జ్యోతుల తోరణాలు కట్టాలి. మేలైన మాటలతో కాపురాలు నిలవాలి. మగువల మాటలు విజ్ఞానవంతమై వుండాలి. కుటుంబాలలో శాంతిసౌఖ్యాలను నింపగలగాలి. అందుకు ఆదర్శం గా నిలిచిన స్త్రీ పాత్ర – పరిమళ!
వదిన గారి ప్రేమ శాస్త్ర బోధనలతో..వాద వివాదాలతో, ‘తను పారేసుకున్న తొలిప్రేమ ని వెదికిపెట్టమన్న’ భార్య మాటలతో.. లోతైన అన్వేషణ సాగించిన చందూ కి, ప్రేమ లోతు తెలిసిందా? సరైన నిర్వచనం దొరికిందా?

          అతని ఘాటైన ప్రశ్నకి ధీటైన జవాబులా నిలిచిన కథ.
          ప్రేమ లోతుని కొలిచి తెచ్చిన కథ – గుండె లోతు.

***

రచయిత్రి గురించి :

          కథ పై తనదైన ముద్రని సొంతం చేసుకున్న  అతి కొద్దిమంది తెలుగు రచయిత్రు లలో ఎస్. శ్రీదేవి గారు ఒకరు. విభిన్నమైన వినూత్న కథాంశాలను ఎంచుకుని, తనదైన శైలిలో రచనలు చేయడం వీరి ప్రత్యేకం.  రచనలలో -అనేక సంఘర్షణాత్మక సమస్యలకి చక్కని పరిష్కారాన్ని కూడా  సూచిస్తూ  ఆదర్శం గా నిలుస్తున్న రచయిత్రి కి  నెచ్చెలి తరఫున అభినందనలు తెలియచేసుకుంటున్నాను.

          అడిగిన వెంటనే మంచి కథని అందచేసినందుకు ధన్యవాదాలు.

శుభాకాంక్షలతో..

ఆర్.దమయంతి.

***

ప్రియ పాఠకుల్లారా!

          కథామధురంలో కథని, కథపై సమీక్షని చదివి మీ మీ హృదయస్పందనలను నెచ్చెలితో పంచుకోవాల్సిందిగా మనవి.

          అందరకీ వందనములు!

ఆర్.దమయంతి.

*****

‘ప్రేమ అనే పదానికి స్వచ్ఛమైన నిర్వచనంలా నిలిచిన ఓ స్త్రీ కథ’ – గుండెలోతు!

ఎస్.శ్రీదేవి

          ప్రేమంటే ఏమిటో తెలియకుండానే జీవితపు చరమాంకంలోకి చేరుకునేవారు ఎందరో. ఆపైన సంధ్య వాలుతుంది. మృత్యువు కబళిస్తుంది. మనసు వికసించని మొగ్గగానే రాలిపోతుంది. ఈ వాస్తవం తెలియక ఎందరో ఆడామగా కలిసి మాట్లాడుకోగానే అదే ప్రేమనేసుకుని ఎంతో దూరం ఊహించుకుంటారు.

          దీనికి నేను మినహాయింపు కాదు. కాబట్టే ఎముకలు కొరికే చలిలో ఈ ప్రయాణం.

          ఏదేనా తెలివైన పని చెయ్యటానికి ప్రత్యేకించి ఏ కారణం ఉండదు. అదే పిచ్చిపని చెయ్యటానికి ఒక చిన్న అనుమానమో సరదానో కారణమవుతుంది. నా విషయంలో కూడా అంతే జరిగింది. సరిగ్గా ఇరవైనాలుగు గంటల క్రితం..నా భార్య పేరు మీద వచ్చిన ఉత్తరాన్ని విప్పి చదువుతున్నక్షణాన…

          శ్రీమతి వాసంతిగారికి,

          నా పేరు భాస్కర్. సామంత్ బిజినెస్ పార్టనర్‍ని. సామంత్ పేరు చెప్పాను కాబట్టి ఇంకే వివరాలూ అక్కర్లేదనుకుంటాను.

          ప్రస్తుతం వాడి పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. డాక్టర్లు అతను బతికే అవకాశం లేదని చెప్పేశారు. రెండు కిడ్నీలూ చెడిపోయాయి. ఊపిరితిత్తులు కూడా దెబ్బతిన్నాయి. బతుకుమీద విరక్తితో వాడు ఇంతదాకా తెచ్చుకున్నాడు. ఆ విరక్తికి గల కారణమేమిటో ఎప్పుడూ చెప్పలేదు. వాడు వద్దనుకున్న గతాన్ని కెలకడం ఇష్టంలేక నేనుకూడా ఎప్పుడూ అడగలేదు.

ఇప్పుడు…

          పూంచ్‍లోని ఒక చిన్న క్లినిక్‍లో ఇన్‍పేషెంట్‍గా రోజులు లెక్కపెట్టుకుంటూ జాగృతీ సుషుప్తీ కాని స్థితిలో ఉన్నాడు. అందువలన వాడి గతాన్ని శోధించక తప్పలేదు. డైరీలో మీ అడ్రస్ దొరికింది. మీదొక్కటే ఉంది. మీ ఇద్దరికీ గల బంధుత్వం ఏమిటో నాకు తెలీదు. అలాంటిది ఏదైనా ఉంటే తక్షణం బయల్దేరి రాగలరు. ఆఖరి చూపుల కోసం…

          వాసంతికి నా కేరాఫ్‍లో వచ్చిన భాస్కర్ ఉత్తరాన్ని ముందు నేనే విప్పి చదివాను. ఎవరీ సామంత్? అతని డైరీలో వాసంతి అడ్రస్ ఎందుకు ఉంది? అదొక్కటే ఎందుకుంది? నాలో ఉత్కంఠ.

          ఉత్తరాన్ని వాసంతికి ఇచ్చాను . చదవడం పూర్తయేసరికి ఆమె కళ్ళలో గిర్రున నీళ్ళు తిరిగాయి.

          “ఎవరతను?”” అసహనంగా అడిగాను.

          “మా బావ”” రుద్ధ స్వరంతో చెప్పింది.

          ఇంకేం? నాకు భగ్గుమంది.

          “అతనికి ఎవరూ లేరా?””

          “మా నాన్న చెల్లెలి కొడుకు. అత్తయ్యా మామయ్యా చిన్నప్పుడే చనిపోతే మా ఇంట్లోనే ఉండి చదువుకున్నాడు. ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఆర్మీలో చేరాడు. ఐదేళ్లు చేశాక అది వదిలేసి కాశ్మీర్లోనే వ్యాపారం పెట్టుకుని స్థిరపడ్డాడు””

          “ఎప్పుడూ అతని గురించి నాతో అనలేదేం?””

          “ప్రత్యేకంగా చెప్పటానికి ఏమీ లేదుగా?””

          ఏదో ఉంది, అందుకే ఈ దాపరికం, ఉక్రోషంగా అనుకున్నాను.

          “వెళ్లాలా?”” అడిగాను.

          అక్కర్లేదని నేనే అనేస్తే సరిపోతుంది. వాసంతికింకా తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళకి తెలియపరిచినా చాలు. వాసంతిని శోధించాలని నా కోరిక.

          “వెళ్ళొద్దాం”” బేలగా అంది.

          ఫలితమే ఈ ప్రయాణం.

***

          నేను దారంతా మౌనంగానే ఉన్నాను. జమ్మూనుంచి బస్సు ప్రయాణం. ఘాట్ రోడ్డు. మైమరపించే ప్రకృతి. కానీ నా మనసు అందులో లీనం కాలేదు.

          బస్సు దిగగానే వెతుక్కుంటూ ఎదురొచ్చిన వ్యక్తిని భాస్కర్ గా గుర్తించడానికి మేము పెద్దగా ప్రయాస పడక్కరలేకపోయింది.

          “ఎలా ఉంది సామంత్‍కి?”” దుఃఖంతో భారంగా ఉన్న గొంతుతో అడిగింది వాసంతి.

          “చూద్దురుగాని””

          మా సామాన్లు అందుకుని ముందుకి దారి తీశాడతను. మమ్మల్ని తన ఇంటికి రమ్మన లేదు నేరుగా హాస్పిటల్‍కి తీసుకెళ్ళిపోయాడు.

          సినిమాల్లో లంగ్ క్యాన్సర్ పేషెంట్లనీ తాగుబోతులనీ చాలా గ్లామరైజ్ చేసి చూపిస్తారు. ముక్కోణపు ప్రేమ దృశ్యాలలో ఆడవారి ఏడుపు కూడా.

          అదే దృష్టితో… అంటే నేనెప్పుడూ చూసి ఎరగని ఈ సామంత్‍ని దేవానంద్ గ్లామర్‍తో వూహించుకున్నానేమో, షాకైపోయాను.

          అస్తిపంజరానికి చర్మం కప్పినట్టు మంచానికి అతుక్కుపోయి ఉన్నాడు. ఒకప్పుడు ఎలా ఉండేవాడో ఊహించడానికి కూడా వీల్లేనంతగా రోగచ్ఛాయలున్నాయి. చర్మం బాగా కృశించిపోయింది. ఎన్ని పాత జ్ఞాపకాలు మదిలో మెదిలాయో, ఒక్క అంగలో వెళ్ళి అతని మంచంమీద కూర్చుంది వాసంతి.

          “సామంత్!”” అతని చేతిని తన చేతిలోకి తీసుకుని దుఃఖం నిగ్రహించుకోవడానికి ప్రయత్నిస్తోంది.

          ఆపైన? అతడు కళ్ళు తెరుస్తాడు. వాసంతిని చూస్తాడు. “”ఇలా అయిపోయా వేమిటి?”” అని అడుగుతుంది. “నీకోసమే”” అంటాడు. ఆ తర్వాత?

          ఊహించడం నాకు సాధ్యపడలేదు. అక్కడే ఉండి సినిమా సీనులా అదంతా చూడటమూ నాకు సాధ్యపడదు. బయటికి నడిచాను. వస్తుంటే టేబుల్‍ మీద నీలం రంగు అట్టగల పుస్తకం కనిపించింది. తీసుకుని వచ్చేసాను. అది సామంత్ డైరీ.

          నా వెనకే అడుగుల చప్పుడు. అది భాస్కర్‍ది.

          “సామంత్… మీకు?”” సందిగ్ధంగా ఆపేశాడు.

          “వాసంతి కజిన్”” క్లుప్తంగా జవాబిచ్చాను.

          నా మనసంతా సామంత్ డైరీమీదే ఉంది. ఏం రాశాడు అందులో? వాసంతిని ప్రేమించాననా? ప్రతిక్షణం ఆమెనే తలుచుకుంటూ గడిపేస్తున్నాననా? వాసంతిని ఎందుకు పెళ్లి చేసుకోలేదు? అన్నీ సందేహాలే. తొందరగా డైరీ చదివేసి సందేహ నివృత్తి చేసుకోవాలని ఆత్రంగా ఉంది. డైరీలో ఏమేం ఉన్నాయో అన్ని చదివి ఉంటాడు భాస్కర్. అయినా ఏమీ తెలియనట్టు అడుగుతున్నాడు. నటన. అందరూ నటులే. కటువుగా తలతిప్పి అతన్ని చూశాను.

          “నిన్నటి నుంచి ఇక్కడే ఉన్నాను. మరి సెలవు ఇప్పిస్తే వెళ్తాను”” అన్నాడు. అని ఒక్క క్షణం ఆగి, “మా ఇంట్లో మీకు సదుపాయంగా ఉండదు. ఈ దగ్గర్లో లాడ్జి ఉంది. చాలా బాగుంటుంది”” గొణిగినట్టు అని మళ్ళీ నా మొహంలోకి చూడకుండా తలదించుకుని వెళ్ళిపోయాడు.

          అతనెలాంటి మిత్రుడో అర్థమైంది. మనస్సు అతనిమీది నుంచి మరల్చుచుకుని డైరీ తెరిచాను. ఎర్రటి స్కెచ్ పెన్‍తో వాసంతి అడ్రస్ మొదటి పేజీలో రాసి ఉంది. ఆ తర్వాతన్నీ ఏవో లెక్కలున్నాయి. ఒక పద్దు పుస్తకంలా ఉంది. నాకు నిరుత్సాహం కలిగి మూసేశాను. ఆ ఎర్రటి అక్షరాలు నా మనో నేత్రం ముందు నుంచి చెరిగిపోవటం లేదు.

          నేను తిరిగి హాస్పిటల్‍కి వచ్చేసరికి సామంత్ మెలకువగానే ఉన్నాడు. అతని మంచానికి దగ్గరగా స్టూలు లాక్కుని కూర్చుని ఉంది వాసంతి. చిన్నగా మాట్లాడుతోంది. నేను వాళ్ల మధ్యకి వెళ్లకుండా బయట కారిడార్లో నిలబడ్డాను. మాటలు వినిపిస్తున్నాయి.

          “ఏమిటిదంతా సామంత్?”” అడుగుతోంది వాసంతి. ఆమె గొంతు భారంగా ఉంది. అప్పుడే వాళ్ళ సంభాషణ మొదలైనట్లుంది. ఇంతసేపూ ఏం చేసినట్టు?

          ఏమీ పట్టనట్టు నేను, మేము వచ్చామనే నిశ్చింతతో భాస్కర్ ఎవరి దారిన వాళ్ళం వెళ్లిపోయాక వాసంతి ఒక్కర్తే డాక్టర్ దగ్గరికి వెళ్లి పేషెంటు కండిషనదీ తెలుసుకుందనీ, ఆశ లేదని డాక్టర్ చెప్పాడనీ, అంత దు:ఖాన్నీ మనసులో దాచుకుని అతనితో మాట్లాడుతోందనీ నాకు తరువాత ఎప్పటికో తెలిసింది.

          “చేతనైతే నీ జోలికి రాకుండా ప్రేమించమన్నాడు మీ నాన్న. ఆ ప్రయత్నమే ఇది”” సామంత్ గొంతు చాలా బలహీనంగా ఉన్నా మాటల్లో స్థిరత్వం ఉంది. భావ వ్యక్తీకరణలో పొందిక ఉంది.

          “ప్రేమంటే ఏమిటి?”” వాసంతి ప్రశ్న.

          “పెళ్లైనదానివి, నీకు అనుభవంలోకి రాలేదా?””

          “రాలేదు. నువ్వు అనుకుంటున్న ప్రేమ పుస్తకాలలో ఉంటుంది. సినిమాల్లో హీరో హీరోయిన్ల మధ్య ఉంటుంది. నిజ జీవితంలో ఉండదు””

          “అప్పటికీ ఇప్పటికీ ఏమీ మారలేదు నువ్వు””

          “మారకేం? చాలా మారాను. నువ్వు నన్ను ప్రేమించానని చెప్పినప్పుడు నాకు పదహారేళ్లు. నేను చదివిన నవలల్లో, చూసిన సినిమాల్లో హీరోలు నామీద గెలుపుకోసం నా మనోవీధుల్లో స్వైరవిహారం చేసేవారు. సన్నగా రివటలా ఉండే నువ్వు వాళ్లతో ఎందులోనూ పోటీ పడలేకపోయావు. తర్వాత మా నాన్న సంబంధాలు చూడటం మొదలుపెట్టాడు. దాంతో కలల్లోంచీ భూమ్మీదకి వచ్చేశాను”

          “అప్పుడైనా నేను గుర్తు రాలేదా?””

          “ఏదీ, నాన్నతో పోట్లాడి వెళ్లి ఆర్మీలో చేరావుగా?””

          “అంతే! మర్చిపోయావా?””

          “మర్చిపోతే వెతుక్కుంటూ ఇంత దూరం ఎందుకు వస్తాను?””

          “మీవారు వచ్చారా?””

          “వచ్చారు””

          “ఏరీ?””

          “బైటికి వెళ్లారు””

          “నీకు ఉత్తరం రాసినట్టు భాస్కర్ చెప్పాడు. అతనికి కోపం వస్తుందేమోనని భయపడ్డాను””

          “తను నీలా భావుకుడు కాదులే. చాలా ప్రాక్టికల్ మనిషి””

          “చాలా సంతోషంగా ఉంది వాసంతీ, నిన్ను ఇలా చూడగలిగినందుకు””

          “నాకు మాత్రం బాధగా ఉంది. ఇప్పటికైనా మించి పోయినది ఏదీ లేదు. నిన్ను తీసుకెళ్లచ్చేమో డాక్టర్ని అడుగుతాను. మాతో వద్దువుగాని. అమ్మ, అక్కయ్యలు, మేము… అందరి మధ్యా ఒంటరితనం నిన్ను బాధపెట్టదు. కొత్త జీవితం మొదలు పెడుదువు గాని”” ఈ చివరి మాటలు అంటున్నప్పుడు మాత్రం వాసంతి గొంతు వణికింది.

          నేను వాళ్ల దగ్గరకి వెళ్లాను. నన్ను అతనికి చూపించింది.

          “గాడ్ బ్లెస్ యూ” అస్పష్టంగా అన్నాడతను.

          క్రమంగా అతనిలో చికాకు మొదలైంది. ఏదో చెప్పాలని తపన పడుతున్నాడు. కానీ మాట రాలేదు. కళ్ళలో నీళ్లు నిండాయి. క్రమంగా అవి ఇంకిపోయి కళ్ళు మూతలు పడ్డాయి.

          నేను గబగబా వెళ్లి డాక్టర్ని పిలుచుకు వచ్చాను. చాలా చిన్న డిస్పెన్సరీ అది. సామంత్ దానికి మహారాజ పోషకుడు. ఆరోగ్యం దెబ్బతిన్పప్పటి నుంచి అక్కడే ఉంటున్నాడట.

          “మిలిటరీ హాస్పిటల్లో చేరమని ఎంతగానో చెప్పాను. కానీ వినలేదు”” అన్నాడు డాక్టర్ నాతో వస్తూ. సామంత్‍ని చూసి సారీ చెప్పేసాడు.

          వాసంతి ఖిన్నురాలైంది. ఆమెను చూడటానికే అతని ప్రాణం ఈ కొద్దిరోజులైనా ఆగిందేమో! ఏ జన్మ రుణమో, నాకిది! లేకపోతే అతనితో నాకున్న అనుబంధం ఏమిటని? అంత దూరం నుంచీ ద్వేషిస్తూ రావటం… వచ్చీరాగానే అతని ప్రాణం పోవటం. క్లుప్తంగా అత్యక్రియలు కానిచ్చాము. స్మశానం నుంచి వస్తుంటే ఏదో కోల్పోయిన భావన కలిగింది.

          భాస్కర్ చివరిదాకా మాతో ఉన్నాడు. వ్యాపారం గురించి ఏవో లెక్కలు చెప్పబోయాడు. నేను వద్దన్నాను. అతను సంతోషించినట్టే ఉన్నాడు. స్మశానం నుంచి వెళ్లిపోయాక మళ్లీ మమ్మల్ని కలవటానికి రాలేదు.

***

          “ఓ మనిషి చావుకి నేను బాధ్యురాలిని అనుకుంటే నిజంగా నేనొక హత్య చేసినట్టే కదా?” తిరుగు ప్రయాణంలో అంది వాసంతి.

          “అంతేగానీ నువ్వతన్ని ప్రేమించలేదా?”” సూటిగా అడిగాను.

          “ప్రేమంటే ఏమిటి?””

          నిజమే! ప్రేమంటే ఏమిటి? ఒక వ్యక్తి మనకే సొంతం కావాలనుకోవడమా? ఇంట్లోంచి లేచిపోయి, సమాజంలోనే వుంటూ, ఆడా మగా పిల్లల్ని కంటూ జీవన వ్యాపారంలో కృంగి, కృశించి, చిట్టచివరికి అస్తిత్వాన్ని కోల్పోవటమేనా, ప్రేమంటే? నాకీ ఆలోచనలే నచ్చలేదు. ప్రేమ అనేది ఇంత సంకుచితంగా వుంటుందనిపించలేదు.

          “ఈ ప్రశ్నకి జవాబు నాకెప్పుడూ దొరకలేదు. ప్రేమనేది మైదానాల్లోకివెళ్ళటంలోనూ, లేవదీసుకుని వెళ్లిన అమీర్లకి అమ్మాయిలని అనుసంధానపరచటంలోనూ ఉంటుందని అనుకోను. దేవదాసు సినిమా నాలుగైదు సార్లు చూశాను. నాకు అనిపించింది ఒక్కటే. పార్వతికి ముసలి భర్త దొరికాడు కాబట్టి దేవదాసుని మర్చిపోలేక పోయిందిగానీ అతన్ని మించిన భావుకుడు, యువకుడు భర్తై ఉంటే?””

          వాసంతి భావాలకి నేను ఉక్కిరి బిక్కిరి అయిపోయాను. ఇలా కూడా ఆలోచిస్తారా అని విస్మయం కలిగింది.

          “సామంత్ నన్ను ప్రేమించానన్నప్పుడు నాకు పదహారేళ్లు. ఇంటర్ రెండో సంవత్సరంలో ఉన్నాను. ఎంసెట్‍కి తయారవుతున్నాను. నాకు అతనిలో ప్రేమాస్పదమైన అంశం ఏదీ కనిపించలేదు. అతని ప్రేమ టెక్నికలర్లో కనిపించి ప్రలోభ పెట్టలేదు. అందుకని స్పష్టంగా తిరస్కరించాను. ఈ సంగతి ఆ తర్వాత నాన్నకు తెలిసి అతన్ని కోప్పడ్డారు-

          నా పెద్దల్లుడు ఇంజనీరు. రెండో అల్లుడు డాక్టర్. వాసంతికూడా పెద్ద చదువులు చదువుతానంటోంది. వీళ్ళ పక్కన నిలబడే అర్హత నీకుందా? నీకసలు చదువు ధ్యాసే లేదు- అని.

          ఊహ తెలిసినప్పటినుంచి వాసంతి నా భార్యనే అనుకుంటున్నాను- అన్నాడు సామంత్.

          చదువుకుని పైకి రావలసిన వయసులో ఇలాంటి ఆలోచనలు చేస్తున్నావంటే నువ్వు బాగుపడవు- అన్నారు నాన్న.

          సామంత్ మా ఇంట్లోనుంచి వెళ్ళిపోయి ఆర్మీలో చేరాడు. మా నాన్నకి అతను ఎక్కడున్నదీ తెలుసేమో, నాకు తెలియదు. తర్వాత అతని విషయం నేను పట్టించుకో లేదు”” సుదీర్ఘమైన కథని క్లుప్తమైన మాటల్లో చెప్పింది వాసంతి.

          నేను సమాధానపడలేక పోయాను. ప్రేమించిన నేరానికి బలైపోయిన సామంత్ రూపం కళ్ళముందు కదిలింది. తనని తను తాగుడుతో హింసించుకునే స్థాయికి మనిషి దిగజారాడంటే దుఃఖం, విరహం అనే ఎన్ని జారుడుమెట్లు జారాడో! నాకు అతడి మీద జాలి కలిగింది.

          “మరి నామీదైనా నీకు ప్రేమ ఉందా?”” వ్యంగ్యంగా అడిగాను.

          “మీతో సహచర్యం ప్రేమ పుట్టిస్తోంది”

          ఆ జవాబు ఎందుకో కటువుగా అనిపించింది. నేను తనని శోధిస్తున్నది కాని సమయంలోననే విషయం తట్టలేదు. ఒక పునశ్చరణ, మరొక అపరాధభావన, ఈ రెండిటి నుంచి పుట్టిన సంఘర్షణ ఆమెని నలిబిలి చేస్తున్నాయని గుర్తించలేదు.

          “మరేం చూసి నన్ను పెళ్లి చేసుకున్నావు?”” సూటిగా అడిగాను. తనూ సూటిగానే చూసి జవాబు ఏమీ చెప్పకుండా తలవంచుకుని కూర్చుంది.

          నోటితో చెప్పని జవాబు తన చూపుల్లో దొరికింది. నా అందం, చదువు, ఆస్తి అంతస్తులు చూసి చేసుకుంది. చేసుకున్నాక భర్తని కాబట్టి ప్రేమిస్తోంది. అంతేగాని ఆమెలో సహజమైన ప్రేమనేది లేదు నాపట్ల. పూర్ సామంత్! అనుకున్నాను ముందు. పూర్ మీ అనుకోవాలి ఇప్పుడు.

          నా అహం దారుణంగా దెబ్బతింది. ఒక స్త్రీ తనని ప్రేమించలేదంటే ఏ మగవాడూ భరించలేడేమో . ప్రేమంటే ఏమిటో తెలియని వాసంతిపట్ల ప్రతీకారంతో నా మనసు రగిలిపోయింది.

          రైలు ఆగింది. కిటికీలోంచీ స్టేషన్ పేరు చూశాను. వాసంతీవాళ్ల ఊరికి వెళ్ళాలంటే దగ్గరి రైల్వేస్టేషన్ ఇదే. మెరుపులా ఒక ఆలోచన మెదిలింది.

          “టీ తాగుదాం”” అన్నాను లేస్తూ.

          ఇద్దరం దిగాము. స్టాల్ దగ్గర టీ తాగాము. కావాలనే డబ్బులు ఇవ్వడం దగ్గర ఆలస్యం చేశాను. రైలు కూత కూసింది.

          “కదులుతుందేమో!”” వాసంతి కంగారుగా అంది.

          ఆమె కంగారుని పట్టించుకోకుండా తాపీగా అన్నాను, “నిన్ను ప్రేమించిన సామంత్‍పట్ల నీకు కొంచెం అయినా నిబద్ధత లేదు. పెళ్లి చేసుకున్న నామీద కూడా నీకు ప్రేమ లేదు . నువ్వొక వాసనలేని పువ్వువి. ఐ హేట్ యు. హేట్ యూ బై ఆల్ మీన్స్”” కసిగా అని గబగబా వెళ్ళి కదులుతున్న రైలు ఎక్కేసాను. నిశ్చేష్టురాలై ఆమె అలాగే నిలబడి చూస్తున్న దృశ్యం క్రమంగా కనుమరుగైంది.

***

          వెంటనే బయల్దేరి రమ్మని నాకు నాన్న దగ్గర్నుంచి అల్టిమేటం వచ్చింది. వెళ్లాలనిపించ లేదు. వెళ్లకపోయినంత మాత్రాన నేను వాసంతితో గొడవపడిన విషయం సమసిపోదు. దాన్ని ఏదో ఒకలా పరిష్కరించకుంటేనేగానీ నాలో రగిలే అగ్నిభాండం చల్లారదు. అందుకే అయిష్టంగా వెళ్ళాను.

          ఎవరూ నన్నా విషయం ప్రశ్నించలేదు. మామూలు కుశల సమాచారాలు అడిగారు. వాసంతి గురించి వాళ్ళవరూ అడగకపోవటంతోనే గ్రహించాను, విషయం తెలిసిందని. ఒకటి రెండు రోజులు గడిచాయి. నా అంతట నేనే చెప్తానని వాళ్ళూ, రమ్మని పిలిచి అడగకుండా ఊరుకుంటే నా అంత నేనెందుకు చెప్పాలని నేను.

          మూడో రోజున రెండో వదిన నా గదిలోకి వచ్చి కూర్చుంది. తను నా సహాధ్యాయి. అన్నయ్య తనని ప్రేమించి చేసుకున్నాడు. ఏడేళ్లపాటు ఆమెకోసం నిరీక్షించాడు. అంత ఎదురుచూపు తర్వాత ఆమె కాదని ఉంటే వాడు ఏమైపోయి ఉండేవాడోనని అప్పుడప్పుడు అనుకుంటాను. ఇప్పుడు మాత్రం సామంత్ గుర్తొచ్చి అన్నయ్య అతనిలా మారే పరిస్థితి నుంచి వాడిని కాపాడినందుకు వదినపట్ల ఎంతో కృతజ్ఞత కలిగింది.

          “చెప్పు పరిమళా!”” అన్నాను, నా కృతజ్ఞతనంతా గొంతులోనే తొణికిస్తూ.

          “నువ్వే చెప్పాలి”” అంది.

          తను నేను ఏం చెప్పాలని ఆశిస్తోందో ఊహించాను. ఎవరో ఒకరికి చెప్పుకుంటేగానీ మనోభారం తగ్గదని నాకు తెలుసు. కానీ ఎలా చెప్పాలో బోధపడలేదు. అదంత తేలికగా చెప్పగలిగే విషయంలా అనిపించలేదు.

          “వాసంతీ వాళ్ల పెద్దన్నయ్య ఫోన్ చేసి చెప్పాడు విషయం”” అని ప్రతిస్పందన కోసం నా ముఖంలోకి చూసింది. “భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా ఉండవు. కానీ నడిస్టేషన్లో టీ తాగుదామని దింపి  నీదారి నీదని చెప్పి వచ్చేసావంటే గొడవ చాలా తీవ్రమైనదని ఇంట్లో అందరం అనుకుంటున్నాము” అంది.”

          నేను మాట్లాడలేదు.

          “మా తోటికోడళ్ళు ముగ్గురిలోకీ వాసంతి చాలా తెలివైనదని అనుకుంటాను నేను. ఎందుకంటే చక్కటి పెంపకంలో పెరిగి పెద్ద కుటుంబం నుంచి వచ్చిందీ, ఎక్కువ చదివిందీ కాబట్టి. ఇలా జరిగిందేమిటి?””

          “అవన్నీ పైపై హంగులు. వాస్తవానికి ఆ అమ్మాయికి స్వార్థమే తప్ప ప్రేమించడం రాదు. పరిమళా! నువ్వు నమ్ముతావా? తన స్వార్థానికి ఒక మనిషి బలైపోయాడు… ఆమె అతని చావుకి కారణం అయింది”” ఆవేశంగా అన్నాను.

          “ఏమి జరిగింది అసలు?””

          అంతా చెప్పాను. “కాగితం పువ్వని తెలిసి నా గుండెల్లో ఎలా దాచుకోను?”” అడిగాను.

          “ప్రేమించడానికి ఒక అర్హత ఉంటుంది తెలుసా? ప్రేమించబడటం. వాసంతిని అతను ప్రేమించి ఉండొచ్చు. కానీ ఆమెకి అతనిపట్ల ప్రేమ ఉండాలనేముంది?”” అంది వదిన.

          “అది ఎందుకంటే సామంత్‍కి చదువు, ఉద్యోగం, ఆస్తి అంతస్తులు లేవు. అందుకని వాసంతి అతన్ని ప్రేమించలేక పోయింది. అవన్నీ నాకు ఉన్నాయి కాబట్టి నన్ను పెళ్లి చేసుకుంది””

          “అందులో తప్పేముంది?”

          “తప్పేం లేదా?!!”

          “పదిమంది అమ్మాయిల ఫోటోలు తెచ్చి నీముందు పెట్టాము. అందులో నాలుగింటిని కట్నకానుకలు సరిగా ఇవ్వలేరని పక్కన పెట్టాం. ఇంకో ఇద్దరు అమ్మాయిలు నీకు నచ్చలేదు. మిగిలిన నలుగుర్నీ పెళ్లిచూపుల్లో చూసి వాసంతిని ఎంచుకున్నావు. అలాగే తను కూడా. సామంత్ మాత్రం? ఆమెనే ఎందుకు ప్రేమించాలి? వాళ్ళింట్లో పనమ్మాయినో, తనలాంటి మరో దిక్కులేని అమ్మాయినో ఎందుకు ప్రేమించలేదు? అతనూ బెటర్ ఛాయిసే చూసుకున్నాడు కదా?”

          “ప్రేమ అవన్నీ చూడదు. ఎవరిమీద ఎప్పుడు ఎందుకు పుడుతుందో ఎవరూ చెప్పలేరు. ఇట్ జస్ట్ హాపెన్స్””

          “అది కాంట్రాస్టులో వాసంతికి వర్తించదా?”

          “నువ్వు మాటలతో మెలికలు వేస్తున్నావు పరిమళా!”” విసుగ్గా అన్నాను. “రీజనింగ్ తర్కానికి అందదు. కొన్ని కొన్ని విషయాల్లో తర్కించి నోరు మూయించవచ్చుగానీ మనసుకి సమాధానం చెప్పలేము”

          “వాస్తవాలు వప్పుకోవలసివస్తే అలాగే ఉంటుంది మరి! స్త్రీ కోసం… కేవలం ఒక స్త్రీ కోసం యుద్ధాలు చేసుకుని, రాజ్యాలు, ప్రాణాలు పోగొట్టుకున్న సంస్కృతి మనది. నేను నిన్ను ప్రేమించాను, నాకోసం నువ్వేం చేస్తావ్ అని అడిగి మరీ ఆ స్త్రీని కిందకి లాగి ఆమె మానప్రాణ శక్తియుక్తులన్నీ లాక్కుని త్యాగశీలివమ్మా మహిళా అని పాడుకుని సంతోషించే కల్చర్ మనది…”

          “ఎందుకు ఈ సెటైర్లు?”” మెత్తగా అడిగాను. తనకీ ఒక గతం ఉంది. అనుభవం ఉంది. అవి ఇలా మాట్లాడిస్తున్నాయని గ్రహించలేదు.

          “సెటైర్లు కాదు. ప్రాణప్రదంగా ప్రేమించానంటూనే తనకోసం ప్రాణాలన్నీ కళ్ళలో నిలుపుకుని ఎదురుచూసిన సీతచేత అగ్నిప్రవేశం చేయించిన రాముడినీ-

          మరొకరికి అవకాశం ఇవ్వకుండా మత్స్యయంత్రాన్ని కొట్టి అర్జునుడు చేపట్టిన ద్రౌపదిని పంచభర్తృకని చేసి, అదీ చాలక తన సొంతచెల్లినే ఆమెకి సవతిని చేసిన కృష్ణుడినీ- కొలిచే సాంప్రదాయం మనది. త్యాగాలన్నీ స్త్రీలు చేస్తే వాటితో విజయాలను సాధించి గొప్పగా ప్రపంచానికి దాటుకుని చరిత్ర మనది. ఆడవాళ్ళకీ వ్యక్తిత్వం ఉంటుందని గుర్తించడానికి మనకి మనసొప్పదు. అంతేనా, చందూ?””

          “ఫెమినిజం పుస్తకాల్లో చదవటానికి బాగుంటుంది”” అన్నాన్నేను.

          “ఔనంతే. నువ్వు చెప్పేది వాస్తవం. నేను చెప్పేది సిద్ధాంతం. అంతేనా?””

          “నువ్వెలా అనుకున్నా సరే. నాకు ఆమె అంటే అసహ్యం పెరుగుతోంది. ఆమెని నా భార్యగా వూహించుకోలేక పోతున్నాను. పాపం… ఆ సామంత్… తల్లిదండ్రులు చిన్న తనంలోనే పోతే ఆ ప్రేమరాహిత్యాన్ని వాసంతిని ప్రేమించటంలో భర్తీ చేసుకుంటే… భగవంతుడా! ఎంత దయనీయంగా చచ్చిపోయాడో తెలుసా? ఆడవాళ్ళు ఇంత దుర్మార్గంగా కూడా వుంటారా? ఇదేనా పరిమళా, నువ్వు చెప్పే వ్యక్తిత్వం?””చాలాసేపు వదిన మాట్లాడలేదు. తర్వాత నెమ్మదిగా గొంతు విప్పింది. ”

          “నేను ఇంటర్ చదువుతున్నప్పుడు మీ అన్నయ్య రోజూ మా కాలేజీ విడిచే వేళకి వచ్చి గేటు దగ్గర నిలబడేవాడు. నన్నెంతో ఆరాధనగా చూసి, ‘ఐ లవ్యూ‘’ అనేవాడు. అప్పుడు తనూ స్టూడెంటే. ఇదే సినిమాల్లోనైతే ఎంతో అద్భుతంగా చూపించేవారు. నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. ఫ్రెండ్స్ , లెక్చరర్స్ చూస్తారేమోనని ఏడుపొచ్చేది. అదేదో ఈవ్ టీజింగ్ అనుకుని ఫ్రెండ్స్ నాకు దూరం అయ్యారు. చాలా అవమానంగా అనిపించేది””

          ప్రేమకి గల మరో పార్శ్వాన్ని వదిన మాటల్లో చూడసాగాను. అన్నయ్య ద్వారా ఈ విషయాలన్నీ చాలావరకు విన్నవే అయినా వదిన చెప్తుంటే కొత్త అర్థాలు ధ్వనిస్తున్నాయి.

          “కాలేజీకి వెళ్ళనని ఇంట్లో చెప్పి ఏడ్చాను. అమ్మానాన్నలు తరచి తరచి అడిగి విషయం రాబట్టుకున్నారు. మీ అన్నయ్యని ఇంటికి పిలిపించారు””

          తర్వాత జరిగింది నాకు తెలుసు.

          “ఇప్పటికిప్పుడు మా అమ్మాయిని నీకిచ్చి పెళ్లి చేస్తాను. నీకు సమ్మతమేనా? మీ ఇంట్లోవాళ్ళు ఒప్పుకుంటారా?”” అని వదినావాళ్ళ నాన్న అడిగేసరికి అన్నయ్య తెల్లముఖం వేశాడట.

          “మాకు ఉన్నది ఒకే ఒక్క సంతానం మా ఆశలన్నీ పరిమళమీదే. తనని ఇంజనీరింగ్ చదివించాలని కోరిక. మీ ఇద్దరికీ పెళ్లి చేస్తే మరి మీ నాన్నగారు ఇప్పటికే మీ అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు ఐదుగురితోపాటు తననీ చదివిస్తారా? లేకపోతే మీరిద్దరు పెళ్లి మాట మర్చిపోయి చదువుకొని పైకి వచ్చాక పెళ్లి చేసుకుంటారా? ఏదో ఒకటి నువ్వే ఆలోచించుకుని చెప్పు”” అనేసరికి అన్నయ్య ఓ నమస్కారం పెట్టి వచ్చేసాడట.

          మా ఇంట్లో అందరం కలుసుకుని సరదాగా ఉన్నప్పుడు ఈ విషయాలు చెప్పుకొని నవ్వుకుంటాం. ఎప్పుడు వీటి గురించి లోతుగా ఆలోచించలేదు. ఇప్పుడే ఏదో చిన్న ఆలోచన మొదలైంది. ఇంతలోనే వదిన అంది.

          “మా నాన్న మాటల్ని సవాలుగా తీసుకుని మీ అన్నయ్య పీజీ దాకా చదివి , సివిల్స్ లో నెగ్గుకొచ్చి, అపాయింట్మెంట్ ఆర్డర్తో మా ఇంటికి వచ్చి మళ్లీ అడిగారు. అప్పటికి మేమంతా ఆ విషయాన్ని మర్చేపోయాం. ఇంకొన్నాళ్ళు గడిస్తే నా పెళ్లి కూడా జరిగేదేమో … వేరే వ్యక్తితో””

          “అంటే నువ్వు మా అన్నయ్యని ప్రేమించలేదా పరిమళా?”” విస్మయంగా అడిగాను. నాకు ఊపిరి నిలిచిపోయినట్టయింది.

          “ఎందుకు ప్రేమించాలసలు? మీ అన్నయ్యననే కాదు, ఎవరినైనా సరే ఎందుకు ప్రేమించాలి? ఆ అవసరం ఏమిటి? తల్లిదండ్రులు తమ జీవితంలో ఒక భాగంగా పిల్లల్ని భావిస్తారు. ఆ భాగాన్ని అందంగా తీర్చిదిద్దే బాధ్యత తమదేనని అనుకుంటారు. అందమైన బాల్యాన్ని అందించిన వాళ్ళు యౌవనాన్ని మాత్రం అంత అందంగానూ మలచరా?””

          “పరిమళా!””

          “ప్రేమంటే ఏమిటసలు? ఇద్దరు మనుషులు కలుసుకోవడం వలన కలిగే పాజిటివ్ ఇంటరాక్షన్ . అది పెళ్ళితో కూడా జరగచ్చుగా?””

          “చాలా టఫ్‍గా ఉన్నాయి నీ భావాలు””

          “తప్పుగానూ ఉన్నాయా? ఉంటే చెప్పు, సరి చేసుకుంటాను. ఆ సరిచేసుకోవడం ఏదో మా అమ్మాయితో మొదలుపెట్టి రేపు ఎవరైనా ఐ లవ్ యు అనగానే అమాంతం వాడితో డ్యూయెట్లు లాగించేయమంటాను”” అని నవ్వి, చర్చ ఆపేసి వెళ్ళిపోయింది.

          నేను ఆలోచనలో పడ్డాను. వదిన చివరిమాటలు చర్నాకోలా అంచులా నా గుండెను తాకి మంట పుట్టించాయి. అప్పటిదాకా నా కళ్ళకి కట్టినట్టున్న సామంత్ రూపం మలిగిపోయి, టీ స్టాల్ దగ్గర వాసంతి చేతిలో టిక్కెట్టు పెట్టేసిన దృశ్యం కదిలింది. తప్పు చేసినట్టు అనిపించింది. వాసంతి ఏం చేయాలని ఆశించాను? నాకేమీ అర్ధమవలేదు.

          హాల్లో ఫోను మోగుతోంది. ఎవరూ ఎత్తడం లేదు. నేనే వెళ్లి లిఫ్ట్ చేశాను. వాసంతి!

          “చందూ కావాలి”” అంది ఎత్తినది నేనని తెలియక.

          “నేనే చెప్పు” “అన్నాను ముక్తసరిగా.

          “ఒక సహాయం చేయగలరా?”

          “ఏమిటది?”” నా భృకుటి ముడిపడింది. ఏమి ఆశిస్తోంది తను నా నుంచి?

          “కొంచెం ఓపిగ్గా వినాలి మరి… మొదటిసారి నేను పెళ్లి చూపులకు కూర్చున్నప్పుడు అతని ఊహామాత్రంచేత నా మనసులో తటిల్లతలు మెరిసాయి. కడగంటిచూపులతో నయాగరాలు, కులుమనాలిలు గుర్తొచ్చాయి. అతనే కాబోయే భర్తనుకుని నిరభ్యంతరంగా కలలు కన్నాను. ఆ తర్వాత… తనని అమెరికా పంపగలిగే సంబంధం చూసుకుని నాకు టాటా చెప్పేసాడు. అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాను. పెళ్ళిచూపుల్లో చూసిన వాడిని మనసులోకి ఆహ్వానించి మకిలి చేసుకోకూడదని. ఆ తర్వాత మీరు తటస్థపడ్డారు నా తొలిప్రేమ ఏ అగాధంలోకి జారిపోయిందో వెతికి పెట్టగలరా? పువ్వుల్లో పెట్టి సమర్పించు కుంటాను”” అంది.

          ఆమె మాటల్లో కొంత వాస్తవం ఉంది, మరి కొంత కవ్వింపు ఉంది. ఎంత కటువైన పైన వాస్తవాన్ని చెప్పింది! ఆమె తొలిప్రేమ ఏ అగాధంలోకి జారిపోయిందో నేనెక్కడ వెతుక్కోగలను? అలా వెతికేది ఉంటే ముందు నా ప్రేమని వెతుక్కోవాలి, ఏ పెళ్ళి చూపుల్లో పారేసుకున్నానోనని.

          కానీ నా ప్రశ్నకి సమాధానం…?

          “నువ్వు చెప్పేది నా ప్రశ్నకు సమాధానం కాదు”” అన్నాను కఠినంగా.

          “ప్రశ్నేమిటి అసలు?””

          “…””

          “ప్రేమ… అదలా పుడుతుందంతే. సామంత్‍కి నామీద, నాకు మరొకరిమీద, మీకు ఇంకొకరిమీద… రెండు కొసలూ కలవని దారంలా అలా. ఆ తొలిప్రేమని బస్సుల్లోనో రైళ్లలోనో పెళ్ళిచూపుల్లోనో పారేసుకుని వట్టి యదార్థవాదులుగా మిగిలిపోతున్నాం””

          “…”

          “అతను నా మనసుమీద కాకుండా నా జీవితంమీద పట్టుకోసం ప్రయత్నించాడు. తనకి రాని చదువు నాకూ అక్కర్లేదన్నాడు. నన్ను కని పెంచిన తల్లిదండ్రులను కాదని తనతో వచ్చేయమన్నాడు. ఒక్కసారి మా ఇద్దరికీ పెళ్లంటూ జరిగితే చచ్చినట్టు మా నాన్నే దిగివస్తాడన్నాడు. నేను పావుని కావాలనుకోలేదు””

          “మనిషికీ మనిషికీ మధ్య ఉండేవి ఆర్థిక బంధాలేనా వాసంతీ? నువ్వతన్ని తప్పుగా అర్థం చేసుకున్నావేమో!””

          “మనిషికీ మనిషికీ మధ్య మొదటగా ఆర్థిక బంధాలు చోటుచేసుకుంటేనేగా, అవి అనుబంధానికి దారితీసేది? ఇద్దరు పసిపిల్లల మధ్య స్నేహం ఆటబొమ్మని పంచుకోవడంతోనో, కేడ్‍బరీ ఇచ్చిపుచ్చుకోవడంతోనో ప్రారంభమవుతుంది. ఏమీ ఇవ్వలేనివాడు కనీసం తన హృదయాన్నేనా ఇవ్వగలగాలి. అతను అన్నీ నా నుంచే ఆశించాడు””

          నేను ఇంకేమీ మాట్లాడకుండా ఫోన్ పెట్టేసాను. అంత అర్థాంతరంగా పెట్టేసినా మళ్లీ మోగలేదు.

          ఆలోచనలో పడ్డాను. వాసంతి గుండెలోతు కొలవాలనుకున్నాను. అదొక మహాబిలంలా లోనికి లాక్కుని అంతు తెలియని మరిన్ని అగాథాలను చూపిస్తోంది. ఈ ప్రస్థానానికి గమ్యం ఏమిటి? బిలానికి అవతలి ఒడ్డు అంటూ ఉండదు. అంతూ దరీ లేని ఈ శోధన నేనెందుకు చెయ్యాలి? ఆమె ఒక స్త్రీ. ప్రేమించక పోయినా సామంత్ ని ద్వేషించలేదు. రక్తస్పర్శకి చలించింది ఆమె నా భార్య . నన్ను ప్రేమించకపోయినా నిబద్ధతతో ఉంది. మనిషికీ మనిషికీ మధ్యనున్నవి ఆర్థికసంబంధాలే కాబట్టి నిబద్ధత గల భాగస్వామి దొరకడం అదృష్టం అనుకోవాలి.

          నా మనసులో కమ్ముకున్న మేఘాలన్నీ తొలగిపోయి ప్రశాంతంగా మారింది. ఆ మేఘాల్లో ఒక మేఘంగా సామంత్ జ్ఞాపకం కూడా చెదిరిపోయింది.

          మరుసటిరోజు వుదయాన్నే మా మామగారు రావటం కొసమెరుపు.

          “నేను చూసుకోవలసిన వ్యవహారంలోకి మీరిద్దరూ వెళ్లి చక్కబెట్టి వచ్చింది ఇలా దెబ్బలాడుకోవటానికా? చదువూ సంధ్యా లేనివాడికి మేనల్లుడైతే మాత్రం పిల్లనిస్తానా? వాసంతి విజ్ఞత గల పిల్లగాబట్టి అలాంటి ప్రలోభంలో పడలేదు…”” అని కోప్పడ్డారు.

          “తప్పైందండీ!”” అనక తప్పలేదు నాకు. వాసంతితో కూడా.

***

( విపుల – సెప్టెంబర్ 2000, గుండెలోతు స్వీయ సంపుటి, వాసిరెడ్డి నవీన్‍గారి “”కథ”” వార్షిక సంకలనం. ఇంగ్లీషులోకి అనువదించబడి, సాహిత్య అకాడమీ అనువాద కథా సంకలనం Beyond the Backyard లో వచ్చింది )

***

ఎస్.శ్రీదేవి  పరిచయం :

          పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి పోలవరంలో జననం. వరంగల్లో వుద్యోగం. హెడ్డుపోస్టుమాస్టర్ వరంగల్లో స్వచ్చంద పదవీ విరమణ.

          మొదటి కథ ‘ అనగనగా ‘ 1978లో వనితాజ్యోతి మాసపత్రికలో అచ్చైంది. వీరివి 225కి పైగా కథలు, 9 నవలలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి.

          సాహితి అనేది కలం పేరు.

          గూడు, సింధూరి, గుండెలోతు అనే కథాసంపుటాలు, నీలి నక్షత్రం అనే నవల పుస్తకాలుగా వచ్చాయి. ప్రేమలోంచీ ప్రేమలోకి అనే నవలకి ఆంధ్రభూమి ప్రథమ, ‘తిరస్కృతులు,’ ‘నీకోసం నేను ‘ అనే నవలలకి ఆంధ్రభూమి ద్వితీయ 5-3-2 అనే నవలకి కినిగె ద్వితీయ బహుమతులు వచ్చాయి. సింధూరి అనే సంపుటానికి శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి అవార్డు 2005కిగాను వచ్చింది. గూడులోని కథలను వరంగల్ ఆల్ ఇండియా రేడియోలో ప్రసారం చేసారు. ఇవే కాక మరో మూడు నాలుగు కథలు, ఒక రెండు నాటికలు కూడా రేడియోలో వచ్చాయి. ‘ఎంతెంతదూరం? ‘ అనే కథకి విపుల కన్సొలేషన్ బహుమతి, శ్రీమతి రంగవల్లి ట్రస్ట్ అవార్డు వచ్చాయి. ‘అధిరోహణం ‘ అనే కథకు ఆటానుంచీ, ‘ఆవిడ మా అమ్మే ‘కు సీపీ బ్రౌన్ అకాడమీ నుంచీ, ‘ఆమె విజేత కాదు ‘ చినుకు నుంచీ, ‘ రూపాయి చొక్కా ‘ కు భూమిక నుంచీ ఇలా వివిధ కథలకు ఏడెనిమిది బహుమతులు వచ్చాయి. కథలకు కాన్వాస్ పెద్దదిగా వుండాలనేది వీరి అభిప్రాయం.
https://may-ukha.com అనే వెబ్సైటు నడుపుతున్నారు.

*****

 

Please follow and like us:

6 thoughts on “కథామధురం-ఎస్.శ్రీదేవి”

  1. శ్రీమతి ఎస్ . శ్రీదేవి గారి గుండె లోతు కథ ఒక ప్రభంజనం . స్త్రీ ని అర్థం చేసుకోవడంలో పురుషుడు యుగ యుగాలుగా ఓడిపోతూనే వున్నాడు . ఆమె అంతరంగం ఒక అగాధం . దాని లోతు కొలవడం అసాధ్యం .
    ప్రతి వాక్యమూ ఆలోచింప జేసేదిగా వుంది
    గొప్ప కథ చదివిన అనుభూతి కలిగింది . రచయిత్రి కి అభినందనలు
    జి . రంగబాబు

  2. ముందుగా దమయంతిగారికీ, నెచ్చెలి టీమ్ కూ ధన్యవాదాలు. సమాజంలో ఈరోజుని అనేక సమస్యలు వున్నాయి. విషయాన్ని ఆచరణయోగ్యమైనపద్ధతిలో మనం అర్థం చేసుకోకపోవటంవలన, మనకేదో కావాలి, అదేదో ఎదుటివారు తెలుసుకుని ఇచ్చేస్తారులే అనే అస్పష్టమైన ఆశింపు వలన వచ్చే సమస్యలు ఇవన్నీ. పదిశాతంమాత్రమే జరిగిన సంఘటనయొక్క ప్రభావం వుంటుంది, మిగిలి 90శాతం మన స్పందనయొక్క అనే విషయాన్ని నేను చాలా బలంగా నమ్ముతాను.

  3. కథ, మరియు సమీక్ష రెండు బావున్నాయి.

  4. ఫేస్‌బుక్ లో శ్రీదేవి గారి కథలు చాలా చదివాను. ఎప్పటికప్పుడు చక్కని ఇతివృత్తం తో ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి ఆవిడ కథలు.
    జీవితం లో అన్ని పార్శ్వాలు తడమడమే కాదు, ఎక్కడికక్కడ చర్చించి పరిష్కారదిశ గా కథను ముగిస్తారు శ్రీదేవి. ఇటీవల కాలంలో ఇటువంటి రచనలు రావడం లేదు. శ్రీదేవి గారికి రావలసినంత పేరు రాలేదేమో అని నా భావన. కాత్యాయని గారు మంచి కథనే ఎంచుకున్నారు. నెచ్చెలి పాఠకులకు పరిచయం చేసి మంచి పని చేశారు.

Leave a Reply

Your email address will not be published.