పువ్వు పూసింది

(నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో మూడవ బహుమతి రూ.1000/- పొందిన కథ)

– శింగరాజు శ్రీనివాసరావు

          కొత్తగా కొన్నఅపార్టుమెంటులో సాయంవేళ  కాలక్షేపం కోసం కిందికివచ్చి లాన్లో కూర్చుంది విహారిక. అదొక గేటెడ్  కమ్యూనిటీ కావడం వల్ల ఆటస్థలంలో పిల్లలందరూ చేరి ఆడుకుంటున్నారు. సుమారు నాలుగు వందల ఫ్లాట్లు ఉన్నాయి అందులో. విహారికకు సమీపంలో చుట్టూవున్న యాభై ఫ్లాట్లకు సంబంధించిన ఆట స్థలమది. అటుయిటుగా ఓ ఇరవై మంది పిల్లల వరకూ ఆడుకుంటున్నారక్కడ. అందరూ పది సంవత్సరాలలోపు పిల్లలే. వాళ్ళను చూస్తుంటే విహారిక మనసులో ఏదో వెలితి తొంగిచూసింది.

          మాళవ్యతో పెళ్ళయిన పది సంవత్సరాల తరువాత తన సొంతయింటి కల నెరవేరింది కానీ, ఎదురుచూస్తున్న మాతృత్వం మాత్రం దక్కలేదు. చెయ్యని పూజలు, హోమాలు లేవు. తిరగని ఆసుపత్రులు లేవు. కనపడిన ప్రతి చెట్టుకు, రాతికి మ్రొక్కినా ఆమె కడుపు పండలేదు.

          ఈ సమాజంలో అప్రజాతలంటే అదొక చిన్నచూపు. కన్నబిడ్డలు కంటితో చూడక ఆశ్రమాలపాలు చేస్తున్నా, పిల్లలు లేని వారిని చూస్తే వెక్కిరించనివారు ఉండరు. మాతృత్వం గొప్పదే కానీ మాతృత్వమే జీవిత పరమార్థం కాదు కదా. కానీ,  ఈ నవ నాగరిక ప్రపంచంలో కూడ పిల్లలు లేని వారి పట్ల లోకం జాలి చూపులే చూస్తుంది. చంద్రమండలాన్ని చేరుకున్నా, ఆదిమ జాతి లక్షణాలు మనలో పోలేదంటే, దానికి ఇదొక తార్కాణం. “అపుత్రస్యగతిర్నాస్తి” అనుకునే పిచ్చిలోకం నుంచి “ఆడపిల్లయితేనేం” అనుకునే స్థితికి రావడానికి కొన్నిదశాబ్దాల కాలం పట్టింది. ఇక “పిల్లులేకపోతేనేం” అనే స్థితప్రజ్ఞతకు చేరుకోవడానికి మనకు ఇంకెన్నిశతాబ్థాలు పడతాయో. పిల్లలు జీవితంలో భాగమే కానీ, పిల్లలే జీవితం కాకూడదు. ఈ ఆలోచన మనకు రావడానికి ఇంకెంత కాలం ఎదురు చూడాలో…

          అందుకే విహారికకు ఎదురవుతున్నసూటిపోటి మాటలకు తోడు, తనకై తనకే పిల్లలు లేరనే బెంగ కూడ జతకావడంతో ఆమె మరీ కృంగిపోసాగింది. ఇంతలో ఒక బంతి వచ్చి ఆమె ముందు పడడంతో దాన్నిచేతిలోకి తీసుకుంది.

          “ఆంటీబాల్  నాది. ఇవ్వరా” అంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు ఒక అయిదేళ్ళ కుర్రాడు. పచ్చగా దబ్బపండులా మెరిసి పోతున్నాడు. దగ్గరకి వచ్చిన బాబుకు బంతిని ఇస్తూ చూసింది. అతని పెదవుల మధ్య చీలిక ఉంది. బహుశా గ్రహణపుమొర్రి కాబోలు అనుకుంది. పాపం అంత చక్కటి పుటకను ఇచ్చిన భగవంతుడు ఇంత చిన్న లోపాన్ని ఎందుకు పెట్టాడో అనుకుంది. వెంటనే తనలో తనకే అనిపించింది. అన్నీఇచ్చిన భగవంతుడు నాకు మాత్రం పిల్లలను కనలేని లోపం పెట్టలేదా అని అనుకుంది. అన్నీఅందరికీ తృప్తిగా సమకూరిస్తే ఇక తనను పట్టించుకునేవారు ఉండరమోనని కాబోలు ఆ దేవుడు మనుషులకు ఎక్కడో ఒకచోట ఏదోఒక లోపం చేస్తూనే ఉంటాడు.

          “ఆంటీబాల్” అని మరల అడగటంలో ఆలోచనలను వదిలిపెట్టి వాడికి బంతిని ఇస్తూ దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంది. వాడు బాల్  తీసుకుని బుగ్గ తుడుచుకుంటూ పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు.

          మరల ఆలోచనలో పడిపోయింది విహారిక.

          ఇప్పటికే నలభైయవపడిలో పడబోతున్నాను. ఇంకా పిల్లలు పుడతారని ఎదురుచూసే కంటే ఎవరినైనా దత్తత తీసుకుంటే ఎలా ఉంటుంది? పాపం మాళవ్య ఎన్నోసార్లు ఈ ప్రపోజల్  పెట్టాడు. కానీ తనే సుముఖత చూపలేదు. పుట్టడం, పుట్టక పోవడం తరువాత.. ముందు ఎవరినైనా దత్తత తెచ్చుకోవాలి. లేకుంటే ఇదే ఆలోచనలతో పిచ్చిదాన్నయినా అయిపోతాను.

          ఆ ఆలోచన రాగానే ఒక రకమైన భయం పట్టుకుంది ఆమెకు. ఎలాగూ భర్తకు ఇష్టమే కనుక దత్తత తెచ్చుకోవడం ఏమంత పెద్ద కష్టం కాదు. ఈ రోజే మాళవ్యతో చెప్పి ఏదైనా మంచి అనాథాశ్రమంలో పేరు రిజిష్టరు చేసుకుని ప్రయత్నిస్తే సరిపోతుంది. ఇదే ఆలోచనలో ఉన్న విహారిక ఫోనుమ్రోగడంతో ఈ లోకంలోకి వచ్చి పడింది.

          మాళవ్య నుంచి ఫోన్కాల్.

          “హలోచెప్పండి”

          “విహా.. నేను ఇంకో అరగంటలో వచ్చేస్తాను. ఈ రోజు డిన్నర్  సంగీతలో చేద్దాము. ఎందుకో ఇద్దరమూ అలా బయటికి వెళ్దామనిపించింది. రెడీగా ఉండు. సరేనా”

          “నీకిష్టమని ఉదయం చేసిన సాంబారు కూడ ఉంచాను. సడన్గా ఏంటి ఈ నిర్ణయం”

          “ఫ్రిజ్లో పెట్టి రేపు పనమ్మాయికి ఇద్దువులే. బాగా విసుగ్గా వుంది విహా.. ప్లీజ్.. కాదనకు”

          “సరే స్వామీ అలాగే” అని ఫోను కట్చేసి లేచింది విహారిక.

***

          “ఇంతలో ఇంత మార్పేమిటి విహానీలో..మొన్నటిదాకా ఎవరినైనా దత్తత తెచ్చుకుందామంటే ససేమిరా అనే దానివి” కారు నడుపుతూ అడిగాడు మాళవ్య.

          “ఏమోనండీ..నాకుకూడ అర్థం కావడం లేదు. ఈ ఫ్లాటులోకి వచ్చిన తరువాతే నాకు ఈ ఆలోచన వచ్చింది. బహుశా ప్రతిరోజు పిల్లలను చూస్తుండడం వలన అలా అనిపించిందేమో. మనం కూడ నడి వయసులో పడబోతున్నాం కదా. అందుకే మనసు తొందర పెడుతున్నది”

          “పోనీలే.. ఇప్పటికైనా నా దారిలోకి వచ్చావు. కంటేనే పిల్లలా, పెంచుకుంటే మాత్రం కారా. అందులో మన స్వార్థమే కాదు, మరో పరమార్థం కూడ దాగుంది”

          “ఏమిటో అది”

          “ఏకారణం వలన అయితేనేం, అనాథగా మారిన ఒక బిడ్డ జీవితాన్ని మనం నిలబెట్టిన వాళ్ళమవుతాము కదా. పూర్వజన్మలో మనం పిల్లలను కని అనాథలుగా వదిలేశామేమో. అందుకే ఈ జన్మలో మనకు పిల్లలు లేకుండా చేశాడు ఆ దేవుడు. కనీసం ఇప్పుడైనా మనం ఆ పాపాన్ని కడుక్కుందాం”

          “ఏమో అంతదూరం నేను ఆలోచించ లేదు. మన ఇంట్లో ఒక పసిబిడ్డ తిరుగాడాలని నా కోరిక. అందుకే ఈ దత్తతకు ఒప్పుకున్నాను”

          “ఏదో  ఒకటిలే. మనం కూడా అమ్మ, నాన్నఅనిపిలిపించుకునేలా ఉంటే చాలు. అదుగో మనం ఎంచుకున్న దత్తత కేంద్రానికి వచ్చేశాం. మాటల్లోపడి దూరమే తెలియలేదు” అంటూ కారును పక్కకు పార్కు చేసి, విహారికతో సహా ఆశ్రమం వైపుకు కదిలాడు మాళవ్య.

***

          “సర్. మీరు మీ వివరాలను ప్రత్యేకమైన వెబ్సైట్లో ఆన్లైన్లో  నమోదు చేసి మీ పేరును ముందు రిజిస్టరు చేసుకోండి” అని ఒక దరఖాస్తు ఫారంను మాళవ్యకు అందించింది అక్కడి నిర్వాహకురాలు సంధ్య.

          “మేడమ్  అవన్నీఅయిపోయాయి. మీ ఆశ్రమాన్ని మేము ఎంచుకున్నాము. ప్రభుత్వానికి చెల్లించ వలసిన ఫీజు కూడ చెల్లించాము. ఇక మిగిలిన వివరాలన్నీ మీరు చూస్తారని చెప్పారు. ఇవిగోండి దానికి సంబంధించిన కాగితాలు” అని కొన్నిపేపర్లు తీసి ఇచ్చాడు మాళవ్య.

          “అవన్నీమా ముకుందంసార్  చూస్తారు. ఆయన ఒక గంటలో వస్తారు” చెప్పింది అక్కడి ఆయా సంధ్య.

          “మేడమ్..రిజిస్టరు చేసిన ఎన్ని రోజులకు మాకు బిడ్డను ఇవ్వ గలుగుతారు” అడిగింది విహారిక.

          “ఇన్నిరోజులకని మేము నిర్దిష్టంగా చెప్పలేము మేడమ్. మీ దరఖాస్తును మాత్రం వెంటనే వరుస క్రమంలో ఉంచుతాము. మీరు చూస్తానంటే అందుబాటులో ఉన్న ఇద్దరు పిల్లలను చూపిస్తాను. మీకు నచ్చినట్లయితే అన్ని ఫార్మాలిటీస్  పూర్తిచేసి వారంలోపు మీకు బిడ్డను అప్ప చెపుతాము” చెప్పింది సంధ్య.

          ఇంతలో “ఆయమ్మా..గ్లాసులన్నీకలిగి పెత్తాను. నాకు ఇప్పులైనా ఉప్మా పెలతావా” అంటూ వచ్చింది ఓ చిన్నపాప.

          పచ్చటి పసిమి వన్నెతో, పాల బుగ్గలతో, వంకీలు తిరిగిన జుట్టుతో పాత కాలంలోని మర్ఫీ రేడియో మీద పాపలా ముద్దుగా ఉంది.

          “వెళ్ళి అక్కడ చెంబుతీసుకుని బక్కెట్లో నీళ్ళు ముంచి అక్కడి పూల కుండీలలో పొయ్యి. ఈ లోపుగా నేను వస్తాను. అప్పుడు పెడతాలే వెళ్ళు” సంధ్య మాటలలో మృదుత్వం లేదు.

          “ఆకలిగా ఉంది ఆయమ్మా. తినేసి పోత్తాను” పొట్ట తడముకుంటూ అడిగింది ఆ పాప.

          ఆ మాటలకు చలించి పోయింది విహారిక.

          “పాపం పసిబిడ్డ. ఆకలి అని అడుగు తున్నది. వెళ్ళి పాపకు టిఫిన్పెట్టి రండి. మేము వెయిట్చేస్తాం” చెప్పింది విహారిక.

          “అది అంతే మేడమ్. దానికి ఆకలి ఎక్కువ. ఇదే మా ఆశ్రమానికి పట్టిన దరిద్రం. దాని విషయం వదిలెయ్యండి. మీరు చెప్పండి”. సంధ్య మాటల్లో పాపంటే చులకన భావం కనిపించింది విహారికకు.

          “తను పసిబిడ్డమ్మా. ఎవరి బిడ్డయినా ఆకలి అని అడిగితే, మన పనులన్నీ పక్కనబెట్టి వారి ఆకలి తీర్చడం పెద్దవారిగా మన ధర్మం. ముందు వెళ్ళి పాపకు టిఫిన్పెట్టిరామ్మా” కల్పించుకుని చెప్పాడు మాళవ్య.

          “దానివన్నీ నాటకాలు సార్. మీకు తెలియదు. నాలుగేళ్ళ క్రితం ఎవరో తెచ్చిదీన్ని మా ఆఫీసు ముందు వదిలేసి వెళ్ళారు. బిడ్డ ఎర్రగా, బుర్రగా ఉందని చేతిలోకి తీసుకుని చూస్తే, ఇంకేముంది ఒకకన్నులో పువ్వు పూసి ఉంది. అంటే దీనికి ఒక కంటికి చూపులేదన్న మాట. బహుశా అందుకే ఇక్కడ వదిలి వెళ్ళారనిపించింది. ఒక రెండు సంవత్సరాల పాటు వచ్చిన అందరికీ చూపించాము. కానీ ఎవరూ దాన్ని దత్తత తీసుకోవడానికి ముందుకు రాలేదు. కడుపున పుడితే తప్పదు కానీ, దత్తత తీసుకునేటప్పుడు ఈ గుడ్డిది ఎందుకు, మంచి బిడ్డనే తీసుకోవాలనుకుంటారు కదా.
అందుకే ఇది ఇలా ఆగిపోయింది” వివరం చెప్పింది సంధ్య.

          “అయినా పసిపిల్ల కదమ్మా. దాని చేత పనులు చేయించడం ఏమిటి? మీ దగ్గర మిగిలి పోయిందని అలా చూడడం తప్పు కదా” ఏదో చెప్పబోయింది విహారిక.

          “భలేవాళ్ళే మేడమ్. ఎందుకు చూడను. అది నా బిడ్డ లాంటిది. అందుకే పని నేర్పిస్తున్నా” సర్దింది సంధ్య.

          “ఒక్కసారి పాపను పిలుస్తారా” అడిగాడు మాళవ్య.

          “ఎందుకు సార్” అడిగింది సంధ్య.

          “ఒకసారి పిలవండి” విహారిక కూడ అడిగింది.

          కాదనలేక పిలిచింది సంధ్య.

          “కుట్టి..ఇలారా”

          పిలుపు వినడమే ఆలస్యం పరిగెత్తుకుంటూ వచ్చింది ఆ పాప.
దగ్గరకు రమ్మని పిలిచాడు మాళవ్య. భయం భయంగా వచ్చింది కుట్టి.

          “ఆకలవుతుందా అమ్మా” అడిగింది విహారిక. తలూపింది కుట్టి.
బ్యాగులో నుంచి బిస్కెట్స్కె ప్యాకెట్  తీసి ఇచ్చాడు మాళవ్య.

          ఆయా వైపు చూసింది కుట్టి. తలవూపింది సంధ్య. తీసుకున్నది కుట్టి. అప్పుడు నిశితంగా పరిశీలించింది విహారిక. కంటిలో పువ్వు ఏర్పడిన లోపం తప్ప కుందనపు బొమ్మలా ఉంది పిల్ల. ఆలోచనలో పడింది విహారిక.

          “ఆంటీ బుజ్జిపాప కోసం వచ్చారా. ఆయమ్మ చెప్పింది. నన్ను బయతికి లావద్దంది. ఆకలేసి వచ్చాను” అంటూ ఇంకా ఏదో చెప్పబోయింది కుట్టి.

          “వాగింది చాలు. పో లోపలికి. ఎవరొచ్చినా శిఖండిలా తగలడతావు అడ్డం. నిన్నెవరూ తీసుకెళ్ళరు పో” అని కసురుకుంది సంధ్య.

          “సారీ..ఆయమ్మా..నాకు కన్ను లేదని ఎవరూ ఎత్తుకు పోరని రోజూ చెప్తావుగా.. నేను దరిద్రమని అంతావుగా..పోతున్నా” ఏడుస్తూ వెళ్ళింది కుట్టి.

          తెలియకుండానే కళ్ళలో నీళ్ళు తిరిగాయి విహారికకు. అయిదేళ్ళ పసిబిడ్డకు తనను ఎవరూ తీసుకుపోరని, తను దరిద్రురాలినని తెలిసి తిరిగి చెప్పిందంటే, ఎన్నిసార్లు ఈమె ఆ మాటలు అని ఆ పసిగుండెకు గాయం చేసిందో.  సంధ్య మీద బాగా కోపమొచ్చింది విహారికకు.

          “సార్..పిల్లలను తీసుకురమ్మంటారా”  అడిగింది సంధ్య.

          విహారిక వైపు చూశాడు మాళవ్య. మనసంతా అల్లకల్లోలంగా ఉంది విహారికకు. కుట్టి గురించిన ఆలోచనలే చుట్టుముడుతున్నాయి. మెదడు పని చేయటం మానేసింది. ఇప్పుడు ఏ నిర్ణయమూ తీసుకునే స్థితిలో లేదు ఆమె.

          “మాళవ్యా. మనసేమి బాగులేదు. రేపు మరల వచ్చిచూద్దాం. సారీ మేడమ్..రేపు ఉదయం మరల వస్తాము.” అని లేచింది విహారిక. అనుసరించాడు మాళవ్య.

          వెళుతున్నవాళ్ళను చూసి వెటకారంగా నవ్వుకుంది సంధ్య. “ఇలా కుట్టిని చూసి జాలిపడి ఇలా చెప్పి వెళ్ళిన వాళ్ళు  తెల్లవారే సరికి దాని సంగతి మర్చిపోయి వేరేవాళ్ళను తీసుకువెళ్ళిన వారే అంతా”
అనుకుంది మనసులో..

***

          “మాళవ్యా.. నా ఆలోచన మంచిదేనంటావా”

          “కాదని అనలేను గానీ. ఇంకొక్కసారి ఆలోచించు. ఎందుకంటే ఆవేశపడి తెచ్చుకున్న తరువాత మరల తప్పుచేశామే అన్న భావన రాకూడదు”

          “మనకు లోపాలు లేనప్పుడు మనం ఇంకొకరిది లోపం అనాలి. భగవంతుడు నాకు గర్భంలో లోపం పెట్టాడు. దానికి కంటిలో లోపం పెట్టాడు. ఏ తల్లి కన్నబిడ్డో బంగారు తల్లిలా ఉంది. కన్నతల్లి కర్కోటకురాలై ఆ బిడ్డను అనాథను చేసింది. మనమెలాగూ అనాథను తెచ్చుకోవాలను కుంటున్నాము కదా. ఆ పిల్లనే తెచ్చుకుందాం. ఒక వేళ మనకే అలాంటి బిడ్డ పుడితే వదిలేస్తామా. లేదుగా. అక్కడ ఆ బిడ్డ పరిస్థితి చూస్తే జాలి వేస్తున్నది. నా మాటనమ్ము మాళవ్యా.  కంటికి రెప్పలా చూసుకుంటాను కుట్టిని” విహారిక మాటలలో నిజాయితీ కనిపించింది మాళవ్యకు.

          మాళవ్య ఏమీ మాట్లాడలేదు. లేచి వెళ్ళి విహారికను దగ్గరికి తీసుకున్నాడు.

          “విహా..నేను చాలా అదృష్టవంతుడిని. నా మనసులో ఆలోచన కూడ అదే. ఆ బిడ్డను చూడగానే తననే దత్తత తీసుకోవాలనిపించింది. లోపం లేని వారు ఎవరూ ఉండరు ఈ ప్రపంచంలో. దాన్నిసంతోషంగా స్వీకరించి ఆదరించడమే మానవత్వం” అంటున్న మాళవ్య కౌగిలిలో అలా ఒదిగి పోయింది విహారిక.

***

          వాళ్ళు ఆశ్రమంలో అడుగు పెట్టేవేళకు అక్కడి వాతావరణం నిన్నటిలా కనిపించ లేదు. సంద్యను గట్టిగా మందలిస్తున్నాడు ఒకతను. బహుశా అతనే ముకుందం అయి వుండవచ్చు.

          “నీకసలు బుద్ధి ఉందా. నిండా నాలుగేళ్ళు లేని పసిదాన్నికొట్టుకు పంపుతావా. మనది పిల్లలను దత్తత ఇచ్చే కేంద్రం కానీ, ప్రాణాలు తీసే కేంద్రం కాదు. దాన్ని పోషిస్తున్నది నువ్వు కాదు కదా. ఎందుకు అదంటే అంత ద్వేషం. ఆయా అంటే అమ్మతో సమానం. ఇంతకు ముందు కూడ నీ వల్ల పొరపాట్లు జరిగాయి. ఇప్పుడు దాని ప్రాణానికే ప్రమాదం వచ్చింది ” గయ్యిమంటున్న ఆఫీసర్  ముకుందం వీళ్ళను చూసి ఆపాడు.

          “మీరేదో సమస్యలో ఉన్నట్లున్నారు. మేము మరల వస్తాము లెండి” అన్నాడు మాళవ్య.

          “అదేం లేదు రండి. మీరు నిన్న రిజిస్టరు చేయించుకున్న వారేనా” అడిగాడతను.

          అవునని తలూపాడు మాళవ్య.

          “రండిసర్  కూర్చోండి. ఒక పదినిముషాలు సర్. ఇక్కడ ఉన్న పిల్లకు చిన్న యాక్సిడెంటు అయింది. పక్కనే ఆసుపత్రిలో చేర్చాము.  ఒక్కసారి వెళ్ళి ఎలా వుందో చూసి వస్తాను. రాగానే మనం మాట్లాడుకుందాం” అని చెప్పి లేచాడతను.

          “ఎవరికండీ యాక్సిడెంట్..కుట్టికి కాదు కదా” ఇందాక అతను అరుస్తున్నపుడు అతని మాటల్లో కుట్టి అని వినిపించేసరికి అనుమానంగా అడిగింది విహారిక.

          “ఆ పాపకేనండీ. ఈ సంధ్యే ఉదయాన్నేదాన్నిపేస్టు తెమ్మని బంకుకు పంపింది. అది కొనుక్కుని తిరిగి వచ్చేటప్పుడు ఎవరిదో స్కూటరు తగిలి కిందపడి అక్కడవున్న రాయి తలకు కొట్టుకుంది. ఆ కుర్రాడే పాపను ఆసుపత్రిలో చేర్పించాడు. అది చూసిన బంకు అతను నాకు ఫోనుచేస్తే ఇప్పుడే వచ్చాను. ఇదంతా ఈవిడ నిర్వాహకమే. పసి పిల్లకు ఏమవుతుందోనని భయంగా ఉంది. అయినా కుట్టి మీకెలా తెలుసు” అడిగాతను.

          “వివరాలు తరువాత సర్. ముందు ఆసుపత్రికి వెళ్దాము పదండి” అని లేచింది విహారిక. ఆమె మనసు కీడు శంకిస్తున్నది. తన దురదృష్టం ఆ పిల్లకు అంటుకుందేమో. తను దత్తత తీసుకోవాలనే సరికి ఇలా జరిగిందేమో. నా ముఖాన పిల్లలను పెంచే అదృష్టం లేదేమో. భగవంతుడా కుట్టికి ఏమీ కాకుండా చూడు. నా మూలంగా దాని ప్రాణానికి ప్రమాదం రాకుండా  కాపాడు. మనసులోనే దేవుడికి దండాలు పెడుతూ బయలుదేరింది విహారిక.

***

          “తలకు బలమైన గాయం తగలడం వల్ల రక్తం ఎక్కువగా పోయి పిల్లకు స్పృహ తప్పింది. ప్రాణాలకు ప్రమాదం లేదు. కానీ రక్తం ఎక్కించాలి. ఎక్కడైనా ఒకబాటిల్  రక్తం తీసుకురండి” చెప్పాడు డాక్టర్.

          “మీ ఆసుపత్రిలో లేదా డాక్టర్” అడిగాడు ముకుందం.

          “పాపది ”ఓ’ నెగటివ్  బ్లడ్ గ్రూప్. అది దొరకడం చాలా కష్టం సర్. మా దగ్గర లేదు. ఏదైనా పెద్ద బ్లడ్బ్యాంకులో ప్రయత్నించండి” చెప్పాడు డాక్టర్.

          “సార్..నాది కూడ ‘ఓ’ నెగటివ్ బ్లడ్ గ్రూపే. నేను రక్తం ఇవ్వచ్చా పాపకి” వెంటనే స్పందించింది విహారిక.

          “విహా..నువ్వు…” ఏదో చెప్పబోయాడు మాళవ్య.

          “ప్లీజ్..మీరేమీ మాట్లాడకండి. అవతల పసిబిడ్డ ప్రాణమండి” ఏడుస్తున్నది విహారిక.

          “మేడమ్..మీరు తొందర పడకండి. నేనే ఎలాగో ప్రయత్నించి తెస్తాను” అడ్డు చెప్పబోయాడు ముకుందం.

          “ఫర్వాలేదు సర్. ఆలస్యం అయితే కష్టం కదా. నాకేమి పర్వాలేదు. పదండి డాక్టర్” అంటూ కదిలింది విహారిక.

          “సరే రండి” అని విహారికను తీసుకుని వెళ్ళాడు డాక్టర్.

***

          “అంకుల్..నన్ను ఎక్కడికి తీసుకు వెళుతున్నారు” కారులో విహారిక పక్కన కూర్చుని అడిగింది కుట్టి.

          “ఏమో..నాకు తెలియదు. పక్కనే ఉందిగా మీ అమ్మనడుగు” నవ్వుతూ అన్నాడు మాళవ్య.

          “అమ్మా…ఎవరు ఆంటీ నాకు అమ్మ”  అడిగింది కుట్టి.

          “నేనేతల్లీ మీ అమ్మను. మనం మనింటికి వెళుతున్నాం. ఇక నువ్వు ఎక్కడికీ వెళ్ళనక్కర లేదు. నీకెవరూ ఏపనీ చెప్పరు. మహరాణిలా ఉండవచ్చు. నేనే మీ అమ్మ, ఆయనే మీ డాడీ. సరేనా” కంటనీరు అదిమి పట్టి చెబుతున్నది విహారిక.

          “నేను దరిద్రమని, నన్నుఎవరూ తీసుకుని వెళ్ళరని ఆయమ్మ చెప్పిందిగా” అమాయకంగా అడిగింది కుట్టి.

          “తప్పమ్మా..నువ్వు దరిద్రురాలివి కాదు. బంగారు తల్లివి. ఆయమ్మ తెలియక అన్నది. నువ్వు మా ఇంటి మహలక్ష్మివమ్మా” కుట్టిని గుండెకు హత్తుకుని బొటబొట కన్నీరు కార్చింది విహారిక.

          “నాకు ఒక కన్నులో పువ్వు పూసిందని నన్ను రోజూ తిట్టేది ఆయమ్మ. అమ్మా.. నువ్వు కూడ అలాగే అరుస్తావా” కుట్టి మాటలకు గుండెలో దేవినట్టు అనిపించింది విహారికకు.

          “నువ్వు మా ఇంటవెలసిన పువ్వువమ్మా.. నీ కంటిలోనిది పువ్వు కాదమ్మా..చిన్నమచ్చ. నువ్వు పెద్దయ్యేలోపు అది పోతుంది. పోయేలా చేస్తాను. అమ్మ నిన్ను కంటికి రెప్పలా చూసు కుంటుంది. నువ్వు ఇక ఆయమ్మ గురించి, ఆ ఆశ్రమం గురించి మర్చిపో. అదిగో చూడు మన ఇల్లు వచ్చేస్తున్నది. అక్కడ నీకు ఆడుకోను బొమ్మలు, స్నేహితులు అందరూ ఉంటారు. హాయిగా ఆడుకోవచ్చు. సరేనా” కుట్టి మాటలకు బదులు చెప్పాడు మాళవ్య.

          “నిజంగానా అంకుల్” అంది కుట్టి సంతోషంగా.

          “అంకుల్  కాదమ్మా..నాన్న” కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది విహారిక.

          “నాన్న..అమ్మ..భలేభలే..నిజంగా అలా పిలవచ్చా అమ్మా” ఆనందంతో కుట్టి అడుగుతున్న మాటలకు “నిజం తల్లీ..ఇక నుంచి నువ్వు మా బిడ్డవు. మా ఇంట విరిసిన పారిజాతానివి..మాకు దేవుడిచ్చిన బిడ్డవమ్మా” విహారికలో ఆనందం పొంగి పొరలింది.

          “అమ్మా” అంటూ విహారికను చుట్టేసింది కుట్టి.

          “చూశావా విహా..దైవలీల ఎంత చిత్రమైనదో. ఎక్కడ పుట్టిన బిడ్డో ఈనాడు నీఒడి చేరింది. నీ రక్తాన్ని తనలో నింపుకుని రక్తబంధంతో నీ బిడ్డయింది. అమ్మతనం శరీరంలో కాదు విహా మనసులో ఉంటుంది. కంటేనే కాదు, పెంచినా కూడ తల్లే. ఇప్పుడు నువ్వు అప్రజాతవు కావు. ఓ బంగారు తల్లికి తల్లివి. నీ బిడ్డకు ఆయన చేసిన లోపాన్ని తొలగించే మార్గాన్నిఆయనే చూపుతాడు. అన్నీ నీవే అయి పాపను పెంచు” అంటూ అపార్టుమెంటు లోపలికి కారును మళ్ళించాడు మాళవ్య.

*****

Please follow and like us:

4 thoughts on “పువ్వు పూసింది (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో మూడవ బహుమతి రూ.1000/- పొందిన కథ)”

 1. ఒక అవయవ లోపం తో పుట్టింది, కుట్టి. చిన్న పాప. పాపం ఆ పాప తప్పేమిటి? నువ్వు దరిద్రురాలివి అని మాతి మాటికి చెప్పి, ఆ చిన్న మనస్సు నీ గాయపర్చడం.
  అటువంటి వాళ్ళను కూడా ప్రేమించే ఒక హృదయం ఉంటుంది, పెంచుకునే తల్లి ఉంటుంది అన్అని నిరూపించారు.
  కథ చాలా బాగుంది.

  1. ఓ పువ్వు పూసింది చాలా ఆర్ద్ర మైన కధ
   సింగరాజు శ్రీనివాస రావు గారికి అభినందనలు
   యూవీరత్నం

Leave a Reply

Your email address will not be published.