పొలం ఒక బంధం

-గవిడి శ్రీనివాస్

కాసిన్ని చినుకులు రాలటం కాబోలు
నాల్గు మడి సెక్కలు
సూర్యుణ్ణి చూసి మురిసిపోతున్నాయి.

ఉత్సాహం ఉత్సవమౌతూ
కళ్ళల్లో వరి కలల కాంతులు
దర్శిస్తున్నాడు రైతు .

గుంపు కొంగల బారులా
వరినాట్లు నాటిన ఆడోళ్ళు.

నిజమే కదా
మట్టిని తాకిన పాదాలు
మొక్కలై  ఎదుగుతుంటాయి .
 
నడిచిన  మట్టి మీద
మమకారపు  పొరలు విప్పుకుంటాయి .

అస్థిత్వాన్ని నెత్తిన ఎత్తుకుని
పంట చేల కోసం
పాట మొలుస్తుంది .

రేపటి భయాలని
తలపాకలో చుట్టిన
ఇప్పటి సౌందర్యం .

రేపటి ఆకలి తీర్చటం లో
ఆర్ద్రత నిండిన అనుభవం ఎదురౌతుంది .

పంట సాగులో
పరిమళాన్ని  కళ్ళకు ఎత్తుకుని
సంబరాన్ని ఇంతింతగా
ఈ వర్షాకాలం లో
మోసుకుపోతుంటాడు  రైతు .

పక్షుల పలకరింపుల్ని
అలంకరించుకుని
ఆకుపచ్చగా మెరిసే రైతు .

పొలాల మధ్య వికశిస్తూ
పరిమళాన్ని జీవన జ్యోతిగా
పొలం ఒక బంధం గా  వెలిగిన రైతు .

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.