నారి సారించిన నవల-39

                      -కాత్యాయనీ విద్మహే

          మజిలీ నవలలో కథ రాజీ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ భవనం చేరటం దగ్గర మొదలవుతుంది. అక్కడ నుండి మూర్తి కర్ణాటక గవర్నర్ గా బదిలీ అయి ఉద్యోగుల నుండి వీడ్కోలు తీసుకొనటంతో ముగుస్తుంది. ఆయన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా ఉన్నకాలం రెండేళ్లు. మలుపులు నవలలో కథ 1996-97 లో ముగుస్తుంది. దానికి కొనసాగింపు కథే కనుక రెండేళ్ల కాలం మీద సాగిన మజిలీ నవల కథాకాలం  1997- 1999 అనుకోవచ్చు. ఈ నవల  చివర  కార్గిల్ యుద్ధప్రస్తావన ఉంది. అది భారతదేశానికి పాకిస్థాన్ కు మధ్య 1999 మే 3న మొదలై జులై 26 వరకు జరిగిన యుద్ధం. కార్గిల్ యుద్ధంలో మరణించినవారి శవపేటికలు వస్తుంటే గవర్నర్ వెళ్లి అశ్రుతర్పణం ఇయ్యటం గురించి రాజీ చెప్తూ ఆ మరణాల వల్ల రోజులు బాధాకరంగా గడుస్తున్నాయి అంటుంది. ఆ తరువాత దివాలీ ఉత్సవాల గురించిన ప్రస్తావన కూడా ఉంది. అంటే నవలలో కథ 1999 నవంబర్ నాటికి ముగిసింది అనుకోవచ్చు. 

          హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ భవన ప్రాచీనతకు సంబంధించిన చరిత్ర, ఐతిహాసిక కథనాలు అందులో జరిగిన జాతీయ అంతర్జాతీయ చారిత్రక ఒప్పందాలు, భవన వైశాల్యం, నిర్మాణం, అందులోని పురాతన వస్తుసామాగ్రి, శిధిలమవుతున్న భవన విభాగాలను పునరుద్ధరించే పనులు, గవర్నర్ భవనానికి చుట్టు పక్కల ఉన్న ఇతర చారిత్రక భవనాలు మొదలైనవి విపులంగా గవర్నర్ ఆంతరంగిక కార్యదర్శిగా చేపట్టి నిర్వహించిన విధుల గురించిన కథనంలో భాగంగా ఇందులో వర్ణించబడ్డాయి. గవర్నర్ భవనంలోని ఉద్యోగి వ్యవస్థను, గవర్నర్ భవన నిర్వహణలో తమదే కీలకమైన పాత్ర అన్నట్లుగా ప్రవర్తించే అధికారుల చిత్తప్రవృత్తులను, గవర్నర్ కి తామే దగ్గరి వాళ్ళం అని నిరూపించుకొనటానికి ఎప్పటికప్పుడు పోటీ పడుతూ గవర్నర్ కు అతని భార్యకు కూడా దగ్గరి మనిషి అయిన రాజీ పట్ల ఈర్ష్యను కనబరిచే పెద్ద అధికారుల చిన్న బుద్ధులను ఈ నవల చూపింది. 

          గవర్నర్ ఆంతరంగిక కార్యదర్శిగా అతనివెంట అన్ని కార్యక్రమాలకు హాజరవుతూ తన విధులను నిర్వహించటంలో భాగంగా హిమాచల్ ప్రదేశ్ లోని వివిధ ప్రాంతాలను , ఆయా ప్రాంతాలలో జరిగే పండుగలను, ఉత్సవాలను చూస్తూ రాజీ తెలుసుకున్నవి, అనుకున్నవి, అన్నవి, వనజతో మాట్లాడినవి, సహ ఉద్యోగుల నుండి విన్నవి- అన్నీ కలిసి హిమాచల్ ప్రదేశ్ భౌగోళిక ప్రత్యేకతలను, అందులోని సౌందర్యాన్ని, అదే సమయంలో ప్రాకృతికంగా జరగటానికి అవకాశం ఉన్న ప్రమా దాలను గురించి పాఠకులకు తెలియపరుస్తాయి. ప్రజల విశ్వాసాలు, మొక్కజొన్న వంటి పంటలు వచ్చాక చేసే మింజర్ ఉత్సవాలు, ఆ సందర్భంగా జరిగే మూడురోజుల జాతర, నృత్యగాన కళా విశిష్టతలు’ సిల్క్ బట్ట పై అందమైన కుట్టుపనితో తయారుచేసే రుమాళ్ళకు, చిత్ర పటాలకు, ఇత్తడి విగ్రహాలకు ప్రసిద్ధి అయిన చంబా జిల్లా హస్తకళల ప్రావీణ్యత, కాంగ్రా చిత్ర కళ, ఓలా గాంధీ సేవాశ్రమం, అక్కడి హస్తకళలు, మనాలి రోరిచ్ ఆర్ట్ గ్యాలరీ, కులు దసరా ఉత్సవాల ప్రత్యేకత, నహాన్ నవరాత్రుల ప్రత్యేకత, మత సామరస్యం, దేవుడికి సంబంధించిన విశ్వాసాలు మొదలైన వాటితో సుసంపన్నమైన హిమాచల్ ప్రదేశ్ సంస్కృతిని పరిచయం చేస్తుంది ఈ నవల. 

          గవర్నర్  తో పాటు అనేక ప్రాంతాలు పర్యటించిన ఆంతరంగిక కార్యదర్శి రాజీతో పాటు పాఠకులు కూడా పాంగీ, కిన్నోర్, కిబ్బర్ సిమ్లా, రోతాంగ్ పాస్, సిరిమోర్ , సహన్, చంబా, మనాలి, నాగ్గర్, పరవానూ, పాలంపూర్, కాంగ్రా, పొంగ్ డాం, పరాగ్ పూర్, ఉనా, హరిపూర్ దార్, పొంగి మొదలైన ప్రాంతాలలో తిరిగిన అనుభూతిని కలిగించే యాత్రా రచనగా సాగింది నవలా కథనం. ఓలా గ్రామం దగ్గర చింతపూర్ణి దేవాలయం, మహారాణా ప్రతాప్ సాగర్ వింతలు, నహాన్ జిల్లా దేవాలయాలు, పొంటాసాబ్ గురు ద్వారా, గోవింద సాగర్, నైనాదేవి మందిరం, లాహొల్ స్విట్టి బౌద్ధ ఆరామాలు, శిల్ప చిత్రకళలు, రామ్ పూర్  సంతలు, మొదలైన వాటి వివరాలతో , చిన్నపాటి వర్ణనలతో హిమాచల్ ప్రదేశ్ సందర్శన కుతూహలాన్ని రేపుతుంది ఈ నవల. 

          ఆగస్టు 15 , జనవరి 26  ఉత్సవ దినాలలో నగర  ప్రముఖులను పిలిచి విందులు ఇయ్యటం, సమావేశాలు ఏర్పాటు చేసి రాష్ట్రంలో సామాజికోపయోగ కార్యక్రమాలను నిబద్ధతతో చేసే వాళ్లకు అవార్డులు ఇయ్యటం, స్వచ్ఛంద సంస్థల కార్యక్రమాలకు, జిల్లాలలో కార్యక్రమాలకు ముఖ్య అతిధిగా వెళ్ళటం, ఛాన్సలర్ గ విశ్వవిద్యాలయాలను దర్శించటం, కార్యక్రమాలను, తెలుసుకొనటం, పర్యవేక్షించడం, ఎన్నికలు అయిన తరువాత మెజారిటీ పార్టీని పిలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయించటం, వరదలు వచ్చి గ్రామాలు మునిగిపోయి, ప్రజలు నిరాశ్రయులై అవస్థలు పడుతుంటే సహాయ కార్యక్రమాలు చేపట్టటం, అందు కోసం రెడ్ క్రాస్ వంటి సంస్థలను సన్నద్ధం చేయటం,  జిల్లాస్థాయి వరకు విస్తరింప చేయటం, దేశ విదేశ ప్రముఖ కళాకారులను పిలిచి ప్రతి ఏటా జరిపే వేసవి ఉత్సవాలు, హొలీ, దసరా వంటి ఉత్సవాలను ప్రారంభించటం, వాటిలో పాల్గొనటానికి వచ్చే కళాకారులకు, రాష్ట్రపతి మొదలైన వాళ్లకు రాజభవన్ లో విందులు ఇయ్యటం, పంచాయితీ మెంబర్లకు ఇచ్చే శిక్షణా కార్యక్రమాలను ప్రారంభించటం, లోక్ అదాలత్ వంటి నిర్మాణాల ప్రారంభోత్సవం మొదలైన గవర్నర్ కార్యకలాపాలు ఈ నవలలో భాగం అయ్యాయి. 

          ఇదంతా మామూలు పాఠకులకు పరిచయం లేని కొత్త ప్రపంచం అన్న మాట వాస్తవం. కానీ ఇంత మాత్రమే అయితే ఇది టూరిస్ట్ గైడ్ గానో రాజభవన్ కార్యకలాపాల సమాచార నివేదికగానో, మిగిలిపోతుంది. అలా కాకుండా దీనిని నవలగా చేసినది మానవ సంబంధాల అల్లిక. మానవ మనస్తత్వాలలోని వైరుధ్యాలు .. వైచిత్రి. జీవితంలో ఎదురయ్యే ఘటనలను, అనుభవాలను ఎదుర్కొన టంలో పడే సంఘర్షణ. పొందే  సమాధానం. గవర్నర్ ఆంతరంగిక కార్యదర్శిగా హిమాచల్ ప్రదేశ్ కు రావటానికి మొదట్లో సుముఖత చూపని రాజీ  తరువాత అంగీకరించటానికి కారణం గవర్నర్ భార్య వనజ. వనజను పరోక్షంగా పరిచయం చేసినవాడు రవికాంత్. తిరుపతి నుండి వస్తూ కారు యాక్సిడెంట్ లో ఒక్కగానొక్క కొడుకు చనిపోగా కాళ్ళు, ఒక చేయి చచ్చుబడి మానసికంగా కృంగిపోయి ఇప్పుడిప్పుడే కోలుకొంటున్న మనిషి వనజ. మూర్తికి ఆంతరంగిక కార్యదర్శి గా రాజీ అక్కడకు వెళితే  అవిటితనంతో కొత్త ప్రదేశంలో ఉండవలసిన ఆమెకు ఆసరా అవుతుందని రవికాంత్ అభిప్రాయం. అది చెప్పే ఆమెను ఒప్పించాడు. చదివి అభిప్రాయం చెప్పమని అతనిచ్చిన రచనలు వనజ వ్రాసినవే. కొన్ని ప్రేమించి పెళ్లాడిన స్త్రీ పురుషుల మధ్య ప్రేమ వ్యక్తీకరణలు కాగా మరికొన్ని యాక్సిడెంట్ తరువాత ఒక మానసిక వ్యధావస్థలో వ్రాసినవి. అంత గొప్పగా వ్రాసిన ఆమె తన జీవితం ఒట్టిపోయిం దన్న నిర్లిప్తతలో బతికేస్తున్న సమయంలో ఆమె మానసికంగా కోలుకొనటానికి రాజీ సాన్నిహిత్యం ఉపయోగపడుతుందన్న ఆశ రవికాంత్ ది. అది తెలిసి రాజీ  ఆ కొత్త పదవిని అంగీకరించకుండా ఉండలేక పోయింది.. 

          ఈ కొత్త ఉద్యోగాన్ని రాజీ వనజ పట్ల జాలితో కాక అభిమానంతో స్వీకరించింది. అభిమానం వనజ వ్రాసిన స్వగతాలలోని లోతును, గాఢతను అనుభవించటం వల్ల కలిగినది అని రాజీ మాటల్లోనే తెలుస్తుంది. ఆలా లభించిన ఆసరాను అల్లుకుపోవటం వనజ స్థితిలో ఉన్న ఎవరికైనా సహజమే. అందుకనే ఆమె రాజీని ఎక్కువసార్లు కలుసు కొనటానికి బ్రేక్ ఫాస్ట్, భోజనం, టీ అన్నీ తమతోపాటే తీసుకోవాలని ఆశిస్తుంది. అంటుంది. తాను అలా గవర్నర్ దంపతులతో గడపటం సాటి ఉద్యోగస్తులకు కాకా పట్టటంగా అనిపించే ప్రమాదం ఉందని సున్నితంగా తిరస్కరిస్తుంది రాజీ. రోజుకు ఒకసారి వచ్చి కలిసేట్లు ఒప్పిస్తుంది. ఎప్పుడనుకొంటే అప్పుడు రాజీని పిలిపించుకొనే అవకాశం లేకపోవటం వల్ల కలిగిన ఆశాభంగం నుండి రాజభవన్ నుండి రాజీ అద్దె ఇంటికి మకాం మార్చటం వనజకు దుఃఖకారణమే అయింది. అల్లాంటి నిస్సహాయ దుఃఖ సందర్భాలలో ఆమె అనే మాటలు ఒకటిరెండే అయినా అవి రాజీ అహాన్ని దెబ్బతీస్తాయి. అవి వాళ్ళిద్దరి మధ్యా ఘర్షణకు కారణం అవుతుంటాయి. అలాంటి సందర్భాలలో రాజీ చూపే అభిమానం విలువ తెలిసిన మనిషిగా వనజ దిగివస్తుంది. తన ప్రేమకథ,పెళ్లికథ ఏ సంకోచాలు లేకుండా చెప్పుకోగలిగిన స్నేహానుభవాన్ని రాజీ సమక్షంలో పొందింది వనజ. 

          రాజీ అయినా ఆమె పట్ల ఆప్యాయత చూపకుండా ఉండలేదు. గవర్నర్ గారి వెంట అన్ని కార్యక్రమాలకు వెళ్లివచ్చే రాజీ రాగానే ఆ విశేషాలన్నీ పూస గుచ్చినట్లు వనజకు వినిపించటంలోనైనా, రాజభవన్ మరమ్మతుల విషయంలో వనజ ఆలోచన, సలహా ఉండేట్లు చూడటంలోనైనా తన అసహాయతను తలచుకొని ఆమె క్రుంగి పోయే అవకాశం ఇయ్యకూడదనే  రాజీ ఉద్దేశం. వనజ ఒంటరి నిస్సహాయతకు గురికాకూడదనే వివిధ కార్యక్రమాల మీద గవర్నర్ తరచు చేసే పర్యటనలలో సాధ్యమైనంత వరకు ఆమె ఉండేట్లు చూడటం, ప్రయాణం సౌకర్యవంతంగా ఉండేట్లు శ్రద్ధవహించటం రాజీ ఒక పద్ధతిగా అభివృద్ధి చేసింది. అయితే రాజీ వనజ  పట్ల ఎంత అక్కరగా ఉంటుందో, అవసరాలు ఎంతకనిపెట్టుకొని చూస్తుందో అదే సమయంలో సంభాషణలో ఎప్పుడైనా తొంగిచూసే ఆమె అధికార స్వరాన్ని, అధికారపూర్వకమైన చనువును సహించలేక పోయేది. ధనశ్రీ వచ్చిపోయాక ఆమె రాజీ గతం గురించి చెప్పిపోయిన ఏవేవో సంగతులను గురించి వనజ రాజీని బోనులో నిలబెట్టినట్లుగా మాట్లాడినప్పుడు నన్నిలా ప్రశ్నించే హక్కు మీకు లేదు అని తన ఉద్యోగానికి రాజీనామా ఇయ్యటానికి సిద్ధపడింది. అలా తన అభిప్రాయాన్ని, నిరసనను ఖచ్చితంగా వ్యక్తీకరించటం రాజీ నైజం. ఈ విధంగా బలమైన రెండు వ్యక్తిత్వాల మధ్య సున్నితమైన భిన్న సందర్భాలలో  సంఘర్షణకు ఉన్న అవకాశాలను, వాటిని వాళ్ళు ఎదుర్కొని పరిష్కరించుకొన్న తీరును చిత్రించటం వలన నవల ఆసక్తికరంగా రూపొందింది. 

          మూర్తికి మంచి స్నేహితుడు, వనజకు ఆత్మీయుడు అయిన పెద్దమ్మ కొడుకు, వాళ్ళిద్దరి పెళ్ళికి అనుసంధానకర్త అయిన రవికాంత్ తరచు రాజభవన్ కు వచ్చిపోతూ ఉంటాడు. వనజ మాటతీరుకు నొచ్చుకొని ఉద్యోగ బాధ్యత నుండి తప్పుకుందాం అని రాజీ అనుకొన్నపుడల్లా వనజకు ఆమె ఆసరా ఎంత అవసరమో సర్ది చెప్పటం చూస్తాం. దాంపత్య జీవితంలో రవికాంత్ కు భార్యతో  పొసగనితనం, దాని పరిణామాలు ఈ నవల ఇతివృత్తంలో భాగం అయ్యాయి. విద్యార్థి దశ నుండి రాజకీయాలు ప్రవృత్తిలో భాగమైన రవికాంత్ ఆ పనుల మీద నిరంతర సంచారి. పారిశ్రామిక వేత్తకు ఏకైక కూతురు అయిన అతని భార్య తండ్రి వ్యవహారాలలో సాయపడుతూ పిల్లలతో పుట్టింట్లో వుండి అతన్ని కూడా అక్కడికే వచ్చి ఉండమంటుంది. అది రుచించని రవికాంత్ ఒంటరి తనానికి మందుగా తాగుడుకు అలవాటుపడి ఆరోగ్యాన్ని పాడుచేసుకొనటం వనజకు వ్యధా కారణం. అలా అదికూడా రాజీ ఆలోచనను ఆక్రమించిన సమస్యే. ఆ రకంగా ఈ నవలలో రవికాంత్ తో రాజీ ఘర్షణ కూడా ఎదో ఒక స్థాయిలో ఇతివృత్తంలో భాగమైంది. 

          రాజీ జీవితంలోనూ ఏదో అసంతృప్తి ఉన్నట్లు కనబడుతుంది. అందువల్ల ఆమె తనతో తాను కూడా ఎదో ఒక మేరకు ఘర్షణ పడుతుంది. ఆ అసంతృప్తిని అధిగ మించటానికే ఆమె నిరంతరం తనను తాను ఎదో ఒక పనిలో నిమగ్నం చేసుకొంటుం దేమో అనిపిస్తుంది. అందంలో, శారీరక సౌష్ఠవంలో చదువులో, సంస్కారంలో సమ ఉజ్జీలు పరస్పరం ప్రేమ, చనువు ప్రదర్శించుకో గల దంపతులు అయిన మూర్తి వనజలతో సాన్నిహిత్యం మనసు లోపలికి నెట్టేసిన ఆ అసంతృప్తిని ఏమయినా తట్టి లేపిందా అనిపిస్తుంది. రవికాంత్ పరిస్థితికి, అనారోగ్యానికి చింతిస్తూ తన అవిటి తనంతో అందరినీ హైరానా పెడుతున్నాని ఏడ్చేసిన వనజను ఎలా ఓదార్చాలో అర్ధంకాక  రాజీ తికమక పడుతున్నప్పుడు అక్కడికి వచ్చిన గవర్నర్ గారు ఒంట్లో బాగాలేదా అని భార్యను పరామర్శించి డాక్టరును పిలిపించి చూపిస్తాడు. మర్నాడు ఉదయం వనజను చూసి ఒక రాత్రి విశ్రాంతి, మూర్తిగారి సంపర్కంతో తేరుకొన్నది అని సమాధానపడిన రాజీ అప్రయత్నంగా తన గురించిన ఆలోచనలో పడుతుంది.

          “తనకే మానసిక బాధలూ లేవు..బాధపడే తీరికా లేదు. బాధపడితే అనునయించే వాళ్ళూ  లేరు” అని అంతరంగంలో ఆమె అనుకొన్న మాటలు గమనించదగినవి. బాధ పడితే అనునయించే వాళ్లు లేకపోవటం ఆమె సమస్య. అనునయించేవాళ్ళు ఎందుకు లేరు? అమ్మమ్మ తాతయ్య 1947 కు ముందే హైద్రాబాదుకు వలసవచ్చిన వాళ్లు. నిజాం పాలనకు వ్యతిరేకంగా శాంతియుత కార్యకలాపాలలో పాల్గొన్నారు. రజాకార్ల చేతిలో మరణించారు. రాజీ తల్లి కాక వాళ్లకు మరొక కొడుకు. రాజీతో పాటు తమ్ముడిని కూడా పెంచింది రాజీ తల్లి. భర్త మరణానంతరం రాజీ చేతిని తమ్ముడి చేతిలో పెట్టి మరణించింది. అది పెళ్లి కాదని అతడు సర్వోదయ ఉద్యమంలో తిరుగుతూ ఒక అమ్మాయిని పెళ్లిచేసుకొన్నాడు. ఒక కారు ప్రమాదంలో వాళ్లిద్దరూ కూడా మరణించారు. ఢిల్లీలో ఉద్యోగంలోకి చేరిన తరువాత తన జీవితంలోకి వచ్చిన అనంత్ వివాహితుడు కనుక వాళ్ళది రహస్య సంబంధమే అయింది. అతను కూడా విమాన ప్రమాదంలో చనిపోయాడు. దానితో ఆమెకు బాధపడితే అనునయించే వాళ్ళు లేకపోయారు.  అనునయించేవాళ్లే లేరు కనుకనే తనకు బాధలే లేవని తనను తాను నమ్మించుకొనే ప్రయత్నం చేస్తున్నదనుకోవాలి. 

          కరుణాకర్ పెళ్లిచేసుకుందాం అన్నప్పుడు అంగీకరిస్తే నా అనేవాళ్ళు ఉండేవారు కదా!? అంటే అందుకు సమాధానం కూడా మజిలీ నవలలో దొరుకుతుంది. ఒక సారి వనజ రవికాంత్ సంసారజీవిత వైఫల్యం గురించి బెంగపడుతూ మాట్లాడుతున్నప్పుడు మనసువిప్పి మాట్లాడుకొనటానికి మనిషి అవసరం గురించిన స్పృహ కలిగినప్పుడు అనంత్ తో తన బాంధవ్యం గురించిన ఆలోచనలో పడుతుంది. పారిస్ లో జేమ్స్ చేసిన ఆత్యాచారం తరువాత శారీరక సంబంధంలో అసూయ, అహం వహించే పాత్ర గురించి కలిగిన విచికిత్స నుండి శారీరక సంబంధం పై విముఖత తనలో బలపడటాన్ని గుర్తించింది. “కేవలం మానసిక జీవితాన్నే గడపటం అలవాటైన తనకి అతి సహజ మనుకొనే కోర్కెలు కలగవు. పైగా అల్లాంటివి అంటే తనకు జుగుప్స, భయం కలుగుతాయి.” అని రాజీ తన గురించి తాను వేసుకొన్న అంచనాను బట్టి కరుణాకర్ తెచ్చిన పెళ్లి ప్రతిపాదన తిరస్కరించటానికైనా, తనను ఇష్టపడే రవికాంత్ ను తప్పించుకు తిరగటానికైనా కారణం బోధపడుతుంది. గతాన్ని గుర్తు చేసుకోకుండా ఉండటానికి ఆమె నిరంతరం ప్రయత్నిస్తుంటుంది. గతాన్ని గుర్తుచేసుకొనే స్థితి వర్తమానం వేధిస్తున్నప్పుడే వస్తుందని ఆమె అభిప్రాయం. అందుకనే గతంలోకి జారిపో కూడదు అని తనను తాను హెచ్చరించుకొంటుంది కూడా. రాజీ  ప్రయత్నమంతా వర్తమానంలో సజీవంగా, సార్ధకంగా జీవించటమే. 

          ఈ నవలలో మహిళా పంచాయతీ సభ్యులకు శిక్షణా కార్యక్రమాన్ని గవర్నర్ ప్రారంభించే సన్నివేశం ఒకటి ఉంది. దానిని  స్త్రీల సాధికారత గురించి చెప్పటానికి,   స్త్రీలు రాజ్యాంగం కల్పించిన హక్కుతో సర్పంచ్ లు అవుతుంటే ఉపసర్పంచ్ గా ఉండే పురుషుడు ఆమె మీద తన ఆధిక్యతను చూపటానికి, అధికారాన్ని కైవసం చేసుకొనటానికి కొత్తకొత్త మార్గాలను ఎలా కనుక్కొంటాడో  వ్యంగ్యంగా చెప్పటానికి ఉపయోగించుకొన్నది రచయిత్రి. అలాంటి పరిస్థితులలో కూడా స్త్రీలు తమ హక్కులు, అధికారాలు తెలుసు కొంటూ ఆచరణలో పెట్టె ఉత్సాహాన్ని , చొరవను కనబరుస్తున్న వైనాన్ని కూడా సూచించింది. 

          రాజభవన్ మరమ్మత్తు పనులు అయ్యాక  రాజీ హాల్ ను అలంకరించిన తీరు వివరంగా వర్ణించబడింది. హాలులో ఒక మూల క్రైస్తవ, ఇస్లామ్, బౌద్ధ, జైనహిందూ మతాలకు చెందిన విగ్రహాలను , ఫోటోలను పెట్టి తాయారు చేసిన సెక్యులర్ కార్నర్ వాటిలో ఒకటి. అది చూసి ఒక కేంద్రమంత్రి మంచిపని చేశారు అని అభినందిస్తూ ఎలాగూ సెక్యులరిజం ఒక కార్నర్ లోకి పోయింది కనుక ఒక చమత్కార వ్యాఖ్య చేసాడు అని చెప్పటం గమనించదగింది. 2000 నాటికే సెక్యులరిజం అనేది ఒక మూలకు నెట్టివేయబడిందన్న స్పృహ రాజకీయాలలో , పదవులలో ఉన్నవాళ్ళకే అర్ధమైందంటే అది ఈ ఇరవై రెండేళ్ల కాలంలో ఎంత వికృత రూపాన్ని తీసుకొన్నదో వర్తమాన సందర్భం నుండి అర్ధం చేసుకోవచ్చు. 

          హిమాచల్ ప్రదేశ్ నుండి కర్ణాటకకు గవర్నర్ బదిలీతో రాజీ ఉద్యోగ జీవిత రంగ స్థలం కూడా మారింది. అక్కడ ఆమె అనుభవాల కథనం అనంతం నవల.

*****

(ఇంకా వుంది) 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.