వ్యాధితో పోరాటం-13

కనకదుర్గ

          ట్రీట్మెంట్ ఎంత త్వరగా మొదలుపెడితే అంత త్వరగా నొప్పులని ఆపొచ్చు, లోపల పాపకి కూడా స్ట్రెస్స్ తగ్గుతుంది అన్నారు. పాపం శ్రీని ఆ రోజే కొత్త జాబ్ లో జాయిన్అవ్వాల్సింది. ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేసి పరిస్థితి చెబితే లాప్ టాప్ తో స్టార్ట్ చేయొచ్చు, నీకు టైం దొరికినపుడు కాసేపు వర్క్ చేయమన్నారు. 

          చైతు స్కూల్ కి వెళ్ళాడు. అప్పటికి అందరూ ఇండియన్ కొలీగ్స్ కుటుంబాలతో వెళ్ళిపోయారు. సుజాత అనేఒక తమిళ జంట ఉన్నారు. వాళ్ళు వేరే కంపెనీ నుండి వచ్చినవారు.  నాకు బాగున్నపుడు అందరం కలిసేవాళ్ళం కానీ ఎపుడో ఒకసారి. శ్రీని నన్ను ఈ హాస్పిటల్ కి అంబులెన్స్ వారు తీసుకు వస్తున్నపుడు ఆ సుజాత దగ్గరకు వెళ్ళి చైతుని తీసుకొచ్చి వాళ్ళింట్లో తను వచ్చేవరకు వుంచుకుంటారా అని అడిగితే తప్పకుండా చూసుకుంటానని చెప్పింది సుజాత. ఆ రోజు స్నో పడుతుంది. వాళ్ళకి రెండేళ్ళ పాప వుంది. 

          శ్రీని అక్కడ్నుండి ఆఫీస్ కెళ్ళి లాప్ టాప్ తీసుకొని హాస్పిటల్ కి రావాలి.

          ట్రీట్మెంట్ కోసం మన అంగీకారం వుంటే చాలు మొదలుపెట్టేస్తారు. శ్రీని రావాలని ఎదురు చూడలేదు. నాకు డాక్టర్ వచ్చి మొత్తం వివరించింది. మాగ్నీషియంసల్ఫేట్ నొప్పులు కంట్రోల్ కావడానికి ఇస్తారు, అది ఇచ్చినపుడు షుగర్ లెవెల్స్ పెరగొచ్చు అందుకని ఇన్సూలిన్ ఇస్తారు, కొన్ని గంటలకోసారి చెక్ చేస్తూ అని చెప్పారు. అది ఇచ్చినంత సేపు బెడ్ మీద నుండి కదల కూడదు కాబట్టి బాత్రూమ్కెళ్ళాలన్నా నర్స్ ని పిలవాలి, బెడ్ పాన్ పెడ్తుంది. ఇది 24 గంటల నుండి 72 గంటల వరకు ఇస్తారు అని చెప్పారు. నాకంతా అయోమయంగా వుంది. ఒక పక్క నొప్పులు, డాక్టర్లు ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు. అందరూ ఎంతో ధైర్యం చెపుతున్నారు, నువ్వేమి వర్రీ అవ్వకు, నిన్ను, నీ బేబిని మేము బాగా చూసుకుంటాము, మీ బేబి ఆరోగ్యంగా వుండాలంటే ఇవన్నీ చేయాలి. యు విల్ బి ఆల్రైట్, డోంట్ వర్రీ.. యు ఆర్ ఇన్ గుడ్ హ్యండ్స్! అని చెబుతూనే వున్నారు. ట్రీట్మెంటు స్టార్ట్ చేస్తారంటే నాకు భయంగా వుంది. అది నేను తట్టుకోగలనా, లోపల బేబి తట్టుకోగలదా? అసలు నేను బ్రతుకుతానా? ఏం జరుగు తుందో? ఏమో? నాకే ఎందుకిలా జరుగుతుంది. అంతా బాగానే వుంది అనుకుంటుండగా ఇలా అయ్యిందేంటి?

          మన వాళ్ళు ఎవరైనా వుంటే బాగుండు అని మొట్ట మొదటిసారి అనిపించింది. ఎవరి అవసరం పడదేమోనని అనుకుని తప్పు చేసామేమో!  కానీ నన్ను ఒక్కదాన్ని 5 నిమిషాలకు కూడా వదిలి పెట్టలేదు నర్సులు, డాక్టర్లు. నేను దిగులుగా, భయంగా కనిపిస్తున్నానని ఎవరో ఒకరు నీకేమి అవ్వదు, యూ విల్ బి ఆల్రైట్ డియర్ అంటూ చెబుతూనే వున్నారు.

          ట్రీట్మెంట్ మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నారు. మ్యాగ్నీషియం సల్ఫేట్ బ్యాగ్ ఐ.వి పోల్ కి తగిలించారు. ఈ గొడవలో నా పాన్ క్రియాటైటిస్ నొప్పి సంగతి వెనక పడిపోయింది. నొప్పి కోసం ఇచ్చిన మొదటిసారి రక్త నాళంలోకి ( Veins) ఇవ్వడం వల్ల నొప్పి త్వరగా కంట్రోల్ అయ్యిందేమో, మత్తుగా వున్నా, నిద్రపోలేని పరిస్థితి.

          నర్స్ వచ్చి నా చెయ్యి పట్టుకుని, ” మిస్ దుర్గా, (అందరికీ మొదటిసారే మన పేర్లు సరిగ్గా ఉచ్చరించడం రాదు)  ఈ మందు లోపలికి వెళ్తున్నపుడు ముందు ముందు మీకు వొంట్లో అంతా మంటగా అనిపిస్తుంది. మేము మిమ్మల్ని మాకు వీలైనంత వరకు కంఫర్టబుల్ గా వుంచడానికి ప్రయత్నిస్తాము. ఐస్ తో తడిపిన చిన్న టవల్స్ తల పై పెడుతుంటాము. చేతులు, కాళ్ళు తుడుస్తాము. మీరు మంచం దిగడానికి వీల్లేదు కాబట్టి కాళ్ళల్లో రక్త ప్రసరణ సరిగా జరగదు, దాని కోసం మేము కాళ్ళకి Intermittent pneumatic compression (IPC) devices, (అడపా దడపా గాలికి సంబంధించి ఒత్తిడి కలిగించే పరికరాలు) పెడతాము. అది కొద్ది కొద్ది సేపటికి కాళ్ళల్లో ఒత్తిడి కలిగించి వదిలేస్తూ వుండడం వల్ల కాళ్ళల్లో రక్త ప్రసరణ జరుగుతుంటుంది….” అని వివరంగా చెబుతుంది.

          “నాకు చాలా భయం వేస్తుంది..పాపకేమవుతుందోనని. మేమిద్దరం అసలు బ్రతుకుతామా?” గొంతు పూడుకుపోయింది, కన్నీళ్ళు కారిపోసాగాయి.

          “ఐ నో! ఎవరికైనా భయం వేస్తుంది ఈ పరిస్థితిలో. నీకొక్క దానికే కాదు, మేము రోజు ఇలాంటి పేషంట్స్ ని చూస్తుంటాము. వాళ్ళందరూ కూడా నీలాగే దిగాలు పడతారు, భయపడతారు, ఇందాక నువ్వన్నట్టుగానే బేబిని తీసేసి ఇన్ క్యుబేటర్ లో పెట్ట మంటారు. కానీ ప్రత్యేకంగా గర్భిణీ స్త్రీలకి ఇలాంటి పరిస్థితి వస్తే వారికి ధైర్యం చెబ్తూ, ట్రీట్మెంట్ ఇచ్చి తల్లీ, బిడ్డని  ఇంటికి సురక్షితంగా వెళ్ళే వరకు ఎలా చూసుకోవాలో మేము ట్రయినింగ్ తీసుకున్నాం. అందుకే ఆ హాస్పిటల్ నుండి ఇక్కడికి తీసుకొచ్చారు . ఈ ట్రీట్మెంట్ వల్ల నీకు నొప్పులు తగ్గుముఖం పడతాయి, లోపల బేబి ఊపిరితిత్తులు బలంగా అవ్వడానికి, ఆరోగ్యంగా పెరగడానికి కూడా అవసరం పడితే మందులు ఇస్తారు కాబట్టి నెలలు నిండి నీకు ప్రసవం సులువుగా అవుతుంది. ఈ మూడురోజులు ఓపిక పట్టితే నీ బిడ్డకి ఏ సమస్యలు రాకుండా నువ్వే కాపాడగలవు. తల్లి కడుపులో వున్నంత భద్రత బయట తీసి పెడితే వుండదమ్మా! వాళ్ళకి ఇన్ ఫెక్షన్లు వచ్చే అవకాశం వుంటుంది, బిడ్డను బయట కాపాడ్డం సాధ్యం కాదని కాదు, కానీ కష్టమవుతుంది. అదే కడుపులో అయితే ఎంతో హాయిగా పెరుగుతుంది. నువ్వు ఈ మూడు రోజులు నిన్ను మా చేతిలో పెట్టేసేయ్, మేము మీ ఇద్దరిని జాగ్రత్తగా చూసుకుంటాం, సరేనా!” అంది ఆ నర్స్. వాళ్ళ పేర్లు తెలియవు నాకింక.

          తన మాటలతో కొంచెం ధైర్యంగా అనిపించినా ఇంకా సందేహాలు, ఏం అవుతుందో అన్న భయం నన్ను చుట్టు ముట్టేసే వున్నాయి.

          ఒక పక్క బాగా అభివృద్ది చెందిన సైన్స్ అండ్  టెక్నాలజీతో తల్లీ, బిడ్డలను సురక్షితంగా ఉంచడానికి, బిడ్డని తల్లి గర్భంలోనే వుంచి పెరిగేలా చేస్తున్నారని అనిపిస్తుంది. మరోసారి నర్స్ ట్రీట్మెంట్  మొదలుకాగానే వొంట్లో ఏం జరుగుతుందో చెప్పాక భయం ఎక్కువయ్యింది.

          నర్సులు, డాక్టర్లు వచ్చారు. ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. ఒక నర్స్ నా చెయ్యి పట్టుకుని మంచం పక్కనే నిల్చుంది. మరో నర్స్ ఐస్, టవల్స్ పట్టుకుని వుంది. నాకు వీళ్ళను చూస్తుంటే ఏదో జరగబోతుందనిపిస్తుంది. మెల్లిగా మాగ్నీషియంసల్ఫేట్ వొంట్లోకి వెళ్ళడం మొదలు పెట్టింది.

          ఒక అయిదు నిమిషాల్లోనే ఒంట్లోంచి భగ భగ మంటూ మంట మొదలైంది. కళ్ళల్లో, చెవుల్లో, గొంతులో, గుండెలో, చేతుల్లో, కాళ్ళల్లో, ఇక్కడా, అక్కడా అని కాదు తల నుండి కాలి వేళ్ళ వరకు భగ భగమని మంటలో కాల్తున్నట్టుగా అయ్యింది.

          “ఐ యామ్ హాట్, ఇట్స్ వెరీ హాట్…” అని అరవసాగాను.

          ఐస్ చిన్న టవల్స్ లో పెట్టి నుదుటి పైన పెట్టి, మిగతా టవల్స్ చల్లటి నీళ్ళలో ముంచి కాళ్ళ పై, చేతులపై వేసారు.

          కానీ మందు లోపలికి పోతున్నా కొద్ది నాకు పిచ్చి, పిచ్చిగా అవ్వసాగింది. ఆ బెడ్ పై నుండి లేచి పారిపోవాలనిపిస్తుంది. కానీ పోలేను.

          శ్రీని వచ్చాడు. డాక్టర్ ట్రీట్మెంట్ గురించి వివరించింది.

          డాక్టర్లు బయటకు వెళ్ళిపోయారు, మరోసారి ’ఎవ్విరిధింగ్ విల్ బి ఆల్రైట్, డోంట్ వర్రీ,” అని చెబుతూ.

          మంట ఎక్కువవుతుంటే అమ్మా, నాన్న గుర్తుకు రాసాగారు.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.