ఒక పరివ్రాజక కల

– శేషభట్టర్ రఘు

నా కాలంలో ఆడపిల్లలు గోరింటాకుతో తిరిగినట్టు
నా మటుకు నేను గొప్పోడిననే ఖ్యాతితో తిరగాలని
కలగనేవాడ్ని
అలా అనుకోవటంలోనే ఒక గమ్మత్తయిన మత్తుందని
కలలేవీ లేనివాడ్ని సన్యాసి అంటారని
వాడికి అడవులు కొండల్లో జపమాలలు తిప్పటమే
పనిగా ఉంటుందని అనుకునే వాడ్ని
 
అప్పుడప్పుడూ 
కన్న కలలన్నీ గుట్టపోసి చూసేవాడ్ని
ఏం చేయాలో తోచక మళ్ళీ బుర్రలోనే దాచేవాడ్ని
 
బతకటం అంటే జీవితం చేసే నానా రకాల అలజడిని
సితారు తీగల్లా సవరించటం కాదు కనక
నా ఖ్యాతి కలలు కూడా గడ్డంలాగే నెరిసిపోయాయి
అప్పుడు పిల్లల నాజూకు వేళ్ళ మీద వాటిని
పదిలం చేశాను
కొత్త వంతెన మీదికి అడుగులేవో మోపినట్టు
తాజాగా పనస పొట్టేదో ఒలిచినట్టు
చిరపురాతన వాసనలేవో పెదవుల్లో దాచాను
జారుతున్న కాలం మీద ప్రపంచం
అలవాటుగా తన భాషనే రాసుకుంటోంది 
 
ఇన్నాళ్ళ గిర గిర తర్వాత
లోకంలో నాకు దొరకని అభ్రకమేదో దాక్కుందని తెలిశాక
ఎండు ద్రాక్షలాంటి వయసు రుచిని మెదడు కొంచెం మరిగాక
పరివ్రాజకుడిగా బతకటమే గొప్ప వరం అని
దాని కోసం మూర్ఖత్వాన్ని లోయల్లోకి తోసి రమ్మని
చెప్పింది ఈ నిమిషం పూచిన లేత నీడల ఎండ!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.