కనక నారాయణీయం -47

పుట్టపర్తి నాగపద్మిని

          ‘ఆ..అట్నే ఉన్నాం స్వామీ. ఇంతకూ, నేనొచ్చిన సంగతేమంటే, మదనపల్లి దగ్గర అరగొండ పాఠశాల వాళ్ళూ మిమ్మల్ని సన్మానించుకుంటారంట వచ్చే నెల! అక్కడ మీకొక ఏకలవ్య శిష్యోత్తముడున్నాడు. పేరు వల్లంపాటి వెంకట సుబ్బయ్య. శివతాండవ మంటే ప్రాణమనుకోండి. ఈ మధ్య చిత్తూరులో కలిసినాడు. అప్పుడు, నేనక్కడున్నంత సేపూ  శివతాండవమూ, ప్రబంధ నాయికలు గురించే కలవరిస్తూ ఉన్నాడు. మీరేమో ఇట్లా ఉన్నారు కదా! వచ్చేనెలలో అక్కడ ఉపన్యాసం ఏర్పాటు చేస్తామన్నారు. నా ‘మహాకవి పుట్టపర్తి’  పుస్తకాలు కొన్ని పంపినా అమ్మమని, మీ సన్మానానికి పనికొస్తాయి కూడా కదా!! ఆ వెంకటసుబ్బయ్య ఎప్పుడెప్పుడు మీ దర్శనమవుతుందా అని చకోర పక్షి మాదిరి చూస్తా ఉన్నాడు. మీకు ఓపికుందా మరి?’

          ‘వచ్చే నెలంటున్నావు కదా!  అప్పటికి  కొంచెం తగ్గుతుందిలే! నువ్వు పుస్తకాలు కూడా పంపినానంటున్నావు. ఇబ్బందేమీ ఉండదు కదా!’

          ‘ఇబ్బందేముంది స్వామీ! ఆ వెంకట సుబ్బయ్యే చూసుకుంటాడు. లేకుంటే ఇక్కడ యీ సుబ్బయ్య ఊరుకుంటాడా ఏంది? ఐనా చూడండి. తరులతమ్మ పెళ్ళి కూడా ఉంది, మే లో. మీకు కుదురుతుందా? అమ్మ ఏమంటారో?’

          ‘ఆమేమంటుందిలే! పోయి వచ్చేది నేను, అక్కడిచ్చే పదో పరకో, పెళ్ళికి పనికొ స్తాయి కూడా!’

          ‘అది నిజమే! సరే స్వామీ! పోయొస్తా మరి. ఒళ్ళు జాగ్రత్త!’

          సుబ్బయ్య బయలు దేరి వెళ్ళిపోయాడు.

          అతనటు వెళ్ళగానే, పుట్టపర్తి పక్కనున్న టేబిల్ మీద నుంచీ బీడీ కట్ట అందుకుని, అగ్గిపెట్టె కోసం చూశారు. ఖాళీ.

          ‘ఇదిగో కనకా! అగ్గిపెట్టుంటే ఇయ్యి.’

          కనకమ్మ ఇంటి పడమట తులసి కోట దగ్గర తరులతతో కూర్చుని, కరుణాదేవి వ్రాసిన ఉత్తరం చదువుతూంది. అక్కడ మామగారింటి సంగతులూ, ఆడబడుచులు, మరిది అందరితో తనెంత బాగా కలిసి పోయిందో, కర్నూలులో వాళ్ళింట్లో బాడుగకున్న  వాళ్ళ గురించీ, ఎన్నో సంగతులు ఇన్లాండ్ ఉత్తరంలో ఇరికించి ఇరికించి రాసింది. ఇంట్లో పెళ్ళి పనులు ఎలా జరుగుతున్నాయో విచారించింది. కడపలో తన తరువాతి పిల్లల సంగతులడిగింది. అన్నీ, ఎంతో చక్కగా, ముత్యాల వంటి అక్షరాల్లో గుదిగుచ్చి నట్టు, అచ్చం కనకమ్మ వ్రాతను బోలినట్టే! కూతురి వ్రాతను చుస్తూ మురిసిపోతున్న కనకమ్మ, భర్త పిలుపుకు ఉలిక్కిపడింది.

          వెంటనే ఉత్తరాన్ని తరులత చేతికిచ్చి, తాను లేచి, తళిహింట్లో అగ్గిపెట్టె చూసింది కానీ అందులో పుల్లల్లేవు. ఈ లోగా మరోసారి పిలుపు ‘కనకా..’ అంటూ!

          అక్కణ్ణించీ పడసాలలోకి ఆమె పరుగు. ‘అగ్గిపెట్టె నిండుకుందండీ! ..ఒరే అరవిందూ!’ అబ్బాయిని కేకేసింది.  

          వాడి జాడా లేదు. భర్తకేసి చూసింది. ఆయన బీడీ చేతిలో పట్టుకుని కూర్చుని ఏదో ఆలోచిస్తున్నారు. చేతి వేళ్ళు మాత్రం అనాలోచితంగా లెక్క పెడుతున్నట్టు కదులుతూ నే ఉన్నాయి. అంటే, అష్టాక్షరీ లోపల్లోపల సాగుతూనే ఉందన్న మాట!

          నిశ్శబ్దంగా బైటికి వెళ్ళి చిన్న కూతురు నాగ కోసమూ చూసింది. ఊహూ..తనూ లేదు. ఆమె కూడా ఏ ఆటపాటల్లోనో మునిగి ఉంటుందనుకుంటూ, రోడ్డుకవతలుండే  కోమటి అంగడిలోంచీ అగ్గిపెట్టె కొనుక్కు వచ్చి, భర్త పక్కనున్న టేబిల్ మీద పెట్టిం దామె! చేతికివ్వకూడదు అగ్గిపెట్టె మరి!

          బీడీ చేతిలోనే ఉంచుకుని ఇంకా ఆలోచిస్తూనే  ఉన్నారు వారు. టేబిల్ మీద అగ్గిపెట్టె పెట్టగానే ఉలిక్కి పడి చూసారు. అయనంతే! ఇక్కడే కూర్చుని ఉన్నట్టే ఉంటుంది, చూపూ యీ చోట నే ఉన్నా , లోచూపు అటెక్కడో! ఆయన మనో నేత్రమెటో ఉంటుంది. మేధస్సులో అలోచనలు కొనసాగుతూనే ఉంటాయి! ఏ చిన్న శబ్దమైనా ఉలిక్కి పడతారు.

          “ఆ…ఇదిగో! నేను వచ్చే నెల మొదటివారమే చిత్తూరు వెళ్ళవలె! అక్కడో సభుంది. ఇప్పుడే ఆ సుబ్బయ్యొచ్చి చెప్పిపోయినాడు.’

          ‘ఇప్పుడా? ఇంకా మీ కాళ్ళ దెబ్బలవీ..’ ఆగిపోయిందామె.

          ‘ఆ..అప్పటికి తగ్గుతాయిలే.’

          ‘ఆ పై నెలే తరులతమ్మ పెళ్ళి కదా!’ (మీరు ఊళ్ళు పట్టుకుని తిరిగితే ఎలా?) అని ఆమె భావం.

          ‘అదే నేనూ వాడితో చెప్పింది. పెళ్ళికి ఆ వచ్చే డబ్బులు పనికొస్తాయి దేనికో ఒక దానికి!’ ఇంక మాటల్లేవన్నట్టు బీడీ వెలిగించుకుంటూ అటు వైపు తిరిగారాయన.

          కనకమ్మేమీ మాట్లాడకుండా మళ్ళీ తులసికోట దగ్గరి చేరింది కరుణాదేవి ఉత్తరం ఇంకోసారి చదివేందుకు, సంతోషించేందుకు! ఆయనకు త్వరగా దెబ్బలు మానిపోయి, ఇంట్లో పెళ్ళి పనులు మళ్ళీ మొదలయ్యేలా చూడమని, తులసమ్మను వేడుకుంది.

***

          ‘రిక్షాలో కూర్చునేందుకే కష్టంగా ఉంది. అంత దూరం ప్రయాణం బస్సులో! ఎందుకయ్యా ఇప్పుడివన్నీ?’ సుబ్రమణ్యం. 

          ‘నాకు ఇప్పుడంత నొప్పి లేదులేరా! అక్కడ వాడెవడో వెంకట సుబ్బయ్యట, యీ సుబ్బయ్య వెంటపడ్డాడట, నన్ను అక్కడికెట్ట్లైనా పంపమని! వాడికి, నా పుస్తకాలంటే ప్రాణమంట! ఏదో స్కూల్లో సన్మానం. పదో పరకో ఇస్తారు. పెళ్ళికి పనికొస్తుంది కదా!’

          పాపం శిష్యులంతా కష్టపడుతున్నారు, గురువుగారి ఇంట్ళో పెళ్ళి బాగా జరిపిం చటం కోసం! ఒక బడుగు పాఠశాల ఉపాధ్యాయుని ఇంట్లో, రెండు నెలల్లోనే రెండు పెళ్ళిల్లంటే మాటలా? ఐనా పెళ్ళి కుదరటమే పెద్ద విషయం. వివాహం దైవ నిర్ణయం. ఆ ఘడియ వస్తే, ఎవరూ ఆపలేరు. దాని గురించి ఎన్నెన్ని సామెతలున్నాయో. కళ్యాణ మొచ్చినా, కక్కొచ్చినా ఆగదంటుంటారు. తలైనా తాకట్టు పెట్టి చేసేయాలి, కుదిరి నప్పుడే! ఇంట్లో పెద్దవాళ్ళందరూ, శిష్యులూ కూడా ఇదే మాటమీదున్నారు. భారమంతా ఆ అష్టాక్షరీ నాథునిమీదే వదిలేసి, ముందుకురికారంతా! పెద్ద కూతురు పెళ్ళి బాగానే  అయింది. పెళ్ళైన తరువాతే యీ ఇబ్బంది సృష్టించి, తమాషా చూస్తున్నాడాయన! పోనీ, ఏదో పెద్ద ప్రమాదం జరుగకుండా, కాస్తలో తప్పిందని, మళ్ళీ అ నారాయణునికే నమస్క రించుకుని, అడుగు ముందుకేస్తున్నారందరూ! ఇదిగో అనుకోని ప్రయాణమిలా వచ్చింది. ఐనా అక్కడా  ఏకలవ్య  శిష్యోత్తముడున్నాడెలాగూ!’

          ఇలాంటి ఎన్నో మాటల తరువాత పుట్టపర్తి చిత్తూరికి ప్రయాణమయ్యారు.ప్రొద్దుటూ రు సుబ్బయ్య వారం ముందటే ఆ చిత్తూరు వెంకట సుబ్బయ్యకు ఉత్తరం రాశాడట, స్వామి ఫలానా రోజు కడపలో యీ టైంకు బయలుదేరి చిత్తూరికి వస్తారు, నువ్వే స్వయం గా ఆయన్ను బస్టాండ్ లో కలుసుకుని దింపుకోవలె! ఆయన నిన్నసలు చూడలేదు కదా, గుర్తు పట్టటం కష్టం. స్వామిని మళ్ళీ కడప బస్సులో కూచోబెట్టే వరకూ, నీదే బాధ్యత.’ అని. అందువల్ల ఆ టైంలోనే  చిత్తూరు వెళ్ళే బండిలో కూర్చోబెట్టమని సుబ్బయ్య సుబ్రమణ్యానికి కూడా మరి మరీ చెప్పి పంపినాడట! అందుకే యీ సన్నాహం.           

          అయ్యను చిత్తూరు బస్సులో జాగ్రత్తగా కూర్చోబెట్టి, జాగ్రత్తలు చెప్పి సుబ్రమణ్యం ఇంటికి వెళ్ళటానికి వెనుదిరిగాడు.

          పేరుకు శిష్యుడైనా, సుబ్రమణ్యానికి పుట్టపర్తి దంపతులే, తల్లిదండ్రులు. అసలైన తల్లిదండ్రులు కూడా ఇలా పుట్టపర్తి కుటుంబం కోసం, కొడుకు శ్రమిస్తూ ఉంటే ఏమీ అనరు. అంతటి ఉదాత్త మనస్కత ఆ రోజుల్లో ప్రతి వ్యక్తిలోనూ ఉండేది. నీతి, ధర్మం, న్యాయబద్ధమైన ఆలోచనలు – ఇవన్నీ ప్రతి సగటు మనిషిలోనూ కనీసం ఉండవలసిన లక్షణాలుగా పరిగణింపబడేవి.

          పుట్టపర్తి బస్సెక్కే ముందు బస్టాండ్ లో రెండు చిక్కటి కాఫీలు తాగారు. ఇంకే ముంది? జుబ్బా జేబులోంచీ, తాజ్ మహల్ బీడీ తీసి వెలిగించారు. రెండు, పంచెలూ, జుబ్బాలూ, టవలూ వంటివి ఉంచిన చేతి సంచీ నుంచీ, ప్రయాణంలో చదువుకునేందు కు తెచ్చిన భవభూతి ఉత్తర రామ చరిత్రం తీశారు.

          భవభూతి అంటే చెప్పలేనంత ఇష్టమాయనకు. ఉత్తర రామ చరిత్ర కథను ఆద్యం తమూ భవభూతి నడిపిన తీరు, అనితర సాధ్యం.  వైదర్భీ, గౌడీ రీతులను అవలీలగా నడిపించగల కావ్య రచనాశక్తి అతనిది. వేద పండితుడు, కాశ్యప గోత్రీయుడైన నీలకంఠ, జాతు కర్ణి దంపతుల పుత్రుడుగా జన్మించిన బాలుడి జన్మ నామం శ్రీకంఠుడు. వంశాంకు రానికి అన్ని వేదాలలోనూ పటిష్టమైన శిక్షణనిచ్చాడు తండ్రి. తరువాత, ఎనిమిదవ  శతాబ్దానికి చెందిన యశోవర్మ రాజాస్థానంలో చాలా కాలముండి, రాజు పరమపదించిన తరువాత, కాశ్మీర రాజు లలితాదిత్యుని వద్దకు వెళ్ళి తుది శ్వాస వరకూ ఉన్నాడట అక్కడే! భవభూతి, అన్న పేరు స్థిరపడటానికి కారణం, శివుని మీద అతడు వ్రాసిన ఒక శ్లోకంలో భవభూతి అన్న పదబంధాన్ని చాలా అర్థవంతంగా ప్రయోగించటమే! అప్పటి నుంచీ ఆయన పేరే భవభూతి అయింది. మహావీర చరిత, మాలతీ మాధవము, ఉత్తర రామ చరితము నాటికలతో భవభూతి పేరు సంస్కృత  సాహిత్యంలో అజరామరంగా నిలిచి పోయింది. అంతే కాదు, మీమాంసా శాస్త్రాన్ని అవలోకనం చేసిన మహోన్నత పండితునిగా అతన్ని, అత్యంత గౌరవాదరాలతో,  ‘ఉంబేక’ అనికూడా సంబోధిస్తారు.

          పటిష్టమైన శబ్ద సంచయంతో శ్లోక నిర్మాణం ఎంత బాగా చేస్తాడో, లలిత పద విన్యాసంతో, అద్భుత భావాన్ని పలికించ గల నైపుణ్యం కూడా ఆయన సొంతం. ‘ఏకో రస: కరుణ యేవ..’ ‘ఇయం గేహే లక్ష్మీ..’  ‘వాచమర్థోనుధావతి ..’ వంటి శ్లోక భాగాలు  ఇంటింటి శ్లోకాలుగా ప్రచలితమౌతున్నట్టే, కొన్ని పదబంధాలూ చదువరుల హృదయా లను కుదిపేస్తాయి.

          అంత:కరుణ తత్వస్య దంపత్యో: స్నేహ సంశ్రయాత్

          ఆనంద గ్రంథిరేకోయమపత్యమితి బధ్యతే .

అన్న శ్లోకం భార్యా భర్తల అన్యోన్య దాంపత్య సౌందర్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించిం ది. వారిద్దరి మధ్య నున్న ప్రేమ బంధాన్ని ఆనంద గ్రంథిగా మార్చేస్తారు వారి పిల్లలు అంటాడు! ఎంత గొప్ప మాట!

                        వజ్రాదపి కఠోరాణి మృదూని కుసుమాదపి

                      లోకోత్తరాణాం చేతాంసి కో ను విజ్ఞాతుమర్హసి..’

లోకోత్తర చరితులైన వారి  హృదయాలు కొన్నిసార్లు, వజ్ర తుల్యములు. మరికొన్ని సార్లు సుమ సదృశములు. వారినర్థం చేసుకోవటం అసాధ్యం. అంటాడు. రాముని గురించిన యీ మాటల్లో ఎంత గొప్ప రహస్యం దాగుందో కదా! లోకోత్తర చరితులంటే? తమ క్షేమాని కంటే లోక క్షేమాన్నే అధికంగా కోరేవారూ, న్యాయ పాలన, ధర్మ రక్షణకే అధిక ప్రాధాన్యత నిచ్చేవారూ అన్నమాట! మరి అటు వంటి రాముని హృదయపు లోతులు తెలుసుకోవటం అసాధ్యమే ఎవరికైనా, చివరికి సీత కైనా! 

          ఇలా గ్రంథంలోని అక్షరాలవెంట పుట్టపర్తి ఆలోచనలు పరుగులు పెడుతుంటే, చిత్తూరు బస్సు, తన గమ్యం వైపుకు పరుగులు పెట్టి పెట్టి చివరికి బస్టాండ్ చేరింది. ‘చిత్తూర్ చిత్తూర్..’ అని కండక్టర్ అరిచిన అరుపుకు పుట్టపర్తి ఉలిక్కిపడి  ఇహ లోకానికి వచ్చారు. బస్సు ఆగింది. ప్రయాణీకులు మెల్లిగా దిగుతున్నారు. పుస్తకంలో తాను చదువు తున్న పుట కుడి పై భాగాన గుర్తుగా కాస్త మడిచి, చేతి సంచీలో పెట్టుకుని, మెల్లిగా సీటు నుంచీ లేచారు పుట్టపర్తి. మోకాలిచిప్ప దగ్గరి గాయం, కలుక్కుమంటూ తానున్నానని గుర్తు చేసింది. మోకాలిని సవరించుకుంటూ, మెల్లిగా లేచారాయన కూడా! ఇప్పుడిక ఆ వెంకట సుబ్బయ్యను పట్టుకోవాలి. ఎలాగబ్బా? అన్నదే సమస్య. 

***** 

  (సశేషం) 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.