జీవితం అంచున -9 (యదార్థ గాథ)

(…Secondinnings never started)

-ఝాన్సీ కొప్పిశెట్టి

రాణి వెడలె రవితేజములలరగ…

ఆనందోత్సాహములు మోమున వెల్లి విరియగ…

          ఓహ్… మీకు తెలియదు కదూ అమ్మ పెట్టిన నా అసలు పేరు ఝాన్సీ రాణి. అయ్యగారిని కట్టుకున్నాక ఇంటి పేరు మార్చుకోవటమే కాకుండా నా పేరులో సగాన్ని తొలిగించేసి వారికి స్థానం కల్పించి ఝాన్సీ శ్రీనివాస్ గా మారాను.

          ఐడీ కార్డు స్కాన్ చేస్తేగాని కాలేజీ ముఖద్వారం తెరుచుకోదు. ఇండియాలో పాడుబడిన ప్రభుత్వాఫీసులో ఉద్యోగం నిర్వహించిన నాకు నా ఐడీ కార్డు సమేత ఆగమనంతో తెరుచుకునే ఆ ద్వారాలు చూస్తే మహారాణిగారిని ఆహ్వానిస్తూ కోట సింహద్వారాలు తెరుచుకున్నట్లే అనిపించేది.

          కాలేజీ మొదటిరోజున హిరోమీ అనే చైనీస్ అమ్మాయి, జోయ్సీ అనే ఆఫ్రికన్ అమ్మాయి, అమీనా అనే పాకిస్తానీల సరసన ఖాళీ సీటు వెతుక్కుని మరీ కూర్చున్నాను.

          మా నర్సింగ్ టీచర్ కేట్ ఆస్ట్రేలియన్ యువతి. కేట్ క్లాసులో చెప్పే పాఠం, మా ఎదురుగా గోడ పైన డిజిటల్ స్క్రీన్ పైన డిస్ప్లే అవబట్టి వివరిస్తున్న విషయం నాకు అర్ధమయ్యేదే తప్ప కేవలం ఆవిడ చెప్పేది వింటే అసలు ఏమీ అర్ధం కాదు. ఆవిడ సిసలైన ఆస్ట్రేలియన్ యాస విన్నాక నాకు మా అమ్మాయి IELTS గురించి చెప్పింది ఎంత నిజమో కదా అనిపించింది. వినగా వినగా క్రమంగా అర్ధమవుతుందిలెమ్మని సరిపెట్టుకున్నాను. గంటన్నర క్లాసు అయ్యాక ముప్పావు గంట బ్రేకు ఇచ్చారు.

          హిరోమీ, జోయ్సీ, అమీనాలతో పాటు క్యాంటీన్ వైపు వెళ్ళాను. ఏవో స్నాక్స్ కొనుక్కుని డైనింగ్ ఏరియాలో కూర్చున్నాము.

          హిరోమీ వయసు ఇరవై ఆరు. ఏవో కబుర్లు చెప్పుకుంటూండగా తన మొబైల్ మోగింది. ఒక ఆస్ట్రేలియన్ యువకుడి వీడియో కాల్. అతనితో మాటాడుతూ ఫోను మా వైపుకి తిప్పి నన్ను, జోయ్సీని, అమీనాని చూపించింది. కాల్ పూర్తయ్యాక “నా పార్ట్నర్ అలెగ్జాండర్” అంది. అంతలో అతని వెనుకగా రబ్బరు బొమ్మలాంటి ఐదేళ్ళ చింకీ పాప వచ్చింది.

          ఇక్కడ చాలా జంటలు పార్టనర్షిప్ లోనే చాలా కాలం వుంటారు. కొందరయితే కలకాలం పార్టనర్షిప్ లోనే జీవించేస్తారు. మన దేశంలో వెయ్యి జంటల్లో మహా అయితే ఒకరు లివ్-ఇన్-రిలేషన్షిప్ లో వుంటారేమో. దానిని మన సంస్కృతి ఒక విశేషంగా పరిగణిస్తుంది. ఇక్కడ చాలా మంది అమ్మాయిలు చాలా సామాన్యంగా అబ్బాయిలను  “నా పార్ట్నర్” అంటూ పరిచయం చేస్తారు. ఇక్కడ ఇది ఎవ్వరూ పట్టించుకోని సర్వ సాధారణ విషయం.

          ఫోను పెట్టేసాక “అలెగ్జాండర్ నన్ను చాలా అనుమానిస్తాడు. నేను ఎక్కడ, ఎవరితో వున్నదీ తెలుసుకునేందుకే వీడియో కాల్స్ చేస్తూంటాడు. వచ్చే సంవత్సరం నా నర్సింగ్ అయ్యాక పెళ్ళి చేసుకొందామనుకుంటున్నాం. బట్ నా కాళ్ళ మీద నేను నిలబడ్డాక పెళ్ళి విషయం మరోసారి ఆలోచించాలి” అంది హిరోమీ దిగులుగా.

          ఆశ్చర్యంగా ఆమె వైపు చూసాను. తక్కువ పరిచయంలో ఎక్కువగా స్వ విషయాలు అడగటం సభ్యత కాదని ఊరుకున్నాను. హిరోమీ చెప్పిన సమాచారం నన్ను మాత్రమే ఆశ్చర్యపరిచింది. జోయ్సీ, అమీనాలు అసలు పట్టించుకోలేదు.

          పదిహేడు సంవత్సరాల జోయ్సీ ఒకటే ఆవలిస్తూ “రాత్రంతా నిద్ర లేదు…” అంది.

          “ఎందుకని…” అడిగింది హిరోమీ.

          “సరిగ్గా నిద్ర పట్టే సమయానికి పన్నెండు అవుతూండగా నా బాయ్ ఫ్రెండ్ కాల్ చేసాడు. రాత్రంతా మాటాడుతూనే వున్నాడు… పడుకోకుండానే తెల్లారిపోయింది”

          ఎటు వంటి సంకోచం లేకుండా నిర్భయంగా చెబుతుంటే నోరు వెళ్ళబెట్టి వింటున్నాను. స్నేహితుల దగ్గరే కాదు.. తల్లిదండ్రుల ముందూ ఏ దాపరికం లేకుండా అంతే నిర్భయంగా మాట్లాడతారు వీళ్ళు. బాయ్ ఫ్రెండ్ తో తగవు గురించి అయినా, ప్రియుడితో తెగతెంపులు గురించి అయినా ఏ సంకోచం లేకుండా తల్లిదండ్రులకు చెప్పే తెగువ వీరికి పుట్టుకతో వస్తుంది. మరి పుట్టిన మరుసటి రోజు నుండే వేరు గదిలో ఒంటరిగా పడుకోవటానికి అలవాటు పడ్డ బిడ్డలకు ఆ మాత్రం స్వాతంత్య్రం సహజమే.

          కాస్త పొట్టిగా వున్నా ముచ్చట గొలిపే రూపు రేఖలతో ముద్దుగా కనిపించే ఇరవై ఏళ్ళ అమీనా వంక చూసాను. మమ్మల్ని ఎవరినీ పట్టించుకోకుండా మౌనంగా, పరధ్యానంగా స్నాక్ తింటోంది. అమీనా ఎప్పుడూ నిశ్శబ్దంగానే వుంటుంది కాని ప్రశాంతంగా వున్నట్టు మాత్రం నా కళ్ళకు కనబడదు. ఆ అమ్మాయి లోతు కళ్ళ అగాధాల్లో ఎన్నెన్ని కథలో మరి…

          నా పిల్లల వయసు కన్నా బాగా చిన్నవాళ్ళయిన ఈ ముగ్గురు అమ్మాయిలు చిత్రంగా నా క్లాస్మేట్స్..మంచి స్నేహితులు..!

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.