అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 8

– విజయ గొల్లపూడి

జరిగినకథ: విశాల కాలేజీ చదివే రోజుల్లో ఆస్ట్రేలియా అందమైన దేశం, తను ఎప్పుడైనా
ఆస్ట్రేలియా ఒక్కసారైనా వెళ్ళాలి అనుకుంది. డిగ్రీ పూర్తి కాగానే, ఎం.బి.ఏ లో చేరింది. ఫైనల్ ఇయర్ లో విష్ణుసాయితో పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంది. తను ఇష్టపడే తాతగారు దూరమవడం విశాలకు కాస్త మనస్తాపం కలిగించినా, విష్ణుసాయి సాన్నిధ్యంలో మళ్ళీ మామూలు మనిషయ్యింది. విశాల, విష్ణుతో ఆస్ట్రేలియా వెళ్ళడానికి వీసా
రావడంతో, ఇద్దరూ ఆస్ట్రేలియాలో స్థిరపడే దిశగా ఇద్దరూ పయన మవుతున్నారు. తల్లిదండ్రుల వద్ద వీడ్కోలు తీసుకుని, ఇద్దరూ విమానయానం చేసి, సిడ్నీలో అడుగిడ బోతున్నారు.

***

          అపుడే తూరుపు తెలతెలవారుతోంది. సూర్యభానుని లేలేత కిరణాలు పుడమి పై బంగారు వెలుగులు విరజిమ్ముతుండగా, ఆ వెలుగురేఖలను ఛేదించుకుంటూ రయ్యిన క్వాంటాస్ వ్యోమయానము చక్రాలతో ఆస్ట్రేలియా గడ్డ సిడ్నీ నగరం పై చకాచకా పరుగి డుతూ కింగ్స్ ఫోర్డ్ స్మిత్ అంతర్జాతీయా విమానాశ్రయంలో రెక్కలు అటుఇటూ ఊపుతూ వాలింది.

          ఒక్కసారిగా విమానం ఆగిన కుదుపుతో ప్రయాణికులంతా సీటుబెల్ట్ బంధం నుంచి విడిపించుకుని, క్యాబిన్ లో బ్యాగులు తీసుకునే ప్రయత్నంలో పడ్డారు.

          విశాల, విష్ణు లేచి నుంచుని ఇద్దరూ తలో సూట్ కేసు చేతిలోకి తీసుకున్నారు. వాళ్ళిద్దరి సీటు కాస్త ముందుగానే ఉండటంతో బిజినెస్ క్లాసు ప్రయాణీకులు ఖాళీ చేయడంతో విమానద్వారం వద్దకు చేరుకుంటున్నారు. గగనయాన వనితలు వారిరు వురికి నవ్వుతూ ధన్యవాదాలు తెలిపారు.

          అదే సమయంలో అక్కడ మెట్లు దిగగానే వాళ్ళ ముందునుంచి సినీనటుడు
బాలకృష్ణని ఒక అడుగు దూరంలో చూసి ఆశ్చర్యంతో విశాల ఒక్కసారిగా, “అరె, మన బాలయ్య, బాలకృష్ణ కదా వెడుతున్నది!” అని ఉత్సాహం నిండిన గొంతుతో అరిచినంత పని చేసింది. వెంటనే ముందుకు వెడుతున్న బాలకృష్ణ ఒక్కక్షణం ఆగి వెనక్కి తిరిగి వారిద్దరినీ చిరునవ్వుతో పలకరించాడు.

          “ఏమిటీ, మీరు తెలుగువాళ్ళేనా? ఇక్కడే ఉంటారా?” ఊహించని ఆ సంఘటనకు విష్ణు ఒక్కసారిగా విస్తుపోయి, మళ్ళీ తమాయించుకుని “మొదటిసారిగా ఆస్ట్రేలియాలో అడుగు పెడుతున్నామండీ” అన్నాడు.

          విశాల కూడా ఆనందంతో “బాలకృష్ణగారు మీరు నటించిన భైరవద్వీపం, ఆదిత్య 369 సినిమాలలో మీ నటన అద్భుతం. మిమ్మల్ని ఇక్కడ చూడటం ఆనందంగా ఉంది.” అంది.

          బాలకృష్ణ ప్రక్కనే ఉన్న యూనిట్ అతన్ని పిలిచి, విశాల, విష్ణుతో కలిసి ఒక ఫోటో తీయమని సైగ చేసాడు. పోలరాయిడ్ కెమెరాతో వెంటనే వారికి  ఫోటో తీయించి తన సంతకంతో ఆ ఫోటో వాళ్ళ చేతిలో పెట్టాడు.

          “ఇక్కడ కొన్ని షాట్స్ కోసం సినిమా షూటింగ్ కి వచ్చాను. మళ్ళీ నాలుగు రోజులలో వెళ్ళిపోతాను” అని ఇద్దరికీ బెస్ట్ విషెస్ చెప్పి అక్కడ నుంచి బాలకృష్ణ వెళ్ళిపోయాడు.

          విశాల మొదటిసారిగా సిడ్నీ నేల పై తన జీవిత భాగస్వామితో అడుగిడుతున్న సందర్భంలో, అదే సమయంలో ఒక సెలబ్రిటీ తెలుగు సినీ నటుడిని కలుసుకోవడంతో ఒక్కసారిగా ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయింది.

          మెల్లిగా టెర్మినల్ గేట్స్ దాటుకుని, ఎస్కలేటర్ లో పైకి వచ్చారు. వెల్ కం టు సిడ్నీ అని స్వాగత వచనాలు చూడగానే, స్వయానా ఆస్ట్రేలియా దేశమే తనకు వ్యక్తి గతంగా స్వాగతం పలుకుతోందా అన్న అనుభూతికి లోనైంది విశాల.

          “హార్టీ వెల్ కం మైడియర్ విశాల” అని విష్ణు కూడా నవ్వుతూ విశాలవైపు చూసాడు.

          “ఓహ్ మైడియర్ శ్రీవారు! ఇట్స్ ఎక్సైటింగ్. వాటె వార్మ్ వెల్ కం టుడే! ఇట్స్ టూ ఓవర్ వెల్మింగ్ టు మి. మన బాలయ్యని చూడటం నిజంగా థ్రిల్లింగ్ గా ఉంది.”

          బోర్డ్, ఇండికేషన్స్ చూసుకుంటూ, వేరే ప్రయాణికులని అనుసరిస్తూ ఇద్దరూ  సెక్యూరిటీ దగ్గిర కౌంటర్ లో పాస్ పోర్ట్, వీసా చూపించారు. కౌంటర్లో ఆమె ఇద్దరిమొహాలు చూసి, అన్నీ వివరాలు చెక్ చేస్తూ “వెల్ కమ్ టు ఆస్ట్రేలియా, హపీ స్టే” అంటూ స్టాంప్ వేసి పాస్ పోర్ట్, వీసా తిరిగి ఇచ్చింది.

          ఇద్దరూ అక్కడ నించి లగేజ్ తీసుకోవడానికి కరూసల్ దగ్గిరకు వచ్చి లైన్లో వస్తున్న సూట్ కేసులు చూడసాగారు.

          విశాల దూరం నుంచి లైట్ బ్రౌన్ కలర్లో ఉన్న సూట్ కేసుల సెట్ గుర్తుపట్టి “అదిగో అవి మనవే” అని విష్ణుకి చూపించింది.

          అక్కడే ఉన్న ట్రాలీలో సూట్ కేసులు పెట్టుకున్నారు.

          విశాల “ఇక్కడ కూలీలు ఎవరూ ఉండరు అనుకుంటా” అనగానే,

          “ఇది స్టార్టింగ్ పాయింట్, మన పని మనం చేసుకోవడానికి నౌకర్లు, చాకర్లు ఉండరు” అంటూ చిరునవ్వు నవ్వాడు విష్ణు.

          ఇద్దరూ సెక్యూరిటీ డిక్లేర్ చేసే క్యూలో నిలబడ్డారు. అక్కడ వాళ్ళ ముందు ఉన్నతను క్వారంటైన్ క్యూలో అక్కడ ఆఫీసర్ ని బ్రతిమాలుతున్నాడు.

          “బ్యాగ్ లో కొన్ని ఫుడ్ ఐటెమ్స్ ఇక్కడ ఎలవ్ చేసేది లేదు, జరిమానా కట్టాల్సి ఉంటుంది. కొన్ని ఐటెమ్స్ ప్రొహిబిటెడ్, ఆస్ట్రేలియా ఇటు వంటి విషయాలలో చాలా స్ట్రిక్ట్” అని చెపుతున్నాడు.

          అమ్మో! ఫుడ్ ఐటెమ్స్ ఇలా దొంగతనంగా తీసుకువస్తున్నారు, ఇక్కడ ఆఫీసర్స్ ఈ దేశంలో ఏ విధమైన వ్యాధికారక క్రిములు ప్రవేశించకుండా రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నారు. తను చదువుకున్న పెథాలజీ సబ్జెక్ట్ పేండమిక్ వ్యాధులు ఒక్కసారి గుర్తు చేసుకుంది విశాల.

          నిజంగా సెక్యూరిటీ ఆఫీసర్స్ హోదాకి తగ్గట్టే మంచి బలిష్టంగా, పొడుగ్గా నేవీ బ్లూ డ్రస్ లో గంభీరంగా ఉన్నారు. అందులో లేడీ ఆఫీసర్స్ కూడా ఉన్నారు.

          మరో ప్రక్క పొడుగ్గా, లావుగా ఉన్న సెక్యూరిటీ డాగ్ అటు, ఇటు తిరుగుతూ వాసన చూస్తూ విశాల, విష్ణు ఉన్న బ్యాగుల వైపు వచ్చింది. 

          విశాల ఆ కుక్కని చూడగానే ఒక్కసారిగా బెదిరిపోయింది. కానీ వెంటనే అక్కడ నుంచి ఆ కుక్క వేరే లైన్ లోకి వెళ్ళిపోయింది.

          విష్ణు, విశాల బ్యాగ్స్ చూసి, ఏ విధమైన అభ్యంతరకరమైన వస్తువులు, ఆహార పదార్థాలు లేకపోవడంతో వాళ్ళని ఆ గేట్ ద్వారా బయటకు వెళ్ళమని దారి చూపించారు సెక్యూరిటీ.

          ఇద్దరూ అక్కడ దగ్గిర్లో ఉన్న రెస్ట్ రూమ్ కి వెళ్ళి రిఫ్రెష్ అయి వచ్చారు.

          టెలెస్ట్రా ఫోన్ బూత్ చూసి, విష్ణు తన దగ్గిర ఉన్న రెండు డాలర్ల కోయిన్ తో ఇండియాలో ఇంటి నంబర్ కి ఫోన్ చేసాడు.

          “నాన్నగారు క్షేమంగా ఇద్దరం ఇక్కడ సిడ్నీలో ఇపుడే దిగాము. ప్రయాణం బాగా జరిగింది” అని విష్ణు చెప్పగానే విశ్వనాధం గారు సంతోషపడి, ప్రక్కనే ఉన్న భార్యకు ఇచ్చారు.

          తరువాత విశాల తల్లిదండ్రులకు కూడా ఫోన్ చేసి, “మామయ్యగారు సిడ్నీ చేరు కున్నాము, ఇదిగో విశాలతో మాట్లాడండి” అని విష్ణు విశాలకి ఇవ్వగానే “నాన్నగారు మేము క్షేమంగా సిడ్నీ చేరాము. అంతా బాగా జరిగింది” అని విశాల సంతోషంగా మాట్లాడింది.

          మెల్లిగా నడుచుకుంటూ ఇద్దరూ వెడుతున్నారు. అక్కడ డిస్ప్లే గా పెట్టిన బ్రోచర్స్, సైట్ సీయింగ్ పాంప్లెట్ల్ కనిపించగానే విశాల వెంటనే కొన్ని చేతిలోకి తీసుకుని హాండ్ బ్యాగ్ లో పెట్టుకుంది.

          ఇద్దరూ అక్కడ లాంజ్ దగ్గిరకు వచ్చి లగేజ్ ప్రక్కన నిలిపి సోఫాలో కూర్చున్నారు.

          విష్ణు అక్కడే ఉన్న గ్లోరియా జీన్స్ కేఫ్ లో అక్కడ బోర్డ్ లో ఉన్న లిస్ట్ చూసి, రెండు కెపాసినో ఆర్డర్ చేసాడు. బిల్ పే చేసి, విశాల దగ్గిరకు వస్తూ…,

          “మై ఫెయిర్ లేడీ డియర్ విశాల, ఆస్ట్రేలియా, అమెరికా బ్రాండ్ గ్లోరియా జీన్స్ కాఫీ రుచి ఆస్వాదించు.” అన్నాడు విష్ణు.

          “వా క్యా స్వాద్ హై జనాబ్. నిజంగా ఆస్ట్రేలియా గడ్డ పై అడుగుపెట్టి సిడ్నీ లో తొలి కాఫీ రుచి, లైఫ్ పార్టనర్ తో ఈ క్షణం కలకాలం నాకు గుర్తుండిపోతాయి.” అంది విశాల కాఫీ సిప్ చేస్తూ.

          అలా వాళ్ళు మాట్లాడుకుంటున్నపుడు, అక్కడికి మరో జంట పూల బొకేతో వాళ్ళ దగ్గిరకు వచ్చారు.

          “ఆర్ యూ విష్ణు అండ్ విశాల?” అని అడిగాడు ఆ వ్యక్తి.

          “యూ ఆర్ వినయ్ అండ్ అనిత, రైట్?” అన్నాడు విష్ణు.

          ఇద్దరూ ఒకరికొకరు షేక్ హాండ్ ఇచ్చుకున్నారు.

          విష్ణు తన వర్క్ కొలీగ్ ఆస్ట్రేలియాలో ఉంటున్న తన బంధువు వినయ్ గురించి చెప్పాడు. అతని ద్వారా విష్ణు, వినయ్ ఈ మెయిల్ తీసుకుని, తను వస్తున్న ఫ్లైయిట్ వివరాలు ఇచ్చాడు.

          అనిత పూల బొకే విశాల చేతిలో పెట్టి “వెల్ కం టూ ఆస్ట్రేలియా” అంటూ విష్ చేసింది.

          “సారీ, ప్రొద్దున్నే హెవీ ట్రాఫిక్ వల్ల ఆలస్యం అయ్యింది” అన్నాడు వినయ్.

          “నో నాట్ ఎట్ ఆల్, నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇపుడే కాఫీతో కాస్త రిఫ్రెష్ అయ్యాము.” అన్నాడు విష్ణు.

          “రండి, కారు పార్కింగ్ దగ్గరకు వెడదాం” అన్నాడు వినయ్.

          అందరూ అక్కడి నుంచి, లగేజీ ట్రాలీతో బయటకు వచ్చారు.

          అక్కడ ట్రాఫిక్ లైట్స్ దగ్గిర సిగ్నల్ కోసం చూస్తున్నారు.

          అనిత ట్రాఫిక్ లైట్ దగ్గిర స్థంభం దగ్గిర బటన్ నొక్కింది. ఇరవై సెకన్లలో ఆకుపచ్చ రంగులో మనిషి బొమ్మతో టిక్ టిక్ సౌండ్ రావడంతో అందరూ రోడ్డు దాటారు.

          విశాల సునిశితంగా ఆ లైట్లను ట్రాఫిక్ లైట్ బొమ్మను పరిశీలించింది.

          ఇండియాలో కేవలం గ్రీన్, ఆరెంజ్, రెడ్ లైట్లు ఉంటాయి. కానీ ఇక్కడ పాదచారు లకు కూడా సిగ్నల్ ఉండటం బాగుంది కదా అనుకుంది.

          కారు పార్కింగ్ దగ్గిరకు చేరుకుని, సూట్ కేసులు కారు డిక్కీలో వినయ్ జాగ్రత్తగా పెట్టాడు. మళ్ళీ ట్రాలీని అక్కడ ట్రాలీ బే ఏరియాలో పెట్టి వచ్చాడు వినయ్.

          ‘చాలా ఆర్గనైజ్డ్ గా ట్రాలీలు అన్నీ ఒకచోట చక్కగా పెట్టారు కదా, ఎక్కడ పడితే అక్కడ వదిలేయకుండా అనుకుంది’ విశాల.

          వినయ్ పార్కింగ్ ఫీజు మెషీన్లో పే చేసాడు. బూమ్ గేట్ వెళ్ళడానికి తెరుచుకుంది.

          వినయ్, అనిత ముందు కూర్చున్నారు.

          విష్ణు, విశాల వెనకాల కూర్చోగానే, ఇద్దరూ సీటు బెల్ట్ పెట్టుకోండి, ఇక్కడ కారులో ప్రతి ఒక్కరికీ సీట్ బెల్ట్ కంపల్సరీ. లేకపోతే డ్రైవ్ చేసేవారికి ఫైన్ పడుతుంది” అన్నాడు వినయ్.

          ఇద్దరూ సీటు బెల్ట్ పెట్టుకోగానే, వినయ్ డ్రైవ్ చేస్తూ హైవేలో నిర్దేశిత స్పీడుతో కారుని పోనిచ్చాడు.

          సువిశాలమైన రోడ్లు, వాహనాలు, బోర్డ్ పై ఉన్న పేర్లు చూస్తూ రెండు కళ్ళు చాలవు అన్నట్లుగా విశాల కుడివైపు, ఎడమవైపు మార్చి మార్చి చూడసాగింది. విష్ణు కూడా వెళ్ళే దారిని గమనిస్తున్నాడు.

          ఇరు జంటలు మొదటిసారి కలుసుకోవడం అయినా కానీ మొదటి సారి దేశం కాని
దేశంలో ఆత్మీయులని కలుసుకున్న అనుభూతి వారిరువురిలో.

          “వావ్ బ్యూటిఫుల్ సీన్ బీచ్, ప్లైట్ లు టేకాఫ్ అవుతున్నాయి అటువైపు చూడండి” అని విశాల ఎక్సైట్మెంట్ ఆపుకోలేక విష్ణుతో అంది.

          “విశాల ఈ ప్లేస్ బ్రైటన్లీసాన్స్, పార్క్ బ్యూటిఫుల్ రిలేక్సింగ్ ప్లేస్ ఫర్ ఎ వీకెండ్ టు స్పెండ్ హియర్” అంది అనిత.

          “మేము ఉండే ప్లేస్ కోగ్రా, ఇక్కడకు దగ్గిరే” అన్నాడు వినయ్.

          ఉదయమే కావడంతో పార్క్ లో చెట్లమధ్య సూర్యుడు నక్కి నక్కి చూస్తున్నట్లు ఉంది దృశ్యం.

          అలా చూస్తూండగానే కారు ఒక పోర్టికో ముందు ఆగింది, గారేజ్ డోర్ వెంటనే రిమోట్ తో తెరుచుకుంది.

          చూడటానికి ఆ ఇల్లు బొమ్మరిల్లులా ఉంది.

          గారేజ్ లో నించి లోపలికి వంటిట్లోకి తలుపు ఉంది. లగేజ్ తీసుకెళ్ళడానికి వీల్స్ తో ఉన్న కేరియర్ తీసుకువచ్చి వినయ్ పెట్టెలన్నీ ముందున్న గదిలో పెట్టాడు.

          హాలులో తెల్లని గులాబీ పూలు ఫ్లవర్ వాజ్ లో మనోహరంగా అమర్చి ఉన్నాయి.

          అనిత విశాలకు గది చూపిస్తూ అటాచ్ డ్ బాత్రూమ్, బట్టలు పెట్టుకోవడానికి వాకిన్ రోబ్. హాట్, కోల్డ్ వాటర్ కుళాయిలో మిక్స్ చేసుకోవచ్చు. హాట్ వాటర్ కావాలంటే కుడి వైపు, కోల్డ్ వాటర్ కావాలంటే ఎడం వైపు తిప్పాలి. సోపు, టవల్స్ ఇక్కడ రెడీగా ఉన్నాయి.

          మీరు స్నానం చేసి రండి. నేను టిఫిన్ రెడీ చేస్తాను.

          అలా అన్ని ఓపికగా విశాలకు అనిత చూపించి వెళ్ళింది.

          వినయ్, విష్ణు హాలులో కబుర్లు చెప్పుకుంటున్నారు.

          “ముందు వాళ్ళని కాస్త రిలాక్స్ కానివ్వండి, లాంగ్ జర్నీ చేసి అలసిపోయినట్లు న్నారు.” అంది అనిత.

          విశాలకు ఇంకా మేఘాలలో తేలిపోతున్నట్లుంది. ‘ఇది కలయా, నిజమా! నేనేనా ఇక్కడ ఆస్ట్రేలియాలో ఉన్నాను. ఇంత వరకు పుస్తకాలు, చదువు, పరీక్షలు, అకడమిక్ వర్క్ తో సతమతమయ్యే తను ఇపుడు పూర్తిగా అపోజిట్ గా వేరే ధృవంలోకి వచ్చి వాలి నట్లుంది’ అనుకుంది మనసులో విశాల.

          విష్ణు గదిలోకి రాగానే సూట్ కేస్ కీస్ తీసుకుని, ఓపెన్ చేసింది.

          తనకు కావలసిన బట్టలు, టూత్ బ్రష్, మేకప్ కిట్ హ్యాండీగా ఒక చిన్న బాగ్ లో పెట్టుకుంది.

          డైరెక్ట్ గా గ్యాస్ హీటింగ్ ద్వారా కుళాయిలో వేడినీళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తాయి. ఎంత చక్కటి సౌలభ్యం ఇక్కడ అనుకుంది విశాల. వేడినీళ్ళతో స్నానం చేసిన మీదట ప్రయాణ బడలిక తగ్గి, రిఫ్రెష్ అయ్యింది విశాల. విష్ణుసాయి కూడా స్నానం చేసి, చకచకా రెడీ అయిపోయాడు.

          విష్ణు బ్యాలెన్స్డ్ గానే ఉన్నాడు. అతను తన ధోరణిలో సమయానుచితంగామాటలు కలుపుతూ, ఏ మాత్రం క్రొత్త దేశంలో అడుగుపెట్టాను అన్న ఫీలింగ్ లేకుండా మూవ్ ఆన్ అవుతున్నాడు.

          చెప్పాలంటే విష్ణు నీరు ఏ పాత్ర లో పోస్తే ఆ పాత్రలో ఒదిగినరీతిగా పరిస్థితులకు, సమయ సందర్భాలకు తగినట్లుగా మెలుగుతూ సాగిపోతాడు. అదే అతనిలో ప్రత్యేకత.

* * * * *

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.