వ్యాధితో పోరాటం-22

కనకదుర్గ

          అమ్మ ఫోన్ చేసి శ్రావణ శుక్రవారం పూజ చేస్తున్నాను వచ్చి పొమ్మన్నది. పూజ కోసం కాకపోయినా ఇలాగైనా అమ్మని, నాన్నని చూసి రావొచ్చని, వెళ్దామనుకున్నాను. ఇంతలో పక్కింటి వాళ్ళు వచ్చి మా అత్తగారిని తాంబూలం తీసుకొని వెళ్ళమని పిలిచారు. అలాగే మరో ఇద్దరు, ముగ్గురు రమ్మన్నారు. నేను రెడీ అయ్యాను కానీ ఆమె తాంబూలం తీసుకుని వచ్చేదాక నేను వెళ్ళలేను, ఎందుకంటే శైలుని చూసుకోవాలి. శైలు లోపల కూర్చొని ఉన్నపుడు మా అత్తగారు త్వరగా వెళ్ళొస్తానని అన్నారు. కాసేపు శైలు ఏం మాట్లాడలేదు. పది నిమిషాలు కూడా కాకముందే , ”మాయే,” అని పిలుస్తూ మెల్లిగా గోడలు పట్టుకుని వసారాలోకి వచ్చింది. ( అమ్మని ‘మాయే’ అని పిలిచేది.) నేను తనని కూర్చోబెట్టడానికి ప్రయత్నంచాను.

          “బాబీ మా అమ్మ ఎక్కడికి పోయింది?”

          “అమ్మ లోపలే ఉంది శైలు. ఎక్కడికి వెళ్ళలేదు.’’ అని చెప్పాను.  రెండు నిమిషాలు కాగానే ఎలా చూసిందో కానీ వాళ్ళమ్మని ఒక ఇంటి నుండి మరో ఇంటికి వెళ్తుండగా చూసింది. వసారా నుండి గేట్ వరకు కొన్ని మెట్లున్నాయి. గబగబా మెట్లు దిగి గేట్ వైపు వెళ్ళసాగింది. “శైలు ఆగు, పడతావు!,” అని పరిగెత్తి గేట్ కి అడ్డంగా నిలబడ్డాను. శైలు అరుపులు, బండ బూతులు, ఏడుపు, గగ్గోలు పెట్టడం ఎక్కువై పోయింది. గేట్ కి అడ్డంగా నిలబడ్డా కూడా నన్ను పక్కకి నెట్టేసి బయటకు వెళ్ళిపోతుందేమోనని నా భయం. ఏం చేయాలో అర్ధం కాలేదు. బయటి నుండి ఒకరు, “గేట్ గొళ్ళెం పెట్టేసేయండమ్మా అపుడ యితే తను బయటకు రాలేదు.” అని వినిపించింది. బయట అందరూ నిలబడి చోధ్యం చూస్తున్నారు.

          నేను వెంటనే గేట్ గొళ్ళెం పెట్టేసాను. అది చూసి కోపం ఇంకా ఎక్కువైంది. తను భారీ మనిషి. లాగి ఒక్కటి కొట్టింది నన్ను, తల దిమ్మ తిరిగి పోయింది. ఇంతలో మా అత్తగారు తాంబూలం తీసుకుని బయటకు వచ్చి ఈ గోలంతా చూసి పరిగెత్తుకుంటూ వచ్చారు. నేను గేట్ గొళ్ళెం తీయగానే లోపలికి వచ్చారు. నాకిదంతా అలవాటు లేదు. గుండె దడ పెరిగింది, కాళ్ళు, చేతులు వణుకుతున్నాయి. ఇద్దరం కల్సి శైలుని లోపలికి తీసుకెళ్తుంటే మా అత్తగారు, “బాబీ ఉంది కదా శైలమ్మా! ఎందుకింత గొడవ చేయడం. తప్పు కదా!” అంటే “నువ్వెందుకు నన్నొదిలిపెట్టి వెళ్ళావు? నాకు ఆమె వద్దు, నువ్వే కావాలి. నేను కొట్టిన నీ దగ్గరికి రానీయలే.”

          “అయ్యో, బాబీని కొడతారా! అన్నకి చెబ్తే, కొప్పడతాడు.”

          “చెప్పు నాకేం భయమా? నేను కూడా కోప్పడతా.”

          లోపలికి తీసుకొచ్చి కూర్చోపెట్టాక, “దెబ్బ తగిలిందామ్మా? గట్టిగా కొట్టిందా? తొందరగా వచ్చేద్దామనే వెళ్ళాను, ’ఎప్పుడూ రావు కదా, ఒక 5 నిమిషాలు కూర్చో,’ అని కూర్చోమన్నారు.”

          “అయ్యో పర్వాలేదండీ. తను గొడవ పెట్టకపోతే మీరెంత సేపు వెళ్ళినా నాకేం ప్రాబ్లెం లేదు. కొన్నాళ్ళయితే అలవాటవుతుంది.”అన్నాను.

          “నువ్వెళ్ళమ్మా, అమ్మ ఎదురు చూస్తుందేమో, సాయంత్రం వస్తావా?”

          “ఆ సాయంత్రానికల్లా వచ్చేస్తాను.”

          లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తాగి బయల్దేరాను.

          “పో, వెళ్ళి పో మళ్ళీ మా ఇంటికి రాకు…” అని గట్టిగా అరిచింది శైలు.

          నేనేం మాట్లాడకుండా వెళ్ళాను.

          ప్యారడైజ్ బస్ స్టాప్ కి వెళ్ళి చార్మినార్ బస్ ఎక్కాను.

          నేను కాపురానికి వచ్చిన కొత్తలో శ్రీని నాతో చాలా ప్రేమగా ఉండేవాడు. నాకు ఇంట్లో కొత్త అని వెంట ఉండి అన్నీ చెప్పేవాడు. ’’అమ్మా, ఈ రోజు మసాల గోంగూర చెయ్యి, గుత్తొంకాయ కూర చెయ్యి, మెంతికూర పచ్చడి, పాల కూర పచ్చడి,” అని అడిగి మరీ చేయించేవాడు. అలా అత్తగారిని ఇబ్బంది పెట్టడం నాకు నచ్చేది కాదు. నేను సాయం చేసేదాన్ని. “మా అమ్మ చేస్తుంది నువ్వెందుకు అక్కడ ” అనేవాడు.

          నాకు ఇబ్బందిగా అనిపించేది, ఆమె వంట చేస్తుంటే నేను రూమ్ లో కూర్చోవడం. ఇంట్లో ఉంటే శని,ఆది వారాల్లో ఊరికే కిచెన్ లోకి వచ్చి వెళ్తూ ఉండేవాడు. ఇదంతా చూసి శైలు అన్నని టీజ్ చేసేది. “అన్న, తోక లాగ తిరుగుతున్నాడు,” అని. నాకే ఇబ్బందిగా ఉండేది. వాళ్ళింట్లో మిక్సీ లేదు, కానీ మా పెళ్ళికి మా మామాగారి కొలీగ్స్ మిక్సీ ఇచ్చారు. మిక్సీ తీసి వాడక ముందు రోట్లో పచ్చి మిరప కాయలు, కొత్తిమీర, పసుపు, ఉప్పు, చింత పండు కలిపి నూరాల్సి వచ్చేది. అలాగే ఏ పచ్చళ్ళు చేసినా కూరలకు, మసాలాలు రుబ్బేదాన్ని.

          నాకు ఇవన్నీ అలవాటు లేకపోయినా తప్పదు కాబట్టి చేసేదాన్ని. చేస్తూ, చేస్తూ అలవాటయిపోయింది పనులు చేసుకోవడం.

          శ్రీని ఎపుడూ నా వెంట వెంట ఉండడమే కాదు నేను కంఫర్టబుల్ గా ఉన్నానా లేదా అని చూస్తూ ఉండేవాడు. మా ఇంట్లో, బంధువుల్లో చూసిన భార్యా, భర్త బంధాలు చూసి నాకు పెళ్ళంటే భయం ఉండేది. 

          శ్రీని ఆఫీసు నుండి వచ్చే టైంకోసం వేయిట్ చేసేదాన్ని. మేము టీ తాగుతుంటే వచ్చేవాడు. తను గేట్ తీసే చప్పుడు కూడా ఎక్కడ ఉన్నా తెలిసిపోయేది. నాకు చాలా సంతోషమేసేది. తను వచ్చాకే నేను ఫ్రెష్ అప్ అయ్యేదాన్ని, తను స్నానం చేసి వచ్చాక ఇద్దరం ఒకోసారి మేడ పైన చాప పర్చుకుని కూర్చొని కబుర్లు చెప్పుకునేవారం, ఒకోసారి కాసేపు వాక్ కి వెళ్ళి వచ్చేవాళ్ళం, లేదా కూరలు కొనుకొచ్చేవారం. ఎప్పుడూ నేను మాట్లాడడమే కానీ తను ఎక్కువ మాట్లాడేవాడు కాదు. “నువెప్పుడూ మాట్లాడవేమిటి?” అని అడిగితే, ” నువ్వు బాగా మాట్లాడతావు, నాకు అలా మాట్లాడడం రాదు. నేను వింటాను.”

          “నేనెమన్నా టేప్ రికార్డర్ నా ఎప్పటికీ నేనే అరిగిపోయిన కేసెట్ లా మాట్లాడడానికి. ఇపుడు పర్వాలేదేమో, కానీ ముందు ముందు చాలా ముఖ్యమైన విషయాల పై మనం చర్చించుకోవలసి వస్తుంది. మరి అపుడు ఎలా?”

          “ఆ విషయాలన్నీ ఇపుడెందుకు? అప్పటి సంగతి అపుడు చూసుకుందాం. సరేనా!” అనేవాడు.

          నాతో చాలా ప్రేమగా ఉన్నపుడు నేనడిగేదాన్ని, “ఈ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉంటుందా?” అని ఎన్నోసార్లు అడిగాను.

          “ఎందుకుండదు? నా మీద నమ్మకం లేదా? ఎందుకట్లా అడుగుతావు?” అనేవాడు.

          ఆ తర్వాత ఇంట్లో అమ్మమ్మగారికి నన్ను చూసినపుడల్లా ఏవేవో గుర్తొచ్చి నానా మాటలనడం మొదలుపెట్టినపుడు, ఇంట్లో భీకరంగా అమ్మమ్మ, మనవరాలికి గొడవ జరిగినపుడు నేను సపోర్ట్ అడగడం మొదలు పెట్టినపుడు శ్రీని కామ్ గా అయిపోవడం, నాతో పెద్ద తప్పయినట్టు అప్ సెట్ అవ్వడం జరిగేది. అడ్జస్ట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తానన్నాను కానీ, కొత్తలో తన సపోర్ట్ లేకపోతే ఎలా? అప్పటి వరకు అంత ప్రేమ చూపించిన వాడు అలా మౌనంగా అయిపోవడం, దూరం జరిగిపోవడం నాకు చాలా బాధ కలిగించింది. నాకు తెలుసు, వాళ్ళింటి పరిస్థితి వేరు, తను పెరిగిన వాతావరణం వేరు. కానీ తను మనసు విప్పి ఒక్కనాడు నాతో తన బాల్యం గురించి  కానీ, తన స్నేహితులు, తన స్కూల్ గురించి ఎపుడో ఒక మాట చెప్పేవాడు కానీ డిటేయిల్ గా అస్సలు షేర్ చేసుకునేవాడు కాదు.

          అసలే శ్రీని సరిగ్గా మాట్లాడడం లేదని, అతనితో ఎలా మాట్లాడితే రెస్పాన్స్ వస్తుందో అని ఆలోచిస్తూ ఢల్ గా ఉన్నాను.

          శైలుతో ఇదంతా జరగడంతో మరింతగా నిరాశా, నిస్పృహలు ఎక్కువయ్యాయి. ఇది శైలు తప్పని ఎప్పుడూ అనలేను. తను ఎలాంటి పరిస్థితిలో ఉందో నాకు బాగా తెల్సు. అలవాటు లేని పరిస్థితి కాబట్టి కొద్దిగా సమయం పడ్తుంది. ఇంటివాళ్ళు కూడా నాతో దాపరికాలు లేకుండా నాతో పంచుకొవాల్సినవి పంచుకుంటూ నాకు సపోర్ట్ చేస్తే నాకు అలవాటవుతుంది, వాళ్ళు పూర్తిగా నన్ను నమ్మితే కానీ అది సాధ్యం కాదేమో అనిపిస్తుం ది ఒకోసారి. కానీ ఇలాంటివి జరిగినపుడు నేను వాళ్ళ ఇంటి పరిస్థితికి సరిపోనేమో. అమ్మమ్మగారన్నట్టు వాళ్ళకిష్టమైన అమ్మాయిని చేసుకుని ఉంటే తనకి సహనం ఎక్కువ ఉండి వాళ్ళందరిని చాలా ప్రేమగా చూసుకునేదేమో. ఇపుడు ఏం చేయాలి నేను? శైలు అలా చేసినందుకు నేను బాధ పడడం లేదు. ఇలాంటివి ఎపుడో ఒకసారి జరుగుతాయని నాకు తెలుసు.

          శైలుకి కొన్ని పనుల్లో సాయం కావాలి. బాత్రూంకెళితే నీళ్ళు మనం చిన్న బకెట్లో నింపితే తను క్లీన్ చేసుకునేది. ఒకోసారి నీళ్ళు సరిపోకపోతే మళ్ళీ మళ్ళీ అడిగేది. ఎవరు ఖాళీగా ఉంటే వాళ్ళు సాయం చేసేవారం. నేను ఖాళీగా ఉంటే నేను హెల్ప్ చేసేదాన్ని. మెట్లు ఎక్కడానికి, దిగడానికి సాయం కావాలి, టీ.వీ పెట్టడం, ఆఫ్ చేయడం, స్నానం చేసాక లోపలికి తేసుకొచ్చి బట్టలు వేయాలి, తను పౌడర్ రాసుకుంటే బొట్టు పెట్టాలి. నూనె రాసి జడ వేయాలి. తన మూడ్ బాగుంటే నాతో అన్నీ చెప్పి చేయించుకునేది. అత్తగారు పనిలో బిజీగా ఉంటే నేనే మెల్లిగా నచ్చచెప్పి చేసేదాన్ని. వీటికి అన్నీ మెల్లిగా అలవాటు పడిపోయాను. నేను వచ్చిన కొత్తలో కూరలకి, మొక్కలు కొనుక్కు రావడానికి ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం. కానీ మా ఇంటికి వెళ్తే మాత్రం నా వెంట వచ్చేవాడు, నా వెంటే ఉండే వాడు. కానీ నాకు అమ్మ వాళ్ళతో, మా పిన్ని కూతురు, కొడుకు వచ్చారు, వాళ్ళతో కలిసి మాట్లాడాలని, కబుర్లు చెప్పాలని ఉండేది. రాధ మా పిన్ని కూతురు ఒకసారి అడిగింది,” ఏంటి బావ అక్కని అస్సలు విడిచిపెట్టవు? మాతో కాసేపు కూర్చుంటే ఏం కాదులే.”

          “అలాగేం లేదు,” అనేవాడు.

          మా పిన్ని పిల్లలు, రాధ, మహీ ఇద్దరిని మా ఇంటికి తీసుకెళ్ళాం. మా అత్తగారు రకరకాల వంటలు చేసి పెట్టారు, వాళ్ళిద్దరినీ ట్యాంక్ బండ్ కి తీసుకెళ్ళాము.

          తర్వాత ఆడిగాను శ్రీని ని,”ఎందుకు అంతలా నా వెంటే ఉంటావు? నాకు కొంచెం ఫ్రీగా మా వాళ్ళతో ఉండాలని ఉంటుంది కదా!” అంటే.

          చాలా సేపు ఏమి మాట్లాడలేదు. తర్వాత మెల్లిగా, “మా ఫ్యామిలీ గురించి, అందరితో చెప్పేస్తావేమోనని నా భయం! సారీ,” అన్నాడు.

          నేను స్టన్ అయిపోయాను. నేను మా ఇంట్లో అందరి గురించి ఏమి దాచుకోకుండా చెప్పేస్తాను.

          “నాకర్ధం కాలేదు,” అన్నాను.

          “మా ఇంట్లో పరిస్థితులు వేరు కదా! అవన్నీ విని అందరు నవ్వుకుంటారేమో!”

          “అలా అనుకుంటే మరి మా అమ్మ వాళ్ళకి అన్నీ తెలిసే కదా ఈ పెళ్ళి చేసారు. నా కంటే ముందే వాళ్ళకి తెలుసు. ఇపుడు నేను కొత్తగా షేర్ చేసుకునేది ఏముంది? అందరి ఫ్యామిలీస్ ఒకే రకంగా ఉండవు కదా! ఎవ్వరూ ఏమి అనుకోరు.” అని చెప్పాను.

          పిన్ని పిల్లలు రెండు రోజులుండి వెళ్ళారు. మా అత్తగారు, మామగారు, శైలు, అందరూ సంతోషపడ్డారు వాళ్ళని చూసి.

          నాకపుడు గుర్తొచ్చింది ఇది ఫస్ట్ టైమ్ నేనొక్కదాన్ని అమ్మ వాళ్ళింటికి వెళ్ళడం.

          ఆలోచిస్తుండగానే చార్మినార్ వచ్చేసింది. అక్కడి నుండి రిక్షాలో చందూలాల్ బారాదరికి వెల్లాను. 22 ఏళ్ళు అక్కడ పెరిగాను, స్కూల్, కాలేజ్ కెళ్ళడం, నా పెళ్ళి కూడా మా ఇంటి ముందరే చేసారు. ఇంటి ముందర పందిరి వేసి పెళ్ళి చేయాలని నాన్న కోరిక. అక్క పెళ్ళి రెడ్డీ హాస్టల్ లో జరిగింది. మా ఇంట్లో రెండు కొబ్బరి చెట్లుండేవి ఆ చెట్ల కొబ్బరి మండలతోనే పందిరి వేసారు.

          మా ఇల్లున్న సందులోకి తిరుగుతుండగా అమ్మ మా ఇంటి గేట్లో నిల్చుని నా కోసం ఎదురు చూస్తుండడం గుర్తొచ్చింది.

          గేట్ తీసుకుని లోపలికి వెళ్ళాను. అమ్మా, నాన్న నా కోసం భోజనం చేయకుండా ఎదురు చూస్తున్నారు.

          అమ్మకి, నాన్నకు నన్ను చూడగానే చాలా సంతోషమేసింది. ముగ్గురం కూర్చొని భోజనం చేసాము. వాళ్ళిద్దరూ ఒంటరిగా అనిపించారు. నాకు ఒక్కసారిగా ఎక్కడికి వెళ్ళకుండా వాళ్ళతోనే ఉండిపోవాలనిపించింది.

          అమ్మ తల దువ్వి జడ వేస్తానంటే వెళ్ళి అమ్మ ముందు కూర్చున్నాను. నాన్న కుర్చీలో కూర్చుని కునికిపాట్లు పడతారు. ఆ రోజు నేనున్నానని పడుకోకుండా అమ్మ జడ వేస్తుంటే చూస్తున్నారు. అమ్మ మెల్లిగా అడుగుతుంది, ఇంట్లో అందరూ ఎలా ఉన్నారని,  శైలు ఎలా ఉంది? నేను సాయంత్రం కాలేజ్ కి వెళ్తున్నానా? అన్నిటికి మెల్లిగా సమాధా నం చెబుతున్నాను. నాన్న, ”బుక్స్ కొనుక్కున్నావా? ప్రతి ఏడాది నేను కొనేవాడిని, ఇపుడు శ్రీనివాస్ కొంటున్నాడు. ఎలాగైతేనేమి నీకిష్టమైన చదువు పూర్తి చేసుకో తల్లి.” అన్నారు.

          అమ్మ చిక్కులు తీస్తూ జడ వేస్తుంటే పెళ్ళికాక ముందు ఎలా మేం ముగ్గురం వుండేవాళ్ళమో అలాగే అనిపించింది. అంతే కాకుండా అత్తగారింట్లో రోజూ ఒకరకమైన గొడవ ఉంటుంది. ఒకోసారి నేను ఎంత ప్రయత్నిస్తున్నా ఆ యింట్లో అడ్జస్ట్ కాలేక పోవడం, ఒకోసారి జీవితాంతం ఈ ఇంట్లోనే భయం, భయంగా గడపాలా అన్న ఆలోచన వస్తే మాత్రం వెన్ను జలదరించేది. అలాంటపుడు నాకు నేనే ధైర్యం చెప్పుకునేదాన్ని, శ్రీనివాస్ మంచివాడు, నా చదువుకి ఆటంకం చెప్పలేదు, పోను పోను మెల్లిగా ఇంట్లో అందరితో అలవాటవుతుంది. అంతగా ఆలోచించొద్దని, అన్నీ కుదుటపడతాయని. నేను ముందు నుండి భార్యా, భర్తల మధ్య మంచి కమ్యూనికేషన్ లేకపోతే ఒకరినొకరిని అర్ధం చేసుకోవడానికి కష్టం అవుతుంది. ఇద్దరి మధ్య బంధం సమానంగా ఉండి, అన్ని విషయాలు మాట్లాడుకుని ఒక నిర్ణయానికి రాగలిగితే బావుంటుంది. చిన్న చిన్న సమస్యలొచ్చినా అభిప్రాయభేదాలు వచ్చినా ఎప్పటికపుడు వాటి గురించి మాట్లాడుకుని ఆ సమస్యలను పరిష్కరించుకుంటూ పోతే పెద్ద పెద్ద సమస్యలుండవు. నేను ఇవన్నీ చెబ్తూ వుండేదాన్ని, తను అన్ని విని నవ్వేవాడే కానీ తనేమనుకుంటున్నాడో చెప్పేవాడు కాదు.

          అమ్మ జడ వేయడం అయిపోయింది. సాయంత్రం అవుతుంటే ఈ రోజుకి ఇక్కడే వుండి రేపు వెళ్ళొచ్చులే అనుకున్నాను. అమ్మకి, నాన్నకి చెబితే చాలా సంతోషించారు. కానీ నాన్న, “ముందు వాళ్ళకి ఫోన్ చేసి అడుగమ్మా! వాళ్ళు సరే అంటే వుండొచ్చు.” అన్నారు. సరేనని రెండిళ్ళవతల ఆంటీ ఇంట్లో ఫోన్ వుంటే వెళ్ళీ ఫోన్ చేసి మా అత్తగారికి చెప్పాను, “ఈ రోజు ఇక్కడ వుండి రేపు సాయంత్రం వస్తాను, సరేనా?” అని అడిగా. ఆమె అలాగేమ్మా! అనగానే నాకు చాలా సంతోషమేసింది.

          ఒక్కరోజయినా అమ్మ, నాన్నతో సమయం గడపొచ్చు అనుకున్నాను.

          ఒక గంట రెండు గంటలు అమ్మ, నాన్న మా అత్తగారింట్లో అందరూ ఎలా వుంటారని అడుగుతుంటే చెబుతున్నాను. శైలుకి ఎలా సాయం చేస్తాను, ప్రతిరోజు అంతగా గొడవ ఉండదు కానీ అపుడపుడు అమ్మమ్మ, మనవరాలు గొడవ పడుతుంటారని చెప్పాను. నాన్న వంట చేస్తున్నావా అందరికీ అని అడిగారు.  ప్రతిరోజు మా అత్తగారే చేస్తారు, నేను కూరలు కోయడం, మిక్సీలో పొడులు, మసాలాలు, పచ్చళ్ళలాంటివి చేస్తుంటానని చెబ్తున్నాను. మా అత్తగారింటి నుంచి ఫోన్ వచ్చిందని ఒక కుర్రాడు పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పాడు, రెండిళ్ళవతల నుండి. నేను వెళ్ళి మాట్లాడాను.

          “హలో!” అన్నాను.

          “ఏంటి రానన్నావంట రాత్రికి, ఎందుకు?” శ్రీని అటువైపు నుండి ఫోన్లో.

          “ఊరికే, అమ్మా, నాన్నతో ఉండి చాలా రోజులయ్యింది. ఈ ఒక్క రాత్రికే, రేపు సాయంత్రం క్లాస్ టైమ్ కి వచ్చేస్తాను.”

          “నేనొస్తాను ఇపుడు…”

          “కానీ ఎందుకు? ఒక్క రాత్రికే కదా!”

          “నేనొస్తాను, రేప్రొద్దున ఇద్దరం కల్సి వచ్చేద్దాం.” అని ఫోన్ పెట్టేసాడు.

          నేను స్టన్ అయిపోయాను. ఒక్క రాత్రికే కదా! నేనేమన్నా, రోజులు, రోజులు, వారాలు, నెలలు ఉంటానని అనలేదే. నాకు ఉక్రోషంగా అనిపించింది. మా వదినది భద్రాచలం, తను వెళితే నెలలు వెళ్ళి వస్తుంది. ఒకే వూళ్ళో ఉంటే ఇలా పొద్దున్నే వెళ్ళి  సాయంత్రం వచ్చేయమంటారు.

          ఇంటికొచ్చాక నా ముఖకవళికలు చూసి అమ్మా, నాన్న, “ఏమ్మా! ఏం జరిగింది?” అని అడిగారు.

          నాకు అమ్మను పట్టుకుని గట్టిగా ఏడవాలనిపించింది. కానీ కూతురికి మంచి భర్త దొరికాడు, చదివిస్తున్నాడు, బాగా చూసుకుంటాడు, అత్తా, మామగారు కూడా చిన్నవారే ఇపుడే నా మీద పెద్ద బాధ్యతలు పడవు. సంతోషంగానే వుంది అనుకుంటున్నారు.

          “ఏం లేదమ్మా! శ్రీనివాస్ వస్తాడట, రాత్రికి ఇక్కడ ఉండి పొద్దున్నే ఆఫీసుకు ఇక్కడ నుండే వెళ్తాడట. నేను మెల్లిగా సాయంత్రం వెళ్తాలే!” అమ్మా, నాన్న మొహాలు చూసుకున్నారు.

          నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది.

          “శ్రీనివాస్ వస్తే వంట చేయాలి. మన ముగ్గురికే కదా! పొద్దున వంట సరిపోతుందని అనుకున్నాను. కాకారకాయలున్నాయి, వేపుడు చేసి, ఏదైనా పచ్చడి చేసి, అన్నం పెట్టి కొన్ని అప్పడాలు, వడియాలు వేయిద్దాం. పొద్దున చేసిన పాయసం వుంది కదా సరిపో తుంది.” అని అమ్మ లేచి వంటింట్లోకి వెళ్ళింది. ఇపుడు తను అంత అర్జంట్ గా రావాల్సి న అవసరం ఏం వుంది? ఇపుడిపుడే రిలాక్స్ అవుతున్నాను. అమ్మ, నాన్న దగ్గర ఉన్నాను. ఒక్కరోజు వాళ్ళతో గడిపి వెళ్ళాలనుకున్నాను. వద్దంటే ఇంత కోపం వస్తుంది.

          నేను అమ్మకి సాయం చేయడానికి వెళ్ళాను. మేము వంట చేస్తుండగానే వచ్చాడు. ఆటోలో వచ్చి ఉంటాడు. నాన్న పలకరించారు. శ్రీని ఎవ్వరితోను ఎక్కువగా మాట్లాడడు.

          “బావున్నారా? అమ్మా, నాన్న, మీ అమ్మమ్మగారు బావున్నారా? శైలజ ఎలా వుంది?”

          “అందరూ బావున్నారు. మీరు బాగున్నారా?”

          “బాగున్నాం!”

          వంట అయిపోగానే నాన్న నన్ను పిలిచి, ” శ్రీనివాస్ కి లుంగీ తెచ్చి ఇయ్యమ్మా! మీరు కాళ్ళు కడుక్కొని వస్తే భోజనం చేద్దాం.” అన్నారు.

          నాతో పెద్దగా ఏం మాట్లాడలేదు. వాళ్ళిద్దరి భోజనం అయ్యాక అమ్మా, నేను తిన్నాను. అమ్మ నాలో వచ్చిన మార్పు చూస్తూనే ఉంది. నేను మామూలుగానే మాట్లాడ టానికి ప్రయత్నిస్తున్నాను. “ఫాతిమాని కలిసావా ఈ మధ్య? మీ ఇంటి దగ్గరే కంప్యూటర్ కోర్స్ చేస్తుందట కదా!”

          ” అవునమ్మా! కానీ ఈ మధ్య కలవలేదు. కాకరకాయ వేపుడు బావుందమ్మా!”

          “మీ అత్తగారు చాలా రుచిగా వంట చేస్తారని చెప్పావు కదా! వేపుళ్ళు చేస్తారా?”

          “చేస్తారమ్మా. మనం గుండ్రంగా కోస్తాం కదా వేపుడికి, వాళ్ళు పొడుగ్గా కోస్తారంతే.”

          ” మన వంటలు నచ్చుతాయో లేదో శ్రీనివాస్ కి…”

          “ఎందుకు నచ్చవు. వాళ్ళ వంటలు వాళ్ళవి, మన వంటలు మనవి.” అన్నాను.

          ఇంట్లో వాళ్ళిద్దరే కదా మంచాలన్నీ పెరట్లో పెట్టేసారు. ఒక మంచం తీసి అమ్మ, నాన్న కలిసి నవారు టైట్ చేస్తుంటే ఇదంతా అవసరమా? అని నాకనిపించింది.

          సాయంత్రం వరకుండి వెళ్ళిపోతే బావుండేది. ఇదంతా చేయవలసిన అవసరం ఉండేది కాదు.

          రాత్రి పడుకునేపుడు, నేనేం మాట్లాడకుండా ఏ గొడవ లేకుండా పడుకుందా మనుకున్నాను.

          “ఇంటికి ఎందుకు రాలేదు చెప్పు.” అని పదే పదే అడగసాగాడు.

          “ఊరికేనే, ఏం లేదు, చాలా రోజులయింది, అమ్మా, నాన్న దగ్గర ఉండి, వాళ్ళని మిస్ అవుతున్నాను. అందుకే…”

          ” అది కాదు, అసలు రీజన్ చెప్పు ఎందుకు రాలేదో.”

          ” ఏం కాలేదు, ఏం లేదు. ఒక్కరోజు మా ఇంట్లో ఉండాలనుకోవడం తప్పా?”

          ” అది కాదు, అసలు సంగతి చెప్పు.”

          “ఏం లేదంటే వినవేంటి?”

          “చెప్పు…”

          ఒక్కనిమిషం ఆలోచించాను. “నువ్వు కోపం తెచ్చుకోవద్దు, మళ్ళీ మాట్లాడకుండా మౌనంగా అయిపోవద్దు, సరేనా?”

          ” సరే!”

          ” ఏం లేదు, నేను అనుకున్నంత ఈజీగా లేదు అడ్జస్ట్ కావడం… అపుడపుడు చిన్న బ్రేక్స్ తీసుకుంటే కొంచెం మార్పుంటుందేమో! ఊళ్ళోనే ఉన్నారు కాబట్టి ఎపుడన్నా ఒకసారి వచ్చి ఒక రెండ్రోజులుంటాను, అమ్మా, నాన్నకి కూడా కొంచెం బావుంటుంది అనుకుంటున్నా,” అంతే.

          అంతసేపు చెప్పు, చెప్పు అన్నవాడు సడన్ గా కామ్ గా అయిపోయాడు. మాట్లాడ కుండా పడుకున్నాడు.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.