నా జీవన యానంలో- రెండవభాగం- 36

-కె.వరలక్ష్మి

          సెన్సిటివ్ నెస్  ఉంటే –  అది మనిషిని స్థిమితంగా ఉండనీయదు. ఇంటికి వచ్చాక ఏమిటో మనసులో ఒకటే ఆర్ద్రత. ఇన్నాళ్ళుగా మోహన్ కదలకుండా పడుకునే మంచం కడిగి ఆరబెట్టడం వల్ల, ఆ ప్లేస్ ఖాళీగా ఉంది. అతనుంటే ఇంట్లో ఎప్పడూ టీ.వి మోగాల్సిందే. ఏమీ తోచనంత తీరికతో సైలెంటై పోయిన ఇంట్లో దుఃఖం, బాధ, ఏదో తెలీని దిగులు.

          ప్రేమంటే తెలీని ఆ చిన్న వయసులో అతను నన్ను ప్రేమించానంటూ నా జీవితం లోనికి వచ్చాడు. బుచ్చిబాబుగారు అన్నట్టు “ప్రియుడు ప్రియురాల్ని ఎంత వరకూ ప్రేమిస్తాడు? ఆమె పరిచయం దొరికి, శరీరందొరికేంత వరకూ. అంతే !” చాలా మంది జీవితం ప్రేమ అనుభవించకుండానే జరిగిపోతుంది, కలల్లోనూ, పుస్తకాల్లోనూ ప్రేమ మాధుర్యాన్ని తెలుసుకోవాల్సిందే.

          ఏది ఏమైనా నలభై ఏళ్ళు కలిసి ఒకే ఇంట్లో జీవించిన అనుబంధం – ఆ ఒంటరి ఇంట్లో అతడు తరుచుగా గుర్తుకొచ్చి గుండె కరిగి నీరవుతోంది. అందరం ఉండీ అతన్ని ఎక్కడో వదిలేసామే అనే దిగులు నన్ను నిలవనీయ లేదు. అలాగని ఇదివరకులా అతనికి సేవ చేసే ఓపికలేదు. ఎంత డబ్బు ఇస్తానన్నా ఊళ్ళో ఎవరూ ‘చెయ్యం’ అంటున్నారు. నన్నొక వీడని దుఖం, పెరిగిన వాతావరణం వల్ల వచ్చిన పాపభయం నన్ను తలకిందులు చేసెయ్యసాగాయి. అతడు తన బాధ్యతలేవీ పాటించనివాడే కాని నన్ను కట్టుకున్నవాడు. నా పిల్లలకు తండ్రి.

          ‘ఈ జీవిక వ్యర్థశ్రమ, నిరర్థక విషాదగాధ, ఈ మనుగడ నిరాధారమని అనుకున్నాను గాని వెను తిరిగి విలోకిస్తే కనిపించిందొక సత్యం. జీవించిన ప్రతి క్షణం పూర్ణమక్షరం నిత్యం’ అన్న అబ్బూరి వారితో ఏకీభవించాలన్పించేది. జీవితంలో రకరకాల అనుభవాలు ఎదుర్కొంటాం. ఎదురవుతుంటై. విలువలు మారిపోతున్న సమాజంలో అనుభవాలకు అంతమూలేదు. వాటిని విస్మరించి బాధపడినా, సంతోషించినా కొత్తగా సమకూరే ప్రయోజనమూ లేదు. అందుకే, గతం గడిచి పోయిందని  ఏలా ఈ అనుతాపం? కాలం నర్తకి  బహుశా మారుస్తున్నది వేషం.

అని సంతృప్తి పడడమే ఆరోగ్యకరం –

          నేనెందుకు జగ్గంపేట వచ్చేసాను? అక్కడుంటే అప్పుడప్పుడు వెళ్ళి అతన్ని చూసేదాన్ని కదా! ‘డిపెండెన్స్ ఈజ్ డెత్’ నా దృష్టిలో పశుపక్షాదులు కూడా కలిసికట్టుగా ఉంటాయి. వాటి యూనిటీని కూడా మనుషులు ఫాలో కాలేదు.

          అనంత శక్తివంతంగా కన్పించే మనసు ఒక్కోసారి  చిన్న మాటకే తల్లిడిల్లుతుంది. సర్వశక్తుల్ని కోల్పోయి ఏమీ చేతకాని దానిలా మిగిలి పోతుంది. ఎవరైనా నిన్ను ద్వేషిస్తే ద్వేషించనీ. ప్రేమించకపోతే పోనీ, నిర్లక్ష్యం చేస్తే చేయనీ, అది వాళ్ళ కర్మ. నీ రచనావ్యాసంగమే నీకు తోడు నీడ, బంధువర్గం అంతా. . అలా నాకు నేనే ధైర్యాన్ని నూరి పోసుకునేదాన్ని.

          అంతలో ట్రెజరీ వాళ్ళు కబురు చేసారు, మోహన్  లైవ్ సర్టిఫికెట్ ఇవ్వాలని. ఇంక ఇంటికి తీసుకొచ్బేయాలి అనుకుంటూండగా పిల్లల నుంచి ఫోన్ ‘మోహన్ ఫరిస్థితి క్రిటికల్’గా ఉందని. అప్పటికే నెలరోజులై అతన్ని మా చిన్నమ్మాయి ఇంటికి తీసుకొచ్చే సారు. నేను వెంటనే బయలుదేరి హైదరాబాద్  వెళ్ళేను. బస్సుదిగి నేరుగా అక్కడికే వెళ్ళేను. అతని పరిస్థితి చాలా దిగజారిపోయి ఉంది. చూడగానే దుఃఖం ఆగక భోరున ఏడ్చేసాను. తుంటికి రెండువైపులా పెద్ద, పెద్ద బెడ్ సోర్సు వచ్చేసాయి. గదిలో భరించ లేని దుర్గంధం. నన్ను చూస్తూనే అతని కళ్ళుమెరిసాయి. పక్కనే కుర్చీలో కూర్చుంటే నా చేతిని పట్టుకుని గాజులు సవరిస్తూ ఉండి పోయాడు. ముఖంలో తెలివిడితనం తగ్గలేదు. కాస్సేపటికి కారు డ్రైవ్ చేస్తున్నట్టు సైగ చేసి మన ఊరికి, మన ఇంటికి వెళ్ళి పోదాం అన్నాడు. డాక్టర్ని కనుక్కుంటే “హైఫీవర్ ఉంది, ఎక్కడికీ కదల వద్దన్నాడు.” గాయాలు మాని, జ్వరం తగ్గితే అతను కోరినట్టే టేక్సిలో ఊరికి తీసుకెళ్ళిపోదాం అను కున్నాను. అవి మానే గాయాలుకావనీ, ఇప్పటికే వాడాల్సిన మందులన్నీ వాడేసారని, ఇక మందులేవీ పని చేయ్యడం లేదనీ తెలిసింది.

          మరో మూడు రోజుల్లో మా అత్తగారు, ఆడపడుచులు ఒక్కరొక్కరుగా వస్తుంటే డౌటొచ్చింది.

          డిసంబర్ 4 –  2005 రాత్రి 12 వరకూ అందరం దగ్గరే ఉన్నాం. తెల్లవారుఝామున ఎప్పుడో మోహన్ ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడు. ఇంటి దగ్గరే నా సంరక్షణలోనే ఉంటే ఇలా జరిగి ఉండేది కాదని ఒక గిల్టీ నన్ను పట్టుకుని కుదిపేసింది.

          ఇప్పుడిలా రాస్తూ ఉన్నా నా కళ్ళు ధారాపాతంగా వర్షిస్తూనే ఉన్నాయి. అప్పట్లో అందరూ చుట్టూ ఉన్నంతసేపూ మాములుగా ఉండేదాన్ని ఒక్కదాన్నే ఉన్నప్పుడు దుఃఖం ఆక్రమించుకునేది. అతని పెద్దకర్మ రోజు రాత్రి ఎవరు చెప్పేరో కాని, నేను ఎవరి ఇంట్లోనూ ఉండకూడదన్నారు. అలాంటి మాటను నేను మా ప్రాంతంలో ఎప్పుడూ వినలేదు. ఏదైనా ఆలయ ప్రాంగణంలో రాత్రంతా గడిపి రావాలట. మా అబ్బాయి నన్ను, మా అత్తగారిని చిలుకూరు తీసుకెళ్తున్నానని చెప్పి, లహరి రిసార్ట్ కి తీసుకెళ్ళేడు. రాత్రి రిసార్ట్ గదిలో నిద్ర పోయి, తెల్లవారేక చిలుకూరు ఆలయానికి వెళ్ళి వచ్చాం. మరో పది రోజుల్లో అబ్బాయి కుటుంబం, నేనూ రాజమండ్రి వెళ్ళి శాస్త్రోక్తంగా కూర్చుని అస్థికల్ని గోదావరిలో కలిపేసాం. ఆ పూజ జరుగుతున్నంతసేపూ నా కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి. పెళ్లైన కొత్తల్లో మేం తిరిగిన ఆ గోదావరి పరిసరాలు, సాయంత్రాలు తీరికగా కూర్చుని కబుర్లు చెప్పుకొన్న ఆ రేవుల మెట్లు, అప్సరా హోటల్ ప్రాంగణం.. అన్నీ దాటి జగ్గంపేట చేరుకున్నాం. ఆ రోజుతో మోహన్ ఒక జ్ఞాపకంగా మారిపోయాడు. కాని ఒక వ్యక్తి మసలిన ఇల్లు ఎప్పటికీ అతన్ని గుర్తు చేస్తూనే ఉంటుంది. బీరువా తెరవగానే ఇస్త్రీ చేసిపెట్టి ఉన్న అతని బట్టలు, టేబుల్ సొరుగులో అతని వాచీ, రేజర్ లాంటివి అడుగడుగునా…

          2005 వ సంవత్సరం గొప్ప నిర్దయ చూపింది నా పట్ల. హారిబుల్ ఎక్స్ పీరెన్సెస్  ఇచ్చింది.

          ఆ సంవత్సరం ప్రారంభంలో రాసినవి తప్ప ఏమీ రాయలేకపోయాను.

అవే:

6.1.05 ఆంధ్రభూమి వీక్లీలో వచ్చిన ‘ప్రస్థానం’  కథ ఆటా ప్రచురణ

24.2.05 విశాఖ రేడియోలో ‘బాంధవ్యం ‘ కథ ప్రసారమైంది.

2.3.05 నవ్య వీక్లీ లో ‘గుప్తం’ కథ

22.4.05 స్వాతి వీక్లీలో  ‘బాంధవ్యం’ కథ –

ఎప్రిల్ 2005 చినుకు మంత్లీ  మొదటి సంచికలో  “నిజం” కథ –

22.5.05 ఆదివారం ఆంధ్రజ్యోతి లో “ఒంటరి చాకిరీ ‘  కవిత

2.10.05 ఆదివారం ఆంధ్రజ్యోతిలో ‘ గండుచీమలు కథ –

నవంబర్ 2005 ‘పత్రిక’ దీపావళి స్పెషల్ సంచికలో ‘ఇంకా ఇంతేనా?’ కథ –

సెప్టెంబర్ 2005 ‘తెలుగునాడి’లో ‘ ఒంటరి చాకిరీ ‘కవిత (రీప్రింట్)

          ఫిబ్రవరి 2005 కన్నడ పత్రిక ‘రాగ సంగమ’లో ‘శుభోదయ’ పేరుతో ‘ఉషోదయం’ నవల అనువాదం –7.10.2005 నిడదవోలు మాలతి  గారి తూలిక వెబ్ పత్రికలోని ఆవిడే ఇంగ్లీషులోకి అనువదించిన నా కథ ‘గాజుపళ్ళెం’ వచ్చాయి.

          మోహన్ కాలం చేసాక బైటివాళ్ళ ప్రవర్తన కొంత చిత్రవిచిత్రంగా తోచసాగింది. మా అబ్బాయి ఇంట్లో ఉన్నప్పుడు ఆ యింట్లోనే ఉండే మా కోడలు తల్లి తెల్లవారకుండా వచ్చి తన ముఖానికి, కూతురు ముఖానికీ ఇంతంత కుంకుమ బొట్లు పెట్టుకునేది. రోజూ క్రమం తప్పకుండా పసుపు రాసుకునేవారు. వీలైనంత వరకూ ఉదయపు వేళల్లో నన్ను చూడ కుండా జాగ్రత్తపడేవాళ్ళు.

          ఇక మా ఊరికి వచ్చాక మా వీధి అమ్మలక్కలు, ఊరి వాళ్ళు చాలా మంది  పలకరిం చడానికి వచ్చారు. అందులో కొందరు వెళ్తూవెళ్తూ నాకు వినపడేలాగ ‘బొట్టుకాటుకా పెట్టేసు కుంటుంది’ అంటూ బుగ్గలు నొక్కుకోవడం. నేను ఏ బేంకు పనిమీదనో బైటికి వెళ్తుంటే “అప్పుడే బైట తిరిగేస్తుంది చూడు” అని కామెంట్లు. పెరట్లో పూసిన పువ్వుల్ని పాత అలవాటు చొప్పున మాల కట్టి ఇవ్వబోతే నా చేతి నుంచి అందుకోకుండా కింద పెట్ట మని తీసుకోవడం.

          నేను బైటికెళ్తే ఎదురు చూసుకుని వెళ్ళే మగవాళ్ళు గిరుక్కున తిరిగి ఇంట్లోకెళ్లి పోవడం, లేదా స్కూటర్ని మరో వైపు మళ్ళించుకోవడం. ఇక దగ్గర బంధువుల ఇళ్ళల్లో శుభకార్యాలకి ఎప్పుడూ నన్ను ముందుగా అక్షతలు వేసి ఆశీర్వదించమనే వాళ్ళు కాస్తా తర్వాతెప్పుడో పిలవడం –

          మనం పుస్తకాలు, కథలూ కాకరకాయలూ అంటూ మరో ఊహా లోకంలో బతికేస్తుం టాం కాని మన చుట్టూ ఇంకోలోకం ఉందని అర్థమయ్యేలా చేస్తారు జనం.

          అలాంటి సందర్భంలో మొదటగా ఫోన్ చేసి ధైర్యం చెప్పింది ఆర్టిస్ట్ చంద్రం “లోకం అలాగే ఉంటుంది. కథలు రాస్తూ వాటన్నింటినీ, ఈ లోకాన్నీ దూరం పెట్టండి ” అంటూ. రచయిత్రుల్లో శిలాలోలిత  ఫోన్ చేసి “మీ కథలు, కవితల్తో  మీకు నచ్చినట్లు జీవించండి” అంది. నా రచనలే కాదు, రచయితలు, రచయిత్రులు నాకు చాలా ధైర్యాన్నిచ్చారు.

జనవరి 5 – 2006 న ఇలా రాసుకున్నాను. –

“ఇవాళ్టికి సరిగ్గా నెలైంది

ఈ లోకం నుంచి నువ్వు నిష్క్రమించి

ఇప్పుడిక నీ కోసమై ఏడ్వనా?

మన చేతుల్లో లేని జీవితకాలాన్ని

 గుప్పిట పట్టి బంధిచాలనుకోవడం

తల్లి గర్భంలోనే నిర్ణయించబడిన

ఆరోగ్యం కోసం అర్రులుచాచడం

అవివేకం కాదా!

నా  దుఃఖం అంతస్స్రవంతి

నా ఆర్తి నిరాశ్రయ జ్యోతి” –

సర్జరీ  జరిగిన ఎడమవైపు చెయ్యి, వీపు బరువెక్కిపోయి ఒకటే నొప్పి ప్రారంభమైంది.

          ఏమున్నదింకా నేను తాపత్రయ పడడానికి? ఈ భూమిపైన ఎవరు శాశ్వతంగా ఉండి పోతారు? ఏదెలాపోతే నాకేం అనే నిర్లిప్తత నన్నలముకుంది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.