యాదోంకి బారాత్-13

-వారాల ఆనంద్

          ఒకసారి ఉద్యోగంలో చేరింతర్వాత మన జీవిత చక్రం మారిపోతుంది. అప్పటి దాకా వున్న అలవాట్లు టైంటేబుల్ వున్నది వున్నట్టు వుండదు. ఉద్యోగకాలానికి అనుకూలంగా మారిపోతుంది. మార్చుకోవాలి. తప్పదు. అందులోనూ పని చేసే ఊర్లోనే వుంటే పరిస్థితి ఒకరకంగా వుంటుంది.  వేరే వూర్లో వుండి రొజు షటిల్ కొట్టాలంటే మరొక రకం. నాది షటిల్ సర్విస్. వేములవాడ-సిరిసిల్లా-వేములవాడ. అదట్లా వుంటే నేను ఉద్యోగంలో చేరిన 80 లలో ఉద్యోగులు స్థానికంగా ఉండాలనే నిబంధనను ఖచ్చితంగా పాటించేవారు. అందు కోసం వేరే ఊర్లకెళ్ళి వచ్చెపోయే వాళ్ళు స్థానికంగా ఒక ఇంటి నంబర్ ఇచ్చేవాళ్ళం. బయటకు వెళ్తే హెడ్ క్వార్టర్ అనుమతులు కూడా అవసరమయ్యేవి. ప్రిన్సిపాళ్ళు, అధికార్లు కింది వాళ్ళను సతాయించాలనుకుంటే ఈ ఆయుధం వాడే వాళ్ళు. నా కలాంటి అవసరం రాలేదు.

***

          ఒకసారి వేములవాడలో లాండ్ అయ్యాక  మొదటి రోజుల్లో ఉదయమే తాతయ్య వాళ్ళింట్లో టిఫిన్ అదీ పూర్తిచేసే వాణ్ని. తర్వాత అట్లా బయటకెళ్ళి ఇంటి వెనకాలే వున్న ఇట్టేడు కిరణ్ వాళ్ళ షాబాజ్ బండల షాప్ లోనో, రవీంద్ర తోనో లేదా రాజ్ ఫోటో స్టూడియోలోనో గడిపేవాన్ని. తర్వాత లంచ్ చేసి నడుచుకుంటూ మేదరివాడ, చాకలి వాడలు దాటి వేములవాడ ‘మూలవాగు’ గుండా నడిచి తిప్పాపూర్ బస్ స్టాండ్ చేరేవాన్ని. అప్పటికి ఇంకా శాశ్వత బస్ స్టాండ్ నిర్మాణం కాలేదు. తిప్పాపూర్ స్టాండ్ లో ట్రాక్టర్ ఆనందం, శ్రీమతి భాగ్యలక్ష్మి తదితరుల ఇండ్లు ఉండేవి. అక్కడే మక్కకంకులు అమ్మే వాళ్ళు చిన్న చాయ్ దుకాణాలు ఉండేవి. బస్ ఎక్కి సిరిసిల్ల 12 కిలో మీటర్లు వెళ్ళే వాణ్ని. అట్లా కొంత కాలం వెళ్ళిం తర్వాత మా కాలేజీ సహచరుడు యాద కిషన్ స్కూటర్ మీద షేర్ చేసుకుని కలిసి వెళ్ళడం అలవాటయింది. మార్చ్ లో కాలేజీలో జాయిన్ అయితే అప్పటికి ఇంకా క్లాసులు జరుగుతున్నాయి. అప్పుడు రెండు రకాల విద్యార్థులు వుండే వాళ్ళు. ఒకరకం పరీక్షల్లో పల్టీలు కొట్టీ కొట్టీ ముదిరిపోయి లంపెన్ గాంగ్లా వుండేవాళ్ళు. మరో రకం కొంత ప్రగతిశీలంగా చదువుకుంటూ బాగుండేవాళ్ళు. సిరిసిల్లా కాలేజీ కో-ఎడ్యుకేషన్. అమ్మాయిలూ అబ్బాయిలూ వుండేవాళ్ళు దాంతో వాతావరణం లైవ్లీ గానూ, వివాదంగానూ వుండేది. నేను చేరిన కొత్తల్లోనే పెద్ద గొడవ జరిగింది. ఒక రోజు తెలుగు లెక్చరర్ లక్ష్మయ్య గారు క్లాసులో చెబుతూ వుండగా మగ పిల్లలు ఏవో అశ్లీల మాటలు అని వాటి అర్థం కావాలనో ఎదో గొడవ పడ్డారు. అమ్మాయిలూ కూడా వుండడంతో గొడవ బాగానే అయింది. వివాదం ప్రిన్సిపాల్ గదిలో కొచ్చింది. విద్యార్థుల్ని ప్రిన్సిపాల్ పిలిపించాడు. ఆ సమయానికి యాదృచ్చికంగా నేను అక్కడే వున్నాను. ‘విద్యార్థులూ, మీరు పిల్లలు ఇప్పుడే మీకివన్నీ ఎందుకు హాయిగా చదువుకోక అంటూ నేనూ ఎదో మాట’ కలిపాను. ప్రిన్సిపాల్ వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాడు. ఇక ఏముంది గొడవ పెద్దది అయింది. నేను జువాలజీ లాబ్ లో కిషన్ రాజన్నలతో వున్నాను. ఒక్కసారిగా పది మందికి పైగా స్టూడెంట్స్ అక్కడికి వచ్చారు.’ ఏమో అన్నావట నీకేం తెలుసు.. ఎవరు నువ్వు..నీకు పెళ్ళయిందా.. నాకిద్దరు పిల్లలు తెలుసా అంటూ దాడికి వచ్చాడొకడు.. నేను ఎదురు తిరిగేసరికి గొడవ పెద్దది అవుతున్నదని రాజన్న కిషన్ లు వాళ్ళను సముదాయించి ‘సారు కొత్తగా వచ్చాడు.. అంటూ సర్ది చెప్పారు. కొంచెం గొడవ  అయింది. వాళ్ళు వెళ్ళిం తర్వాత వాడు ప్రతాప్ అనీ రఫ్ ఫెల్లో అంతా గుండాల తత్వం పోనీలే అన్నారు నాతో. మొదట్లోనే ఒక బిట్టర్ అనుభవం.

          అదలా ఉండగానే ఇంటర్ వార్షిక పరీక్షలు వచ్చాయి. వేములవాడలో మా బంధువు మా మిత్రుడు ఎడ్ల రాజేందర్ తమ్ముడు మహేష్ మా కాలేజీలోనే ఇంటర్ స్టూడెంట్. ఆనంద్ బావ అంటూ క్లోజ్ గా ఉండేవాడు. అప్పటికి నాకు పరీక్షలు రాసిన అనుభవమే తప్ప ఇనివిజిలేషన్ కొత్త. అందుకే మొదటి రోజు శ్రీధర్ రావు సర్ తనతో ఒకే గదిలో వేయించుకున్నాడు. తీరా చూస్తే మహేష్ అదే రూములో పరీక్ష రాస్తూ వున్నాడు. ఏ ముంది ఇంగ్లిష్ పరీక్ష గ్రామర్ బిట్స్ అన్నీ చెప్పాను. అట్లా ఉపయోగపడ్డాను. రోజూ పరీక్షల డ్యూటీ క్రమంగా అలవాటయింది. అప్పుడే రుద్ర రవి, హసన్ ఫసి ఉల్లా, అశోక్ తదితరులు, ఇంకా శైలజ(హిమజ) కూడా పరీక్షలు రాసారు. మిత్రుడు కొడం పవన్ కుమార్ పరీక్షల చివరి రోజువచ్చి రవి తదితరులను పరిచయం చేసాడు. ఆశ్చర్యంగా ఇంటర్ 2 ఇయర్ పరీక్షలు రాసిన వాళ్ళూ నేనూ మంచి స్నేహితులమయ్యాం. శైలజ మా ఆంటీ అయింది.

          కాలేజీ పరిస్థితి ఇట్లా వుంటే బయట అప్పటికే మంచి కవిగా పేరు గడించినఆత్మీయ మిత్రుడు జూకంటి జగన్నాథం సిరిసిల్లా సెస్ ( CO-OPERTIVE ELECTICAL SUPPLY SOCIETY ) లో పనిచేసేవాడు. తను కూడా కాలేజీకి వచ్చేవాడు, నేనూ వాళ్ళ ఆఫీసుకు వెళ్తూ వుండేవాన్ని. పవన్ తో కలిసి అప్పటికే సీనియర్ కవి శ్రీ కనపర్తి గారి ఇంటికి వెళ్ళేవాళ్ళం. వాళ్ళ కూతుళ్ళు కవిత, సరితలు కూడా బాగా ఆత్మీయంగా మాట్లాడేవాళ్ళు. ఇంకా నిజాం వెంకటేశం, జక్కని వెంకట రాజం, వడ్డేపల్లి కృష్ణ తదితరుల పరిచయమూ అప్పుడే జరిగింది. అదే సమయంలో అంతా సాహిత్య వాతావరణం. కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్ పసుపులేటి జయంత్ కుమార్ కూడా కవిత్వం రాసేవాడు. మొత్తంగా సిరిసిల్లలో ఒక సాహితీ వాతావరణం వుండేది. దాదాపుగా అదే సమయంలో నేనో కథ రాస్తే అది ఆంధ్రప్రభ ఆదివారం సంచికలో వచ్చింది. ఒక తహసిల్దార్ కూతురు కాలేజీలో లెక్చరర్ అన్న మాటలకు అవమానంగా భావించి ఆత్మ హత్య చేసుకుంటుంది అలాటిదే ఆ కథ. మంచి రెస్పాన్స్ వచ్చింది కాని కాలేజీలో అలాంటి సంఘటన జరిగింది అదే రాసానని జయంత్ ప్రచారం చేయడంతో కొంత వివాదమయింది. అలాంటిదేమీ లేదని నేను చాలా సర్ది చెప్పుకోవాల్సి వచ్చింది.

          అట్లే సిరిసిల్ల జూనియర్ కాలేజీలో పని చేస్తుండగా మొదటి సంవత్సరాలల్లోనే ఏవో ఎన్నికలోచ్చాయి. అప్పటి ఉత్తర తెలంగాణా అట్టుడుకుతున్న స్థితి. ఒక వైపు అన్నల ఎన్నికల బహిష్కరణ పిలుపు. మరో వైపు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎన్నికల్ని నిర్వహిం చాలని పట్టు. దాంతో ఎన్నికల సమయంలో గోడలన్నీ వివిధ రాజకీయ పార్టీల ప్రచార ఆడంబరాలు. మరో ప్రక్క ఎన్నికల బహిష్కరణ పిలుపు నిస్తూ అన్నల నినాదాలరాతలు. పరిస్థితి చాలా ఉద్రిక్తంగా వుండేది. పోలింగు సమయంలో వోట్ల బాక్సులు ఎత్తుకెళ్ళడం, పోలీసుల పైన దాడి చేసి ఆయుధాలు ఎత్తుకెల్లిన సంఘటనలు కూడా జరిగేవి. ఎన్నికల అధికారులు ఒక స్థాయిలో పోలీసులు వుంటే మేము ఎన్నికలు నిర్వహణ చేయం అనే దాకా వచ్చింది. అంతే కాదు అన్నలు వస్తే బాక్సులు అప్పగించాలే తప్ప వాళ్ళతో వాదా లకు వివాదాలకు దిగోద్దని కూడా నిర్ణయం చేసారు. ఉన్నతాధికారులది ఎటూ చెప్పలేని స్థితి. ప్రభుత్వ నిర్ణయం కనుక ఎట్లాగోలా ఎన్నికల్ని నిర్వహించాలన్నది వాళ్ళ పట్టుదల. ఆ సమయంలోనే నాకు కొనారావుపేట్, నిమ్మపల్లి ప్రాంతాల్లో ఒక గ్రామంలో ఎన్నికల డ్యూటీ పడింది. నాకేమో కొత్త. అయినా మామూలుగానే వున్నాను. ఎన్నికల ట్రైనింగ్ క్లాసులు ముగిసాయి. చూపుడు వేలికి చుక్కలు పెట్టడం, బాలట్ పేపర్లు మలవడం మొదలు అనేక విషయాలు వివరించారు. మీరంతా చాలా ఎన్నికలు చూసారు అంటూనే అధికారులు అనేక విషయాల్ని వివరించారు. ఎన్నికల రోజులు రానే వచ్చాయి. ఎన్నికల సామాన్లు తీసుకునే సమయంలో డ్యూటీ ఎక్కడో ఎవరెవరు ఏ టీమో ఆదేశాలు ఇచ్చే వారు. నాకు మా కాలేజీ పీఈ టీ దేవరాజం సారు, నారాయణ సార్లు సహచరులుగా వచ్చారు. నేను ఊపిరి తీసుకున్నాను. నువ్వేం ఫికర్ పెట్టుకోకు బిడ్డా. మేం చూసు కుంటాం అన్నారు వారిద్దరు. దేవరాజం సారయితే వాళ్ళ ఇంటి నుండి ముగ్గురికి సరపడా చికెన్ మటన్ లతో కారేజీల్లో భోజనం తెచ్చాడు. ఇంకే ముంది. ఎన్నికలు సరదాగానే గడిచాయి. పోలింగుకు ముందు రోజు మాత్రం పీకల దాకా టెన్షన్తో గడిచింది. అట్లా మొదటి ఎన్నికల డ్యూటీ గడిచి ఊపిరి పీల్చుకున్నాను.

          అట్లా సిరిసిల్లా కాలేజీలో వుండగా రెండు మూడు ఎన్నికలలో డ్యూటీ చేసాను. ప్రతిసారీ వేర్వేరు వూర్లు, భిన్నమయిన అనుభవాలు.

***

          80 విద్యాసంవత్సరం ముగిసిన తర్వాత క్రమంగా కొత్త అడ్మిషన్లు కొత్త పిల్లలు సరికొత్త అనుభవాలు. విద్యాలయాల్లో ఉండే గొప్పదనమే అది. ఎప్పటికప్పుడు కొత్తే. పిల్లలు చదువులు బదిలీలతో కొత్త సహచరులు. ఏదీ మిగతా కార్యాలయాల్లో లాగా రొటీన్ గా వుండదు. ఏ విద్యా సంవత్సరానికా సంవత్సరం కొత్తదే. నేను సిరిసిల్ల కాలేజీలో పూర్తి చార్జ్ తీసుకుని విద్యార్థులతో కలివిడితనం పెంచుకోవడం మొదలు పెట్టాను. పుస్తకా లివ్వడం. తీసుకోవడం. అంతా గోల గోలగా వుండేది. కొందరు బుద్దిగా వుంటే మరి కొందరు చిరాకు కలిగించే వాళ్ళు. నాకున్న STAMMERING ఒక్కోసారి బాగా ఇబ్బంది పెట్టేది. పిల్లలు ముందు కాకున్నా వెనక నవ్వే వాల్లనుకుంటా. ఏమీ చేయలేని స్థితి. నా ఫ్రెండ్లీ తత్వమే నన్ను విద్యార్థులకు దగ్గర చేసింది. అంతే కాదు నా ప్రగతిశీల భావాలు కూడా ఆ ఆలోచనలున్న స్టూడెంట్స్ కు దగ్గర చేసింది. జగన్నాథం లాంటి మిత్రులు క్లాసులు చెప్పాల్సి లేకున్నా నేను ఇలాంటి ఇబ్బందులు  ఎదుర్కోవాల్సి రావడం పట్ల బాధ పాడేవాళ్ళు.

          కానీ నేను దాన్ని క్రమంగా అధిగమించాను. ముఖ్యంగా రుద్ర రవి లాంటి వాళ్ళ స్నేహం ఎంతో బలాన్నిచ్చింది. వాళ్ళ స్నేహం కలిసిన తర్వాత సిరిసిల్ల గాంధీ చౌరస్తా లో వున్న వాళ్ళ బాంబే డైయింగ్ షాప్ లో దాదాపుగా కలిసే వాళ్ళం. ఫసి, సలీం, అశోక్, గూడూరి ప్రవీణ్, బొగ  రవి లాంటి అనేక మిత్రులతో పాటు జగన్, పవన్ అంతా ఓకే బాచ్. కలిసా మంటే చాలు స్వీట్ హౌజ్ లో గంగా జమున లేదా ఉడిపిలో టిఫిన్లు అంతా ఒక సెలెబ్రేషన్ లాగా వుండేది. రవి వాళ్ళ నాన్న శ్రీ రుద్ర శంకరయ్య గారు ఆ వూరికి అనేక టర్మ్స్ సర్పంచ్. తను కూడా నేనంటే బాగా అభిమానంగా చూసేవారు. ఫసి వాళ్ళ బాబాయి జిల్లపరిషత్తు కో ఆప్షన్ సభ్యుడిగా వుండేవారు.

          సిరిసిల్లలో ఆ రకంగా చైతన్యవంతమయిన జీవితానికి మిత్ర బృందం అనేక విధాలుగా తోడ్పడింది. అంతే కాదు సాంస్కృతికంగా అనేక కార్యక్రామాలూ చేసాం

***

దోస్తులూ-షాదీ ముబారక్ లూ

ఇష్టం గానూ అయిష్టం గానో నేనయితే 21 దాటి 22ఏళ్ళు వచ్చేసరికి ఉద్యోగంలో చేరి పోయాను. అప్పుడు అట్లా ప్రభుత్వ ఉద్యోగం దొరకడమే గొప్ప అన్న వాళ్ళూ వున్నారు. నాకయితే ఏ భావమూ ఉండేది కాదు. మా సుమిత్ర పెద్దమ్మేమో వానికి ఉద్యోగం వచ్చింది ఇంకేముంది పెళ్ళి చేయవా అని మా అమ్మతో అనేది. నేను నవ్వుతూ వినేవాన్ని. కానీ నా తోటి వాళ్ళకు దోస్తులకు పిల్లల్ని చూడ్డం పెళ్ళిళ్ళు చేయడం కూడా ఆ వయసులోనే జరిగింది. అప్పటికి వాటిని బాల్య వివాహాలు అనలేం. కానీ అవి ముందస్తు పెళ్ళిల్లే. మా మిత్రుల్లో చాలా మంది జీవితాల్లో స్థిర పడక ముందే మూడు ముళ్ళూ వేసేసారు. అలాంటి వాటికి ప్రధానంగా కొన్ని కారణాలు కనిపిస్తాయి.

          పిల్లగాడు పక్క చూపులు చూస్తున్నాడు, గోడలు దుంకుతున్నాడు అన్నది గ్రామీణ ప్రాంతాల్నించి వచ్చిన దోస్తుల ఇంటివాళ్ళ గోస. దాన్ని తప్పించేందుకు పెళ్ళి చేసారు. ఇంకొకరు పెళ్ళిళ్ళలో వేరే అమ్మాయిల పైన తలంబ్రాలు చల్లుతున్నాడని, గొడవలవు తున్నాయని లగ్గానికి పూనుకొన్నారు. ఇంకొకరేమో వయసొచ్చేసింది ఇక ఆగడని పెళ్ళి  చేసేయాలని చేసిన వారున్నారు. మరొకరేమో ఇంట్లో పెద్దవాళ్ళ ఆరోగ్యాలు బాగా లేవు వాళ్ళ కళ్ళ ముందర చేయాలనీ చేసారు. ఇట్లా మా మిత్రులనేక మంది పెళ్ళిళ్ళు చేసుకున్నారు. నేనేమో దాదాపు అన్ని పెళ్ళిళ్ళూ చూసి చేసి ఆనందించాను. ఆహ్లాదంగా గడిపాను. సెలెబ్రేట్ చేసాను.

***

          మా దోస్తుల్లో నాకు గుర్తున్న మొదటి పెళ్ళి చింతకింది వేణుగోపాల్ ది. ఆ పెళ్ళి  మేము ఇంటర్ మొదటి సంవత్సరంలో ఉండగానే జరిగింది. వాళ్ళ నాన్న పెద్ద వ్యాపారి అందుకేనేమో తన పెద్దకొడుకు పెళ్ళి అంత త్వరగా చేసాడు. కరీంనగర్ కాపువాడలో జరిగిన ఆ పెళ్ళి విశేషాలు అంతగా గుర్తుకు లేవు. కోడాక్ కెమెరాతో ఆ నాడు తీసిన ఫోటోలూ లేవు. కానీ వాడు మా అందరికంటే సీనియర్ అయిపోయాడు.

          ఇక స్నేహితుల్లో రెండవ పెళ్ళి. అప్పటికి నాకు అత్యంత దగ్గరివాడూ ఆరవ ప్రాణంగా తిరిగిన వాడూ అయిన కే. దామోదర్ రెడ్డి ది. కేడీ అనీ దామోదర్ అనీ ముద్దుగా పిలుచుకునే తన పెళ్లి 10 మే 1978 లో భూమ్పెల్లి లో జరిగింది. అప్పటికి మా డిగ్రీ చదువులు పూర్తి అయ్యాయి. నేను ఇతర మిత్రులం కరీంనగర్ లో చదివితే దామోదర్ హైదరాబాద్ లో చదివాడు. లేదా చదివినట్టు చేసాడు. దామోదర్ వాళ్ళది పోరండ్ల గ్రామం. భూస్వామ్య కుటుంబం. వాళ్ళ బాపు అప్పటికే జిల్లా స్థాయిలో సహకార శాఖలో ఉన్నతాధికారి. వందెకరాల ఆసామికి సంబందాలకేమి తక్కువ. పెళ్ళి కుదిరింది. మిత్రులం అందరమూ వెళ్ళాలి.

          కానీ అప్పుడే మాకు రామగుండం ఫెర్టిలైజర్ కంపనీలో ఉద్యోగాల కోసం ఎంప్లాయి మెంట్ ఆఫీసు నుంచి కాల్ లెటర్స్ వచ్చాయి. 9 మే రోజున హాజరవ్వాలి. నేనూ, లింగమూర్తి, నర్సిరెడ్డి ఇట్లా పలువురం వెళ్ళాం. మొదట రాత పరీక్ష అన్నారు. అందులో ఎంపికయిన వారికి తర్వాత ఇంటర్వ్యు అన్నారు. రాతలో నేగ్గాం. ఇంటర్వ్యు కి కొందరిని అదే రోజు ఏర్పాటు చేసారు. నాతో పాటు మరికొందరికి మర్నాడు రమ్మన్నారు. తెల్లారితే దామోదర్ పెళ్ళి. ఎట్లా.. ఇంటర్వ్యు ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఇంట్లో వాళ్ళకు బాగా లేదని నాకు ఇవ్వాలే ఇంటర్వ్యు పూర్తి చేయమని బతిమిలాడాను. మొదట కాదన్నా తర్వాత ఎట్లాగో ఒప్పుకుని పూర్తి చేసారు. అమ్మయ్య అనుకుని రాత్రికి కరీంనగర్ కు చేరు కున్నాను. తెల్లారి ఉదయం సిద్దిపేట దగ్గరిలోని భూంపెల్లి పెళ్ళికి చలో. కారణమేంటో కానీ నాకా ఉద్యోగం రాలేదు. లింగమూర్తి వాళ్ళకు వచ్చింది. అప్పుడు ఎఫ్.సి.ఐ.కి లీగల్ అడ్వైజర్ గా వున్న మా మామ బొమ్మ వెంకన్నను కలిసాం. ఆయన ఎఫ్.సి.ఐ. అధికారు లతో మాట్లాడి అంతా అయిపోయిన తర్వాతనా చెప్పేది అని చివాట్లు పెట్టాడు. అదట్లా ముగిసింది. కానీ దామోదర్ పెళ్ళి మాత్రం ఘనంగా జరిగింది. వాళ్ళ వైవాహిక జీవితమూ గొప్పగా జరిగింది. కరీంనగర్ లో అనేక ఏళ్ళ పాటు పెళ్ళి రోజుల్ని జరుపుకున్నారు. నేనూ హాజరయ్యాను.

***

          ఇక 1978 లోనే జరిగిన మరో పెళ్ళి మిత్రుడు కవి వఝల శివ కుమార్ ది. అప్పటికే కవిగా పేరున్నవాడు. నటుడిగా గాయకుడిగా వేములవాడలో కృషి చేస్తున్నవాడు. తన పెళ్ళి భీమేశ్వర సభామంటపంలో ఘనంగా జరిగింది. నేను కరీంనగర్ నుంచి ప్రత్యేకంగా వెళ్ళాను. పెళ్ళిలో ఏదయినా ప్రత్యేకంగా చేయాలినిపించింది. చిన్న చిన్న కవర్లల్లో రెండేసి చాక్లెట్స్ పెట్టి పెళ్ళికి వచ్చిన వారందరికీ పంచాలని అన్నాను. దాంతో మిత్రు లంతా ముందుకొచ్చి కవర్ల తయారీలో పడ్డారు. రాత్రి పెళ్ళి. పెద్ద ఊరెంగింపు. రఫీక్ గాడేమో ఆనంద్ నా టీ షర్ట్ వేసుకో అన్నాడు. మొదటిసారిగా టీ షర్ట్ తో పెళ్ళిలో హడావిడి చేసాం. పెళ్ళి కూతురు శారద మా మిత్రుడు మధు రవీందర్ చెల్లెలే. వాళ్ళ నాన్న మధు మృత్యుంజయ శర్మ గారు మంచి అధ్యాపకుడు. చూడగానే దండం పెట్టాలనిపించెంత సౌమ్యుడాయన. ఇక శారద రవిందర్ వాళ్ళ అమ్మ శకుంతల గారూ, ఉపాధ్యాయుల సాంబశివుడి అమ్మ విశ్వేశ్వరమ్మ గారూ, మా అమ్మ రాధ చిన్నప్పటి నుండి మంచి స్నేహితులు. కలిసి చదువుకున్నవాళ్ళు. నేను కనిపించినప్పుడల్లా ఆ యిద్దరూ సొంత కొడుకులాగా చూసేవాళ్ళు. మా రాధ కొడుకు అని సంబరంగా పిలిచే వాళ్ళు. నాకయితే ఎంతో సంతోషం వేసేది.

          అట్లా మంచి వాళ్ళయిన కుటుంబంలోంచి వచ్చిన శారద గారి మంచితనం, నెమ్మదితనం, సర్దుకుపోయే తత్వం వల్లనే మా శివకుమార్ జీవితం ఇప్పటికీ సాఫీగా సంతోషంగా సాగిపోతున్నదని నేననుకుంటాను. ఆ మేరకు బాగా అదృష్టవంతుడు మా వఝల శివకుమార్. ఆ జంట తమ కుమారుడికి ఆనంద్ అని పేరు పెట్టుకున్నారు. దాంతో వాళ్ళని డాడీ మమ్మీ అని నేను పిలుస్తాను తను కూడా కోడక్ అంటాడు. ఏది ఎట్లున్నా కలిసి ఉన్నాం ఉంటాం కూడా. 

***

          1981లో మా క్లాస్మేట్ మంగలంపల్లి వెంకటేశ్వర్లు పెళ్ళి. గుండి గ్రామంలో జరిగింది. అయ్యగార్ల పెళ్ళి. వెంకటేష్, నేను, వేణు, దామోదర్ తదితరులం వెళ్ళాం.

          ఇక మా స్నేహితుల పెళ్లిళ్ళ విషయంలో 1982 ముఖ్యమయిన సంవత్సరం. ఎందు కంటే ఆ ఏడు నాకు చాలా ఆప్తులయిన ముగ్గురి వివాహాలయ్యాయి.

          అందులో మొదటి పెళ్ళి పి.ఎస్.రవీంద్రది. తను నాకు చిన్ననాటి స్నేహితుడు. కవి మంచి ఫోటోగ్రాఫర్. చాలా విషయాల్లో కలివిడిగా వుండేవాళ్ళం. పీఎస్ తాను చిన్నప్పుడు మొట్ట మొదటిసారి కరీంనగర్ కు మా అమ్మతో కల్సి వచ్చానని గుర్తు చేసుకుంటాడు. అప్పుడు మేము మిఠాయి దుకాణం ఇంట్లో వుండే వాళ్ళం తర్వాత మంకమ్మ తోటకు మారిన తర్వాత కూడా రవి కరీంనగర్ కు ఎప్పుడు వచ్చినా మా దగ్గరే ఉండేవాడు. ఇద్దరమూ ఎన్ని సినిమాలు కలిసి చూసామో, ఎన్ని రాత్రులు ముచ్చట్లతో గడిపామో లెక్కలేదు. తాను ఇంటర్ తర్వాత ఫోటోగ్రఫీ నేర్చుకునేందుకు అలోశెట్టి ప్రభాకర్ వద్దకు జగిత్యాల వెళ్ళాడు. అక్కడే ప్రభాకర్ మిత్రుడు సురేందర్ ప్రేరణతో పెళ్ళికి సిద్ధమయ్యాడు. శ్రీ వాసాల నర్సయ్య గారి కూతురు వసుంధర గారి గురించి చెప్పాడు. వసుందరను చూడ్డానికి, కలవడానికి  పీఎస్ తో నేనూ వెళ్ళాను. అప్పటికి తను టీచర్ ట్రైనింగ్ లోవుంది. పీఎస్ కి ఇష్టమయింది. నా అభిప్రాయమూ ఒకే నన్నాను. అట్లా పెళ్ళి సెటిల్ అయింది. పీఎస్ మేనమామ మంచే సత్యనారాయణ మాత్రం తనకు ఇష్టం లేనట్టు నాతో కొంచెం కినుకుగా మాట్లాడాడు. ‘జబ్ మియా బీవీ రాజీ హో తో క్యా కరేగా ఖాజీ అనుకున్నాను’. పిల్లా పిలగాడూ ఒకే అన్నంక ఆగేదేముంది. 30 జనవరి 1982 రోజున రాత్రి మెట్పెళ్లిలో పెళ్ళి జరిగింది. పీఎస్ అప్పటికే కొంతకాలం అవుట్ డోర్ ఫోటోగ్రఫి చేసి 1981 లో ‘ప్రతిమ’ స్టూడియో ప్రారంభించాడు. మిత్రుడు బొడ్ల అశోక్ కట్టిన కొత్త ఇల్లు షాపింగ్ లో ప్రతిమ స్టూడియోని జింబో, అలిశెట్టి ప్రభాకర్ లు కలిసి ప్రారంభించారు. తనని ఫోటోగ్రఫి వైపు ప్రోత్సహించిన జింబో, ఫోటోగ్రఫి నేర్పించిన అలిశెట్టిలతో ప్రతిమ ప్రారంభించడం తనకు చాలా సంతోషం కలిగించిన అంశమని పీఎస్ అంటాడు. తర్వాత వసుంధర టీచర్ ఉద్యోగంలోనూ పీఎస్ ఫోటోగ్రఫి లోనూ, ఆ తర్వాత జర్నలిజంలోనూ బిజీ అయిపోయారు.

***

          ఇక 2 ఫిబ్రవరి 1982 రోజున మిత్రుడు ఇట్టేడు కిరణ్ కుమార్ పెళ్ళి జరిగింది. కిరణ్ నన్ను బావా అని పిలిచేంత దగ్గరి మిత్రుడు. అప్పటికే 1981లో  మేము వేములవాడలో ఫిలిం సొసైటీ ప్రారంభించాం. దాన్లో నన్ను ప్రోత్సహించి, వెన్నంటి వుండి నడిచి నడిపించినవాడు కిరణ్. చాలా ఆక్టివ్ గా ఉండేవాడు. అప్పటికే ఒక సారి బాంబే వెళ్ళి  కొంత కాలం ఇంటికి దూరంగా వున్నాడు. బాంబేలో సినిమాల కోసమో అడ్వర్టైజ్మెంట్ చిత్రాలకోసమో పని చేసానని చెప్పేవాడు. వేములవాడ వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న నిర్వహిస్తున్న షాబాద్ బండ, బెంగళూరు గూనల షాప్ నిర్వహించడం మొదలుపెట్టాడు. వాళ్ళ షాప్ మా తాతయ్య ఇంటికి వెనకాలే వుండేది.నేను సిరిసిల్లా కాలేజీకి వెళ్ళి  సాయంత్రం ఇంటికి తిరిగి రాగానే వెళ్ళి కిరణ్ తో కలిసి కాలం గడిపెవాన్ని. కిరణ్ సహకారం లేకుంటే వేములవాడలో ఫిలిం సొసైటీ స్థాపన సాధ్యం అయ్యేది కాదు. కిరణ్ తల్లి దండ్రులు శ్రీమతి శారదా బాయి, శ్రీ జగదీశ్వరయ్య గార్లు కిరణ్ అంటే చాలా ప్రేమగా వుండేవాళ్ళు. ఒక్క కిరణ్ అనే కాదు కూతురు విష్ణువందన, మిగతా కుమారులు గౌతం, శరత్ లను కూడా ప్రేమతో అపురూపంగా పెంచారు.

          కిరణ్ కు నిజామాబాద్ కు చెందిన కమళావతితో ఘనంగా పెళ్ళి జరిగింది. మిత్రుల మంతా నిజామాబాద్ వెళ్ళాం. పెళ్ళికి జింబో, శివప్రసాద్, బల్మూరి యుగంధర్, రఫీక్, సాంబశివుడు, రమేష్ చంద్ర, జక్కని రాజయ్య, ఎడ్ల రాజేందర్, మహేష్ ఇంకా ఎంతో మంది మిత్రులం హాజరయ్యాం. పీఎస్ అప్పటికి తన పెళ్ళయి మూడు రోజులే అయినా ఫోటోలు తీయడానికి వచ్చాడు.

***

          ఇక 1982 లోనే జరిగిన మరో పెళ్ళి మంగారి రాజేందర్ అంటే మా రాజు మామది. అప్పటికే తాతయ్య డాక్టర్ సుబ్రహ్మణ్యం గారి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో పెళ్ళికి సిద్ధపడ్డారు. ఇంటికి దగ్గరే. పోలీసు స్టేషన్ ముందు వున్న కుటుంబంతోటే సంబంధం. శైలజ సిరిసిల్లాలో ఇంటర్ పూర్తి చేసి డిగ్రీ వరంగల్ లో చదువుతున్నట్టు గుర్తు. ఆమె తండ్రి గారు శ్రీ సత్యనారాయణ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్. అయతే శైలజ వాళ్ళ మేనత్త శ్రీమతి ఆండాలమ్మ, మామయ్య శ్రీ వెంకట్ రెడ్డి (తాసీల్దార్) గార్లు శైలజను adopt చేసుకున్నారు. 29 మే 1982రోజున పెళ్ళి. మంగారి వాళ్ళింట్లో చిన్నవాడి పెళ్ళి కనుక అంతా ఆడంబరంగా చేయాలనుకున్నారు. దాంతో అయిదుగురు అక్కా చెల్లెళ్ళు సుమిత్ర, రాధ, శాంత, వినోద, ప్రమదలు కొన్ని రోజుల ముందే వేములవాడ చేరుకొని ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అన్నీ తామే అయి నిర్వహించారు. ఇరుపక్షాలూ స్తితిమంతులయిన వాళ్ళే కనుక పెళ్ళి కూడా ఘనంగా జరిపించారు. బంధు మిత్రులు అనేక మంది హాజరయ్యారు. మేము వేములవాడ ఫిలిం సొసైటీ, నటరాజ కళా నికేతన్ ల పక్షాన ఒక కవర్లో అక్షింతలు, మరో కవర్ లో రెండు చాక్లెట్స్ వచ్చిన అతిథులందరికీ అందించాం. 

          అట్లా మా దోస్తుల్లో పలువురి పెళ్ళిళ్ళు జరిగి వాళ్ళంతా కాపురాల్లోకి ఒదిగిపోయారు. అయినా సృజనాత్మక రంగాల్లోని వారు తమ రచనల్ని కొనసాగించారు. మాతో పాటు సాహితీ కళారంగ కార్యక్రమాల్లో ఉత్సాహంగానే పాల్గొన్నారు.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.