నడక దారిలో-35

-శీలా సుభద్రా దేవి

జరిగిన కథ :తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలో నా చదువు అంచెలంచెలుగా సాగి డిగ్రీతో బాటు సాహిత్యం, సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. స్వాతి పత్రికలో శీలా వీర్రాజు గారికి కలంస్నేహం, రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో సభావివాహం జరిగింది. ఏడాది తిరగకుండానే మా జీవన గీతానికి పల్లవి చేరింది. మరుదుల వివాహా లతో కుటుంబం పెద్దదైంది. నాకు రెండో పాప రెండు నెలలకే అనారోగ్యంతో చనిపో యింది. ఉమ్మడి కుటుంబం విడిపోయి వేరు కాపురాలు అయ్యాయి. వీర్రాజు గారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, మాకు పుట్టిన బాబు అనారోగ్యం, ఎమ్మే తెలుగు పరీక్షలు పూర్తయిన మూడురోజులకు బాబు అస్వస్థతతో చనిపోయాడు. బియ్యీడీ ఎంట్రెన్స్ పరీక్ష రాసి రేంకు రావటంతో ఆంధ్రమహిళాసభ బియ్యీడీ కాలేజిలో చేరి హర్డిల్ రేసులా ఒడిదుడుకులతో బియ్యీడీ పుర్తిచేసాను. ఒకటి రెండు స్కూల్స్ లో తాత్కాలికంగా పనిచేసి, ఎట్టకేలకు ఆర్టీసి హైస్కూల్ లో ఉద్యోగం వచ్చింది. తర్వాత—

***

 
          ఒకరోజు అక్కయ్య దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. అందులో విశేషాలు –అన్నయ్య వాళ్ళు ధర్మవరంలోని పొలం అమ్ముతున్నారని తెలిసిందనీ, అన్నయ్యకు తాను రాసిన ఉత్తరంలో అది పిత్రార్జితం కనుక అందులో ఆడపిల్లలకు వాటా వుందనీ అమ్మకి కూడా కలిపి ఆరు వాటాలు వేయమన్నందుకు అన్నయ్య తన మీద నిప్పులు కురిపిస్తూ సమాధానం రాసాడనీ, తనకు నాన్నగారు ఉన్నప్పుడే పెళ్ళి అయింది కనుక తన వాటా మిగతా వారికి పంచమనీ అందట. చిన్నక్కకి పెళ్ళికి గానీ, చదువుకి గానీ ఏమి ఖర్చుపెట్ట లేదు కనుక వాటా ఇవ్వవలసిందిగా చెప్పిందట. నీకు అన్నయ్య చదివించి పెళ్ళి చేసాడు కనుక నీ యిష్టం తెలియజేయు– అంటూ అక్కయ్య రాసినది. 
 
          అయితే నేను ఈ విషయంలో ఏమీ కలుగ చేసుకోదలచుకోలేదు. మౌనంగా ఊరుకున్నాను. ఈ సంఘటన అన్నయ్యని మాకు మరింత దూరం చేసిందనేది మాత్రం నిజం.         
 
          నాకు ఎలాగూ ఓ చిన్న ఉద్యోగం దొరికింది. పుట్టింటి ఆస్తి మీద ఆశ పెంచుకోటం నాకు నచ్చలేదు. కలిసినపుడు ఆప్యాయంగా పలకరిస్తే అదే పదివేలు అనుకున్నాను.
 
          చిన్నన్నయ్య, అన్నయ్యా పొలం అమ్మిన డబ్బు రావటంతోనూ, హౌస్ లోను కూడా తీసుకోవటంతో ఇద్దరికీ స్వంత ఇళ్ళు ఏర్పడ్డాయి. ఇన్నాళ్ళకి కొడుకులకు ఒక స్వంత ఇల్లు ఏర్పడటం అమ్మకి చాలా సంతోషం కలిగించింది.
 
          పల్లవికి జ్వరం తగ్గింది. కానీ నీరసంగా ఉందని ఆ రోజు కూడా బడి మాన్పించాను. వీర్రాజు గారు ఏవో ముఖచిత్రాలు వేయాల్సినవి ఉన్నాయి. ఆఫీసుకి వెళ్ళనన్నారు.
 
          ఉదయమే లేచి టిఫిన్, వంటా చేసి నాకు బాక్స్ కట్టుకొని మొదటిరోజు స్కూలుకు వెళ్ళాను.
 
          అప్పటికి హెచ్చెమ్ వచ్చారు. నేను నమస్కారం చేసాను. ప్రార్థనఅనంతరం మేడం తన రూంలోకి నన్ను పిలిచి అక్కడే ఉన్న సీనియర్ లెక్కల టీచర్ ఇందిర కుమారిగారిని, సోషల్ టీచర్ కమలగారినీ పరిచయం చేసి వాళ్ళతోనే ఉంటుండు అన్నారు. దాంతో మరి స్టాఫ్ రూంకి వెళ్ళకుండా ఆఫీసు రూం పక్కనే ఉన్న చిన్న పార్టిషన్ రూంలో వాళ్ళతో పాటు కూర్చున్నాను.
 
          అంతలో అటెండర్ నాకు నా టైం టేబుల్ ఇచ్చాడు. మొదటి పీరియడ్ క్లాస్ టీచర్లు ఉంటారు. అందుచేత నాకు మొదటి పీరియడ్ ఖాళీ. నాకు ఎనిమిది, తొమ్మిది, పది క్లాసులకు ఫిజికల్ సైన్స్ ఆరు, ఏడు తరగతులు లెక్కలు ఇచ్చారు.
 
          పదో తరగతిలో మగపిల్లలంతా ఎత్తుగా పెద్దగా అనిపించారు. వాళ్ళని నేను కంట్రోల్ చేయగలనా అని భయపడ్డాను. కానీ చక్కగా విన్నారు. ఆరూ ఏడు తరగతుల్లో పిల్లలను అంతకు ముందు లెక్కలటీచర్ బాగా కొట్టేవారుట. అందుకని నేను దగ్గరకు వస్తుంటే భయపడి వెనక్కి వెనక్కి పోయేవారు. కానీ వాళ్ళకి అర్థమయ్యేందుకు పదేపదే వివరిస్తుంటే నాకు బాగా మాలిమి అయిపోయారు.
 
          ఆంధ్రవాణిని కూడా టీచర్ గా తీసుకున్నారు. ఆమెకి ప్రాధమిక క్లాసులు ఇచ్చారు. తర్వాత్తర్వాత ఆమెని డెప్యూటీ డీఈవో రికమండేషన్ మీద తాత్కాలికంగా తీసుకున్నా రనే విషయం తెలిసింది. వచ్చిన దగ్గర నుండి టీచర్లందరితోనూ గలగలా మాట్లాడి వాళ్ళకి దగ్గర అయిపోయింది.
 
          నేను స్వతహాగానే చొచ్చుకుపోయి స్నేహం చేయలేను. అందులో సుమారు పదేళ్ళుగా ఇంట్లోనే ఉండటం మరింత బెరుకుతనం వచ్చేసింది.
 
          అయితే తరగతిలో అడుగు పెట్టగానే నేను పిల్లలతో కలిసిపోయి వాళ్ళకి అర్థమ య్యే వరకూ మరోసారి వివరించి చెప్పటంతో పిల్లలు నాకు బాగా దగ్గరయ్యారు. పదవ తరగతి మగపిల్లలు కూడా నన్ను అభిమానించటంతో నాకూ భయం తగ్గింది.
 
          నేను ఆగష్టు మొదటివారంలో ఉద్యోగంలో చేరాను. వారం తిరిగే సరికి రాష్ట్రంలో సంక్షోభం. 15 ఆగష్టు 1984న, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి NT రామారావు యునైటెడ్ స్టేట్స్‌లో గుండె శస్త్రచికిత్స చేయించుకోటానికి వెళ్ళినప్పుడు రాజ్యాంగ విరుద్ధంగా అధికారం నుండి తొలగించారు. తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో ఎన్టీఆర్ స్థాపించిన ప్రాంతీయ పార్టీ అధికారంలోకి వచ్చినందుకు మొదట్లో ముప్పుతిప్పలు పెట్టిన ఒకప్పటి కాంగ్రెస్ పార్టీ ఆర్థిక మంత్రి నాదెండ్ల భాస్కరరావును కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించి తిరుగుబాటుకు కాంగ్రెస్ పార్టీ తెర వెనుక నుండి పనిచేసింది. 
 
          ప్రతిపక్ష పార్టీలన్నిటినీ కలుపుకుని రామారావు చాలా సమర్ధవంతంగా వారిని ఎదుర్కొన్నాడు. పట్టుదలతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి, ప్రజల మద్దతును కూడగట్టు కున్నాడు. ప్రజలందరికీ ఎన్టీఆర్ పట్ల అభిమానాన్ని, కేంద్రం పట్ల వ్యతిరేకతను గమనించి కేంద్రం రాష్ట్ర గవర్నర్ గా వున్న రాంలాల్ ని తొలగించి, శంకర్ దయాళ్ శర్మ ని గవర్నరుగా నియమించింది.సెప్టెంబర్ 16 న ఎన్టీఆర్ ను తిరిగి ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి మార్గం సుగమం అయ్యింది. తొలగించబడిన ఒక ముఖ్యమంత్రి తిరిగి నియమించటం అనేది భారత దేశ రాజకీయ చరిత్రలో బహుశా అదే మొదటిసారి కావచ్చు.
 
          ఆ విధంగా 1984 ఆగస్టు-సెప్టెంబర్‌లో ఎన్టీఆర్‌ని తొలగించటం తిరిగి ఇందిరాగాంధీ ఎన్టీఆర్ నే నియమించటం అనేది రాష్ట్రంలో రసవత్తర రాజకీయ నాటకంగా చెప్పొచ్చు. ఆఖరికి రాష్ట్రం తిరిగి ప్రశాంతంగా మారింది.
 
          తిరిగి ఎన్టీఆర్ పేదవారికి రెండు రూపాయలకే కిలో బియ్యం పధకం, ఆడవాళ్ళకు సమాన ఆస్థి హక్కు చట్టం వలన ప్రజల అభిమానం పొందాడు.
 
          అక్టోబర్ లో మాడపాటి హైస్కూల్ లో పాఠశాలలో విజ్ణాన ప్రదర్శనకు మా స్కూల్ తరపున సైన్స్ ఎగ్జిబిషన్ ఏదైనా తయారు చేయమని మా మేడం నన్ను పిలిచి చెప్పారు. రెండు నమూనాలు తయారుచేసి నలుగురు విద్యార్థులను తీసుకొని, నాకు సాయంగా ఉషా, విజయలక్ష్మి అనే టీచర్లతో కలసి మాడపాటి స్కూలుకి వెళ్ళాను. సైన్సు విభాగంలో ఎగ్జిబిట్లు ఏర్పాటు చేసే హడావుడిలో ఉండగా ఒక సంచలన వార్త. అది నిజమా కాదా అని స్కూలుకు దగ్గర్లో ఒకరి ఇంటికి టీవిలో వార్తలు చూడటానికి వెళ్ళాము.
 
          అదే ఆ ఏడాది సంచలనం కలిగించిన దిగ్భ్రాంతికరమైన మరో సంఘటన అక్టోబర్‌ నెల చివరలో ఇందిరాగాంధీ హత్య .
 
          విజ్ణాన ప్రదర్శన నిరవధికంగా వాయిదా వేసారు. ఏవైనా గొడవలు అవుతాయేమోనని పిల్లల్ని స్కూలు దగ్గర దింపి మేము ఇళ్ళకి వెళ్ళిపోయాం.
 
          ఆ సంఘటన ఢిల్లీలో సిక్కుల అల్లర్లకు దారితీయటం ఆ తర్వాత హింస, అల్లర్లు, కర్ఫ్యూలు, కాల్పులతో దేశం అంతా అల్లకల్లోలమైంది.
 
          1984లో, ఇందిరా గాంధీ హత్య అనంతరం జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ నేతృత్వంలో విజయదుందుభి మోగించింది. మొదట్లో రాజకీయాల పట్ల అంతగా ఆసక్తి లేకపోయినా రాజీవ్ గాంధీ తదనంతరం యువతరాన్ని దృష్టిలో ఉంచుకుని తన పాలనలో అనేక సంస్కరణలు చేయటంతో దేశంలో కొత్తమార్పులు వచ్చాయి.      
 
          అక్కయ్య వాళ్ళ పక్కనే ఉన్న అపార్ట్మెంట్ లో శారదా శ్రీనివాసన్ గారి చెల్లెలు లీలాకుమారి ఉంటారు. వాళ్ళ అపార్ట్మెంట్ అమ్మకానికి ఉందని మామయ్య ఒకరోజు వచ్చి చెప్పారు. కొనుక్కోవాలనే కోరిక వున్నా ఆ సమయంలో డబ్బు లేక వదిలేసాము. రాజమండ్రి ఇల్లు అమ్మేస్తే కొనుక్కోవచ్చు అనే ఆలోచనతో వీర్రాజు గారు తన సోదరులను సంప్రదించి రాజమండ్రిలోని స్నేహితులకు ఆ బాధ్యత అప్పగించారు.
 
          స్కూల్ లో నలభై మందికి పైగా ఉపాధ్యాయినుల సిబ్బంది, తెలుగు మాధ్యమం, ఆంగ్లమాధ్యమం కలిపి ఇరవై మూడు తరగతులు, పదిహేను వందలకు పైగా విద్యార్థు లతో స్కూలంతా కళకళలాడుతూ ఉండేది. స్కూల్ లో వారివారి ఆలోచనా విధానాన్ని బట్టి గ్రూపులుగా ఉన్నా బయటకు అంతగా తెలిసేది కాదు. అంతేకాక ప్రధానోపాధ్యాయి నితో కలిపి ఎక్కువ మంది క్రిష్టియన్ మతానికి చెందినవారు. అయినా మతపరంగా వాదనలు జరిగేవి కాదు.
 
          స్కూల్లో ఏవైనా గొడవలు రావటానికి ముఖ్యకారణం మాత్రం హైస్కూల్ సోషల్ టీచర్ అయిన కృష్ణకుమారిగారు. ఆమె క్లాసులకు వెళ్ళగా నేను చూడలేదు. స్టాఫ్ రూం లోనే కూర్చుంటుంది. ఆమె బేగ్ మాత్రమే రామపాదుకల్లా క్లాసులు తిరుగుతుంది. క్లాసు లీడర్ గైడ్ లోంచి నోట్స్ రాయిస్తాడు. క్లాసు కంట్రోల్ లో ఉంచుతాడు. కృష్ణకుమారి నోటికి భయపడి మేడం కూడా మాట్లాడరు. నాకు ఆ పరిస్థితి చూసి ఆశ్చర్యం వేస్తుండేది.
 
          నాకు అన్నీ హైస్కూల్ క్లాసుల ఫిజికల్ సైన్స్, ఏడవతరగతి మాత్రమే గణితం ఉండటం వలన హైస్కూల్ టీచరుగా గుర్తింపబడటం కొంత మంది ప్రైమరీ టీచర్లకు కంటకింపుగా ఉండేది. కానీ, బయటకు ఏమీ అనేవారు కాదు. అదీకాక నేను ఎక్కువగా స్కూలు విషయాల్లో పట్టించుకోకుండా నా పనేదో చూసుకునేదాన్ని. అందుకని క్లాసులోకి వెళ్ళటం, నోట్సులు దిద్దటం వీటితోనే సమయం గడిచి పోయేది. కొత్త కనుక పాఠాలు ప్రిపేర్ అయ్యి క్లాసుకు వెళ్ళవలసి ఉండేది. ఉషా అనే ఆమె మాత్రమే కలుపుగోలుగా మాట్లాడుతూ ఉండేది. అంతేకాక ఉషా ఇల్లు శంకరమఠం దగ్గరే కనుక ఒక్కొక్కసారి కలిసి వెళ్ళేవాళ్ళం.
 
          రాష్ట్రానికి చెందిన మరో ముఖ్యమైన విషయం 1984లో జనరల్ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా మధ్యంతర ఎన్నికలు జరగటంతో తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీ సాధించి రెండవ సారి ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ప్రమాణస్వీకారం చేశారు.
 
          ఈ సారి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక వీర్రాజు గారిని ఆయన పేషీలో స్క్రిప్ట్ రైటర్ గా పోస్ట్ క్రియేట్ చేసి అపాయింట్ చేసారు. జీతం మాత్రం పూర్వపు ఎల్డీసీ జీతమే కానీ, పనిమాత్రం మూడింతలు పెరిగింది. ఉదయం నాలుగు గంటలకే కారు వచ్చేది. తిన్నగా సిఎమ్ ఇంటికే తీసుకెళ్ళే వారు. వీర్రాజు గారు ఆ రోజు పేపర్లన్నీ చదివి ముఖ్యమైన వార్తల్ని కట్ చేసి పేపరు మీదే అతికించి ఆయన స్నానపానాదులు అయ్యి వచ్చేసరికి అందజేయాలి. వీర్రాజుగారికి మాత్రం టీనీళ్ళయినా ఉండేవి కాదట.
 
          ఎక్కడైనా ప్రసంగాలు చేయాల్సినవి ఉంటే అవి తయారు చేయాలి. అయితే ఎన్టీఆర్ కి ఒకంతట అది నచ్చేది కాదు. హావభావ ప్రకటనలతో ప్రసంగించటానికి వీలుగా అనేక మార్పులు చేయించేవారు. అటువంటప్పుడు వీర్రాజు గారు ఎక్కడ, ఏమి తింటారో తెలియదు. ఇంటికి ఎప్పుడొస్తారో కూడా తెలియదు. ఆఖరుకు ఏ ఆదివారమో తీరిగ్గా హెయిర్ కటింగ్ కోసం సెలూన్ కి వెళ్తే కూడా అక్కడికే కారు వెళ్ళి వీర్రాజు గారిని పికప్ చేసుకుని ఆఫీసుకు పట్టుకెళ్ళి పోవటం కూడా జరుగుతుండేది.
 
          అంత బిజీలో కూడా ఏ రాత్రి పూటో ముఖ్యమైన వాళ్ళకు, మిత్రులకూ ముఖ చిత్రాలు వేస్తుండేవారు. అప్పట్లోనే అంతకు ముందు యువభారతి సంస్థలో ఉన్న రోజుల్లో సూర్యనారాయణతో కలిపి కవిత్వ సంపుటి వేసుకున్న జయప్రభ తన స్వీయ కవితల సంపుటికి కవితలు ఎంపిక చేయమని నాకూ, ముఖచిత్రం వేయమనీ వీర్రాజు గారికి అడిగి స్క్రిప్ట్ తీసుకొచ్చి ఇచ్చింది. ఆ సంపుటికి ముందుమాటలో నా పేరు కూడా ఆత్మీయంగా ప్రస్తావించింది. ఈ నాడు ఆమె అంచెలంచెలుగా ఎదిగి అంతర్జాతీయ కవయిత్రిగా పేరుపొందటం సంతోషం కలిగిస్తుంటుంది.
 
          వీర్రాజు గారు రచనలు చేయటం పూర్తిగా తగ్గిపోయింది. సభలూ, సమావేశాలు తగ్గి పోయాయి. మిత్రులతో కలయికలు తగ్గిపోయాయి. ఇంట్లో కలిసి ఉన్నరోజు మాకు పండుగలా ఉండేది.
           
          మేమున్న అద్దెయిల్లు చాలా చిన్నది కావటం, వీర్రాజుగారు రాత్రనకా, పగలనకా ఉద్యోగంలో తీరిక లేకుండా ఉండటం, నేనుకూడా ఉద్యోగంలో చేరటం కారణాల వలన పై వూళ్ళ నుండి మా ఇంటికి వచ్చే బంధువుల రాకపోకలు తగ్గిపోయాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అది కూడా మేలే అనుకున్నాము.
 
          పల్లవి తరుచూ ఇంటి వాళ్ళ ఇంటికి టీవీ చూడటం కోసం వెళ్ళాలని సరదా పడటంతో టీవీ కొనుక్కుంటే బాగుండునని ఆలోచన వచ్చింది. ఎప్పుడో యువభారతికి వేసిన చిత్రాలు తాలూకు డబ్బులు రావటంతో వీర్రాజు గారు వాయిదా పద్దతిలో కొనటానికి సిద్ధపడ్డారు.
 
          ఆ విధంగా మా ఇంట్లోకి నలుపు తెలుపుల టీవీ వచ్చి ఠీవిగా కూర్చుంది.
 
*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.