కథా మధురం 

ఆ‘పాత’ కథామృతం-13

కొమ్మూరి పద్మావతీదేవి

 -డా. సిహెచ్. సుశీల

          తెలుగు నాటకరంగంలో పూర్వం స్త్రీ పాత్రలను కూడా పురుషులే ధరించడానికి కారణం నాటకాల్లో నటించడం సంసారపక్షం స్త్రీలకు కూడదన్న బలమైన విశ్వాసం సమాజంలో ఉండడమే. ఈ నాటికీ నాటకాల్లో స్త్రీ పాత్రలు చాలా పరిమిత సంఖ్యలో ఉండడం గమనించవచ్చు. అలాంటి రోజుల్లో నాటక చరిత్రలో ప్రముఖుడు బళ్ళారి రాఘవ తను ప్రముఖ న్యాయవాది అయినా నాటకరంగం పట్ల ప్రత్యేకాభిమానంతో, నిజానికి అదే తన జీవిత గమ్యం అన్నట్లు అనేక విధాలుగా కృషి చేశారు. దానిలో ఒకటి స్త్రీ ‘పాత్రలను స్త్రీలే ధరించాల’ని పిలుపునివ్వడం. ఆ పిలుపుతో రంగస్థలం పై కాలూనారు శ్రీమతి కొమ్మూరి పద్మావతీదేవి. ఆమేమీ ధనార్జన కొరకు నాటకరంగంలోకి రాలేదు. అప్పటికే ఆమె కథలు రాస్తున్న రచయిత్రి. అసలు ఆమె కుటుంబమే సాహిత్యా నికి నిలయం.
 
          1908 జులై 7న సంఘ సంస్కరణ, గొప్ప సంస్కారం గల కుటుంబంలో  జన్మించా రామె. సంఘసంస్కరణోద్యమంలో చురుకుగా పని చేస్తున్న ఈమె తల్లిదండ్రుల ఆదర్శ వివాహాన్ని స్వయంగా కందుకూరి వీరేశలింగం పంతులు నిర్వహించారు. తల్లిదండ్రులు పద్మావతీదేవికి చదువుతో పాటు సంగీతం కూడా నేర్పించారు. ఆ కళ పట్ల అభిరుచితోను, తల్లిదండ్రుల అభ్యుదయ భావాలతోనూ పెరిగిన ఆమె సంప్రదాయ సంకెళ్ళను తెంచు కుని నాటకరంగంలోకి అడుగుపెట్టారు. రామదాసు, ప్రహ్లాద, తప్పెవరిది, సరిపడని సంగతులు, చంద్రగుప్త, ఆ లోకం నుండి ఆహ్వానం మొదలైన నాటకాలలో నటించారు. తరువాత సినీరంగ ప్రవేశం చేసి ద్రౌపది మాన సంరక్షణ, రైతుబిడ్డ, సుమతి, పెద్ద మనుషులు చిత్రాలలో నటించారు.
 
          ప్రముఖ రచయిత గుడిపాటి వెంకటాచలం తమ్ముడు కొమ్మూరి వెంకటరామయ్య గారి భార్య కొమ్మూరి పద్మావతీదేవి. (చలాన్ని తన తాతగారు దత్తత తీసుకోవడంతో ఆయన ఇంటిపేరు గుడిపాటిగా మారింది.) వెంకటరామయ్య గారికి తెనాలిలో ప్రింటింగ్ ప్రెస్ ఉండేది. వీరి కుమారుడు కొమ్మూరి సాంబశివరావు అనేక డిటెక్టివ్ నవలలు (యుగంధర్, రాజు పాత్రలతో) రచించారు. కుమార్తె వరూధిని కొడవటిగంటి కుటుంబ రావు గారిని వివాహమాడారు. మరో కుమార్తె ఉషారాణి పంజాబ్ కి చెందిన సుమీందర్ సింగ్ భాటియాని వివాహం చేసుకున్నారు. నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా తెలుగు శాఖకు తొలి ఎడిటర్ గా 1990 వరకు పదవీబాధ్యతలు నిర్వహించారు.
 
          చిట్టితండ్రి, అయిదు గంటలు, ఆ రోజు దీపావళి, అనుకోని సంఘటన, ఉమ, అపోహ, ఆఫీసు హోదా, ఎందుకీ బతుకు, ఎవరితను, దిగివచ్చిన, నిజం తెలిస్తే, నాంచారమ్మ కథ, నీ మీద ఒట్టు, పసివాడు, పెళ్ళికూతురు, పెద్ద ఉద్యోగం, మేరీ, రెండవ పెళ్ళి… ఇంకా చాలా కథలు రచించారు పద్మావతీదేవి.
 
          ముఖ్యంగా నాటక, సినీరంగంలో స్వయంగా తాను ప్రవేశించి, పరిశీలించడం వల్ల రాసిన కథ  “శోభ”.
 
 శోభ 
 
          సినిమా రంగంలో మంగమ్మ అనే స్త్రీ ‘మంజరి’ గా ఎలా ఎదిగిందీ, ఎలా మాయ జలతారు వలలో మెరిసిందీ, జారుడుమెట్ల నుండి ఎలా జారిందీ వివరిస్తూ “పాకుడు రాళ్ళు” అనే నవలను 1968 లో రావూరి భరద్వాజ రచించారు. ఇంత వివరంగా సినీ మాయా లోకాన్ని వర్ణించిన నవల ఇదే మొదటిది. 
 
          కానీ 1955 (మార్చి16) లోనే  ఆంధ్రప్రభ వారపత్రికలో శ్రీమతి కొమ్మూరి పద్మావతీ దేవి “శోభ” అనే కథ రాసారు.
 
          సుబ్బులు ‘శోభారాణి’ గా మారిన వైనం అంత సులభంగా, సూటిగా జరగలేదు. భర్త చనిపోయిన తర్వాత శాయమ్మ తన కూతురు సుబ్బులుని తీసుకొని అన్నయ్య రామయ్య ఇంటికి చేరుకుంది. ఆయన పిల్లలు ముగ్గురు, ఆత్మహత్య చేసుకున్న తమ్ముడి పిల్లలు ఇద్దరూ… అప్పటికే సంసారాన్ని భారంగా ఈడుస్తున్నాడు రామయ్య. వంటి మీద చిన్న మెత్తు బంగారం లేకపోయినా అందంగా మెరిసిపోయే సుబ్బులు అద్దం, అలంకరణ అంటే ఇష్టపడుతుండడంతో భయపడ్డ శాయమ్మ వదిన శేషమ్మతో తన వేదన వెళ్ళ బోసుకునేది. రామయ్య కూడా జాగ్రత్తలు చెప్పేవాడు. అయినా సినిమా మీద మోజుతో కిళ్ళీకొట్టు వాడి మాటలు నమ్మి మద్రాసు చేరుకుంది సుబ్బులు. తాంబరంలో తన గుడిసె లోకి చేర్చిన రామస్వామి, భార్య అలివేలుతో చెప్పాడు సుబ్బులుకి సినిమా ఛాన్సులు వస్తే డబ్బే డబ్బని. కానీ అది అంత సులువు కాదని అర్ధం అయింది నాలుగు రోజులు స్టూడియోల చుట్టూ తిరగగానే. సుబ్బులు చెవులకున్న బంగారు పోగులు అమ్మేసి, మంచి చీర కట్టి , పౌడరు దిట్టంగా కొట్టి ఫోటోగ్రాఫర్ చేత నాలుగు ఫోటోలు తీయించారు రామ స్వామి, అలివేలు. “శోభారాణి” అని పేరు పెట్టారు. ఒకరోజు చిన్న అవకాశం వచ్చింది.  రాణిగారి పరివార బృందంలో నిలబడేందుకు నిర్మాత పిలిచి, అమ్మాయి బాగుండడంతో రాణిగారి పక్కనే వీవెన విసిరే చెలికత్తె పాత్రగా నిల్చోబెట్టాడు. అలాగే గ్రూప్ లో నిలబడే అవకాశాలు కొన్ని పొందిన శోభ మెల్లగా రెండు డైలాగ్ లు చెప్పే స్థాయికి, తర్వాత సైడ్ కారెక్టర్ వేసే స్థాయికి చేరింది. 
 
          రోజులు గడుస్తున్నాయి. సుబ్బులు శోభగా ఎదగసాగింది. రామస్వామి చేతికి డబ్బు చేరసాగింది. ఆ నిషాలో ఒకానొక రోజు తాగిన మత్తులో శోభ పైన చేయి వేయబోతే, గొడవ చేసి, ఏడ్చి, కాళ్ళు పట్టుకుంది. సినిమాలో నటించడమే తన లక్ష్యం అని, ‘సహాయం చేయి అన్నా’ అంది. అలివేలు కూడా తిట్టి చీపురు తీయడంతో జారుకున్నాడు రామ స్వామి. బంగారు బాతు లాంటిదాన్ని పోగొట్టుకోలేక, తెలివిగా ఆమెను జాగ్రత్తగా చూసు కుంటూ, కారు, మంచి ఇల్లు సంపాదించుకుని, భార్యాభర్తలిద్దరూ వేషభాషలు మార్చేసి, శోభ కాల్షీట్లు చూస్తూ, దాదాపు ఆమెను తమ గుప్పిట్లో పెట్టుకున్నారు.
 
          రోజులు గడిచేకొద్దీ అవకాశాలు, పేరు ప్రఖ్యాతులు, ఆస్తి అంతస్తులు చేరుకొన్నాయి. ఏ పత్రికలో చూసినా శోభ ఫోటోలు, ఇంటర్వ్యూలు. పెత్తనమంతా రామస్వామిదే. ‘రెప రెపలాడే పంచెకట్టుతో, సిగరెట్ పొగ వదులుతూ, వేలిన మెరిసే ఉంగరాలతో, చేతిని అలా విసురుతూ, అందరినీ పలకరిస్తూ, ఠీవిగా నడిచి వచ్చేవాడు రామస్వామి.
 
          ఒకరోజు షూటింగ్ లో సెట్టు మీద జబ్బుతో చనిపోతున్న తల్లిని చూస్తూ ఏడిచే సన్నివేశం. శోభ ఎందుకో ఉలిక్కిపడింది. అమ్మ గుర్తుకు వచ్చింది. ఊరు, ఇల్లు గుర్తుకు వచ్చాయి. నటించడం కాకుండా సహజంగానే ఏడ్చేసింది. సీన్ పూర్తయినా ఏడ్చి ఏడ్చి స్పృహ తప్పి పడిపోయింది. “ఎంత అద్భుతంగా నటించింది” అనుకున్నారంతా సెట్ లో. అక్కడే ఉన్న ‘కెమెరామెన్ ‘సత్యం’ ఆమెను సోఫాలోకి చేర్చి, ముఖం మీద నీళ్ళు చల్లాడు. “కళ్ళు తెరవండి” అంటూ ఓవల్టీన్ గ్లాసు అందించాడు. అక్కడే ఉన్న  రామ స్వామి గబగబా వచ్చి గ్లాసు తాను అందుకుని ఆమె నోట్లో కొద్దిగా పోసాడు. మెల్లగా  తేరు కున్న ఆమెను భార్యాభర్తలిద్దరూ కారులో జాగ్రత్తగా ఇంటికి తీసుకువచ్చారు. ఆ రోజు సంఘటనని పత్రికలన్నీ కీర్తించినా, ఎన్నెన్నో అవకాశాలు వచ్చి పడినా శోభ నిర్లిప్తంగా మారిపోసాగింది. వచ్చిన అవకాశాలను అన్నీ ఒప్పుకోమని రామస్వామి ఒత్తిడి చేయ సాగాడు. క్రమంగా ఆమె పరధ్యానంగా ఉండడం గమనించాడు రామస్వామి. ఆమె ప్రతి అడుగుకూ ఆంక్షలు పెట్టసాగాడు. విసిగిపోయింది. గొడవ పెట్టుంది. ఆమె నిర్లక్ష్యాన్ని సహించలేకపోయాడు.
 
          “కళ్ళు నెత్తికి వచ్చాయా! మన్నులో పడిపోతావు” అని అరిచాడు. “ఇప్పుడే కళ్ళు తెరిచాను. నా జీవితం నా యిష్టం. ఇక సినిమాలు చేయను” అని కరాఖండిగా చెప్పింది.  “నీటి బుడగల్లాంటి ఈ జీవితాలు మన్నులో పడక తప్పదు. నాలాంటి వాళ్ళెంత మంది పడిపోలేదు! ఈ పాడు జీవితం నాకు వద్దనే వద్దు. నేను పెళ్ళి చేసేసుకున్నాను. నా మీద నీ అధికారాలు చెల్లవు” అంది. 
 
          ఏదో జరుగుతోందని అనుమానిస్తున్న రామస్వామి దిమ్మెరపోయి  “ఎవడా దుర్మార్గుడు ” అంటూ ఆవేశంగా మీద కొచ్చాడు. భయంతో పరుగెత్తబోయి కాలు జారి పడిపోయింది శోభ.
 
          అప్పుడే లోపలికి వచ్చిన “సత్యం” ఆమెను చేతుల్లోకి తీసుకున్నాడు. ప్రేమగా తల పై చేయి వేసి ” శోభా” అన్నాడు. 
 
          “శోభ కాదు. నాపేరు సుబ్బులు” అందామె.
 
          ఈ కథ చదువుతుంటే సినిమా ప్రపంచంలోని వెలుగు నీడలు, వెండితెర జిలుగులు, ఎగుడు దిగుడులు, డబ్బు ప్రాధాన్యత ముందు కనుమరుగై పోతున్న మానవ సంబంధాలు మాత్రమే కాక ఎందరో నటీమణుల జీవితాలు కళ్ళ ముందుకు వస్తాయి. ఏవో సన్నివేశాలు, ఏవో డైలాగులు గుర్తుకువస్తాయి.
 
          “మహానటి” అనిపించుకునీ, సాధారణ స్త్రీ లాగా ప్రేమాభిమానాలు కోసం తపించి పోయే వారు జ్ఞప్తికి వస్తారు. కానీ ఆంగ్ల , హిందీ, తెలుగు ( ఇంకా ఎన్నో) భాషా నటీమణుల జీవితాలు అంతిమంగా సుబ్బులు కథలాగా సుఖాంతం కాలేదు. ఏది ఏమైనా ఇదొక విలక్షణమైన మంచి కథ. బహుశా యదార్థ గాధ అని చెప్పవచ్చు.
 
          తెలుగులో తొలితరం రంగస్థల నటిగా, రచయిత్రిగా ప్రసిద్ధి చెంది, 1956 లో గృహలక్ష్మి స్వర్ణ కంకణం పురస్కారం పొందిన పద్మావతీదేవి 1970 మే 9 న చెన్నైలో మరణించారు.
 
          పరమపద సోపానం వంటి సినిమా లోకంలోని జీవితాన్ని తాను ఆ రంగంలోనే ఉంటూ కూడా నిర్భయంగా చిత్రించారు రచయిత్రి శ్రీమతి కొమ్మూరి పద్మావతీదేవి.

*****

వచ్చే నెల మరో ఆ’పాత’ కథామృతంతో కలుద్దాం

Please follow and like us:

2 thoughts on “కథామధురం-ఆ‘పాత’కథామృతం-13 కొమ్మూరి పద్మావతీదేవి”

  1. చాలా బావుంది
    కొమ్మూరి పద్మావతి గారి కధ చాలా సహజంగా వుంది.

Leave a Reply

Your email address will not be published.