పేషంట్ చెప్పే కథలు – 22

సాలెగూడు

ఆలూరి విజయలక్ష్మి

          “ఇలా తప్ప మరోలా బ్రతకలేనా?” మరోసారి ప్రశ్నించుకుంది కళావతి. కోమల త్వాన్ని కోల్పోని ఆమె ముఖం వాడిపోయి వుంది. కళ్ళు సిగ్గుతో వాలిపోయాయి. “ఇంత పాడుబ్రతుకు బ్రతక్కపోతేనేం!” అని పొడిచినట్లుండే లోకుల చూపులు తనమీద పడిన ప్రతిసారీ తనను తానే ప్రశ్న వేసుకుంటుంది కళావతి. యెంత ఆలోచించినా, ఎంత తరచి చూసినా ఎప్పుడూ జవాబొక్కటే మిగులుతుంది. “ఇలా తప్ప మరోలా బ్రతికే మార్గంలేదు నాకు. ఇంత కంటే గౌరవంగా, సుఖంగా, నిశ్చింతగా బ్రతికే దారిలేదు నాకు.”

          తనను కన్నతల్లి బ్రతుకు తుఫానులో ఎటువైపుకు విసిరి వేయబడి యెంత గౌరవంగా, యెంత సుఖంగా  బ్రతుకుతోందో తెలియదు. ఆమె తొందరపాటు ఫలితంగా ఊపిరి నింపుకుని బ్రతుకుతున్న తానింత హేయమైన జీవితాన్ని గడుపుతూంది. పసికందుగా ఉండగానే తనను కొనుక్కుని సాకినా సుబ్బమ్మ ఆమెకలవాటైన జీవన పాశంలోకి బలవంతంగా నెట్టేసింది తనను. అనుక్షణం తనను చుట్టిన వాతావరణాన్ని అసహ్యించుకుంటూనే, ఆ వాతావరణం నుంచి దూరంగా పారిపోయి మర్యాదగా బ్రతకా లనుకుంటూనే, తాను చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయి ఈ సాలెగూటిలో నుంచి బయట పడలేకపోయింది. 

          “గర్భాశయం బాగా పాడయింది. బాగా విస్రాంతి తీసుకోవాలి. బలమైన ఆహారం తీసుకోవాలి. అన్నిటి కంటే ముఖ్యం ట్రీట్మెంట్ పూర్తయ్యేదాకా భర్తతో కలవకూడదు” శృతి చెప్తున్న జాగ్రత్తలు విని సుబ్బమ్మ ముఖం వెలవెలబోయింది. 

          “ఇవన్నీ యెట్లా జరుగుతాయమ్మా మాకు?” ఒక నిమిషం పోయాక సుబ్బమ్మ గొంతు పెగిలింది. 

          “పిల్లది రికార్డ్ డాన్స్ ల కెళ్తేతప్ప పూట గడవదు. రెండు నెల్ల నుంచీ బట్టల జబ్బు తో బాధపడుతున్నా ప్రతిరాత్రీ ఎవడో ఒకడొచ్చి దాని ప్రాణం తీస్తాడు. కాదని బ్రతకలేని పాపిష్టి జన్మ మాది” విచారంగా తనకు తానూ చెప్పుకుంటున్నట్లుగా అంటున్న సుబ్బమ్మ ని, తనను జాలిగా చూసింది డాక్టరమ్మ. సుబ్బమ్మ మాటలు విని తన తల భూమిలోకి వంగిపోయింది. తాను గడుపుతున్న నికృష్ట జీవితం అతి భయంకరంగా ముందు నిలిచినట్లయింది. తిరిగి సుబ్బమ్మ మాటలు వినిపించి ఆలోచనల్లో నుంచి బయట పడింది కళావతి. 

          “మీరు చెప్తే తప్పేదేముంది? అట్లాగే ఏదో తంటాలుపడి మీరు చెప్పినట్లే జరిపి స్తాను. కాస్త మంచి మందులు వ్రాసి పిల్లని తొందరగా కోలుకునేలా చూడండమ్మా!” కన్నీళ్ళతో అర్థిస్తున్నా సుబ్బమ్మ వంక ఆశ్చర్యంగా చూసింది కళావతి. తన కలల్ని కోరికల్ని నిర్దాక్షిణ్యంగా తుంచేసి కటువైన జీవిత సత్యాల్ని పరమ మోటుగా తన ముందుంచిన ఈ రాక్షసిలో యింత మెత్తదనం ఉందా?! ఎప్పుడూ కసుర్లు, తిట్లు తప్ప ప్రేమ, లాలింపు లాంటి పదాలే యెరుగకుండా, బ్రతుకు చక్రపు పళ్ళమధ్య నలిగిపోతూ మార్దవాన్ని, లాలిత్యాన్ని కోల్పోయిన ఈ గయ్యాళి దానిలో ఈమాత్రపు ప్రేమైనా మిగిలుందా?! తన కోసం ఆరాటపడే ప్రాణి, తన కోసం దుఃఖపడే హృదయం ఈ లోకంలో కనీసం ఒక్కటుందా?! గుండె లోతుల్లోంచి ఏడుపు తన్నుకొస్తూంది కళావతికి. 

          “పద” డాక్టరమ్మ వ్రాసిచ్చిన మందుల చీటీ తీసుకుని కళావతి భుజం చుట్టూ చెయ్యేసి పొదవుకుని బయటకు తీసుకు వెళ్ళింది సుబ్బమ్మ. తనను  చుట్టిన సుబ్బమ్మ చేతి వంక నిశ్చలంగా చూస్తూంది కళావతి. ఒక క్షణం క్రిందటి వరకు ఈ చేతి స్పర్శంటే పరమరోత తనకు. ఈ చెయ్యి ఉత్సాహంతో ఉరకలు వేస్తూ తాను కట్టుకుంటున్న కోరికల కోటల్ని కూలదోస్తూ తన చేతిలోని పుస్తకాల్ని లాగేసింది. ఈ చెయ్యి తన శరీరాన్నివిక్రయ వస్తువుగా మార్చి వ్యాపారం చేసింది. ఈ చెయ్యి బలవంతాన తన బ్రతుకును పెద్దపాము నోట్లో పడేసింది… ఈ చెయ్యి తన మీద పడితే మచ్చలపాము తనను చుట్టుకుంటున్న ట్లుగా జిగుప్సతో జలదరించేది తన శరీరం… కానీ… ఈ క్షణంలో ఈమె హృదయంలో ఎన్ని స్వార్థపుటాలోచనలైనా వుండనియ్, ఈమె కనబరచిన రవ్వంత ఆదరణ తనకెంతో ఊరట కలిగిస్తూంది. 

          “కళా! సిరిపురం షావుకారు కొడుకు చంద్రకోసం తిరుగుతున్నాడు” రిక్షా తమ వీధి మలుపు తిరుగుతూ ఉండగా అంది సుబ్బమ్మ. 

          “ఒద్దొద్దు” ఆదుర్దాగా అంది కళావతి. “ముక్కు పచ్చలారని పిల్ల. దాన్ని ఇప్పటి నుంచి ఈ నరకంలోకి లాగొద్దు ఎలాగోలా గడుపుకుందాం. ఎక్కడో ఒకచోట అప్పు పుట్టిం చుకురా. బ్రతికి బాగుంటే ఎప్పటికో ఒకప్పటికి తీర్చుకుందాం” చంద్ర కూడా తనలాంటి దురదృష్టవంతురాలే. ఎగిరిపోడానికి తనకే రెక్కల్లేవు. ఆ పిల్లకేం సహాయ పడుతుంది తాను! అయినా సాధ్యమైనంత ఎక్కువ కాలం ఈ బాధలకు దూరంగా ఉంచాలని తాపత్రయం. 

          “ఎప్పటికి నీ ఒళ్ళు బాగుపడెను! ఎప్పటికీ అప్పులన్నీ తీరును!” నిట్టూర్చింది సుబ్బమ్మ. 

          సుబ్బమ్మ దొరికిన చోటల్లా అప్పులు తెచ్చి ఇల్లు నడుపుతూంది. కళావతికి డాక్టరమ్మ చెప్పిన మందులు, ఆహారం, విస్రాంతిని సమకూర్చడానికి ప్రయత్నిస్తూంది. కళావతి అనారోగ్యం వల్ల  ఎంతో నష్టం కలుగుతూందనే దుగ్దవున్నా ఏ మారుమూలో దాగున్న పెంచిన ప్రేమ ఆమె గురించి పరితపించేలా చేస్తూంది. చంద్రను ముగ్గులోకి దింపడానికి చంద్ర, కళ యిద్దరూ కలిసి ఎదురు తిరగడంతో విధిలేక గొణుక్కుంటూనే, ఇద్దర్నీ కలిపి తిడుతూనే అప్పులు తెస్తూంది. 

          కళావతి కొంచెం కోలుకుంటూ ఉండగానే సుబ్బమ్మకోరోజు హఠాత్తుగా ప్రాణంమీద కొచ్చింది. ఎప్పుడూ జుర్రున చీదెరుగని సుబ్బమ్మ పడిపోయేసరికి కళ, చంద్ర నీటి బయట చేపల్లా అయిపోయారు. 

          “పాపం! నీ ఆరోగ్యం కోసం ఏంతో తాపత్రయ పడిందా రోజు.” సుబ్బమ్మకు ఇంజక్షన్ చేస్తూన్న శృతి వంక గాజు కళ్ళతో చూసింది కళావతి… డబ్బుకావాలి… అర్జెంటుగా డబ్బు పుట్టించుకు వస్తేగాని సుబ్బమ్మ ప్రాణాలని నిలిపే మందుల్ని కొనలేం… సుబ్బమ్మ చాటున డబ్బుతో ప్రత్యక్ష సంబంధం లేకుండా బ్రతికిన కళావతికీ పరిస్థితి గాభరా పుట్టి స్తూంది…ఆలోచనలో పడిన కళావతి ఒక నిశ్చయానికి వచ్చిన దానిలా గబగబా చంద్ర చేతిలో మందులచీటీ లాక్కుని బయటకు పరుగెత్తింది. 

          గంటలో సుబ్బమ్మకు కావలసిన మందులు తీసుకొచ్చింది కళ. అప్పటికే చెయ్య వలసిన వైద్యం చేస్తున్న శృతికి కృతజ్ఞతతో నమస్కరించింది. 

          రెండు రోజులు కళ్ళల్లో వత్తులేసుకుని కూర్చుని సుబ్బమ్మకు సేవలు చేసింది కళావతి. సుబ్బమ్మకు స్పృహ వచ్చి కోలుకుంటూ కళ తనకు చేస్తున్న ఉపచారాల్ని చూసి వలవల ఏడ్చేసింది. 

          “ఎక్కడ ఏ ఇంట్లో పుట్టావో, యెంత బాగా బ్రతకాల్సిన దానివో, నీ ఖర్మకాలి నా చేతిలో పడ్డావు. నీ బ్రతుకుని బుగ్గి చేసానే అమ్మా! దేవుడు నన్ను నారకానికే పంపిస్తాడే” శరీరంలో సగ భాగం చచ్చుబడిపోయిన సుబ్బమ్మ వంక నిస్తేజంగా చూస్తూంది కళావతి. సుబ్బమ్మ అన్నమాట నిజమే అయితే ఆడ పిల్లల బ్రతుకుల్ని బుగ్గిచేసిన నరరూప రాక్షసులతో నరకం ఈ పాటికే నిండిపోయుండాలి. ఆడ పిల్లల రక్తమాంసాలతో వ్యాపారా న్ని సాగించే క్షుద్రులు నరకంలో పాదం మోపితే నరకం కూడా అపవిత్ర మవుతుందేమో బహుశా!

          “కళా! ఇంటికెళ్ళి కాస్త ముద్దతిని పడుకో. చంద్ర వుంటుందిక్కడ” బలవంతాన యింటికి పుంపింది సుబ్బమ్మ. 

          మునిమాపువేళ యింటికి వెళ్ళిన కళ యింకా చీకటి తెరలు విచ్చుకోకుండానే హాస్పిటల్ కు తిరిగొచ్చింది. బాధతో విలవిలలాడుతూ హృదయ విదారకంగా ఏడుస్తూన్న కళ దగ్గరకు ఆదుర్ధాగా వచ్చింది శృతి. 

          “నేనీ బాధకు తట్టుకోలేనమ్మగారు! నేను చచ్చిపోతాను. ఈ బాధాలేవీ తెలీకుండా చచ్చిపోడానికి ఇంజక్షన్ ఇవ్వండమ్మగారూ!” దీనంగా అర్థిస్తూ ఏడుస్తున్న కళ తనను చూస్తూ వికటాట్టహాసం చేస్తున్న పేదరికం, డబ్బు అప్పిచ్చినప్పుడు పెట్టిన షరతును గుర్తుచేస్తూ తన మీదకు లంఘిస్తున్న క్రూరమృగం కళ్ళ ముందు నిలిచి కంపించి పోయింది. కడుపులో గుణపాలతో పొడుస్తున్నట్లు వెర్రిబాధ… మెలికలు తిరిగిపోతూ ఏడుస్తూంది కళావతి… చీకటి యింకా చిక్కగానే వుంది. 

*****     

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.