అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 12

– విజయ గొల్లపూడి

జరిగినకథ: విశాల, విష్ణుసాయి పెళ్ళి అయిన తరువాత ఆస్ట్రేలియా సిడ్నీలో పెర్మ నెంట్  రెసిడెంట్స్గా స్థిరపడటానికి వస్తారు. అనిత, వినయ్ ఇంట్లో రెండు రోజులు వారికి ఆతిధ్యమిస్తారు. వారి పిల్లలు అమర్, అన్విత వారికి చేరిక అవుతారు. వినయ్ తన స్నేహితుడు గోపికి పరిచయం చేసి, పేయింగ్గెస్ట్గా నెల రోజులు అతనింట్లో ఉండటానికి వాళ్ళ మధ్య ఒప్పందం కుదురుస్తాడు. వారికి సూపర్మార్కెట్లో రవి పరిచయమవుతాడు…

***

         విశాల తను ఆ ఫోన్ తీసుకుని తప్పుచేసానా అని మధన పడింది. కానీ విశాలకేమి తెలుసు ఫోన్ లో అవతలి కంఠం పెద్ద స్కెచ్చే వేసి తనకు కావలసిన విలువైన సమాచారం రాబట్టడానికి, ముఖ్యమైన ఫోన్ నంబర్ కోసమే ఆమెకు గోపి లేని సమయంలో చేసిందని.

ఇన్నాళ్లు ఆడుతూ, పాడుతూ కాలం గడిపేసిన విశాలకు మొదటిసారిగా గందరగోళంగా అనిపించింది. గోపికి ఫోన్ వచ్చిన విషయం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తోంది.

          గోపీ ఇంటికి రాగానే ఇద్దరినీ పలకరించి, “ఎలా ఉంది సిడ్నీ? ఏమేమి పనులు చేసుకున్నారు?”అన్నాడు.

          విష్ణు తను తీసుకున్న ఓడా ఫోన్ చూపించి, తన నంబర్ అతనికి ఇచ్చాడు. 

అదే అదనుగా విశాల ఫోన్ వచ్చిన విషయం చెపుతూ, “వాళ్ళకు కావలసిన ఫలానా వాళ్ళ ఫోన్ నంబర్ అడగ్గానే ఇచ్చాను, తరువాత వాళ్ళు ఫోన్ వెంటనే పెట్టేసారు” అని చెప్పింది.

          “ఏమిటి, ఫోన్ వచ్చిందా? ఇక్కడ డైరెక్టరీ బుక్ లో నంబర్ పేరు చెప్పగానే ఇచ్చేసారా? మై గాడ్, లెట్ మి సీ, హూ హేస్ కాల్డ్” అని వెంటనే ఫోన్ స్క్రీన్ పై నంబర్ చెక్ చేసాడు. కాని అక్కడ నంబర్ ప్రైవేట్ కాల్ అని రావడంతో గోపీ అసహనంగా, ఖచ్చితంగా దిస్ ఫోన్ ఈస్ ఫ్రం మై ఎక్స్ వైఫ్. మేము ఇద్దరం డైవోర్స్ కి అప్లై చేసాము. నాకు పెళ్ళి కాగానే, పెర్మనెంట్ రెసిడెంట్ వీసా వచ్చేదాక ఆగి, నేను ఇల్లు కొనుక్కున్నాక నా ప్రొపర్టీ లాక్కోవడానికి, నానుంచి విడిపోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. నేను ఒక రకంగా మోసపోయాను. మీరు నన్ను అడగకుండా, ఏమీ తెలియకుండా, ఫోన్ నంబర్ ఇవ్వడం ఏమీ బాలేదు.” అని కాస్త ఆవేశంగా అన్నాడు.

          విశాల మొహంలో కత్తివేటుకు నెత్తురు చుక్క లేనట్లుగా ఒక్కసారిగా కొయ్యబారిపోయింది. విష్ణు కూడా సడన్ గా అతను డైవోర్స్ అని తెలుసుకుని షాకయ్యాడు. కాని తమాయించుకుని, గోపితో మీరు ఈ విషయాలేమి మాకు ముందు చెప్పలేదు కదా! అనుకోకుండా అలా జరిగిపోయింది” అని సర్ది చెప్పాడు.

            వెంటనే గోపీ, ఇట్స్ ఓకే. ఇకపై ఈ నంబర్ కి వచ్చే ఫోన్స్ తీయకండి. అలా బయటికి వెడదాం రండి. నేను మీకు సిటీ చూపించాలనుకున్నాను అనగానే, మరో మాటకి ఆస్కారం లేకుండా అందరూ కారులో కూర్చోగానే, గోపీ కారు డైవ్ చేసుకుంటూ సిడ్నీ సిటీ సి.బి.డి వెడుతున్నాము. హార్ట్ ఆఫ్ ద సిటీ ‘డార్లింగ్ హార్బర్’ అని చూపెడుతూ, కారు పార్కింగ్ చేసాడు. ముగ్గురూ డార్లింగ్ హార్బర్ బ్రిడ్జ్ వైపు నడిచారు.

           1825 నుండి 1831 వరకు న్యూ సౌత్ వేల్స్ గవర్నర్గా ఉన్న లెఫ్టినెంట్ జనరల్రాల్ఫ్ డార్లింగ్’ పేరు మీద డార్లింగ్ హార్బర్ పేరు పెట్టబడింది. దిస్ ఈస్ ఐకానిక్ ఫేమస్ టూరిస్ట్ అట్రాక్షన్ టు సిడ్నీ. న్యూ ఇయర్ ఫైర్ వర్క్స్ ఇక్కడే జరుగుతాయి. దీనికి కొంచెం దూరంలో పైకి వెడితే ఇదే సిడ్నీ హార్బర్ బ్రిడ్జి. బ్యూటీ ఆఫ్ దిస్ బ్రిడ్జ్ ఈస్ రెండుగా స్ప్లిట్ అవుతూ రొటేట్ అవుతుంది అని వివరణ ఇస్తు గోపీ వాళ్లతో మాటలు కలిపి మామూలుగా ఉండటానికి ప్రయత్నించాడు. 

          కానీ అదే సమయంలో ఇటు విష్ణుగానీ, విశాల గానీ ఏమాత్రం సంతోషంగా లేరు. విశాల మనసులో మూగగా రోదిస్తోంది. శుభమా అని కొత్తగా పెళ్ళి చేసుకున్న జంట పోయి, పోయి రెండుగా విడిపోతున్న జంట ఇంట్లో ఉండటమా, ఇదెక్కడి ప్రారబ్ధం. కనీసం ఈ విషయాలు ముందు కూడా చెప్పలేదు. పోయి పోయి రాబందు కోరల్లో ఇరుక్కున్నామా? తన కలల సౌధం ఎదురుగానున్నా, హార్బర్ చుట్టూ పావురాలు గుంపుగా వచ్చి కోలాహలం చేస్తున్నా ఆ అందాలని విశాల ఇపుడు ఆస్వాదించలేకపోయింది. ఎందుకంటే గోపీ మీద ఉన్న సదభిప్రాయం పోయి, అతని మాటలకు విశాల చాలా నొచ్చుకుంది. 

         మెల్లిగా సూర్యుడు మబ్బుల వెనక్కి వెళ్ళిపోతు, నల్లగా కారుమేఘాలు ఆవహించటంతో, ఇక వెడదామా, అని గోపీ కారు పార్కింగ్ వైపు బయలుదేరుతూ ముందు నడిచాడు.

          విశాల నెమ్మదిగా విష్ణుతో అంది, “దయచేసి మనం ఇక్కడినుంచి వేరేచోటికి వెళ్ళిపోదాం. ఇతని పద్ధతి, మాటలు నాకు నచ్చలేదు. మనం కొత్తగా గూటిని ఏర్పాటు చేసుకుందామని వచ్చాం. విడిపోతున్న ఈ జంట గూటిలో ఉండటం నాకు ససేమిరా ఇష్టం లేదు”.

           విష్ణు, విశాల తో వేరే చెవికి వినపడనంత నెమ్మదిగా అన్నాడు, విశాల కాస్త ఓపిక పట్టు. నాకు ఏం జరుగుతోందో తెలియటం లేదు. అతను రేపు ఇండియా వెడుతున్నాడు. ఇంకో నెల రోజులకు గాని రాడు. నేను ముందుగానే రెంట్ పే చేసేసాను. అతను వచ్చేలోపుగా నెల రోజులలో మనం వేరే ఇల్లు వెతుక్కుని, వెళ్ళిపోదాం.” అని ఆ క్షణంలో ఆమెను సమాధాన పరిచాడు.

          వెడుతుంటే గోపీ, మధ్యలో సన్నాయి నొక్కులు నొక్కుతూ, “మీలాగే నేను ఎన్నో కలలు కన్నాను ఇక్కడకు వచ్చే ముందు. మీరు ఇక్కడకు ఎందుకు వచ్చారో నాకు తెలియదు. ఫారిన్ అంటే భూతల స్వర్గం అనుకుంటారు బంధువులంతా. ఇలా పెళ్ళి అయిందో లేదో, వెంటనే ఇంటిల్లిపాది నన్ను మావయ్యను ఎప్పుడు చేస్తావ్ అని ఒకళ్ళు, మాకు మనవడిని ఎప్పుడు ఇస్తావ్ అని మాఇంట్లోను, మా మీదే దృష్టి పెట్టారు. ఇక్కడ సాధక, బాధకాలు ఇండియాలో వాళ్ళకేమి తెలుస్తాయి”అని చాలా పెసిమిస్టిక్ గా మాట్లాడాడు.

          అతని మాటలు వింటూంటే, విశాల కి చాలా రోతగా అనిపించింది. తను చిన్నతనంలో చదివిన థామస్ హారిస్ పుస్తకం ‘ఐయామ్ ఓకే, యూ ఆర్ ఓకే’ పుస్తకం లో చెప్పినట్లుగా మనుష్యుల మనస్తత్వాలు ఇలాగే ఉంటాయి కామోసు, తను బాగున్నంతసేపు, వేరే వాళ్ళతో అనుబంధం సజావుగా సాగుతుంది. తనకి బాగుండకపోతే, ఇక వేరే వాళ్ళకి కూడా జీవితం సాఫీగా సాగకూడదా… ఏమిటి? ఇంత దారుణంగా ఈ విపరీత ధోరణులు, పెడార్థాలు ఏమిటో’ అనుకుంది. 

            ఇంటికి చేరుకోగానే, గోపీ అపాలజిటిక్ గా అన్నాడు, సారీ కాస్త హర్ట్ అయ్యి ఏదేదో అనేసాను. ఏమీ అనుకోవద్దు. ఇపుడే క్షణంలో కుక్కర్ పెడతాను, ఉయ్ విల్ హావ్ డిన్నర్ అన్నాడు.

          దానికి విష్ణు, దట్స్ ఓకే. విశాల, మేము తలొక డిష్ చేసేద్దాం రండి అని వాతావరణాన్ని చల్లబరిచాడు.

          గోపి కుక్కర్ లో అన్నం, పప్పు పెట్టాడు. విశాల పేంట్రీ లో ఏమున్నాయో చూసుకుని, చక చకా టొమోటో చారు చేసేసింది. ముగ్గురు కలిసి అన్నీ సిద్ధం చేసుకుని, డిన్నర్ చేసారు. గోపీ వేడి, వేడి చారు రుచి చూసి, “నిజంగా మా అమ్మగారు చేసినట్లే ఉంది మీరు చేసిన టొమోటో రసం” అన్నాడు. దానికి విశాల తనలో ఉన్న కోపాన్ని మర్చిపోయి, “వావ్! దటీజ్ ఎ నైస్ కాంప్లిమెంట్, నేను మొదటిసారి చేసిన చారు అమ్మ చారుతో పోల్చారంటే సంతోషంగా ఉంది. అమ్మ వంట చేస్తుంటే చూసేదాన్ని. ఈ రోజు ఆచరణలో పెట్టే అవకాశం కలిగింది” అనగానే, విష్ణు కూడా “అవును విశాలా! చారు తినగానే జిహ్వకి రుచి తెలిసింది” అన్నాడు.

అదేనేమో మన ఇండియన్ థాలీ మహత్యం, కడుపులోకి  బువ్వవెళ్ళగానే, ఎంత కోపమైనా ఇట్టే చల్లారిపోతుంది.

          ఆ రాత్రి, గోపి విష్ణు కి ఇలా చెప్పాడు. ఇక్కడ ప్రతి మంగళవారం గార్బేజ్ బిన్ ఖాళీ చేయడానికి ట్రక్ వస్తుంది ప్రొద్దున్న ఐదు గంటలకి. అందుకని బిన్స్ ముందు రోజు రాత్రే అందరూ పెట్టేస్తారు. ఈ బిన్స్ మూడు రంగులలో ఉంటాయి. రెడ్ కలర్ బిన్ లో ఇంటి చెత్త ఉంచుతారు. రీ సైకిల్ మెటీరియల్స్ చెత్త పసుపు రంగు బిన్, గ్రీన్ కలర్ బిన్ లో ఆర్గానిక్ వేస్ట్ మెటీరియల్ ఉంచుతారు అని వివరంగా చెప్పాడు.

          ఆ విషయాలు వింటూ విశాల అనుకుంది, ‘ఇదే పద్ధతి చెత్త పడేయడానికి మన భారతదేశంలో ఎందుకు అవలంబించరు? ప్రొద్దున్న లేస్తే మంత్రులు, నాయకులు విదేశాలు చూడటానికి వెడతారు కదా! ట్రాఫిక్ విషయంలో, పరిశుభ్రత విషయంలో పాశ్చాత్య దేశాలలో అవలంబిస్తున్న పద్ధతిని మన దేశంలో కూడా అమలుపరిస్తే బాగుంటుంది. సగానికి సగం దోమల బెడద వదిలిపోతుంది కదా.. అని మనసులో స్వగతించింది.

          ఆ రోజు రాత్రి విశాల నిద్ర పట్టక, మనసు సమాధాన పడక, మనసులో బెరుకు, భయంతో ఆలోచనలకు ఆనకట్ట వేస్తు పడుకోవటానికి విశ్వ ప్రయత్నం చేసింది.

          ఇటు విష్ణు పరిస్థితి వేరేలా ఉంది. ‘నేను ఈ దేశానికి, విశాల తో కలిసి వచ్చి పొరపాటు చేసానా? ముందు నేను వచ్చి, ఇల్లు రెడీ చేసుకుని అపుడు తనని తీసుకురావలసిందా? అని తన డెసిషన్ మేకింగ్ లో పెర్మ్యుటేషన్, కాంబినేషన్స్ బేరీజు వేసుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు.

            ఆకాశంలో నిండు పున్నమి చందమామ, పెళ్ళైన కొత్త జంట నా అందాలను చూడలేకపోతున్నారే అని బాధగా నవ్వుకుంది.

          మెదడుకి పని అప్పచెప్పి, సబ్ కాన్షియస్ లోకి సీరియస్ గా ఇన్ స్ట్రక్షన్స్ ఇవ్వాలే గానీ, ఏ పనైనా చేయగల సామర్థ్యం బ్రెయిన్ కి ఉంది. సరిగ్గా ఇపుడు గోపీ కూడా అదే స్థితిలో ఉన్నాడు. తన జీవితాన్ని చక్కబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంటిని స్నేహితుడి ద్వారా పరిచయమైన జంటకి అప్పగించి, త్వరగా ఇండియాలో ఆస్తి వ్యవహారాలు చూసుకోవడానికి తల్లి పిలుపు మీద వెడుతున్నాడు.

            విష్ణు లేవగానే మరోసారి ఇంటి జాగ్రత్తలు చెప్పి, టాక్సీలో ఎయిర్ పోర్ట్ కి గోపి వెళ్ళిపోయాడు.

          విశాల ని ‘ఇంగ్లీష్ బ్రేక్ ఫాస్ట్ టీ బాగ్ తో చేసిన చాయ్ ఘుమ ఘుమలతో విష్ణు నిద్రనుంచి మేలుగొలిపాడు.

          “విశాలా! నీకో పేద్ద సర్ ప్రైజ్. త్వరగా తయారవ్వు. వీలైతే ఒక మాంచి స్నాక్ తయారు చేసెయ్”

          అవునా! ముందు చెప్పకూడదా నాకు. సరే చిత్తం! మీరే ఇపుడు నాకు బాస్. ప్రస్తుతం ఎదురుగా ఉల్లిపాయలు కనిపిస్తున్నాయి. నేను పచికెన్ చేసేస్తాను అని వంటింట్లోకి వెళ్ళిపోయి అన్ని సిద్ధం చేసింది.

         ఇద్దరూ రెండు బ్యాగులతో రైల్వే స్టేషన్ కి చేరుకున్నారు. హోమ్ బుష్ స్టేషన్ కి చేరుకున్నారు. అక్కడ అంతా కోలాహాలంగా ఉంది. వాలంటీర్లు అందరికీ డైరెక్షన్స్ ఇస్తూ ఎటు వెళ్ళాలో గైడ్ చేస్తున్నారు.

     మెల్లిగా ఇద్దరూ ఒలింపిక్ పార్క్ కి నడుచుకుంటూ చేరుకున్నారు. అపుడు విశాల ఒక్కసారిగా తన కళ్ళను, తనే నమ్మలేకపోయింది. నిజంగానే నేను టీ.విలో చూస్తానేమో అనుకున్నాను. అలాంటిది నన్ను ఏకంగా ఒలింపిక్ పార్క్ కి తీసుకుని వచ్చేసారు. ఇట్స్ అన్ బిలీవబుల్ అంటూ విష్ణుసాయి చేతికి షేకేండ్ ఇచ్చింది. 

          ఎంతోమంది వాలంటీర్లు నవ్వుతూ, చలాకీగా వస్తున్నవాళ్ళకి స్వాగతం పలుకుతూ, టికెట్లు చెక్ చేస్తూ లోపలికి పంపుతున్నారు. ఏ విధమైన తొడతొక్కిడి లేకుండా అందరూ లైన్ లో స్టేడియంలోకి ప్రవేశిస్తున్నారు. 

          వాటర్ ఫౌంటేన్స్ తో పార్క్ ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. విశాల, విష్ణు జిమ్నాస్టిక్స్, అథెలిటిక్స్ విభాగంలో గేమ్స్ చూడటానికి వెళ్ళారు. అక్కడ మస్కాట్ సావనీర్స్ కొన్నారు. ఆ రోజు ఆస్ట్రేలియా అథెలెట్ కేథీ ఫ్రీమన్, భారతదేశ అథెలెట్ పి.టి ఉష అథెలెటిక్ విన్యాసాలను తన కెమెరాలో బంధించుకుంది విశాల.

          ఇద్దరూ బైనక్యూలర్స్ తో స్టేడియం లో గేమ్ లు చూసి ఆనందించారు. సిడ్నీ ఒలింపిక్ పార్క్ లో సినిక్ బ్యూటీ చూసి మైమరచిపోయారు. ఎంతో అన్యోన్యమైన ఆ జంటను చూసి ఒక యువ వాలంటీర్ వచ్చి, వారి కెమెరాతో ఇద్దరికీ ఫోటోలు క్లిక్ మనిపించాడు.

          విష్ణు, విశాల చేతిలో బ్యాగ్ లాక్కుని, “అవును పచికెన్ అన్నావ్, కిచెన్ లో ఏం చేసావో నాకు చూపించలేదు, ఇపుడైనా రుచి చూపిస్తావా? అన్నాడు.

           అక్కడే ఉన్న తెలుగు ఫ్యామిలి వీళ్ళని చూస్తూ, “పచికెన్ ఏమిటండీ? అని ఆ జంట వారిని పలుకరించారు.  “హాయ్! నా పేరు, హరీష్, నా భార్య స్వప్న. మేము కేవలం ఒలింపిక్స్ చూడటం కోసం సిడ్నీ ఒక వారం వచ్చాము. మిమ్మల్ని చూడగానే కొండంత బలం, సంతోషం వచ్చింది” అన్నాడు అతను.

          స్వప్న కూడా హాయ్ చెపుతూ, “మీ తెలుగు మాటలు వినగానే ప్రాణం లేచొచ్చినట్లైంది. ఇంక మీరు అంటున్న కోడ్ ‘పచికెన్’ నేను డీకోడ్ చేసేసాను. అదే అదే ఘుమఘుమలు, ఆంధ్రాని వదిలేసి ఆస్ట్రేలియా వచ్చినా ఉల్లిపాయతో నోరూరించే పకోడి కదా మీరు తీసుకువచ్చారు!”

          వెంటనే విశాల “అరె భలే కనిపెట్టేసారే! నా పద ప్రయోగాన్ని” అంటూ నవ్వింది.

          అల్యూమినియం ఫాయిల్ ఓపెన్ చేసి, గేమ్ చూస్తూ, పకోడీ రుచులను ఆస్వాదిస్తూ, ఇరు జంటలు ఫోటోలు తీసుకుని, ఫోన్ నంబర్స్ తీసుకుని బై బై చెప్పుకుంటూ వెను తిరిగారు.

          వరుసగా ట్రైయిన్స్ ఉండటంతో, ఇబ్బంది పడకుండా విశాల, విష్ణుసాయి ఇంటికి చేరుకున్నారు.

          “ఆ రోజు నాకు చెప్పకుండా బోండై బీచ్ లో ఎక్కడకీ మీరు వెళ్ళారు అని నేను మీమీద అపోహ పడ్డాను. మిమ్మల్ని అడగాలా వద్దా అనుకున్నాను, ఇదన్నమాట ఒలింపిక్స్ కి టికెట్స్ తీసుకుంటారని అనుకోలేదు. రియల్లీ ఎ డే టు రిమెంబర్ దిస్ డే ఫరెవర్.” అని మనస్ఫూర్తిగా నవ్వుతూ అంది విశాల.

          “చాలు, విశాల. నిజంగా నిన్న తుఫాన్, మళ్ళీ ఈ రోజు వాన వెలసిన తరువాత ప్రశాంతత. ఇలా ఒక దాని వెంట, ఒకటి వస్తాయి. అయినంత మాత్రాన అంత బెంబేలు పడిపోవనక్కరలేదు. కొద్దిపాటి ఓర్పు ఉండాలి. మనకు బాబా కూడా సత్ చరిత్రలో శ్రద్ధ, సహనం ఉండాలి అని బోధించారు.” అంటూ తను చెప్పవలసిన విషయం ఆమెకి ఛాన్స్ దొరకగానే చెప్పేసాడు విష్ణు.

          నిన్న మన ఇద్దరి మధ్య కాదు సమస్య, మూడో వ్యక్తి వల్ల, నా తప్పు లేకపోయినా వినాయక చవితి నీలాపనిందల్లాగ అతను నన్ను అనడం నాకు నచ్చలేదండీ అని సున్నితంగా విశాల చెప్పింది.

         మనసులో ఉన్న భారాన్ని దించుకుని, తేలికైన మనసుతో రెండు హృదయాలు ఒకటైనాయి.

          ప్రొద్దున్న ఎనిమిది గంటలకి ఫోన్ రింగవుతోంది. అంతకు ముందు జరిగిన సంఘటనతో ఫోన్ లో మాట్లాడాలంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్. ముందు ఎవరో తెలుసుకోవాలి అని విశాల అనుకుంటుండగా…

          విష్ణు, విశాల దగ్గిరకు వచ్చి,  “మేడమ్ దిస్ ఈస్ యువర్ మొబైల్ ఫోన్. మాట్లాడవచ్చు” అంటూ, విశాల చేతిలో మొబైల్ ఫోన్ పెట్టాడు.

          నిజంగానే మొబైల్ ఫోన్ కొన్నాక, విశాల అందుకుంటున్న మొదటి ఫోన్ కాల్. ఎవరై ఉంటారా! నా భార్య అని ఆత్రుతతో ఫోన్ తీసుకుని హలో! అంది. `

          

* * * * *

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.