కథా మధురం 

ఆ‘పాత’ కథామృతం-14

ప్రభావతి – రచయిత్రి “భాస్కరమ్మ”

 -డా. సిహెచ్. సుశీల

 
          ఆ. భాస్కరమ్మ రచించిన “ప్రభావతి” అనే కథ 1926 ఆగస్టు, భారతి పత్రికలో ప్రచురించబడింది. 
 
          కాకినాడ పట్టణంలో శాస్త్రవిజ్ఞానంలోను, సంప్రదాయ, సంపదలలోను, దాతృత్వం లోను యోగ్యుడైన ఒక నియోగ బ్రాహ్మణుడు పెమ్మరాజు గోపాల్రావుగారి సంతానములో మొదటి పుత్రిక లక్ష్మీదేవమ్మ. ఆమెకు పదునారవ ఏట ఒక కుమారుడు పుట్టిన ఆరు నెలలకే భర్త మరణించగా పిల్లవాడిని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నది. అలాగని అతి గారాబం చేయక మంచి బుద్ధులు నెరపుచూ, పాఠశాలకు పంపి, చదువు సంస్కారం లో అశ్రద్ధ చేయకుండా పెంచసాగింది. పుట్టింటి, అత్తింటి వారు కూడా మంచి సంపన్న వంతులు.
 
          మంత్రిప్రెగడ చంద్రశేఖరం గారొక సామాన్య కుటుంబీకుడు. ఆయన భార్య సుశీల, కుమార్తె ప్రభావతి. తరువాత ఇద్దరు కుమారులు. ప్రభావతి అంటే ఆ భార్యాభర్తలకు అమిత ప్రేమ. తొమ్మిదేళ్ళ ప్రభావతి ఆటలలోనూ చదువులోనూ చురుకుగా ఉండేది.  “హిందూ ధర్మాచారము ప్రకారము” పిల్లకు పెళ్ళివచ్చును కదా, గోపాల్రావు గారి మనుమడు పదిహేనేళ్ళ శివరావు ఉన్నాడు –  అని కొందరు సూచించారు. అంత గొప్ప సంబంధానికి తాను తూగగలడా అని, వారు తమ వంటి సామాన్యుని ఇంటి ఆడపిల్లను చేసుకుంటారా అని ఆలోచనలో పడ్డాడు చంద్రశేఖరం. మరికొందరు ఆయనకాశచూప డంతో తన అత్తగారైన బుచ్చెమ్మ గారితో చెప్పాడు ఒకసారి వారింటికి వెళ్ళి విషయం కదిలించి చూడమని.
 
          బుచ్చెమ్మ ప్రభావతిని తీసుకుని లక్ష్మీదేవమ్మ గారింటికి బండిలో బయలుదేరడం తో ఈ కథ ప్రారంభమవుతుంది. “ఆడపిల్లని మగ పెళ్ళి వారింటికి తీసుకొని వెళ్ళడం ఆ రోజుల్లో కొంత కొత్త సంప్రదాయమే.” 
 
          విశాలమైన, పెద్ద గృహం, అందమైన తోట వారి సంపన్నతను తెలియజేస్తోంది. బుచ్చెమ్మను సాదరంగా ఆహ్వానించింది లక్ష్మీదేవమ్మ. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే ప్రభావతి అక్కడ ఉన్న బీరువాలలో ఉన్న రకరకాల బొమ్మలను చూడసాగింది. ఆడ వారిద్దరూ పిల్లలను పరిశీలనగా గమనించి, వారికి వివాహం చేయడానికి ఏ విధమైన అభ్యంతరాలు లేవు అనుకొన్నారు.
 
          చంద్రశేఖరం గారికి అన్ని విషయాలు సంతృప్తికరంగా ఉన్నాయి, ఉన్న ఊరిలోనే సంబంధం, పిల్లలు ఈడు జోడుగా ఉన్నారు. కానీ కట్నకానుకలు ఎక్కువ అడిగితే తాను భరించగలడా అని సంకోచిస్తున్నాడు. ఇరువురి కుటుంబాలలో పెళ్ళి సంగతులు నడు స్తున్నాయని ఊరంతా తెలిసిపోయింది. స్కూళ్ళకు వెళ్ళే దారిలో శివరావు, ప్రభావతి ఎదురు పడేవారు. పెళ్ళి అంటే వివరం తెలియక పోయినా చుట్టుపక్కల వారు హాస్యాలా డడంతో ఇద్దరు సిగ్గు పడేవారు.
 
          గోపాల్రావు గారికి కొంచెం జ్యోతిషం తెలుసు. తమ వంశంలో పదిహేనేళ్ళ లోపు కుర్రవాళ్ళకి వివాహం జరిపితే ఇద్దరు ముగ్గురు పెళ్ళయిన కొన్ని రోజులకే మరణించడం సంభవించింది. అందుకే శివరావుకి పదిహేనేళ్ళు దాటే వరకు ఏ మాటా వెల్లడించలేదు. కట్నం ఎక్కువ ఆశిస్తున్నారేమో అన్న సందేహంతో చంద్రశేఖరం కూడామిన్నకున్నారు. ఆ సంవత్సరం దాటాక, చివరకు జ్యేష్ఠ మాసంలో నాలుగు వందల రూపాయలు కట్నం తో తనకున్నంతలో చాలా వైభవంగానే కూతురు పెళ్ళి చేసాడు చంద్రశేఖరం. ఇరు వర్గాల బంధు గణమంతా ప్రభావతి అదృష్టాన్ని కొనియాడారు. శ్రావణమాసం మంగళ వారం నోములకు ప్రభావతిచే ఊరందరినీ పిలిపించింది సుశీల. వచ్చిన వారందరు ప్రభావతి ఖరీదైన దుస్తులు, నగలు చూసి “ఎంత అదృష్టవంతురాలివి” అని ముద్దులు పెట్టుకున్నారు. తర్వాత లక్ష్మీదేవమ్మ ఆడంబరంగా తెచ్చిన ‘శ్రావణ పట్టీ’ తో వారి చావడి అంతా నిండిపోయింది. దసరా పండుగ కూడా వచ్చి వెళ్ళిపోయింది రెండు కుటుంబాలలో ఆనందాలను నింపి.
 
          దీపావళికి అల్లుడిని ఆహ్వానించడానికి వెళ్ళిన చంద్రశేఖరం గారికి ఆ అబ్బాయికి నాలుగైదు రోజుల నుండి ఒంట్లో నలతగా ఉందని తెలిసింది.
 
          స్కూలుకి వెళ్ళే దారిలో ప్రభావతికి శివరావు కనబడడం లేదు. తల్లి తరచూ వారింటికి వెళ్ళి వచ్చి ఎందుకో దిగులుగా ఉంటోంది. ఒక రోజైతే ఆటలు నుండి ఇంటికి వచ్చిన ప్రభావతి తల్లి ఏడుస్తూ ఉండడం చూసి విషయం ఏమిటో తెలియక పోయినా తానూ ఏడ్వసాగింది. మర్నాడు చంద్రశేఖరం ఎంతకూ ఇంటికి రాకపోవడంతో ప్రభా వతిని తీసుకుని సుశీల వావిలాల లక్ష్మీదేవమ్మ ఇంటికి వెళ్ళింది. వీరు వెళ్ళిన కాసేపటికే ఇంట్లో వారు గొల్లుమన్నారు. శివరావు చనిపోయాడు అని చెప్పడానికి బదులు ఇక్కడ రచయిత్రి చెప్పిన విధానం –  “అయిపోయినది. ప్రభావతి యదృష్టమంతయు నెనిమిది నెలల్లో పరిపూర్ణత నొందినది. పలువురిలోకి వచ్చుటకు గాని, నెచ్చెలులతో  స్వేచ్ఛగా నాడుకొనుటకు గాని, శుభకార్యముల యందు నలువురిలో గూర్చుండుటకు గాని నోచిపుట్ట లేదు. శుభకార్యములలో పేరంటాండ్ర మధ్య గూర్చుండ, వారితోపాటామెకు పసుపు కుంకుమ నిచ్చుటకు వెనుదీయజొచ్చిరి”.
 
          కొన్ని సంవత్సరాలు గడిచినవి. స్కూలు మానివేసిన ప్రభావతి ఇంట్లోనే అనేక పుస్తకాలు చదువుకోనారంభించింది. అనేక విషయాలు తెలుసుకోసాగింది. ప్రఖ్యాతులైన స్త్రీ పురుషుల చరిత్రలు చదువుతున్నప్పుడు తాను కూడా ఆనందించేది. ఆలోచించేది. ఈ వైధవ్యం వలన స్త్రీలకు జరుగుతున్న దురాచారాలను రూపుమాపాలని, స్త్రీల స్వాతం త్రం కొరకు ఘోర యుద్ధము చేయవలెనని తలంచు చుండెడిది.
 
          హఠాత్తుగా ఒక రాత్రి – పదహారేళ్ళ ప్రభావతి తన గదిలో చాప పై ( మంచం కాదు) కూర్చొని దుఃఖిస్తూ ఉంది. చుట్టూ పుస్తకాలు. ఒక చిన్న సీసా. తనలో తను తర్కించు కొంటున్నది.
 
          “తల్లిదండ్రులారా! సంఘమునకంత వెరువ వలయునా!
 
          ఓ సంఘమా! వితంతు స్త్రీల విరూపిణులను జేయుటలో నీ యుద్దేశమేమి?”
 
          చంద్రశేఖరం గారికి అసాధారణ ఆత్మగౌరవం, మనస్థైర్యం, స్వాతంత్ర్యాపేక్ష, ఇతరులకు లోబడి ఉద్యోగం చేయడం ఇష్టంలేక తనకు తెలిసిన వైద్యవృత్తి నవలం భించి సాధారణ జీవితం గడిపేవాడని రచయిత్రి మొదట్లోనే చెప్పారు. అందుకే భర్త చనిపోయిన తర్వాత కూతురికి బొట్టు మాత్రమే తీయుటకు అంగీకరించాడు. ఇంటిలో ఆమె చదువుకోవడానికి అనేక పుస్తకాలు అందుబాటులో ఉంచాడు. 
 
          నిజానికి అదొక సంధి యుగం. అటు ప్రాచీన సంప్రదాయాలు పూర్తిగా వదులుకో లేరు… ఇటు ఆంగ్ల సాహిత్యం పఠనం వల్ల కొంత అభ్యుదయ భావాలు, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కృషి వలన వితంతువులకు పునర్వివాహ చట్టం రావడం, వీరేశలింగం పంతులు, గురజాడ అప్పారావు వంటి వారి సాంఘికోద్యమాల ప్రభావం వల్ల నూతన దృష్టి ఏర్పడడం – రెండింటి మధ్య స్త్రీల పట్ల తమ భావాలు తేల్చుకోలేక పోతున్నారు. చంద్రశేఖరం వంటి స్వాతంత్య్ర భావాలు కలవారు కూడా మూఢ విశ్వాసాల పట్ల విముఖత చూపినా “సంఘ ఆచారా”లను ఎదిరించలేక పోతున్నారు.
 
          ప్రభావతికి పదహారేళ్ళ వయసు వచ్చింది. ఇక్కడ రచయిత్రి “వాచ్యం” గా చెప్పక పోయినా, చంద్రశేఖరం సంఘానికి తల ఒగ్గారని, ఇన్నేళ్ళు ఎలా ధైర్యంగా లాగుకొని వచ్చినా, ఇరుగుపొరుగు వారి తీవ్ర వొత్తిడి వల్ల కూతురికి వెండ్రుకలు తీయించడానికి ఒప్పుకొన్నారని, అందుకే, అర్ధరాత్రి తన గదిలో ప్రభావతి దుఃఖిస్తున్నదని తెలుస్తుంది. తల్లిదండ్రులను, సంఘాన్ని ప్రశ్నిస్తూ, “తల గొరికించుట ఎంతటి ఘోర కార్యములు చేసిన వారికి వేయు శిక్ష! రుక్మిణి నెత్తుకొని పోవుచున్న కృష్ణుని ఎదిరించినందుకు, దూషించినందుకు రుక్మిణికి తల గొరికి కృష్ణుడు అవమానించాడు. నాకెందుకీ హైన్యము! భార్య పోయిన పురుషుడు పన్నెండవ దినమున పెండ్లి కొడుకు కావచ్చును. భర్త పోయిన స్త్రీ కి పదవ నాడు ఎంతటి అవస్థ! భర్త పోయిన బాధ కంటే ఈ హింస భరింపరానిది. అవయవ నిర్మాణంలో స్త్రీ పురుషులకు భేదమున్ననూ మానసిక విషయములలో నిరువు రును సమానులే. చిరకాలము పరులకు లోబడి యున్న యొక దేశపు ప్రజలు పౌరుష స్వాతంత్య్ర దేశాభిమానాద్యున్నత గుణముల మరచి బానిస వృత్తి నవలంభించి తమ కదియే బాగున్నదని యెట్లు సంతృప్తి చెంది యుందురో యట్లే స్త్రీలును చిరకాలము నుండి యీ ఘోర దురాచార పిశాచమునకు లోబడి యుండుటచే దానికలవాటు పడి సహింప గలుగుచుండిరి. రామమోహనురాయలు సహగమనమును మాన్పించెను గానీ నాకు జూడ చావకుండా, బ్రతుకకుండా జీవితకాలమంతయు నీ యవమానములెల్ల భరించుచు జీవించు చుండుట కంటే యొక క్షణములో ప్రాణము దీయు నా సహగమ నమే బాగున్నది. ఈ దురాచార భూయిష్టమగు నిట్టి సంఘములో జీవించియుండుట కన్నా మరణమే మేలు” అని నిర్ణయించుకొన్నది.
 
          “ఓ గ్రంథములారా ! సంఘము నందలి దురాచారముల దలచుకొని విచారమున మునిగియున్నప్పుడెల్ల ననేక నీతులను, జ్ఞానమును బోధించుచు నూతనోత్సాహముల నొసంగుచు వచ్చిన మిమ్ముల వదలలేకున్నాను” అంటూ సీసాలోని విషాన్ని తాగేసింది.
 
          చంద్రశేఖరం గారెంత నవనాగరికులైనను సంఘమునకు వెరచుచుండిరి. సంఘమునకు వ్యతిరిక్తముగా నడచుటకు గాని, సంఘము నుండి విడివడుటకు గాని ఆయనకెంత మాత్రమిష్టము లేదు. సంఘమునందు తమకు **వచ్చు మాటలు** సహించలేక బాలికకు వైధవ్యచిహ్నముల నొసంగదలచెను – అని రచయిత్రి ముగింపు లో చెప్పడం వలన,  ప్రభావతికి పదేళ్ళ వయసులో భర్త చనిపోయినా వెంట్రుకలు తీయడం, తెల్లచీరలు కట్టుకోమనడం వంటి ఆచారాలను చేయలేదని, పదహారేళ్ళ వయసులో అందంగా ఉన్న అమాయకమైన ఆ స్త్రీ ని చూసి సహించలేని సంఘము వత్తిడి చేయడంతో ఆయన భయపడ్డారని ఊహించవచ్చు. ఆ వికార రూపం, ఆ ఉప ద్రవం నుండి తప్పించుకోవడానికి ప్రభావతి విషాన్ని సేవించి “తన మరణమైనా సంఘము యొక్క హృదయమును కరగించునేమో” అని నిస్సహాయంగా అనుకున్నది.
 
          వైధవ్యం ఒక భయంకరమైన వంటరితనం. చుట్టూ మనుషులు ఉన్నా భరించ లేనంత ఒంటరితనం. తోడు కోల్పోవడం స్త్రీ పురుషుల ఇరువురికి సమానమే కానీ సమాజం స్త్రీకి ఎన్నెన్నో ఆంక్షలు విధించడం వల్ల ఆమెకది నరకమే. ఆమెను విధవ అంటారు. ఆంగ్లంలో  widower అంటారు కానీ తెలుగులో భార్యను కోల్పోయిన పురుషునికి ఏమీ పేరు లేదు. భర్త మరణించిన స్త్రీకి పదవరోజు చేసే తంతు చాలా భయంకరమైంది.  భర్త పోయిన బాధ కంటే అది మరింత బాధ. భరించలేనంత శిక్ష. అలా చేయడం క్రూరమైన నేరం. కానీ చిత్రమేమంటే ఈ నేరానికి  చట్టంలో ఎలాంటి శిక్షలు లేవు. గుండు కొట్టించటం తెల్లచీర కట్టించడం వంటివి ఈనాడు లేకపోవచ్చును కానీ ఇంకా చాలా ఆచారాలు ఉన్నాయి. భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో, అన్ని కులాలలో, మతా లలో వివిధ సంప్రదాయాలు ఇంకా ఉన్నాయి. ఆదర్శాలు పలికే కుటుంబాలలో కూడా ఆచరణం శూన్యం. ప్రస్తుత కాలంలో కూడా ఈ దుర్మార్గమైన తంతు నిరాటకంగా జరుగు తున్నది. భర్త తాగుబోతు అయినా, తిరుగుబోతు అయినా, బాధ పెట్టినా, రాత్రంతా తాగి కొట్టినా మర్నాడు పేరంటంలో ఆమె ముత్తైదవ హోదాలో వాయనం పుచ్చుకొని పసుపు కుంకుమను తీసుకొని గర్వంగా తృప్తిగా ఇంటికి వస్తుంది. వైథవ్యం ఎవరూ కోరుకోరు. విధి లిఖితంగా ఆ పరిస్థితి వస్తే ఆమె తప్పేముంది! ఆమె దోషం ఏముంది. అనుకోని , కోరుకో ని విపత్తు ఆమె పై పడింది. ఎన్నో దురాచారాలు, మూడ విశ్వాసాలు భారతదేశంలో మాసిపోయాయి. లేదా చాలా మార్పులు చెందాయి. కానీ వితంతువుల పరిస్థితిలో పెద్ద మార్పేమీ రాలేదు. పూర్వంలా కాకుండా కొందరు బొట్టు పెట్టుకుంటున్నారు. భర్త అనే వాడు తన జీవితంలోకి రాకమునుపే పుట్టినప్పటి నుంచి తల్లి తనకు చేసిన అలంకరణ, బొట్టు కాటుక పూలు, గాజులు ఎందుకు తీసివేయాలి అని నేటి స్త్రీ  ప్రశ్నిస్తున్నది. తీసి వేయటం లేదు కానీ, సంఘ సామూహిక శుభకార్యాలలో మాత్రం వివక్షత కొనసాగుతూనే ఉంది. ఆమె మనసు ముక్కలు అవుతూనే ఉంది. పుట్టింట అత్యంత అలుసు, చులకనా ఉంది. సంతానహీన అయితే కుటుంబాలలో జీతంలేని చాకిరీకి పనికి వస్తుంది. శుభకార్యా నికి మాత్రం పనికిరాదు. సంతానం ఉన్నా వారికి ఆమె పై ప్రేమ ఉన్నా వియ్యపు రాళ్ళు కు అంత ప్రేమ ఉంటుందా! ఆమె ధనవంతురాలు అయితే అందంగా అలంకరించు కుంటే, ‘తల చెడిన దానికి భోగభాగ్యాలు ఎందుకు’, ‘ఈ అలంకరణ ఎందుకు’ అనే పురుషులు స్త్రీలు ఉన్నారు. ‘పూర్వజన్మ పాప ఫలం’, ‘చేసుకున్న వారికి చేసుకున్నంత’, ‘అనుభవించక తప్పుతుందా’ వంటి మాటలు వింటూ చివరికి ‘నా తలరాత ఇంతే’ అని ఆమె మధన పడే వరకు సుత్తి దెబ్బలు కొట్టటం ఆపకపోవడం శోచనీయం. అందరికీ లోకువై చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తూ బ్రతకడం ఎంత నరకమో ఆమెకు మాత్రమే తెలుసు. వితంతువు, విధవ, అపశకునం అనే పదాలు ఈ సమాజం నుండి పోవాలి. లేదా వీతంతువుకి కొన్ని ప్రత్యేక రాయితీలు విద్యా ఉద్యోగాల వంటి వాటిల్లో ప్రభుత్వం కల్పిం చాలి. నిజానికి తను పూర్వంలాగానే ప్రస్తుతం మనిషే అనీ, భర్త లేకపోవటం అనే ఒక్క విషయం తప్ప, తన మనసులో తన బుద్ధిలో ఏ మార్పు లేదన్న చైతన్యం మొదటఆమెకే కలగాలి. తన వ్యక్తిత్వాన్ని నిలుపుకునేలా సర్వశక్తులను కూడదీసుకొని ప్రయత్నించాలి.
 
          “చెరువు దగ్గరకు తీసుకువెళ్ళే” సంప్రదాయం కొన్ని కులాల్లో ఉన్నా చాలా వరకు తగ్గింది. కానీ ఇంట్లో తంతు మాత్రం జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్న ఆచారం. *పదవరోజు* ఆమెకు చక్కగా అలంకరించి బొట్లు, గాజులు విపరీతంగా పెట్టేసి, తర్వాత ముఖం చూసే తతంగం ఉంది. నోట్లో జీలకర్ర వేసుకొని ఆమెను చూస్తే తమకు వైధవ్యం దోషం రాదట. ‘తమ భార్యలకు వైధవ్యం – అంటే తాము పోతామేమో ‘ అన్న భయం పురుషులకు ఉంటుందట. ఉద్యోగస్తురాలైన స్త్రీ అయితే 11 రోజులు తర్వాత జీవనాధా రమైన ఉద్యోగానికి వెళ్ళక తప్పదు. ఇంట్లో గృహిణిగా ఉండే స్త్రీ సంవత్సరం వరకు బయటకు వెళ్ళరాదట అన్న నిబంధన ఇప్పటికీ ఉంది. పొద్దున్నే ఆమె ముఖం చూడ కూడదు, బయటకు వెళ్ళేటప్పుడు ఆమె ఎదురు రాకూడదు…ఇవేమీ  కల్పనలు కావు. ఒకసారి ఇలాంటి చర్చ ఒక సాహిత్య గ్రూప్ లో జరుగుతున్నప్పుడు “మళ్ళీ పెళ్ళి  చేసు కోవచ్చుగా! ఎవరు వద్దన్నారు” అని సన్నాయి నొక్కులు నొక్కారు కొందరు. చట్టము, సంఘము మళ్ళీ పెళ్ళికి అడ్డు రాకపోవచ్చు కానీ ఆమె మనసుకు ఇష్టం లేదేమో! మనస్పూర్తిగా ప్రేమించిన భర్తను మరిచిపోలేకపోతుందేమో! భయంకరమైన కష్టాలు పెట్టిన ఆ వ్యక్తి వల్ల విసిగిపోయి ఇప్పుడైనా ప్రశాంతంగా చక్కని ఎకాంతాన్ని అనుభవిం చాలని నిర్ణయించుకుందేమో! వ్యక్తిగత విషయాల్లోకి దూరి అనవసరమైన సలహాలు ఇవ్వడం మానలేదు నేటి సమాజంలో కూడా.
 
          ఏ మనిషి జీవితం పూలబాట కాదు. ఎన్నో సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా స్త్రీలకు ఉన్న సమస్యలకు తోడు ‘భర్త మరణించడం’ ఒకటి. కానీ ఇక జీవితమే లేదు అనుకునేలా సమాజం అనేక ఆంక్షలు బలవంతంగా ఆమె పై రుద్దటం భావ్యము కాదు.
 
          ఇంతటి విప్లవాత్మక భావాలతో, విశ్లేషణతో కూడిన, స్త్రీలకు సంబంధించిన ముఖ్యమైన విషాదకరమైన విషయాన్ని కథగా రాసిన ఈ రచయిత్రికి సంబంధించిన సమాచారము ఎంత ప్రయత్నించినా దొరకలేదు.  ఇటువంటి ఆణిముత్యాలు లాంటి కథల రాసిన ఎందరో రచయిత్రులు 1920 నుండి ఉన్నారు. సంఘంలోని మూఢ విశ్వాసాలను ఖండిస్తూ రాసిన కథలు ఎన్నో ఉన్నాయి. ప్రచారం ఇష్టము లేక కావచ్చు లేదా కథా సంపుటాలు ఆ నాడు వెలువరించక పోవటం వలన కావచ్చు వారందరూ మరుగున పడిపోయారు. ఇంకా వివరాలు తెలియని చాలా మంది రచయితలు కథలు నేను పాత పత్రికలు కిన్నెర, ఆనందవాణి, గృహలక్ష్మి, భారతి, ఆంధ్ర పత్రికల నుంచి సేకరించాను. నాటి సాంఘిక పరిస్థితుల్లో స్త్రీల జీవితాలను వర్ణించే కథలు, నాటి పరిస్థితులకు ఎదురొడ్డి ఆత్మవిశ్వాసంతో బ్రతికిన స్త్రీల గురించిన కథలు ఎన్నో ఉన్నాయి.
 
          “ఎవరైనా ఆ రచయిత్రుల వారసులుంటే, లేదా ఎవరికైనా వివరాలు తెలిస్తే నాకు తెలియ పరచవలసినదిగా మనవి. నేను శ్రమపడి సేకరిస్తున్న ఈ కథలను, నా విశ్లేషణా వ్యాసాలను ముద్రించే సమయంలో పుస్తకంలో వారి పేర్లను కూడా కృతజ్ఞతా
పూర్వకంగా చేరుస్తానని మనవి.”

*****

వచ్చే నెల మరో ఆ’పాత’ కథామృతంతో కలుద్దాం

Please follow and like us:

2 thoughts on “కథామధురం-ఆ‘పాత’కథామృతం-14 భాస్కరమ్మ”

  1. గుండె బరువెక్కింది.ఇంట్లో కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఇద్దరినీ అలా చూసినందువలన , వారి గురించిన ఆలోచనలలోనుండి బయటకు రావడం కష్టమయింది. సుశీల గారి విశ్లేషణ బాగుంది. ఇప్పటికీ మారని నమ్మకాలు? జీలకర్ర కు , ముఖం చూడడానికి సంబంధం ఏమిటో ?

  2. కథను గూర్చిన కథనం చాలా బాగుంది
    కథ కూడా బాగుంది

Leave a Reply

Your email address will not be published.