కనక నారాయణీయం -54

పుట్టపర్తి నాగపద్మిని

          ‘జీవితంలో సందర్భమేదైనా అన్నిటికీ తులసీ రామాయణంలోని ఘట్టాలను పాడుకుంటారు వాళ్ళు. మనసారా ఆయనను స్మరించుకోవడం వాళ్ళలోని గొప్ప గుణం రా!! నాకప్పుడే అనిపించింది, రాస్తే గీస్తే ఇటు వంటి రామయణం రాయాలబ్బా అని. నాకెదో పద్ధతిగా బాలకాణ్డే వ్రాయాలన్న నియమమెమీ లేదప్పా!! ముందు కిష్కింధ వ్రాసు కున్నా! అందులోని ఘట్టాలు నన్నావైపు ఆకర్షించినాయి. ఇదుగో ఇప్పుడు, బాలకాండ వ్రాస్తున్నా. అందులోని ఒక ఘట్టమే నువ్వు విన్నది.’ 

          వెంకటసుబ్బయ్య – ఔనా స్వామీ!! ఐతే మీరు ఆవిష్కరంచబోతున్న యీ గేయ రామాయణంలో ఎటువంటి కొత్త కల్పనలు ఉండబోతున్నాయి?

          ఇంతకు ముందు విన్న దానిలో గిరాందేవి అని అన్నారు? నాకర్థం కాలేదు. ఆమె ఎవరు?

          పుట్టపర్తి అన్నారు. ‘నువ్వేమి చదువుదామనుకుంటున్నావ్రా?’

          ఒక్క క్షణం వెంకటసుబ్బయ్యకు అర్థం కాలేదు. తాను అడిగిన ప్రశ్నకు మళ్ళీ ప్రశ్నే సమాధానంగా వచ్చిందే అని తికమక పడ్డాడు. ఐనా పెద్దవారి ముందు, అధిక ప్రసంగం కూడదు అని నాన్న ఎప్పుడూ ఇంట్లో అంటూనే ఉంటారు. పైగా సాక్షాత్ సరస్వతీ పుత్రునిగా, శివతాండవ కర్తగా జేజేలందుకుంటున్న పుట్టపర్తి వారి ముందు తానొక మెట్టు కిందే ఉండాలి కదా’ అందుకే తేరుకుని అన్నాడు.

          ‘మా తండ్రిగారు సంప్రదాయవాదులు. నాకూ సంస్కృత  తెలుగు సాహిత్యాలంటే పిచ్చే. ఐనా ఇంగ్లీష్ లెక్చరర్ గా ఉద్యోగం చేయాలని ఎందుకో కోరిక. ఇంట్లో మా తండ్రిగారి వల్ల ఎటూ యీ రెండింటి సాన్నిహిత్యం నాకు అబ్బుతుంది. వాటికి ఇంగ్లిష్ కూడా తోడైతే, నా దృష్టి ఇంకా విస్తరిస్తుందని….! ‘

          పుట్టపర్తి కళ్ళల్లో మెచ్చుకోలు, ‘సరే, బాగానే ఉంది. కానీ ఇప్పుడు తెలుగు సాహిత్యం రుచి తెలుస్తూంది కాబట్టి, తీరిక వేళల్లో, తెలుగు పదకోశం తిరగేస్తూ ఉండవలె! మా రోజుల్లో తిరగేయటం పదమే ఉండేది కాదు. ఏదైనా గ్రంథం కనిపించిందంటే దాన్ని నమిలి బుర్రలో పెట్టేసుకోవాలంతే! మీ కాలానికాపని సాధ్యమయ్యే సంగతి కాదు. అందుకే అప్పుడప్పుడు, దృష్టి పదకోశాల మీదికి మళ్ళిస్తూ ఉంటె, అవి నేరుగా బుర్రలో నిక్షిప్తమై పోతాయి.

          ఇంక నేనిప్పుడు చదువుతుండిన ఘట్టం, గిరాందేవి, సరస్వతీదేవి, వాల్మీకి మేధస్సులో ప్రవేశిస్తున్న ఘట్టం. ఇది నా కల్పన. నారదుడు ధైర్యం చెప్పిన తరువాత, వాల్మీకి మనసులో సందేహాలు తలెత్తాయి. ఇంతకు ముందు ఎటువంటి సాహితీ గంధమూ అంటని తనకు యీ పని సాధ్యమేనా? అని!

          అతని సందేహనివృత్తి చేస్తూ గిరాందేవి అతన్ని కరుణించి, ఇలా దిగివచ్చి, అతని హృదిలో కొలువై, ముందుకు నడిపిందని నా ఊహ.’

          వెంకటసుబ్బయ్య కళ్ళలోనూ మెరుపు. అంత పెద్ద వారు, తన నిర్ణయాన్ని కూడ ప్రోత్సహిస్తూ, తమ వేళల్లో చదువుకునే పద్ధతిని చెబుతూనే, యీ కాలానికి అనువైన సూచననూ ఇచ్చి, ఆప్యాయతను పంచినందుకు భలే సంతోషం వేసింది. పైగా వీడెవడో పిల్లవాడు? వీడికి నేను చెప్పడమేమిటి? అన్న అహంభావం లేకుండా, గిరాందేవి ఆగమ నాన్ని కూడా తాను చిత్రీకరించిన పద్ధతి విడమరచి చెప్పటం ఇంకా నచ్చింది. కానీ వెంటనే స్వామి కాలి దెబ్బ విషయం గుర్తుకు వచ్చింది.  ‘మరి, మీకు ఆ మధ్య కాలికి దెబ్బ తగిలింది కదా? ఇప్పుడు తగ్గిందా నొప్పి స్వామీ?’

          పుట్టపర్తి భళ్ళున నవ్వేశారు. ‘ఎప్పుడో మానిందిరా. ఐనా ఇంకా అదే ఆలోచిస్తూ కూర్చుంటే బండి ముందుకు నడిచేదెట్లా? ఇంతకూ, ఇక్కడి కెందుకొచ్చినట్టు నువ్వు?’

          వెంకటసుబ్బయ్య అన్నాడు, ‘మా బంధువుల ఇంట్లో పెళ్ళి స్వామీ. మా తల్లి దండ్రులకు తోడుగా రావటం ఒక కారణం. మిమ్మల్నీ దర్శించుకోవచ్చన్నది రెండవ కారణం.’

          పుట్టపర్తి అన్నారు. ‘చాలా మంచి పనిచేసినావురా! మీ తండ్రిగారికి తోడు రావటం, నన్ను చూడటానికి రావటం, రెండూ బాగున్నాయి. పెళ్ళి బాగా జరిగిందా?

          వెంకటసుబ్బయ్య అన్నాడు, ‘బాగా జరిగింది స్వామీ. ఈ రోజు తెల్లవారు ఝామునే! మా అమ్మా నాన్నా పడుకుంటామన్నారు కాసేపు! సాయంత్రం బస్సుకు మళ్ళీ ఊరికి ప్రయాణం. ఈ లోగా నేనిట్లా వచ్చాను.’

          పుట్టపర్తి అన్నారు. ‘నిన్న మొన్న మా ఇంట్లో రెండు పెళ్ళిళ్ళయ్యాయి. నా కళ్ళ ముందు, సీతా రామ కళ్యాణ ఘట్టమే మనసులో మెదులుతూ ఉంది.

          జనప్రియంగా ఆ ఘట్టాన్ని నడపాలని నాకనిపిస్తూ ఉంది. పైగా నా బిడ్డల  అప్పగింతలప్పుడు నాకు జనకుని వేదన వంటి వేదనే నిండింది. రాజర్షిగా స్థితప్రజ్ఞతతో పరిపాలన సాగిస్తున్న జనకుడంతటి వానికే యీ బాధ తప్పలేదు. నేనెంత? అక్కడ ఒక్కసారి నలుగురు ఆడబిడ్డల పెళ్ళిళ్ళు, అందరి అప్పగింతలూ, ప్రతి తల్లిదండ్రుల వలెనే ఆ దంపతుల మనసుల్లోనూ పరాయి ఇంటికి తమ కనుపాపలను, పంపే బాధ సహజ సుందరం.

          శాకుంతలంలో కణ్వ మహర్షి విలవిలలాడి పోతాడు, పెంచుకున్న శకుంతలను అత్తవారింటికి పంపే సందర్భంలో! ఒరే, అదుగో, ఆ బీరువాలో, రెండవ అరలో, పచ్చ అట్టల పుస్తకం ఉంది తీసుకురా!’

          వెంకటసుబ్బయ్య, వెంటనే లేచి ఆ బుక్కుచూస్తూ, దొరికినా దొరకనట్టే ఒకసారి యధాలాపంగా లోపల తిరగేశాడు. దాదాపు అన్ని పుటల్లోనూ, చిన్న చిన్న అక్షరాళ్ళో ఏవేవో వ్రాసుకున్నట్టు గమనించాడు. మళ్ళి బుద్ధిగా మడిచి, పుట్టపర్తివారికి అందించాడు బుక్కును! 

          పుట్టపర్తి పుస్తకం పుటలు గబగబా తిప్పి గంభీరంగా శ్లోకాలను పఠించే సంప్రదాయ శైలిలో అందుకున్నారు.      

          యాశ్యద్యద్య  శకుంతలేతి హృదయం సంస్పృష్టముత్కంఠయా

          కంఠస్థంభిత బాష్పవృత్తి కలుషం, చింతా జడం దర్శనం,

          వైక్లబ్యం మమ తావదీదృశమహో స్నేహాదరణ్యౌకస:

          పీడ్యంతే గృహిణ: కథం ను తనయావిశ్లేషదు:ఖైర్నవై:’

          వెంకటసుబ్బయ్య శ్రద్ధగా విన్నాడు. కానీ అర్థం కాలేదు. ఆతని ముఖాన్ని చూస్తూ పుట్టపర్తే అందుకున్నారు.’ ఈ శ్లోకంలో ఏమంటున్నాడు కణ్వుని ద్వారా కాళీదాసు అంటే,

          ‘ ఇప్పుడు శకుంతల నా ఆశ్రమం నుండి సాగిపోతున్నది. ఆ మాట తలచుకున్నం త మాత్రం చేతనే నా హృదయం విలవిలలాడిపోతున్నది. కంఠం మాట పెగలక  పూడు కున్నది. కన్నీరు దృష్టిని కమ్మేసింది. ముందేమీ కనిపించటం లేదు.అరణ్యవాసులమూ, మునులమూ ఐన మా పరిస్థితే యీ విధంగా ఉంటే, ఇక కుమార్తెలను అత్తింటికి పంపే సమయంలో కన్నవారి మనసులు ఇంకెంతగా క్షోభిస్తాయో చెప్పగలమా?’ అని !’

          వెంకట సుబ్బయ్యకు యీ సందర్భమూ, యీ శ్లోకమూ, యీ వివరణా, అన్నీ ఎంతో అద్భుతంగా అనిపిస్తున్నాయి. పుట్టపర్తి వైపు ఆరాధనతో చూస్తున్నాడు.

          మళ్ళీ పుట్టపర్తి పుస్తకం మూసేసి, అన్నారు, ఇటువంటి ఆలోచనలు, సందర్భాలూ, యే కవి హృదయాన్నైనా కుదిపివేస్తాయిరా! వాటి ప్రభావంతో మరో చోట, మరో కవి హృదయ కేదారంలో కొత్త సృజనల విత్తులు జీవం పోసుకుంటాయి. కాకపోతే, కవుల జీవితాలు, యీ సమాజంలోని పద్ధతులకు భిన్నంగా ఉంటాయి. నా సంగతే చూడు, నా లోకమంతా ఇదిగో, యీ పుస్తకాల చుట్టూ అల్లుకుపోయి ఉంది. ఐతే, నాకు అంది వచ్చ్చిన అదృష్టాలు,

          నా శ్రీమతి కనకమ్మ, నా శిష్యులు సుబ్రమణ్యం, సుబ్బయ్య, గోవింద రెడ్డి, బాబయ్య ఇంక కొందరు. ఒక్కొక్కప్పు డనుకుంటాను, అన్ని బాధ్యతలూ ఎక్కువగా కనకవల్లి మీదే వదిలి నేను నిశ్చింతగా యీ విధంగా సాహితీలోకానికే అంకితమైపోవటం, సమంజసమా? అని! కానీ ఆమె అన్నీ ధైర్యంగా చేయగల్గిన సమర్థురాలు, ఆమె నమ్ముకున్న రాముడి పరివారమే ఆమెకన్ని పనులూ సానుకూలం చేస్తుంది. గతంలో నేను తీసుకున్న కొన్ని నిర్ణయాల కారణంగా మాకు కష్టకాలమెదురైనా, ఎంతో స్థితప్రజ్ఞతతో సరిదిద్దింది. ఇది చెప్పడానికి నేనేమీ సిగ్గుపడటం లేదురా! ఇది ఎన్నోసార్లు నాకు అనుభవంలోకి వచ్చిన విషయం. ఇంక, నా శిష్య సంపద నా పట్ల మాతృమూర్తిగా ఆమె పట్ల కూడా, సమానమైన  భక్తి శ్రద్ధలున్నవారు. వాళ్ళకు నేనిచ్చింది చాలా తక్కువే ఐనా వాళ్ళ మనసుల్లో నాకిం తటి స్థానముండడం, నన్నే ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ఇవి యీ జన్మ బంధాలు కావు.

          జననాంతర సౌహృదాలు. అంతే! ఇప్పుడు నీకివన్నీ చెప్పాలనిపించటం కూడా అటువంటిదే!’ 

          పుట్టపర్తి మాటలకు వెంకటసుబ్బయ్య మనసు కూడా ఆర్ద్రమైపోయింది. తెలియ కుండానే, కళ్ళు నిండుకున్నాయి.

          ఇంతలో కింద నుండి నాగపద్మిని వచ్చి, అయ్యా, మిమ్మల్ని స్కూల్ కు రమ్మంటు న్నారంట! ఎవరో వచ్చినారని చెప్పమనిందమ్మ! ‘అని చెప్పింది.

          పుట్టపర్తి , ‘ఆ అవును, మర్చేపోయినాను. పదరా నాయనా! స్కూల్ లో  ఏ పని పడిందో నాతో! పోవాలప్పా!’ అంటూ లేచారు.

          వెంకటసుబ్బయ్య కూడా లేచి స్వామి పాదాలకు నమస్కరించి, బయలుదేరాడు.

 ***** 

  (సశేషం) 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.