పౌరాణిక గాథలు -15

-భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి

కోపాగ్ని – ఔర్వుడు కథ

          ప్రపంచంలో గొప్పవాడుగా ప్రసిద్ధిపొందిన పరాశరుడు వసిష్ఠ మహర్షికి మనుమడు. వసిష్ఠుడు అతణ్ని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు.

          అంతకంటే ఎక్కువ ప్రేమగా చూసుకుంటోంది అతడి తల్లి దృశ్యంతి. వాళ్ళిద్దరి ప్రేమతో సకల విద్యలు నేర్చుకుంటూ పెరుగుతున్నాడు పరాశరుడు.

          ఒకరోజు పరాశరుడు తల్లి దగ్గరకి వచ్చి “అమ్మా! నా తండ్రి ఎవరు?ఎక్కడున్నాడు?” అని అడిగాడు.

          దృశ్యంతి కళ్ళనీళ్ళు కారుస్తూ ఏడుస్తోంది కాని తండ్రి గురించి చెప్పలేదు. తల్లి బాధని చూసి తన తండ్రి మరణించాడని అర్ధం చేసుకున్నాడు పరాశరుడు.

          “అమ్మా! బాధపడకు. నా తండ్రి ఎక్కడున్నాడో చెప్పు. నా తండ్రికి కీడు చేసి, నీకు ఇంత దుఃఖాన్ని కలిగించిన వాడు ఎవరైనా సరే వాణ్ని శిక్షించి నీకు కలిగిన బాధని కొంతైనా తగ్గిస్తాను” అన్నాడు.

          పరాశరుడి తల్లి  “నాయనా! నీ తండ్రిని ఒక రాక్షసుడు చంపేశాడు” అని జరిగిన దంతా వివరించింది.

          గర్భంలో ఉండగానే సకల వేదాలు నేర్చుకున్న పరాశరుడు కోపంతో మండి పడుతూ తన తపోబలంతో అన్ని లోకాల్ని నాశనం చేస్తానంటూ కమండలాన్ని చేతిలోకి తీసుకున్నాడు.

          అది చూసిన వసిష్ఠ మహర్షి వెంటనే వచ్చి మనుమణ్ని ఆపాడు. “పరాశరా! నీ కోపం తగ్గించుకో. నీకు ఒక కథ చెప్తాను విను! తరువాత కోపం వల్ల ఎంత నష్టం జరుగుతుందో తెలుసుకో.

***

          పూర్వం కృతవీర్యుడు అనే రాజు ఉండేవాడు. అతడు భృగువంశంలో జన్మించిన బ్రాహ్మణుల్ని గురువులుగా చేసుకుని అనేక యజ్ఞాలు చేసి వాళ్ళకి దక్షిణలు ఎక్కువగా ఇచ్చి గౌరవించాడు.

          కొంత కాలం తరువాత రాజు కృతవీర్యుడు మరణించాడు. అతడి వంశంలో ఉన్న రాజులందరు ధనం మీద ఆశ కలవాళ్ళే. కృతవీర్యుడు చచ్చిపోగానే భృగువంశంలో ఉన్న బ్రాహ్మణుల దగ్గర ఉన్న ధనాన్ని తీసేసుకోవాలని రాజులందరూ కలిసి కూడబలు క్కున్నారు.

          వెంటనే బ్రాహ్మణులందర్నీ కలుసుకుని “రాజు కృతవీర్యుణ్ని మోసం చేసి మీరు సంపాదించిన మొత్తం ధనాన్ని మాకు తిరిగి ఇచ్చెయ్యండి” అని గట్టిగా చెప్పారు.

          రాజశాసనానికి భయపడి భృగువంశంలో ఉన్న బ్రాహ్మణులు తమ దగ్గర ఉన్న ధనం, బంగారం, వస్తువులు, వాహనాలు అన్నీ తీసుకొచ్చి రాజులకి ఇచ్చేశారు. కొంత మంది తమ ధనాన్ని భూమిలో పాతిపెట్టి రాజులకి ఇవ్వకుండా ఊరుకున్నారు.

          రాజులు వాళ్ళని వదిలి పెట్టలేదు. ఇళ్ళన్నీ తవ్వి ధనాన్ని బయటికి తీసుకొచ్చారు. వాళ్ళ కోపం ఇంకా పెరిగింది. భృగువంశ బ్రాహ్మణులు రాజధనాన్ని తీసుకుని తిరిగి ఇవ్వకుండా మోసగించారు. కనుక, వాళ్ళందర్నీ చంపెయ్యాలని తీర్మానించుకున్నారు.

          సైన్యాన్ని పిలిపించి “భృగువంశ బ్రాహ్మణుల్లో ఒక్కళ్ళు కూడా మిగలకూడదు, తల్లుల గర్భంలో ఉన్న శిశువుల్ని కూడా గర్భంలోనే చంపెయ్యండి” అని చెప్పి పంపించారు.

          వాళ్ళు గర్భవతులైన స్త్రీలని వేటాడి వేటాడి చంపుతున్నారు. భర్తల్ని పోగొట్టుకుని, కడుపులో ఉన్న పిల్లల్ని కూడా పోగొట్టుకుంటామేమో అని భయపడిన భార్గవుల (భృగువంశ బ్రాహ్మణుల) భార్యలు హిమాలయాలకి పారిపోయారు.

          పారిపోయిన వాళ్ళల్లో ఒక భార్గవి భయంతో గర్భంలో ఉన్న పిండాన్ని, ఊరు (తొడ) ప్రదేశంలో దాచుకుంది. పారిపోయిన భార్గవుల భార్యల్ని వెతుక్కుంటూ క్షత్రియులు కూడా హిమాలయాలకి చేరుకున్నారు.

          వాళ్ళు వచ్చే సమయానికి ఆమె ఒక మగ శిశువుని ప్రసవించింది. ఆ బాలుడు ప్రళయకాలంలో ఉగ్రమూర్తిలా ప్రజ్వరిల్లుతూన్న సూర్యుడి యొక్క తేజస్సులా గొప్ప ప్రకాశంతో ఉన్నాడు.

          అక్కడికి వచ్చిన క్షత్రియులు అప్పుడే పుట్టిన బాలుడు ఔర్వుణ్ని (ఊరు ప్రదేశం నుంచి పుట్టినవాడు) చూశారు. అతడి నుంచి వస్తున్న మహా తేజస్సుని చూడలేక వాళ్ళు  గుడ్డివాళ్లై పోయారు.

          ఆ బాలుణ్ని ఏమీ చెయ్యలేక, తిరిగి వెనక్కి వెళ్ళలేక ఆ పర్వతాల్లోనే తిరుగుతూ అక్కడే ఉండిపోయారు. తిరుగుతూ తిరుగుతూ భృగుపత్ని దగ్గరకు వచ్చి “అమ్మా! మమ్మల్ని క్షమించి మాకు చూపుని ప్రసాదించు!” అని ప్రార్థించారు.  

          వాళ్ళ ప్రార్థన విని భృగుపత్ని “అయ్యా! మీ చూపు పోవడానికి కారణం నేను కాదు. నన్ను ప్రార్థించి ప్రయోజనం కూడా లేదు. అందుకు కారణం ఈ పసివాడు.

          తన గురువులు మీ వల్ల మరణించారని తెలిసి కోపాగ్నితో సూర్యుడిలా ప్రజ్వరిల్లు తున్న ఈ పసివాడి కోపం వల్ల మీకు చూపు పోయింది. ఈ బాలుడు వంద సంవత్సరాలు నా గర్భంలోనే ఉండి వేద వేదాంగాలన్నీ నేర్చుకున్నాడు. తపస్సు చేసి గొప్ప శక్తిని సంపాదించాడు.

          మీరందరు క్షేమంగా ఉండాలని కోరుకుని మాత్రమే బ్రాహ్మణులు కృతవీర్య మహారాజు చేసిన దానం తీసుకున్నారు. ఆ బ్రాహ్మణుల్నే మీరు అజ్ఞానంతో అన్యాయంగా హింసించారు.

          అందులో ఈ పసివాడి తండ్రులు, బంధువులు, గురువులు ఎంతోమంది ఉన్నారు. తను భూమి మీద పడేటప్పటికే వాళ్ళు మరణించడంతో వాళ్ళందరి ఆశీస్సులు తీసుకో లేక పోయానన్న బాధని తట్టుకోలేక పోయాడు.

          అయినా అతడు మిమ్మల్ని శపించలేదు. అతడిలో ఉన్న జ్ఞాన ప్రకాశాన్ని చూసి తట్టుకోలేక మీరే గుడ్డివాళ్ళయ్యారు. అప్పుడు కళ్ళు ఉండీ అజ్ఞానంతో గుడ్డివాళ్ళు. ఇప్పుడు కళ్ళు ఉండీ అవి కనపడక గుడ్డివాళ్ళు. కనుక, ఎటువంటి గుడ్డితనమూ లేకుండా జ్ఞానవంతులుగా బ్రతకాలని ఈ పసివాణ్ని ప్రార్ధించండి!” అంది.

          ఆమె చెప్పినట్టే క్షత్రియులు ఆ బాలుణ్ని ప్రార్థించారు. చేసిన తప్పుకి క్షమాపణ చెప్పుకుని పసివాడికి నమస్కరించి అతడి దయవల్ల గుడ్డితనం పోగొట్టుకుని తమ ప్రదేశాలకి వెళ్ళిపోయారు.

          ఔర్వుడు రాజుల్ని క్షమించాడు కాని మనస్సులో ఉన్న బాధని మర్చిపోలేక పోయాడు. గురువుల్ని, తండ్రుల్ని, బంధువుల్ని అందర్నీ పోగొట్టుకుని తను ఒంటరి వాడుగా మిగిలిపోయాడు.

          అతడి కోపం చల్లారలేదు. లోకాలన్నీ సర్వనాశనం చెయ్యాలనుకున్నాడు. ఘోరమైన తపస్సు చెయ్యడం ప్రారంభించాడు. అతడి తపస్సుకి లోకాలన్నీ వణికి పోతున్నాయి.

          పితృదేవతలు భూలోకంలో తపస్సు చేస్తున్న ఔర్వుడి దగ్గరకి వచ్చారు. అతడికి అనునయించి చెప్తూ “నాయనా! నువ్వు మన వంశం గర్వపడేలా అమోఘమైన తపస్సు చేస్తున్నావు. అది చాలా గర్వించ తగ్గ విషయం.

          కాని, నువ్వు కోపంతో తపస్సు చేస్తున్నావు. అందువల్ల నువ్వు చేస్తున్న తపస్సు తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ తీవ్రతకి లోకాలన్నీ భయపడుతున్నాయి.

          తపస్సు చేసేవాడు అందరి క్షేమాన్ని కోరాలి, నాశనాన్ని కాదు. లోకాల్లో ఉండే ప్రజలందరూ రక్షింపబడాలి. లేకపోతే ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న బాధే అందరూ అనుభవిస్తారు.

          ప్రజలు అందరూ బాధ పడాలని అనుకోవడం తప్పు. ముందు నువ్వు కోపాన్ని వదిలి పెట్టి మేము చెప్పింది విని అర్థం చేసుకో.

          మేము క్షత్రియుల చేతిలో మరణించేంత అసమర్థులం కాదు. ఎక్కువ కాలం తపస్సులో గడపడం వల్ల మాకు ఆయుష్షు బాగా పెరిగిపోయింది. ఇక్కడ ఉండాలనే కోరిక లేక మేమే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలని అనుకున్నాం.

          ఆత్మహత్య చేసుకుంటే మహాపాపం కలుగుతుంది. అందుకని మాకు మేముగా క్షత్రియులతో శత్రుత్వాన్ని పెంచుకున్నాం. మా శరీరాలు విడిచి పెట్టడానికి క్షత్రియులు కారణంగా కనిపిస్తున్నారు. కాని, అది నిజం కాదు. ఇదంతా మా ఇష్ట ప్రకారమే జరిగింది” అని చెప్పారు.

          ఔర్వుడు పితృదేవతల మాటలు విని కొంత వరకు శాంతించాడు. కోపం పూర్తిగా తగ్గక పోయినా వాళ్ళే స్వయంగా వచ్చి చెప్పారు కనుక అప్పటికి తపస్సు చెయ్యడం ఆపాడు.

          పితృదేవతలకి రెండు చేతులూ జోడించి నమస్కారం చేసి  “మహానుభావులారా! మీరందరు కనిపించకుండా వెళ్ళిపోవడం వల్ల మీకు అపకారం జరిగిందని అను కున్నాను. అందుకే కోపంతో లోకాలన్నింటినీ నాశనం చేస్తానని ప్రతిజ్ఞ చేశాను.

          నాకు ఏదో కీడు జరిగింది కనుక, అదే కీడు అన్ని లోకాలకి జరగాలని అనుకోవడం అవివేకమే! నేను చేస్తున్న పని మంచిది కాదని అర్థం చేసుకున్నాను. మీరు చెప్పినట్టే నా కోపాన్ని విడిచిపెట్టేస్తాను.

          కాని నా కోపం అగ్నితో సమానమైంది. ఈ కోపాగ్నిని విడిచి పెట్టడం అంత తేలిక కాదు. నా కోపం వల్ల వచ్చిన అగ్నికి చాలా శక్తి ఉంది. అది ఎవర్నీ బాధించకుండా ఉండా లంటే ఇప్పుడు నేను దీన్ని ఏ ప్రదేశంలో వదిలి పెట్టాలో చెప్పండి?” అని అడిగాడు.

          ఔర్వుడు చెప్పింది విని పితృదేవతలు “కుమారా! అన్ని లోకాల్లోను నీరు ఉంటుంది కనుక నీ కోపాగ్నిని సముద్ర మధ్యంలో విడిచి పెట్టు. అది సముద్రంలో ఉండే నీటిని దహిస్తుంది. దీనివల్ల నీ ప్రతిజ్ఞ కూడా నెరవేరుతుంది” అని చెప్పారు.

          పితృదేవతలు చెప్పినట్టు ఔర్వుడు తన కోపాగ్నిని సముద్రంలో వదిలేశాడు. దాన్ని ‘కౌర్వానలం’ అంటారు.

          పరాశరా! ఇప్పుడు నేను నీ తాతని చెప్తున్నాను కనుక ఔర్వుడి కంటే ప్రశాంతంగా ఆలోచించి నీ కోపాన్ని తగ్గించుకో. తపస్సంపన్నులమైన మనం ప్రజలు సుఖంగా ఉండాలని కోరుకోవాలి.

          ఎవరి ధర్మం వాళ్ళు సక్రమంగా పాటిస్తేనే అందరూ సుఖంగా ఉంటారు” అని వసిష్ఠ మహర్షి తన మనుమడు పరాశరుడుకి  చెప్పాడు.

          తాత అయిన వసిష్ఠుడి మాటల్ని గౌరవించి తన కోపాన్ని వదిలి పరాశరుడు ప్రశాంతంగా ఉన్నాడు.

మనిషి కోపం తనతో పాటు సమాజాన్ని కూడా దహించేస్తుంది!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.