ఎర్రెర్రని పుచ్చకాయ

-కందేపి రాణి ప్రసాద్

          వేసవి కాలం ఎండ దంచి కొడుతోంది. అడవిలో జంతువులన్నీ ఎండకు మాడి పోతున్నాయి. అడవిలోని చెరువుల్లో నీళ్ళు తగ్గిపోతున్నాయి. కొన్ని చెరువులు కుంటలు పూర్తిగా ఎండి పోయాయి. గొంతు తడుపుకోవాలన్నా చాలా దూరం పోవాల్సి వస్తోంది.
నీళ్ళకే కాదు నీడకు అల్లాడుతున్నాయి. మానవులు చెట్లు కొట్టేయడం వల్ల గూడుకూ స్థానం లేక బాధ పడుతున్నాయి. ఆకాశంలో ఎగిరే పక్షులు ఒక్క నిమిషం వాలదామన్నా చెట్టు లేదు. అలసి అలసి విశ్రాంతి లేక ప్రాణాలు వదులుతున్నాయి.
 
          చెట్టు మీదున్న కోతులు ఆకలితో నకనకలాడుతున్నవి. అడవిలో చెట్లు లేక, ఉన్న చెట్లకు పండ్లు లేక కోతులన్నీ ఉపవాసంతోనే ఉంటున్నాయి. ఆకలికి తాళలేకకోతులన్నీ దగ్గరలో గ్రామాల మీద పడుతున్నాయి. పోలాల్లోని కాయలు, పండ్లు తింటూ కాలం గడుపుతున్నాయి. ఒకటీ అరాతోనే సరిపెట్టుకుంటున్నాయి. 
 
          రోజులాగే పొలాల్లో వెతికింది ఒక కోతి. ఏమీ కనిపించక ఇళ్ళ దగ్గరకు వెళ్ళింది. ఎండలకు భయపడి మనుష్యులు తలుపులు పెట్టుకుని లోపలే ఉంటున్నారు. చల్లగా కూలర్లో, ఎసి లో వేసుకుని పడుకుంటున్నారు.
 
          కోతి ఆకలితో ఇల్లిల్లూ వెతకసాగింది. ఏమీ దొరకడం లేదు. తిరుగుతూ తిరుగుతూ మెయిన్ రోడ్డుకు వెళ్ళింది. అదొక నాలుగు రోడ్ల కూడలి. కోతి నిలబడి చుట్టూ చూపు సారించింది. రోడ్డుకు ఒక పక్కన పుచ్చకాయల ముక్కలు అమ్ముతున్నారు. పుచ్చకాయ ను ముక్కలుగా కోసి ప్లేట్లలో పెట్టి అమ్ముతున్నారు. ఎర్రగా కనిపిస్తున్న ముక్కల్ని చూడగానే కోతికి ప్రాణం లేచి వచ్చింది. తినాలనిపించింది. ఇద్దరు ఆ బండి దగ్గరే నిలబడి తింటున్నారు. ఎలా ముక్కలు తెచ్చుకోవడం అని ఆలోచిస్తున్నది. బండి దగ్గర ఉన్న వాళ్ళు వెళ్ళిపోయారు. అమ్మే అతను వెనక్కు తిరిగి రాసి పోసిన కాయల్లో నుంచి కాయలు ఏరుతున్నాడు. ఇదే అదునుగా భావించి కోతి అక్కడకు వెళ్ళింది. సగానికి కోసి పెట్టిన పుచ్చకాయలు ఎర్రని ఎరుపుతో నోరూరించేస్తున్నాయి.
 
          కోతి ఒక అర చెక్కను చేత బుచ్చుకుని పరిగెత్తింది. బండివాడు వెంబడించాడు. కానీ దొరక్కుండా చెట్టెక్కి కూర్చుంది. బండివాడు నిరాశగా వెళ్ళిపోయాడు. కోతి హమ్మయ్య అనుకుని చెట్టు మీద స్థిరంగా కూర్చుని తినడం మొదలు పెట్టింది. బాగా పండిందేమో ఎర్రగా ఉన్నది. నోట్లో పెట్టుకుంటే చల్లగా తియ్యగా ఉన్నది. కొద్ది కొద్దిగా తింటూ తియ్యదనాన్ని ఆస్వాదిస్తున్నది. మెల్లమెల్లగా తెచ్చుకున్న అరచేక్కంతా తినేసింది. కడుపు నిండిందని అడవిలోకి వెళ్ళిపోయింది.
 
          సాయంత్రానికి కోతి మెలికలు తిరుగుతూ కింద బడి దొర్లసాగింది. అమ్మో నొప్పి! అయ్యో నొప్పి అంటూ కేకలు పెట్టసాగింది. గబగబా తోటి కోతులు దాన్ని ఆసుపత్రికి తిసుకేళ్ళాయి. ఎలుగు బండి వైద్యుడు కోతిని పరీక్ష చేశాడు.
 
          “ఇది ఏమో విషాహారం తిన్నది. అందుకే లోపల అంతా బాక్టీరియా చేరింది. సాల్మో నెల్లా బాక్టీరియా పొట్టలో చేరటం వల్ల కడుపు నొప్పి వస్తున్నది. ఇంకాసేపటికి వాంతులు, విరేచనాలు కూడా అవుతాయి” అని చెప్పి అందరి వంకా చూశాడు వైద్యుడు.
 
          ఏం తిన్నావు మిత్రమా ! అడవిలో విషాహారం ఏమిటి కొత్తగా ? అని ఆశ్యర్యపోతూ అడిగాయి కోతులు.
 
          అడవిలో ఏమీ తినలేదు. అడవి పక్కనున్న ఊర్లో పుచ్చకాయ తిన్నాను. అంతే ఇంకేమి తినలేదు “నీరసంగా కళ్ళు మూసుకుపోతూ చెప్పింది కోతి.
 
          వెంటనే ఎలుగు బంటి అన్నది. ఈ మధ్య మనుష్యులు రసాయనాలు కలుపు తున్నారు. బాగా పండని కాయలకు ఎర్రని ద్రవం ఎక్కించి చూడటానికి నోరూరేలా చేస్తారు. ఆ రసాయనాలు ప్రమాదాన్ని కలుగజేస్తాయి. మనుష్యులందరూ జబ్బుపడి ఆసుపత్రులలో చేరుతున్నారు. బహుశా మన కోతి కూడా అలాంటి కాయ తిన్నదేమో”.
మిగతా కోతులన్నీ ఆశర్యపోయాయి.
 
          “మనం జంతువులం కాబట్టి ఏమీ తెలీదు. వాళ్ళకు అన్నీ తెలిసి కూడా మోసం చేయటం తప్పు కదా ! ఇదేం పాడుబుద్ధి” అంటూ అసహ్యంగా మొహం పెట్టాయి.
 
          ఎలుగు బంటి అన్నది “మనమే నీతి నిజాయితీలతో బతుకుతున్నాం. మనుష్యులు చెడ్డవారు. పక్క దారిని డబ్బు కోసం మోసం చేస్తారు. వారి చెడుబుద్ధి మనకు వద్దు. అడవి లో ఆహారం దొరక్కపోవడానికి కారణం వాళ్ళే. ఎప్పుడూ ఊళ్ళ వైపు వెళ్ళకండి”.
 
          “కోతికి సెలైను పెట్టి ఇంజక్షన్ ఇచ్చింది. సాయంత్రానికి తగ్గిపోతుందిలే వాంతులు కానీ విరేచనాలు కానీ అయితే నాకు చెప్పండి.. ఆకులు, కాయలు కూడా విషపూరితంగా ఉంటున్నాయి. జాగ్రత్తగా చూసుకుని తినండి”. అని చెప్పి ఎలుగు బంటి వెళ్ళిపోయింది.
 
          కోతులు అన్నీ దానికి సపర్యలు చేశాయి వాంతులు విరేచనాలు ఏమీ కాలేదు.. సాయంత్రానికి దానికి కడుపు నొప్పి తగ్గింది. అన్నీ కలిసి ఇంటికి వెళ్ళిపోయాయి. ఇంకెప్పుడూ ఊర్లోని తిండి తినకూడదు అని నిర్ణయించు కున్నాయి. 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.