మిట్ట మధ్యాహ్నపు మరణం- 30

– గౌరీ కృపానందన్

          “అందరూవచ్చేసారా?’ అడిగారు డి.సి.

          “ఉదయకుమార్ రావాలి, తరువాత రామకృష్ణ , దివ్య రావాలి” అన్నారు మాధవ రావు.

          “రాకేష్?”

          “అప్పుడే తీసుకు వచ్చేశాం. వెరి కో ఆపరేటివ్. కొంచం అసాధారణంగా ఉంది” అన్నారు మాధవరావు కాస్త జంకుతో.

          “ఈ కేసే కాస్త అసాధారణంగా ఉంది. మీరు కనిపెట్టిన వాటిని నేను తప్పు పట్టడం లేదు.”

          “రాకేష్సార్… రాకేష్!”

          “ఆ విషయం ఈ మీటింగ్ తరువాత డిసైడ్ చేద్దామని అంటున్నాను.”

          మాధవరావ్,“ప్చ్!” అన్నారు.

          “చూద్దాం. నేను చెప్పదలచుకున్నది ఏమిటంటే తొందర పడకండి అని. మీ కేసు పూర్తిగా చదివాను. అందరి ముందు నాకు తెలిసినది అంతా చెప్పబోతున్నాను. తెలియని విషయాలను అడగబోతున్నాను. ఏమయ్యా? ఉదయ్ కుమార్ వచ్చాడా?”

          జీప్నుంచి దిగాడు ఉదయకుమార్. “ఏమైయ్యింది సార్? ప్రశ్నలన్నీ ముగిసి పోయాయనుకున్నాను. మళ్ళీ నా మీద అనుమానమా?”

          కమిషనరుకు భక్తిశ్రద్దలతో నమస్కారం పెట్టాడు.

          “నువ్వు చేయలేదు కదా? ఎందుకు భయపడతావు? ఎన్ని ప్రశ్నలు అడిగితే నీకెందుకు? లోపలికి వెళ్ళు.”

          అందరూ వచ్చారు. పాత కాలపు బంగాళాలా ఉన్న కమిషనర్ ఆఫీస్. పక్కనే పెద్ద కాన్ఫరెన్స్ హాల్ గంభీరంగా కనబడింది. మధ్యలో ఓవల్ షేప్ లో పెద్ద టేబిల్, దాని ముందు కుర్చీలు ఉన్నాయి. అందరూ కుర్చీలలో కూర్చున్నారు. రాకేష్ ఓ పక్కన కూర్చుని సిగరెట్ వెలిగించాడు. అతని పక్కన నాలుగైదు కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. ఉమ గోళ్ళు కొరుకుతూ తలవంచుకుని కూర్చుంది. ఆమె పక్కన మణి, ఆనంద్ కూర్చోగా, ఎదురుగా ఉన్న కుర్చీలల్లో దివ్య, రామకృష్ణ అప్పుడే వచ్చి కూర్చున్నారు.

          “ఎలా ఉన్నావు ఉమా?” అడిగింది దివ్య. ఉమ తలెత్తి ఆమె వైపు చూసి తల ఊపింది.

          టేబిల్కు ప్రధాన స్థానంలో పోలీసు అధికారుల కోసం కుర్చీలు వేసి ఉన్నాయి. డి.సి. , మాధవరావు, ఇంకో ఇద్దరు పోలీసు అధికారులు అక్కడ కూర్చుని ఉన్నారు. డి.సి. టేబిల్ మీద ఉన్న ఫైల్  పరిశీలిస్తూ మాధవరావుతో కాస్సేపు మాట్లాడారు. ఒక మూలగా ఉదయకుమార్ వినయంగా ఒదిగి కూర్చున్నాడు. రాకేష్ తన చేతులనే నిశితంగాచూస్తూ కూర్చున్నాడు. మూడు రోజులుగా షేవ్ చేసుకోనందు వల్ల అతని గడ్డం కాస్త  పెరిగింది. ఉమ వైపు అతను చూడనే లేదు. ఉమ ఒకసారి అతని వైపు తడబడుతూ చూసి వెంటనే తల దించుకుంది.

          “చేసింది చాలక ఎలా చూస్తున్నాడో చూడు” అన్నాడు మణి.

          “అంతా కనుక్కున్నారుగా. మళ్ళీ ఎందుకు ఈ మీటింగ్?” అన్నాడు ఆనంద్.

          “పోలీసుల దగ్గర ఏదో చెప్పి వాళ్ళను తికమక పెట్టి ఉంటాడు”అన్నాడు మణి.

          “లేదు మణీ. సాక్ష్యాధారాలు బలంగా ఉన్నాయని అన్నారే.” ఆనంద్ అన్నాడు.

          “చూదాం. కమిషనర్ గారు ఏదో చెప్ప బోతున్నారు చూడు.”

          డి.సి. గొంతు సవరించుకుని, “ఉపోద్ఘాతం లేకుండా సూటిగా చెబుతాను. వెల్ కం. మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిపించామో మీకందరికీ తెలిసి ఉంటుంది.

          మూర్తి హత్య గురించి, అంతకు ముందు జరిగిన సంఘటనల గురించి కూడా తెలిసే ఉంటుంది. అయినా కూడా పోలీసుల దృక్పథం నుంచి ఈ హత్యని మేము ఎలా చూసాము? ఏమేమి కనుక్కున్నాము అన్న విషయాలని మీకు విపులంగా చెప్పడం నా కర్తవ్యం. మీరెవరూ భయపడవలసిన అవసరం లేదు. మూర్తిని హత్య చేసింది ఎవరని మాకు తెలిసిపోయింది. మాధవరావు గారి ప్రయత్నాలను మొదట అభినందించాలి. కర్నాటకలో ఉన్న చురుకైన, పోలీసు అధికారులలో ఆయన ఒకరు.”

          “నేను కాదు.. నేను కాదు” అన్నాడు రాకేష్. “చెప్పు ఉమా.”

          “షట్ అప్!” అన్నారు డి.సి.

          రాకేష్ తలను రెండు చేతులతో పట్టుకుని టేబిల్ మీద మోచేతులను ఆనించు కున్నాడు.

          “చనిపోయిన వ్యక్తి వి. కృష్ణమూర్తి. వయస్సు ఇరవై ఆరు. కొత్తగా పెళ్ళైన వ్యక్తి. మార్చ్ పదిహేనవ తారీఖున పెళ్ళి అయ్యింది. ఆ రోజే మొదటి రాత్రి. మరునాడు ఉదయం పదహారవ తారీఖున భార్యతో బృందావన్ఎక్స్ప్రెస్లో బయలు దేరి మధ్యాహ్నం బెంగళూరుకు వచ్చాడు. సాయంత్రం పార్కు, సినిమా అన్నీ తిరిగి మార్చ్ పదిహేడున కాస్త ఆలస్యంగా లేచి బెడ్ కాఫీ తాగాడు. ఉమ స్నానం చేసి నిద్ర పోతున్న భర్తను వదిలి, క్రింద పుస్తకాల షాప్ కి వెళ్ళినప్పుడు, సమయం దాదాపు పదకొండు ఇరవై అయింది. దాదాపు నలబై నిమిషాల తరువాత గదికి తిరిగి వచ్చినప్పుడు భర్త ప్రాణాలతో లేడు. మెడలో కత్తిపోట్లు, గుండెల్లో దాదాపు పది సార్లైనా కత్తితో పొడిచి పొడిచి చంపారు. ఈ హత్య సాధారణమైన కారణాల వల్ల జరిగిన హత్య కాదు. ఆవేశం, కసి, ప్రతీకారంతో జరిగిన దారుణమైన హత్య. ఆ గదిలో నిలువుటద్దం మీద మాయ అని వ్రాసి ఉంది.

          ఇంత దూరం అతని పట్ల శత్రుత్వం ఉన్న వాళ్ళు, అతన్ని ద్వేషించే వాళ్ళు ఎవరా అని అన్వేషించాము. మాయ అంటే అర్థం ఏమిటి? ఎవరి మీదైనా ప్రతీకారం తీర్చుకునే ఉద్దేశంలో…అంటే ఇంకొకరి మీద ఈ హత్యా నేరాన్ని మోపే విధంగా ఒక హెచ్చరికలాగా వ్రాయ బడిందా?

          మొదట మూర్తి పట్ల ద్వేషం , శత్రుత్వం ఉండడానికి అవకాశం ఉన్న వ్యక్తులు ఇద్దరు ముగ్గురు ఉండవచ్చు. ఒకటి మిస్టర్ మణి. మామయ్య కూతుర్ని పెళ్ళి  చేసుకోవాలన్న కోరికతో ఉన్న వ్యక్తి.”

          “ఉమ నాకు అక్కయ్య కూతురు” అన్నాడు మణి.

          “సారీ. అక్కయ్య కూతురిని పెళ్ళి చేసుకోలేక పోయారు. తను చేసుకోవాలని అను కున్న అమ్మాయిని వేరొకడు పెళ్ళి చేసుకుంటే సెంటిమెంటల్ గా ఉన్నవాళ్ళకి కోపం రావచ్చు. కాని ఒక మనిషిని హత్య చేసేటంత ఎక్కువగా కోపం రావడానికి ఆస్కారం ఉంటుందా అని చూడాలంటే మణి యొక్క సైకాలజీ, అతని వ్యక్తిత్వం అన్నీ చూడాలి. తరువాత అలిబి ఉండనే ఉంది. మణి వాళ్ళతోనే బృందావన్ ఎక్స్ ప్రెస్ లో వచ్చాడు. సంఘటన జరిగిన రోజు బెంగళూరులోనే ఉన్నాడు. నార్త్ సైట్ ఇండస్ట్రీస్ కోసం ఆడిట్ పని మీద వచ్చాడు. సంఘటన జరిగినప్పుడు ఎక్కడ ఉన్నారని అడిగినప్పుడు ఏదో హోటల్లో భోజనం చేస్తూ ఉన్నానని అన్నారు. ఏ హోటల్? పేరుమర్చి పోయారట. ఇతను బోజనం చేస్తుండగా ఎవరైనా చూశారా? లేదు. ఎవరికైనా చెప్పి వెళ్ళారా? అదీ లేదు. ఆ హోటల్ లో భోజనంచేసిన విషయాన్నిఅతను సరిగ్గా రుజువు చేయలేదు.”

          “కానీ నేను మీతో…”

          “మధ్యలో మాట్లాడకుండా వినండి మిస్టర్ మణి. మీరు నిజంగానే ఆడిట్ పని మీద వచ్చారన్న సంగతి కంపెనీలో అడిగి తెలుసుకున్నాం. కాని మణి ఈ టూర్  తానే అడిగి వేయించుకున్నట్లు చెన్నైహెడ్ ఆఫీసు నుంచి సమాచారం వచ్చింది. ఆల్ రైట్! దీంట్లో ఏ తప్పు లేదు. అక్కయ్య కూతురు బెంగళూరుకి వెళుతోంది. ఆ సమయంలో తాను కూడా టూర్ వేసుకుని వెళ్ళడం సహజమే. అనవసరంగా అతడిని సందేహించడం మాకు యిష్టం లేదు.

          కానీ మణితో మాట్లాడుతున్నప్పుడు అతను తెలియ చేసిన అభిప్రాయాలు మాకు కొంచం విచిత్రంగా అనిపించాయి.

          “ఆత్మకి, పుట్టుక మరణం లేవు. చావు అనేది ఒక వస్త్రాన్ని త్యజించడం లాంటిది. ఎవరూ మరణించలేదు. ఎవరూ మరణానికి కారకులు కారు.” డి.సి. మణి వైపు చూశారు. “భగవత్ గీతలో చెప్పిన ఈ మాటలు ఒక అభిప్రాయాన్ని కలుగ చేస్తాయి. ఒక మనిషి మరణం పట్ల మరొక మనిషి దుఃఖం చెందడం అనవసరం అని.

          కానీ అదే హత్యా నేరంలో అనుమానితుడు చెబితే దానికే వేరే విధంగా అర్థం వస్తుంది. చేసిన హత్యను తానే సమర్థించు కోవడం అన్నట్లు, న్యాయం అని మలుచు కునేటట్లు అర్థం వస్తుంది. దీని వల్లనే అనుమానితుల జాబితా నుంచి మీ పేరును ఇంకా కొట్టెయ్య లేదు.

          ఆ తరువాత మా అనుమానం హోటల్ సర్వర్ ఉదయ కుమార్ మీద పడింది. ఈ యువకుడు రెండు విధాలుగా ఈ కేసులో చిక్కుకున్నాడు. మూర్తి గది తలుపుల మీద ఇతని వేలి ముద్రలు ఉన్నాయి. తరువాత మల్లీశ్వరం స్పోర్ట్స్ క్లబ్ లో బాస్కెట్ బాల్ ఆడినందు వలన  కొత్త చిక్కులు వచ్చిచేరాయి. ఆ గదిలో దొరికిన  షూప్రింట్స్, మాయా అని  ప్రింటు చేయబడిన టీ షర్ట్ ఉదయకుమార్ దగ్గర ఉండి ఉండవచ్చు. కానీ అతనికి హత్య చేయడానికి సరైన కారణం ఏం ఉంటుంది? మొదటి రోజు అతన్ని ఎవరైనా కోపగిం చుకుని ఉండవచ్చు. తిట్టి ఉండవచ్చు. అవమానంగా భావించి, అతను ఒంటరిగా ఉన్న సమయంలో క్షణికావేశంలో హత్య చేసి ఉండవచ్చు. ఉడుకు రక్తం కదా.

          ఇక ఉమ సంగతి.పెళ్ళికి ముందు ఆమెకు ఏదైనా ప్రేమ వ్యవహారం ఉండి, మాజీ ప్రేమికుడి సహాయంతో… ఎందుకు నవ్వుతున్నారు ఉమా? ఈ కాలంలో ఏదైనా జరగ డానికి ఆస్కారం ఉంది. అందుకే ఉమని కూడా అనుమానితుల లిస్టులో ఉంచాము,

          ఆ తరువాత ఆనంద్! ఆనంద్ నిజంగానే మూర్తి యొక్క సోదరుడా? అతనికీ ఉమకీ మధ్య ఏదైనా…. ఆస్తిపాస్తుల తగాదాలు ఉన్నాయా?

          తరువాత దివ్య.. దివ్యకు మూర్తిని ద్వేషించడానికి కారణం నిశ్చయంగా ఉంది. దివ్యను పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకుని, ఆమెతో కాస్త స్నేహంగా ఉన్నట్లు విన్నాము. ఔటింగ్ లు సినిమాలు వగైరా వగైరా. ఆ తరువాత జాతకాలు కుదరలేదని సాకు చెప్పి పెళ్ళికి నిరాకరించం వలన కోపం వచ్చి ఉండవచ్చు.

          మూర్తి దివ్యను నిరాకరించడానికి అసలు కారణం వేరే ఉందని తెలుసుకున్నాము. దివ్య కారెక్టర్ మంచిది కాదని మూర్తికి తెలిసి ఉండవచ్చు. పెళ్ళికి నిరాకరించినందుకు దివ్యకు కోపం వచ్చి నేరుగా మూర్తిని అడిగి ఉండవచ్చు. అలా అడిగే మనిషే తను.మూర్తి ఉన్నది ఉన్నట్లుగా ‘ఇలా నీ గురించి విన్నాను. అందుకే నిరాకరించాను’ అని చెప్పి ఉండవచ్చు. ఆ విషయం దివ్య మనసులో పగని, కోపాన్ని ఏర్పరచి ఉండవచ్చు.”

          దివ్య చిరునవ్వుతో అన్నది. “మూర్తిని హత్య చేసేటంత కోపమా నాకు? అబ్సర్డ్!”

          “నో.. ఐ డోంట్ థింక్ సో.” డి.సి. ఫైలుతీసి అందులో ఒక కాగితాన్ని చూస్తూ, “మీరు మాధవరావు దగ్గర చెప్పిన స్టేట్మెంట్ అలాగే చదవమంటారా? ‘మై గాడ్! అతని మీద నాకు వచ్చిన కోపానికి నాకు అవకాశం దొరికితే అతన్ని చీల్చి చెండాడే దాన్ని. అంతకు ముందే ఎవరో అతన్ని హత్య చేసేసారు.”

          “అది మాట వరుసకి అన్నది.”

          “దివ్యా! ఇక్కడ ఎవరి మీదా ఇంకా నేరం ఆరోపించబడలేదు.  పోలీసుల దృక్పధం లో ఈ కేసును ఎలా హేండిల్ చేసాము? ఏ తీర్పుకు రాబోతున్నాము? ఆ విషయమే చెబుతున్నాను. మొదట వినండి. తరువాత P.రామకృష్ణ… దివ్యకి కజినా, ప్రేమికుడా ఏదీ సరిగ్గా తేల్చి చెప్పలేము. రామకృష్ణ, దివ్య అదే రోజు బెంగళూరుకు వచ్చి అదే హోటల్ లో రూమ్ నంబరు 136లో స్టేచేశారు. హత్య జరిగిన ఆ సమయంలో ఇద్దరూ గదిలోనే ఉన్నట్లు చెబుతున్నారు. రామకృష్ణ ధృడమైన యువకుడు. వీళ్ళు ఎందుకోసం వచ్చారు? ఎందుకు అబద్దాలు చెబుతున్నారు? అంతుపట్టడం  లేదు. వీళ్ళ అలిబీ చాలా బలహీనంగా ఉంది. మూర్తిని హత్య చేయడానికి రామకృష్ణకి డైరక్ట్ గా కారణం లేక పోయినా దివ్య కోసం ఆ పని చేసి ఉంటాడేమోనని ఆలోచించి చూసాము.

          ఆ తరువాత ఈ కధ యొక్క మెయిన్ కధానాయకుడు లేకపోతే కధానాయిక మాయ! మాయ అంటే ఎవరు? ఏది? మాధవరావు ఈ మాయ గురించి పెద్ద రిసెర్చ్ చేశారు.

          ఆత్మలను వశ్యం చేసుకునే మాయా, శంబరన్ దేవీ పేరు కూడా మాయా. దక్షిణ ఆఫ్రికా నాగరికత మాయా. ఇలా అన్నింటినీ..

          అవన్నీ రూల్ద్ అవుట్ కాగా ఆఖరుగా రెండు రకాలుగా మాయ అన్న పదం ఏర్పడింది అన్న నిర్ధారణకు వచ్చాము. మణి- దివ్య పేర్ల యొక్క మిశ్రమం MANI- DIVYA అని వచ్చి ఉండవచ్చు. లేక మల్లీశ్వరం యూత్ అసోసియేషన్. రెండో కారణం సరిగా సూట్ అయ్యింది. ఎలా అంటే, ఆ గదిలో దొరికిన షూ ప్రింట్ ని ట్రేస్ చేసి అది మాయా స్పోర్ట్స్ క్లబ్ కి సంబంధించినది అని కనుక్కున్నాము.

          అదే సమయంలో ఒక ఫోటో దొరికింది. ఆ ఫోటోలో ఉమ, మూర్తి వెనక, చెట్టు మరుగు న సగం కనిపించే రూపం, టీ షర్ట్ లో కనిపించిన మాయా అన్న అక్షరాలు… ఈ క్లూలను వెంటాడుతూ మేము రాకేష్ ని చేరుకున్నాము, రాకేష్ గురించి వాకబు చేసినందులో తెలిసిన వివరాలు, క్రికెట్ ఆడే వ్యక్తి, చిన్నప్పుడే తల్లిని కోల్పోయి, తండ్రి జర్మనీలో ఉండి పోగా, ఇక్కడ ఒంటరితనంతో బాధ పడుతున్న మనిషి, ఉమ అంటే ఇతనికి వల్లమాలిన ప్రేమ. ఇంట్రావర్ట్ అని చెప్పవచ్చు. ఉమను పెళ్ళికి ముందు వెంబడిం చాడు. సంఘటన జరిగినప్పుడు అదే హోటల్ లో వేరొక గదిలో ఉన్నాడు. అతని షూ  ప్రింట్ గదిలో దొరికింది. అతని తల వెంట్రుకలో ఒకటి మూర్తి శవం మీద దొరికింది. కత్తి, రక్తపు మరకలతో నిండిన ఒక షర్ట్ అతని బెంగళూరు ఫ్లాటులో దొరికాయి. దీనికన్నా బలమైన సాక్ష్యం వేరే ఉండదు. కాబట్టి మూర్తిని హత్య చేసింది రాకేష్ అన్న తీర్మానానికి రావడానికి సాక్యాలు, ఆధారాలు మమ్మల్ని లీడ్ చేస్తున్నాయి.

          అనుమానితుల జాబితాను పునః పరిశీలించిన తరువాత మొదట ఉమ పేరును కొట్టేశాము. ఉమకి ఈ హత్య చేయడానికి ఏ కారణమూ లేదు. మొదటి రోజు అంత సంతోషంగా భర్తతో పార్కుకీ, సినిమాకీ వెళ్ళిన భార్య మర్నాడు అతన్ని ఎందుకు హత్య చేస్తుంది? పెళ్ళికాక ముందు ఆమె ఎవరినీ ప్రేమించ లేదన్న సంగతి తెలిసింది.

          ఆ తరువాత హోటల్ బాయ్. అతని మీద అనుమానం వచ్చినా, పగ ఉండేటంతగా బలమైన సంఘటనలు ఏదీ జరగలేదని తెలిసింది. అతని మానసిక ఆరోగ్యం బాగానే ఉందనడంలో ఎటువంటి సందేహమూ లేదు.

          ఆ తరువాత ఆనంద్! అన్నయ్య పెళ్ళికి ముందు అతనికి ఉమ ఎవరో తెలియదు. అన్నదమ్ముల మధ్య ఎటువంటి పొరపొచ్చాలు లేవు. కాబట్టి అతనూ కాదు.

          ఆ తరువాత ఎలిమినేట్ చేయబడిన మణి, దివ్య, రామకృష్ణ. ముగ్గురికీ మూర్తిని హత్య చేయడానికి కారణాలు ఉన్నాయి. వీళ్ళకన్నా రాకేష్పట్ల బలమైన సాక్ష్యాలు, ఆధారాలు దొరకడం వల్ల  వీళ్ళ పేర్లు తొలిగించాము. ఇక మిగిలినది రాకేష్!

          రాకేష్ కేసుని పరిశీలనగా చూస్తే అతనికి కారణంబలంగా ఉంది. అతనికి ఉమ మీద విపరీతమైన ప్రేమ ఉంది. ఉమని పెళ్ళికాక ముందు వెంబడించాడు. కానీ సమీపించలేదు. ఇతని స్వభావాన్ని పరిశీలిస్తే, చిన్నతనంలో తల్లిని కోల్పోయి, తండ్రి ప్రేమ సరిగ్గా దొరకనందు వల్ల, ఒంటరితనంతో బాధపడే డబ్బున్నవాడు. ఎవరితోనూ కలిసి మెలిసి తిరగని మనిషి. తన భావాలను స్వతంత్రంగా బైటికి చెప్పే అలవాటు లేక, ధైర్యం చాలక మనసులోనే కుములిపోయే స్వభావం అతడిది. ఇలాంటి వ్యక్తులు ఎప్పుడైనా ఒకసారి లావాలా పొంగి పొర్లడం అత్యంత సహజం. ఉమకి రాకేష్ తల్లి పోలిక లు ఉండటం ఒక కొత్త విషయం. తాను కోరిన స్త్రీని వేరొకడు పెళ్ళి చేసుకున్నాడని ప్రతీకారవాంఛ కలగడం న్యాయమే. అందులోనూ సున్నితమైన అతని హృదయం గాయపడి ఉంది. మూర్తితో మాట్లాడి వెళ్ళానని చెప్పాడు. ఆ వ్యవధిలో అతన్ని హత్యచేసి ఉండవచ్చు.

          అన్ని కోణాలను పరిశీలించి మేము ఈ ముగింపుకు వచ్చాము. మూర్తిని హత్య చేసి మాయ అన్న పేరుతో ఉమకి ఉత్తరం వ్రాసి, ఆమెను పెళ్ళి చేసుకోవడానికి, దాదాపు ఒప్పించి, అన్నీ ప్లాన్ వేసి చేసినట్లు సులభంగా ఊహించవచ్చు. ముఖ్యంగా కత్తిని, రక్తపు మరకల షర్ట్ ని తన ఇంట్లో దాచి…”

          డి.సి. నుదుట పట్టిన చెమటని జేబు రుమాలుతో తుడుచుకుంటూ అందరిని కలియచూశారు. అందరి చూపులు రాకేష్ మీదే కేంద్రీకృతమై ఉన్నాయి.

          “నో.. మీరు ఎన్నైనా చెప్పండి. నేను ఆ హత్యను చేయలేదు” అన్నాడు రాకేష్.

          “అలా అని మేమూ అనుకుంటున్నాము” అన్నారు డి.సి.

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.